అమెరికాలో లూసియానా రాష్ట్రంలోని వెబ్‌స్టర్ పారిస్‌కు చెందిన ఓ పాపకు నిద్రలో నడిచే అలవాటుంది. శనివారం రాత్రి ఇంట్లో పడుకున్న బాలిక మరునాడు ఉదయం ఇంట్లో కనిపించలేదు. నిద్రలో నడుస్తూ కాస్త దూరం ఎటైనా వెళ్లిందేమోనని తల్లిదండ్రులు చుట్టుపక్కలంతా వెదికారు. ఎక్కడా కనిపించకపోవడంతో మర్నాడు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇంటి చుక్కపక్కల సీసీటీవీ కెమెరాలన్నింటినీ జల్లెడ పట్టారు. కనీసం బూట్లు లేకుండా బాలిక సమీపంలోని అడవుల్లోకి నడిచి వెళ్తూ ఓ కెమెరాకు చిక్కింది. వెంటనే గాలింపు చేపట్టారు.
చిన్నారి నడిచి వెళ్లిన ప్రాంతమంతా జల్లెడ పట్టారు. ట్రాకింగ్ డాగ్స్, డ్రోన్లతో పాటు చివరికి హెలికాప్టర్‌ను కూడా రంగంలోకి దించారు. విషయం తెలిసి వందలాది మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి వెదుకులాటకు దిగారు. పోలీసులు, ప్రభుత్వ ఏజెన్సీలతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. చివరకు రాత్రి 11 గంటల వేళ రోడ్డుకు సమీపంలో అడవిలో చిన్నారిని ఓ డ్రోన్ థర్మల్ ఇమేజింగ్ ద్వారా కనిపెట్టింది.
అప్పటికి ఒక రోజు గడిచినా చిన్నారి ఇంకా గాఢనిద్రలోనే ఉండటం విశేషం! పోలీసులు, తల్లిదండ్రుల పిలుపులతో ఉలిక్కిపడి లేచింది. నెమ్మదిగా ఏడుపందుకుంది. తల్లిదండ్రులు ఊరడించడంతో మెల్లిగా తేరుకుంది. ఈ దృశ్యాలు అందరినీ కదిలించాయి. ‘అడవిలో, వణికించే చలిలో ఆ చిన్న పాప ప్రశాంతంగా నిద్రపోతూ దొరికిన క్షణాలు హృదయాలను కదిలించాయి. సాంకేతిక పరిజ్ఞానం ఇలా సామాజిక ప్రయోజనానికి ఉపయోగపడటం నిజంగా బాగుంది’ అంటూ నెటిజన్లు సంబరపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment