అధికారులతో సమీక్షిస్తున్న సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: ‘దోమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను డ్రోన్‌ల ద్వారా గుర్తించి, ఆ ప్రాంతాల్లో డ్రోన్‌ల ద్వారా మందు పిచికారి చేసి.. వాటిని చంపేసే వ్యవస్థను 2019కి ముందు ఉపయోగించాం. మళ్లీ అదే వ్యవస్థను తీసుకు వచ్చి డ్రోన్‌లతో దోమలను చంపేయాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బుధవారం వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకున్న చర్యలను అధికారులు సీఎంకు వివరించారు.
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు రాష్ట్రంలో 60 డయేరియా కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం 6 గ్రామాల్లో 35 డయేరియా యాక్టివ్ కేసులు ఉన్నట్టు తెలిపారు. తొమ్మది మంది డయేరియాతో చనిపోయారన్నారు. ఈ నేపథ్యంలో సీఎం మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల నియంత్రణకు 2014 నుంచి 2019 మధ్య అనుసరించిన విధానాలను మళ్లీ అనుసరించాలని వైద్య, ఆరోగ్య, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులను ఆదేశించారు. దోమల నియంత్రణకు అధునాతన సాంకేతిక పద్ధతులను వినియోగించాలన్నారు.
గ్రామాలు, పట్టణాల్లో కలుషిత తాగునీరు, పారిశుధ్య లోపం, దోమల నివారణకు చర్యలు తీసుకోక పోవడం వల్లే ప్రజలు రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. రక్షిత తాగునీరు, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో సీజనల్ వ్యాధుల బారినపడే వారి సంఖ్య అధికంగా ఉంటుందని, వారిపై వైద్య, ఆరోగ్య శాఖ మరింత దృష్టి పెట్టాలని సూచించారు.
అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడితే మాత్రం ఉపేక్షించబోనన్నారు. సీజనల్ వ్యాధుల నివారణలో మూడు శాఖలు సమన్వయంతో పని చేయాలని, అప్పుడే ఫలితాలు వస్తాయన్నారు. శాఖల మంత్రులు, అధికారులు దీనిపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని చెప్పారు. ఈ సమీక్షలో మంత్రులు నారాయణ, సత్యకుమార్ యాదవ్, మూడు శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇప్పుడు సమయం లేదు మళ్లీ వింటా..
రాష్ట్రంలో త్వరలో వైద్య విద్యా కోర్సుల ప్రవేశాల ప్రక్రియ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఫీజులు ఖరారు చేయడంతో పాటు, కొత్త వైద్య కళాశాలల్లో తరగతుల ప్రారంభం, ఇతర అంశాల్లో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఈ అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు అధికారులు ప్రయత్నించగా ప్రస్తుతం సమయం లేదని, మళ్లీ వింటానని చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది.
ఈ విద్యా సంవత్సరం నుంచి పులివెందుల, ఆదోని, మార్కాపురం, ఆదోని, పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించాల్సి ఉంది. ఈ తరుణంలో ఆయా వైద్య కళాశాలలకు ఎన్‌ఎంసీ నుంచి అనుమతులు రాబట్టడంతో పాటు, తరగతులు ప్రారంభించడానికి వీలుగా ఎన్‌ఎంసీ నిబంధనలకు అనుగుణంగా వసతులు కల్పించాల్సి ఉంది.
ఇదిలా ఉండగా అమరావతిపై శ్వేత పత్రం విడుదల చేసిన సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దోమలు అధికంగా ఉన్న 20 వేల ప్రాంతాలను గుర్తించామన్నారు. ఆ ప్రాంతాల్లో డ్రోన్‌లతో మందును పిచికారి చేస్తూ దోమలు లేని ప్రాంతాలను సున్నాకు తీసుకుని రావాలని ప్రణాళిక రచించామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment