ద్వారకాతిరుమలలో నూతనంగా నిర్మించిన టోల్ గేటు
సాక్షి, ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న శేషాచలకొండపై దేవస్థానం నూతనంగా నిర్మించిన టోల్ గేటును ఆలయ చైర్మన్ ఎస్వీ.సుధాకరరావు కుమారుడు నివృతిరావు ఆదివారం ప్రారంభించారు. ఇప్పటివరకు కాంట్రాక్టర్‌ల ద్వారా నిర్వహించబడిన ఈ టోల్ గేటును ఇక దేవస్థానమే సొంతంగా నిర్వహించనుంది. 2018–2019 సంవత్సరానికి గాను స్వామివారికి టోల్ గేటు ద్వారా సుమారు రూ.77 లక్షలు ఆదాయం సమకూరింది. ఈ ఆదాయం మరింతగా పెరుగుతుందన్న ఉద్దేశంతో దీన్ని దేవస్థానం స్వయంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా దాదాపు రూ.20 లక్షల వ్యయంతో టోల్ గేట్ వద్ద షెడ్డును, టికెట్ కౌంటర్‌ను, ఇతర నిర్మాణాలను జరిపారు.
వీటిని ఆలయ ఈఓ దంతులూరి పెద్దిరాజు, ఈఈ వైకుంఠరావు, ఏఈవో బి.రామాచారి, డీఈలు టి.సూర్యనారాయణ, పి.ప్రసాద్, గుర్రాజు, సూపరింటిండెంట్‌లు నగేష్, జి.సుబ్రహ్మణ్యం, కిషోర్, ఏఈలు మధు, దిలీప్ తదితరులతో కలిసి నివృతిరావు ప్రారంభించారు. అనంతరం టికెట్ కౌంటర్‌లో చినవెంకన్న చిత్రపటాన్ని ఉంచి ఆలయ అర్చకులు, పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈఓ మాట్లాడుతూ ఈ టోల్ గేట్ నిర్వహణ ఇద్దరు సూపరింటిండెంట్‌ల పర్యవేక్షణలో ఉంటుందని, ఇందులో మూడు షిఫ్ట్‌లుగా 20 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. అలాగే టోల్‌గేటు ధరలను పెంపుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పెరిగిన ధరలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆయన వివరించారు. లారీ, బస్సు, భారీ వాహనాలకు టోల్ పాత ధర రూ.100 కాగా దానిని రూ.150కి పెంచారు. మినీ బస్సు, వ్యాన్లకు రూ.50 నుంచి రూ.100కు, ట్రాక్టర్ టక్కు, ట్రాక్ ఆటో, ప్రయాణికుల వాహనాలకు రూ.30 నుంచి రూ.50కి పెంచారు. కారు, జీపు, వ్యాన్, స్కూటర్, బైక్, ఆటోకు టోల్ ఫీజును పెంచలేదు.
Comments
Please login to add a commentAdd a comment