ఎన్‌కౌంటర్‌లో స్నాచర్‌ హతం! | - | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్‌లో స్నాచర్‌ హతం!

Published Thu, Mar 27 2025 1:31 AM | Last Updated on Thu, Mar 27 2025 3:50 PM

విమానం, రైలులో మరో ఇద్దరు స్నాచర్ల అరెస్ట్‌

నిందితులు మహారాష్ట్ర వాసులు 

సాక్షి,చైన్నె: చైన్నెలో ఒక గంట వ్యవధిలో ఆరు చోట్ల చైన్లను స్నాచింగ్‌ చేసిన కేసులో ఓస్నాచర్‌ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. హైదరాబాద్‌ విమానంలో ఒకడు.. ముంబై రైలులో మరొక స్నాచర్‌ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. మంగళవారం ఉదయం చైన్నెలో ఒక గంట వ్యవధిలో ఏడు చోట్ల చైన్‌ స్నాచింగ్‌ జరగడం విదితమే. ఈ స్నాచింగ్‌ అంతా ఒకే పంథాలో ఉండడంతో పోలీసులకు సవాల్‌గా మారింది. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితుల కోసం విస్తృతంగా గాలించారు. 

చివరకు విమానాశ్రయంలోకి స్నాచర్ల పోలికలతో ఉన్న ఇద్దరు యువకులు వెళ్లడాన్ని గుర్తించారు. వీరు వేర్వేరుగా ముంబై, హైదరాబాద్‌ విమానాలలో ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుసుకున్నారు. దీంతో విమానాలు రన్‌వే మీదున్న సమయంలో ఎయిర్‌ ట్రాఫిక్‌ ఇంటెలిజెన్స్‌ సహకారంతో ఈ ఇద్దరినీ ముంబై, హైదరాబాద్‌ విమానాలలో అరెస్టు చేశారు. ఆ సమయంలో వీరిద్దరూ పోలీసులను, విమానాశ్రయ వర్గాలను తీవ్రంగా బెదిరించడం గమనార్హం.

ఇద్దరు కాదు ముగ్గురు
తొలుత తమకు పట్టుబడ్డ ఇద్దరిని రహస్య ప్రదేశంలో ఉంచి చైన్నె పోలీసులు విచారణ చేశారు. వీరిద్దరు మహారాష్ట్ర (మరాఠా) ముంబైకు చెందిన జాఫర్‌ గులాం హుస్సేన్‌ ఇరానీ, మిసం దస్మేష్‌ ఇరానీగా గుర్తించారు. వీరిలో జాఫర్‌ పేరు మోసిన స్నాచర్‌ అని తేలింది. ముంబైలో ఆరి తేరిన ఈ స్నాచర్‌ ఇటీవలే జైలు నుంచి వచ్చినట్టు విచారణలో వెలుగు చూసింది. అదే సమయంలో ఈ స్నాచింగ్‌లో మరొకడి హస్తం ఉందన్న సమాచారంతో పోలీసులు రైల్వే మార్గంలో వేట మొదలెట్టారు. ముంబై నుంచి విమానంలో తొలుత పట్టుబడ్డ ఇద్దరు సోమవారం చైన్నెకు రాగా, ఆదివారమే రోడ్డు మార్గంలో బెంగళూరు మీదుగా చైన్నెకు ద్విచక్ర వాహనంలో సల్మాన్‌ అనే స్నాచర్‌ వచ్చి ఉండటం వెలుగు చూసింది. 

ఈ ఇద్దరికీ బైక్‌ సిద్ధం చేసి పెట్టడం మొదలు, రూట్‌ మ్యాప్‌ను రెడీ చేసి ఇచ్చింది సల్మాన్‌ అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మంగళవారం ఉదయం స్నాచింగ్‌ చేసి ఇద్దరు స్నాచర్లు విమాన మార్గాన్ని ఎంచుకోగా, సల్మాన్‌ రైల్వే మార్గంలో ముంబై వెళ్లే పనిలో పడ్డారు. దీంతో రైల్వే పోలీసుల సహకారంతో వేట మొదలెట్టారు. పినాకినీ ఎక్స్‌ప్రెస్‌లో చైన్నె నుంచి విజయవాడ వెళ్లి అక్కడి నుంచి ముంబై వెళ్లడానికి నిర్ణయించిన సల్మాన్‌ను ఒంగోలులో అరెస్టు చేశారు. ఇతడిని చైన్నెకు తీసుకొచ్చారు.

ఎన్‌కౌంటర్‌లో హతం
పట్టుబడ్డ జాఫర్‌ గులాంను పోలీసులు మరింత లోతుగా సిద్ధమయ్యారు. స్నాచింగ్‌ అనంతరం ముగ్గురు నిందితులు తరమణి రైల్వే స్టేషన్‌ వద్ద కలిసినట్లు తేలింది. దీంతో అక్కడ సీన్‌ కన్‌స్ట్రక్షన్‌ కోసం బుధవారం వేకువ జామున ఆ రైల్వే స్టేషన్‌ సమీపంలోకి నిందితులను తీసుకెళ్లారు. అక్కడి వంతెన కింది భాగంలో మోటారు సైకిల్‌ను గుర్తించారు. ఈ సమయంలో ఆ మోటారు సైకిల్‌లో ఉన్న రివాల్వర్‌ను తీసుకుని పోలీసులపై జాఫర్‌ గురి పెట్టాడు. అతడ్ని పోలీసు అధికారి బుహారి లొంగిపోవాలని హెచ్చరించినా పట్టించుకోలేదు. చివరకు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. దీంతో జాఫర్‌ సంఘటన స్థలంలోనే కుప్పకూలి మరణించారు. 

ఎన్‌కౌంటర్‌ సమాచారంతో ఉదయాన్నే కలకలం రేగింది. పోలీసు కమిషనర్‌ అరుణ్‌, ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఎన్‌కౌంటర్‌కు దారి తీసిన పరిస్థితులు, నిందితుడి మీదున్న కేసులు, అతడి నేర చరిత్ర గురించి కమిషనర్‌ మీడియాకు వివరించారు. జాఫర్‌పై 50కు పైగా కేసులు ఉన్నాయని, చైన్నె నగరంలో జరిగిన స్నాచింగ్‌ తర్వాత 100కు పైగా సీసీ కెమెరాలలోని దృశ్యాలను పరిశీలించి, వీరే నిందితులుగా నిర్ధారించినట్లు చెప్పారు. మిగిలిన ఇద్దరు నిందితులను విచారణ చేస్తున్నారు.. వీరి నుంచి స్నాచింగ్‌ చేసిన ఆరుకు పైగా చైన్లను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. చైన్నెలో ఎన్‌కౌంటర్‌ సమాచారంతో జాఫర్‌ కుటుంబానికి చెందిన మహిళలు పలువురు ఆస్పత్రి మార్చురీ వద్దకు చేరుకున్నారు. అయితే, మగవాళ్లు ఎవ్వరూ రాకపోవడం గమనార్హం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement