హింసించి చంపారు | Tortured to death | Sakshi
Sakshi News home page

హింసించి చంపారు

Published Mon, Apr 13 2015 12:39 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM

Tortured to death

మృతుల కుటుంబీకుల ఆవేదన
అది బూటకపు ఎన్‌కౌంటరే
మృతదేహాలను చూస్తే.. బాగా కొట్టినట్లు, నిప్పుతో కాల్చినట్లు ఉంది
పోలీసులపై హత్య కేసు నమోదు చేయాల్సిందే
సీబీఐతో దర్యాప్తు చేయించాలి
పోలీసులకు ఫిర్యాదు


సాక్షి, ప్రతినిధి తిరుపతి/చంద్రగిరి: తమవారిని చిత్రహింసలు పెట్టి కాల్చి చంపేసి ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించిన పోలీసులపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్ మృతుల కుటుంబ సభ్యులు చిత్తూరు జిల్లా చంద్రగిరి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్పెషల్లీ గ్రేవ్ అఫెన్స్ పరిధిలోకి వచ్చే ఈ తరహా కేసులపై ఫిర్యాదుల్ని డీఎస్పీ లేదా ఆపై స్థాయి అధికారులు మాత్రమే దర్యాప్తు చేయాల్సి ఉంది. ఆదివారం తమిళనాడు నుంచి తరలివచ్చిన ఎన్‌కౌంటర్ బాధిత కుటుంబాల రోదనలతో చంద్రగిరిలో విషాద వాతావరణం నెలకొంది.

భర్తల్ని కోల్పోయిన మహిళలు.. బిడ్డలు దూరమైన తల్లులు.. తండ్రుల్ని కోల్పోయిన కొడుకులు.. 42 రోజుల పసికందుతో వచ్చిన మహిళ..  నాన్న ఎప్పుడు వస్తాడని అడుగుతున్న నా పిల్లలకు ఏం చెప్పనయ్యా అని అడుగుతున్న తల్లి.. కూలిచేసి నిన్ను, బిడ్డను బాగా చూసుకుంటానన్న నాభర్త ఏడయ్యా అంటున్న మహిళ.. చంద్రగిరిలో ఎటుచూసినా విషాదమే కనిపించింది. ఎన్‌కౌంటర్ పేరిట తమవారిని చంపేశారని, తమకు న్యాయం చేయాలంటూ వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. ముందురోజే తమవారిని పట్టుకుని కాళ్లు, చేతులు కట్టేసి చిత్రహింసలు పెట్టారని, చంపేసి ఎన్‌కౌంటర్ అని చెబుతున్నారని చెప్పారు.

మృతదేహాలను పరిశీలిస్తే నిప్పుతో కాల్చినట్లు, బాగా కొట్టినట్లు ఉందన్నారు. తమ కుటుంబాల ఆధారాల్ని చిదిమేశారని, తామెలా బతకాలని రోదించారు. రోజుల పసికందుల్ని, రెండుమూడేళ్ల బిడ్డల్ని ఎలా బతికించాలంటూ కన్నీరు పెట్టుకున్నారు. 20 మందిని చంపేసిన ఈ ఎన్‌కౌంటర్‌పై ఆంధ్ర పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ నిజాలను కప్పి పుచ్చేలా ఉందని, ఇది బూటకపు ఎన్‌కౌంటరేనని తెలిపారు.

చెన్నై హైకోర్టు ఆదేశాల మేరకు ఆరు మృతదేహాలను తిరువణ్ణామలైప్రభుత్వాస్పత్రిలో భద్రపరిచినట్లు చెప్పారు. ఈ కేసులో న్యాయం జరిగే వరకు వదిలి పెట్టే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. పోలీసులపై హత్య నేరం కింద కేసు నమోదు చేయించి వారికి శిక్ష పడేవరకు చట్టపరంగా పోరాడతామన్నారు. అవరమైతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. మృతుల కుటుంబసభ్యులు, న్యాయవాదులు, రాజకీయ పార్టీ నాయకులు పెద్దసంఖ్యలో చంద్రగిరి పోలీస్ స్టేషన్‌కు తరలివచ్చారు. పోలీసులపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని 20 మంది న్యాయవాదుల బృందంతో మృతుడు శశికుమార్ భార్య మునియమ్మ, మరికొందరు ఫిర్యాదు చేశారు.

తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా వేటగిరిపాళేనికి చెందిన మూర్తి, శేఖర్, మునిస్వామి, మహేంద్రన్, పెరుమాళ్, బీమన్, మురుగన్, పళని కూలీ పనుల కోసం వస్తే ఆరోతేదీ సాయంత్రం నగరి ప్రాంతంలో అదుపులోకి తీసుకుని కాల్చి చంపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ధర్మపురికి, సేలంకు చెందిన మరో 12 మంది శ్రీవారి మెట్టు ప్రాంతంలో ఏడోతేదీ చనిపోయినట్లు మీడియా ద్వారా తెలిసిందని వివరించారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై ఐపీసీ 302 సెక్షన్ కింద హత్యకేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదుచేసి విచారిస్తామని డీఎస్పీ శివశంకర్‌రెడ్డి చెప్పారు.
 
అమానుషంగా చంపేశారు..
కూలీ పనులకు వస్తున్న మా వాళ్లను పట్టుకుని చిత్ర హింసలకు గురిచేసి, అడవిలోకి తీసుకెళ్లి కాల్చి చంపేశారు. ఏపాపం తెలియని మావాళ్లను కిరాతంగా ఎన్‌కౌంటర్ పేరుతో కాల్చేశారు. మావాళ్లు ఎర్రచందనం కూలీలని ఆంధ్రా పోలీసులు చెప్పడం నిజం కాదు. వారిని తీసుకొచ్చే ఇలా కాల్చిపడేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి.     
 - ముబరేషన్, ధర్మపురి, మృతుడు హరికృష్ణ సోదరుడు
 
పిల్లలను ఎలా పోషించాలి
నా భర్త పెయింటింగ్ పనులు చేసేవాడు. ఏరోజుకారోజు  సంపాదనతో మాకుటుంబం గడిచేది. మా ఆయన పెయింటింగ్ పనులకు తప్ప ఇతర పనులకు వెళ్లేవాడు కాదు. నాకు ఇద్దరు పిల్లలు. ఒకరికి నాలుగేళ్లు, మరొకరికి రెండేళ్లు. నాన్న ఎక్కడికి వెళ్ళాడు? ఎప్పుడు వస్తాడు? అని పిల్లలు అడుగుతుంటే గుండె తరుక్కుపోతోంది. నేను ఏం సమాధానం చెప్పాలి. నా భర్తను అడవిలోకి తీసుకెళ్లి జంతువును చంపినట్లు చంపేశారే.. ఇది మీకు తగునా? పేదలంటేనే స్మగ్లర్లా? నా పిల్లలను ఎలా పోషించాలి.  
 - తంజి అమ్మాళ్, మృతుడు మునస్వామి  భార్య
 
రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి
ఎన్‌కౌంటర్ పేరుతో తమిళనాడుకు చెందిన కూలీలను పోలీసులు అతి కిరాతకంగా కాల్చి చంపేశారు. కూలీలను కాల్చి చంపిన అధికారులను వెంటనే అరెస్ట్ చేయాలి. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించాలి. ఇంటికో ఉద్యోగాన్ని ఇవ్వాలి. తమిళనాడు నుంచి కూలీల తరఫున 20 మంది న్యాయవాదులం ఇక్కడికి వచ్చాం. న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆపం.   
 - కదిరవణన్, న్యాయవాది, చెన్నై
 
పోలీసులకు ఉరిశిక్ష వేయాలి
ఏపాపం తెలియని అమాయకులను తీసుకెళ్లి అడవిలో చంపిన ఆంధ్రా పోలీసులకు ఉరిశిక్ష వేయాలి. ఎన్‌కౌంటర్ మృతుల కుటుంబాలకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి ఆదుకోవాలి. వారికి న్యాయం జరిగేంతవరకు మా పోరాటం ఆగదు. నిజానిజాలు తెలుసుకోకుండానే కాల్చి చంపే హక్కు  పోలీసులకు ఎవరిచ్చారు?
-  ఎదురొలి మణియన్, మాజీ ఎమ్మెల్యే పెలన్‌మళ్లూర్
 
న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు
కూలీలను పట్టుకుని స్మగ్లర్లని కాల్చి చంపేశారు. రోజూ వారు కూలిపనులకు వెళితేగానీ పూట గడవని పరిస్థితి. అటువంటి ఇంటికి పెద్ద దిక్కు లేకుండా చేశారు. బాధితులకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలి. దీనిపై ఇప్పటికే తమిళనాడు హైకోర్టును ఆశ్రయించాం. మృతదేహాలను చూస్తుంటే కొట్టి కాల్చి చంపేశారనిపిస్తుంది. తక్షణమే కేసు నమోదు చేసి కిరాతకానికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. బాధితులకు న్యాయం జరిగేంతవరకు మా పోరాటం ఆగదు.
 - ఇలవలగన్,  మాజీ ఎమ్మెల్యే, ఆర్కాట్
 
చట్టప్రకారం దర్యాప్తు..
బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. వారి తరఫున వచ్చిన బంధువులను, కుటుంబ సభ్యులను విచారించాల్సి ఉంది.  వారిని విచారణ చేస్తుంటే వారి తరఫున వచ్చిన న్యాయవాదులు అడుగడుగునా అడ్డుపడ్డారు. ఇది నిజమైన ఎన్‌కౌంటర్‌కాదని వారు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఫిర్యాదుదారులందరినీ విచారించాల్సిన అవసరం ఉంది. విచారణకు అడ్డుపడిన న్యాయవాదులపై ఉన్నతాధికారులతో చర్చించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
  - రవిశంకర్‌రెడ్డి, డీఎస్పీ
 
స్పెషల్లీ గ్రేవ్ అఫెన్స్ పరిధిలోకి కేసు!

సాధారణంగా హత్య ఆరోపణలపై నమోదైన కేసుల్ని ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులు దర్యాప్తు చేస్తారు. వీటిని గ్రేవ్ అఫెన్సులుగా పరిగణిస్తారు. శేషాచలం ఘటనకు సంబంధించి సచ్చినోడిబండ ప్రాంతంలో 11 మంది, చీకటీగల కోనలో 9 మంది తమిళనాడుకు చెందిన కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ తరహావి చట్ట ప్రకారం స్పెషల్లీ గ్రేవ్ అఫెన్సుల పరిధిలోకి వస్తాయి. వీటిని డీఎస్పీ లేదా ఆపై స్థాయి అధికారులు మాత్రమే దర్యాప్తు చేయాలి. నేరం జరిగిన తీరుతెన్నుల ఆధారంగా నమోదు చేసే సమయంలో నిందితులు ఎవరనేది కచ్చితంగా ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయకపోయినా.. దర్యాప్తు పూర్తిచేసి న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేయాల్సి వస్తే అందులో నేరం జరగడానికి దారితీసిన పరిస్థితులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు.. తదితర అంశాలను కచ్చితంగా పొందుపరచాలి. ఈ తరహా కేసుల దర్యాప్తులో నిబంధనల్ని యథాతథంగా అనుసరించాల్సిందే. ఈ కేసు దర్యాప్తులో అనేక కీలకాంశాలను దర్యాప్తు అధికారులు వెలుగులోకి తేవాల్సి ఉంటుంది. సాధారణంగా ఎన్‌కౌంటర్ల సందర్భంలో మృతుల పైనే హత్యాయత్నం, ఆయుధ చట్టం కింద కేసులు నమోదు చేస్తారు. దీంతో కాల్పులకు సంబంధించిన కొన్ని సున్నితాంశాలు వెలుగులోకి రావు. హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తే కచ్చితంగా ప్రతి అంశాన్నీ పక్కాగా నిర్థారించాలి. మృతుల స్వస్థలాల నుంచి మొదలుపెట్టి ఘటనా స్థలి వరకు వరకు ప్రతి ఘట్టాన్నీ సాక్ష్యాధారాలతో సహా రికార్డులకు ఎక్కించాలి. దీనికోసం ప్రాథమికంగా ఆ ఆపరేషన్‌లో పాల్గొన్న టాస్క్‌ఫోర్స్ బలగాల పూర్తి వివరాలు తెలుసుకోవడంతో పాటు వారు వినియోగించిన ప్రతి తుపాకినీ దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. బలగాలు కాల్పులకు ముందు పాటించాల్సిన నిబంధనల్ని పాటించాయా? అనే అంశంతో పాటు బాధితుల్లో ఎవరు, ఏ తూటా వల్ల చనిపోయారు? అది ఏ తుపాకీ నుంచి వెలువడింది? ఆ తుపాకీని వినియోగించింది ఎవరు? అనేవి స్పష్టంగా తేల్చాలి. హత్యకేసు దర్యాప్తు చేపట్టిన అధికారులు తమిళనాడు నుంచి శేషాచలం వరకు ప్రతి అంశాన్నీ నిర్థారించుకుంటూ రావాల్సి ఉంటుంది. స్వస్థలాల నుంచి కూలీలు బయలుదేరింది మొదలు వారు ప్రయాణించిన మార్గం, బసచేసిన ప్రాంతం, శేషాచలంలోకి చేరుకున్న విధానం, ఆయుధాల సమీకరణ, వాటిని ప్రయోగించిన విధానం ఇవన్నీ వెలుగులోకి వస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement