తిరుపతి శేషాచలంలో ఆంధ్ర పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్ బూటకమని, కూలీలను పట్టుకెళ్లి కాల్చి చంపారని జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులు స్పష్టం చేశారు. కూలీలను హింసించినట్లు మృతదేహాలపై ఆనవాళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలను రాష్ట్రపతికి, కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. మృతి చెందిన కూలీల గ్రామాల్లో ఆ సంఘం సభ్యులు గురువారం పర్యటించి వివరాలు సేకరించారు.
వేలూరు: తిరుపతి శేషాచలం అడవుల్లో ఆంధ్ర పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో తమిళనాడు తిరువణ్ణామలై జిల్లాకు చెందిన 12 మంది, ధర్మపురి జిల్లాకు చెందిన ఏడుగురు, సేలం జిల్లాకు చెందిన ఒకరు మృతి చెందారు. ఈ సంఘటనపై నిజానిజాలు తేల్చేందుకు ుుంబై హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి సురేష్, బిఎస్‌ఎఫ్ రిటైర్డ్ అధికారి రామ్‌మోహన్, పాకిస్థాన్ మాజీ ఉపదూత సత్య ప్రతాప్‌పాల్, చెన్నై హైకోర్టు న్యాయమూర్తి అజంతా, పింగర్‌పింట్ నిపుణుడు శేవియర్, మానవ హక్కుల సంఘానికి చెందిన హెండ్రీబోస్‌లు కమిటీగా ఏర్పాటయ్యారు. కన్నమంగళం సమీపంలోని అర్జునాపురం, పాలసముద్రం గ్రామాల్లో బుధ, గురువారాల్లో పర్యటించిన మానవ హక్కుల సంఘం కమిషన్ సభ్యులు గ్రామస్తులను విచారించారు. వీరు గురువారం విలేకరులతో మాట్లాడారు.
పథకం ప్రకారమే కాల్పులు
ఆంధ్రలోని పోలీసులు పథకం ప్రకారమే కూలీలను కాల్చి చంపారని, ఇది మానవ హక్కుల ఉల్లంఘనే అని పేర్కొన్నారు. కూలీలను హింసించి చంపినట్లు మృతదేహాలపై గాయాలు ఉన్నాయని చెప్పారు. సంఘటనా స్థలంలో తుపాకీ కాల్పులు జరిపినట్లు ఎలాంటి ఆనవాళ్లు లేవని పేర్కొన్నారు. ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపామంటూ ఆంధ్ర పోలీసులు అబద్దాలు చెబుతున్నారని పేర్కొన్నారు. ఆంధ్ర ప్రభుత్వం మానవత్వం లేకుండా కూలీలను కాల్చి చంపించిందని తెలిపారు. ఇది ఎన్‌కౌంటర్ కాదు హత్యేనని చెప్పారు.
చిత్రహింసలకు ఆనవాళ్లు
కూలీల మృతదేహాల్లో కాలివేళ్లు, చేతి వేళ్లు తెగిపోయి ఉన్నాయని చెప్పారు. మృతి చెందిన కూలీల కుటుం బాలు నిరుపేద, దయనీయ స్థితిలో ఉన్నాయన్నారు. పోలీసులు చెబుతున్నట్లు వారు వీరప్పన్ శిష్యులైతే, ఇప్పటికే ఆర్థికంగా బాగా నిలదొక్కుకునే వారని చెప్పారు. పోలీసులు చెప్పేది నిజమైతే, సంఘటన స్థలానికి తమను ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించారు. అక్కడికి మీడియాను అనుమతించడం ఏమిటన్నారు. ఆ మీడియా తీసిన ఫొటోలను పరిశీలిస్తే సంఘటనా స్థలంలో తుపాకుల కాల్పులు జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లేవన్నారు. ఆంధ్ర పోలీసులు తమతో పాటు వచ్చిన 11 మందిని తీసుకెళ్లి కాల్చి చంపారని ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్న శేఖర్, ఇళంగో, బాలచందర్ సాక్ష్యం చెపుతున్నారని ఇదే తమకు ఆధారమని చెప్పారను. వీరి ముగ్గురికి రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించడం అభినందనీయమన్నారు. తమ వద్దనున్న ఆదారాలతో రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి, ఆంధ్ర ప్రభుత్వానికి ఈనెల 23న నివేదిక సమర్పించనున్నామని తెలిపారు.
మహిళా ప్రయాణికురాలు కాపాడింది: శేఖర్
ఎన్‌కౌంటర్ జరిగిన ముందు రోజు తమ ప్రాంతానికి చెందిన ఏడుగురం వెళ్లాం. అందరం బస్సులో ఆఖరి సీటులో కూర్చుని ఉన్నాం. సీటు చాలక పోవడంతో ముందు సీటులోని మహిళ పక్కన కూర్చున్నాను. నగరి వద్ద బస్సు ఆపిన ఆంధ్ర పోలీసులు ఆఖరి సీటులో ఉన్న ఏడుగురిని కిందకు దించుకున్నారు. ఆ సమయంలో తాను భయపడి మహిళ ఒడిలో పడుకున్నాను. ఇందుకు మహిళ కూడా అంగీకరించింది. బస్సు బయలుదేరిన అనంతరం వేరే బస్టాప్‌లో దిగి మరొక బస్సులో సొంత గ్రామానికి చేరుకున్నాను. గ్రామానికి చేరుకున్న అనంతరమే మృతి చెందిన విషయం తెలిసింది.
మద్యం కొనేందుకు వెళ్లాను: బాలచందర్
తాను స్నేహితులతో కలిసి మేస్త్రీ పనులకు వెళ్లాను. బస్సు ఆంధ్ర రాష్ర్ట సరిహద్దులో వచ్చే సమయంలో ఆగడంతో మద్యం కొనేందుకు వెళ్లాను. తిరిగి వచ్చే సరికే బస్సు బయలుదేరి వెళ్లి పోయింది. ఆ సమయంలో మా స్నేహితులతో ఫోన్‌లో మాట్లాడితే తిరుపతి బస్టాండ్‌కు వచ్చేయి అని తెలిపారు. తిరుపతికి వచ్చిన అనంతరం స్నేహితుల ఫోన్ పనిచేయక పోవడంతో తిరుపతి నుంచి తిరువణ్ణామలైకి బస్సులో వచ్చానన్నాడు.
పాని పూరి దుకాణానికి వెళ్లి వస్తుండగా పట్టుకెళ్లారు: ఇళంగో
ఎన్‌కౌంటర్‌కు ముందు రోజు తాను తన స్నేహితుడు పన్నీర్‌సెల్వం (మృతి చెందిన వ్యక్తి), కలిసి నగిరిలోని పానిపూరి తినేందుకు వెళ్లే, తరువాత బస్టాండ్‌కు ఆటోలో బయలు దేరాము. దీన్ని గమనించిన ఇద్దరు పోలీసులు జీపులో వచ్చి ఆటోను అడ్డగించి తమ ఇద్దరినీ మినీ లారీలో ఎక్కించారు. అప్పటికే ఆ లారీలో 15 మందికి పైగా ఉన్నారు. అనంతరం ఒక గంట పాటు అడవిలోకి లారీ వచ్చింది. అడవి సమీపంలోని ఒక అటవీ కార్యాలయం వద్ద లారీని ఆపి పోలీసులు కార్యాలయంలోకి వెళ్లారు. దీన్ని గమనించిన తాను లారీ నుంచి మెల్లగా కిందకు దిగి కార్యాలయం ప్రహరీ గోడను ఎగిరి దూకి అటవీ మార్గంలోనే అష్టకష్టాలు పడి తిరుపతి చేరుకొని అక్కడి నుంచి వేలూరుకు చేరుకున్నానన్నారు.
ఎన్‌కౌంటర్ బూటకం
Published Fri, Apr 17 2015 2:14 AM | Last Updated on Sat, Aug 18 2018 4:35 PM
Advertisement
Advertisement