* రైతు ఆత్మహత్యల ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
* పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి రుణాలు తీసుకుని వారి ఒత్తిళ్ల వల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలపై ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని హైకోర్టు గురువారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు ప్రభుత్వానికి 3 వారాల గడువునిచ్చింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రైతుల ఆత్మహత్యల నివారణకు ఉభయ రాష్ట్రాలు ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేయడంతో పాటు,ఆత్మహత్యల నివారణకు 2006లో స్వామినాథన్ కమిటీ చేసిన సిఫారసులను అమలు చేసేలా ఉభయ రాష్ట్రాలను ఆదేశించాలని కోరుతూ వ్యవసాయ జన చైతన్య సమితి అధ్యక్షుడు రామయ్య యాదవ్, తెలంగాణ రాష్ట్రంలో జీవో 69 ప్రకారం రూ. 1 లక్ష వరకు రైతులు తీసుకున్న పంట, బంగారంపై రుణాలను వన్ టైం సెటిల్‌మెంట్ కింద మాఫీ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త దొంతిరెడ్డి నర్సింహారెడ్డి, మరొకరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యాలను ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్ స్పందిస్తూ, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద రుణాల తీసుకోవడం ద్వారా దాదాపు 150 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు పిటిషనర్లు తమకు వివరాలిచ్చారని తెలిపారు. ఈ ఆత్మహత్యలు గత ఏడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరి నెలల్లో జరిగాయన్నారు. వాటిని జిల్లా కలెక్టర్లకు పంపి, ఒక్కో రైతుకు చెందిన పూర్తి వివరాలతో కోర్టుకు నివేదిక సమర్పిస్తామని వివరించారు. రైతులను వేధించే వడ్డీ వ్యాపారులపై కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల ఒత్తిళ్ల వల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలపై ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలంది. వాటి ఆధారంగా ఈ వ్యాజ్యాలపై విచారణను ముగిస్తామని తెలిపింది.
ఏం చర్యలు తీసుకుంటున్నారు
Published Fri, Mar 11 2016 2:40 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement