సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కార్యదర్శిపై హైకోర్టు గురువారం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తాము ఆదేశించిన మేర నిర్ణీత వ్యవధిలోపు కౌంటర్ దాఖలు చేయనందుకు రూ.1500 జరిమానా విధించినా పద్ధతి మార్చుకోకపోవడాన్ని తప్పుపట్టింది. గురువారం నాటి విచారణకు సైతం కౌంటర్ దాఖలు చేయకుండా సమయం కోరడంతో మండిపడ్డ హైకోర్టు మరోసారి రూ.1500 జరిమానా విధించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఉభయ రాష్ట్రాల్లోని పలు విశ్వవిద్యాలయాలు యూజీసీ అనుమతి లేకుండానే పలు కోర్సులను నిర్వహిస్తున్నాయని, ఈ విషయంలో విశ్వవిద్యాలయాలను నిలువరించేలా యూజీసీని ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ప్రొఫెసర్ జి.శివారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతత్వంలోని ధర్మాసనం ఇటీవల విచారించింది.
తాము ఆదేశించిన విధంగా నిర్ణీత కాల వ్యవధి లోపు కౌంటర్ దాఖలు చేయకపోవడంతో యూజీసీ కార్యదర్శికి రూ.1500 విధిస్తూ విచారణను వాయిదా వేసింది. తాజాగా ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా యూజీసీ తరఫు న్యాయవాది స్పందిస్తూ, కౌంటర్ సిద్ధమైందని, అయితే అది ఇంకా కోర్టులో దాఖలు చేసేందుకు అందుబాటులోకి రాలేదని తెలిపారు. దీనిపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, ఇప్పటికే ఓసారి జరిమానా విధించినా పద్దతి మార్చుకోలేదా..? అంటూ ప్రశ్నించింది. మరోసారి రూ.1500 జరిమానా చెల్లించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
యూజీసీ కార్యదర్శికి మరోసారి రూ.1500 ఫైన్
Published Thu, Oct 29 2015 8:56 PM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM