డీమ్డ్ వర్సిటీల ఆగడాలు పట్టవా? | Deemed Universities and The Education Marathon | Sakshi
Sakshi News home page

డీమ్డ్ వర్సిటీల ఆగడాలు పట్టవా?

Published Fri, Dec 11 2015 1:06 AM | Last Updated on Sat, Aug 11 2018 8:48 PM

డీమ్డ్ వర్సిటీల ఆగడాలు పట్టవా? - Sakshi

డీమ్డ్ వర్సిటీల ఆగడాలు పట్టవా?

విశ్లేషణ
 సదరు డీమ్డ్ వర్సిటీపై క్రిమినల్ కేసు నమోదై ఉన్నా, అది అత్యధిక ఫీజులు వసూలు చేసినా, చివరకు నాలుగేళ్లు చదివి, కోటిన్నర రూపాయలు వెచ్చించి సాధించిన డిగ్రీలు పనికి రాకుండా పోయినా విద్యార్థులను రక్షించే బాధ్యత యూజీసీపైన లేదా?

 ప్రయివేటు వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తున్న డీమ్డ్ విశ్వ విద్యాలయాలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) పరిశీలించి, తగు అర్హతలుంటే ఆ హోదాను ఇచ్చి, అజమాయిషీ చేయ వలసి ఉంటుంది. చెన్నైలోని వివేకానంద మిషన్ రిసెర్చ్ ఫౌండేషన్‌ను (వీఎమ్‌ఆర్‌ఎఫ్) యూజీసీ, డీమ్డ్ యూనివర్సిటీగా గుర్తించినా దాని పనితీరును మెరు గుపరచడానికి ఏ చర్యా తీసుకోకపోవడం గురించి, విద్యార్థులు నష్టపోతున్నా యాజమాన్యాన్ని మందలించ కపోవడం గురించి నటరాజన్ అనే ఒక పీహెచ్‌డీ విద్యార్థి ఫిర్యాదు చేశాడు. సెల్వకుమార్ అనే మరొక వైద్య విద్యార్థి పోలీసుస్టేషన్లో ఒక క్రిమినల్ కేసు దాఖలు చేశాడు.

ఏటా రూ. 3.5 లక్షలు మాత్రమే ఫీజు వసూలు చేయాలని నియమాలు నిర్దేశిస్త్తుండగా, ఆ సంస్థ వారు ఏటా దాదాపు నలభై లక్షల రూపాయల చొప్పున 42 మంది విద్యార్థుల దగ్గర నుంచి నాలుగేళ్లు వసూలు చేశారనీ, తీరా నాలుగేళ్లు చదివిన తరువాత వారి వైద్య విద్యా డిగ్రీకి గుర్తింపులేక, పనికిరాకుండాపోయిందనీ, కనీసం పోస్టు గ్రాడ్యుయేషన్ చదవడానికి కూడా అది ఉపయోగపడక తమకు చాలా నష్టం జరిగిందనీ ఫిర్యాదుదారు పేర్కొన్నాడు. దీన్ని మోసంగా భావించి నేర విచారణ చేయాలని ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. దాని ప్రతిని యూజీసీకి కూడా పంపారు. దీనిపైన ఏ చర్య తీసుకున్నారని నటరాజన్ సమాచార హక్కు చట్టం కింద కోరారు. తన పరిశోధనా పత్రం మూల్యాంకనం చేయలేదని ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది ఎందుకని నటరాజన్ యూజీసీని ప్రశ్నించారు.

 ఏ ఫిర్యాదూ అందలేదని ఒక్క వాక్యంతో యూజీసీ ప్రజాసమాచార అధికారి సమాధానం చెప్పారు. నట రాజన్ సమస్యను పరిష్కరించవలసింది యూనివర్సిటీ వారేనని, తమకు సంబంధం లేదని అన్నారు.  
 సదరు విశ్వవిద్యాలయంపై క్రిమినల్ కేసు దాఖలై ఉన్నా, నియమాలను ఉల్లంఘించి అది అత్యధిక ఫీజులు వసూలు చేసినా, చివరకు నాలుగేళ్లు చదివి, కోటిన్నర రూపాయలు వెచ్చించి సాధించిన డిగ్రీలు పనికి రాకుండాపోయినా విద్యార్థులను రక్షించే బాధ్యత యూజీసీపైన లేదా? అని నటరాజన్ ప్రశ్నించారు. యూజీసీ సమాచార అధికారి శ్రీ చరణ్ దాస్, డీమ్డ్ సంస్థల వ్యవహారాలను చూసే బాధ్యతలు కూడా నిర్వ హిస్తున్నారు. ఆయన తన ఫిర్యాదుపై ఏ చర్యా తీసుకో లేదని, కనీసం కోరిన సమాచారం కూడా సదరు ప్రైవేటు విద్యాసంస్థ నుంచి ఇప్పించలేదని నటరాజన్ అన్నారు.

 డీమ్డ్ యూనివర్సిటీల ప్రమాణాలను అధ్యయనం చేసేందుకు భారత ప్రభుత్వం ప్రొఫెసర్ టాండన్ అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ 2009లో నివేదికను సమర్పించింది. దేశమంతటా పుట్టగొడు గుల్లా వ్యాపించిన డీమ్డ్ విశ్వవిద్యాలయాలు పెక్కిం టిలో ప్రమాణాలు లోపించడం, నిర్వహణ లోపభూయి ష్టంగా ఉండటం, అవి నియమాలను పాటించకపోవ డం వంటి సమస్యలపై తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. యశ్‌పాల్ కమిటీ కూడా ఈ సంస్థలలో ప్రమాణాల పత నం గురించి ఆవేదన వ్యక్తం చేసింది.

ఇక ముందు కొత్తగా ఏ సంస్థకూ విశ్వవిద్యాలయ హోదా ఇవ్వరాదని ఆంక్షలు విధించారు కూడా. డీమ్డ్ విశ్వవిద్యాలయాల ప్రమాణాలను పరిశీలించిన తరువాత టాండన్ కమిటీ వాటిని మూడు భాగాలుగా వర్గీకరించింది. మొదటి భాగంలో విశ్వవిద్యాలయ హోదాకు తగిన ఉన్నత ప్రమాణాలతో నడిచే సంస్థల జాబితాను ఇచ్చారు. మరీ ఉత్తమ ప్రమాణాలు లేక పోయినా, కొన్ని లోపాలు ఉన్న ప్పటికీ, ఆ లోపాలను  సవరించడానికి వీలున్న డీమ్డ్ విశ్వవిద్యాలయాలను రెండో భాగంలో చేర్చారు. కొన్ని మార్పులతో ఈ సంస్థలు విశ్వవిద్యాలయాలుగా కొనసా గవచ్చని పేర్కొన్నారు.  ఇక మూడో జాబితా పనికి రాని విశ్వవిద్యాలయాలది. అంటే స్థాపించిన నాటి నుంచి ఇప్పటివరకూ  ఏ విధమైన ప్రమాణాలను పాటించని వాటిని, ఇక ముందు కూడా ఆ ప్రమాణాలను సాధించే అవకాశం లేని వాటిని, ఆ హోదాను కొనసాగించడానికీ వీల్ల్లేనివాటిని టాండన్ కమిటీ ఈ మూడో జాబితాలో చేర్చింది. ఆ మూడో జాబితాలో వివేకానంద సంస్థ ఉంది.

 సమాచార అధికారి సమాచారం ఇవ్వకపోగా, ఆ సంస్థలు కోర్టులో తమకు ప్రమాణాలు లేవన్న విమ ర్శను సవాలు చేశాయని, కనుక ఆ కేసు ముగిసేదాకా ఆ సంస్థలపై ఏ చర్యా తీసుకోవడానికి వీల్లేదని వాదిం చారు. ఆ కేసుకు, విద్యార్థుల సమస్యల పరిష్కారాలకు సంబంధం ఏమిటని అడిగితే జవాబు లేదు. విద్యార్థులు తమ డిగ్రీ పనికి రాకుండా పోయిందన్న ఫిర్యాదుపై స్పందించకపోగా, ఎఫ్‌ఐఆర్ దాఖైలైనట్టు తెలిసినా ఆ సంస్థను నిలదీయకపోవడం, విద్యార్థుల నుంచి అందిన ఇతర ఫిర్యాదులను సైతం పట్టించుకోకపోవడం అభ్యం తరకరమని కమిషన్ వ్యాఖ్యానించింది.

వెంటనే చర్య తీసుకోవలసిన యూజీసీ నిర్లిప్తంగా ఉందన్నారు. అజ మాయిషీ నియమాలను అనుసరించి యూజీసీ ఏ చర్య తీసుకుందో వివరించాలనీ, వివేకానంద విద్యాసంస్థ మోసం చేసిందన్న అంశంపైన, డిగ్రీ చెల్లుబాటు కాక పోవడంపైన వివరణ ఇవ్వాలనీ, టాండన్ సిఫార్సుల అమలు గురించి వివరించాలనీ కమిషన్, యూజీసీని ఆదేశించింది. వీఎమ్‌ఆర్‌ఎఫ్  రిజిస్ట్రార్ గానీ, వైస్‌చాన్స లర్ గానీ వ్యక్తిగతంగా హాజరై సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. సమాచారం ఇవ్వకుండా వేధించినందుకు వినాయక విద్యా సంస్థ, నటరాజన్‌కు పదివేల రూపా యల పరిహారం ఇవ్వాలని తీర్పు చెప్పింది. యూజీసీకి జరిమానా ఎందుకు విధించకూడదో వివరణ ఇవ్వాలని నోటీసును కూడా జారీ చేసింది.
http://img.sakshi.net/images/cms/2015-02/61423773231_295x200.jpg
 (నటరాజన్ వర్సెస్ యూజీసీ కేసులో ఇచ్చిన తీర్పు ఆధారంగా)
 (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్: మాడభూషి శ్రీధర్)
 professorsridhar@gmail.com
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement