‘ఫీజులు’ వెబ్‌సైట్‌లో పెట్టండి
సాక్షి, హైదరాబాద్: దేశంలోని అన్ని యూనివర్సిటీలు, వాటి పరిధిలోని కాలేజీలు ఫీజులు, కోర్సులు సహా ఇతర వివరాలన్నిటినీ వెబ్‌సైట్లలో పెట్టాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తాజాగా ఆదేశాలు జారీ చేసింది. 14 అంశాలకు సంబంధించిన అంశాలను కాలేజీలు, వర్సిటీలు తమ వెబ్‌సైట్‌లలో విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని పేర్కొంది. విద్యార్థులకు అందే ఉపకార వేతనాలు, అకడమిక్ కేలండర్, విద్యాసంస్థలోని అధ్యాపకుల ప్రొఫైల్స్, వివిధ విభాగాల సమాచారం, కాలేజీల్లోని ఇతరత్రా వసతులు, విద్యార్థుల సేవల కోసం నియమించిన నోడల్ అధికారి పేరు తదితర వివరాలు కూడా వెబ్‌సైట్‌లో పొందుపరచాలి.
తమ ఆదేశాలపై తీసుకున్న చర్యలను తెలుపుతూ 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని పేర్కొంది. అడ్మిషన్‌కు ముందు అనేక కాలేజీలు ట్యూషన్, ఇతర ఫీజుల వివరాలను గోప్యంగా ఉంచి, విద్యాసంస్థలో చేరాక వాటన్నింటినీ ముక్కుపిండి వసూలు చేస్తుండడంపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో అడ్మిషన్లకు ముందే ఫీజులతోపాటు వర్సిటీ, కాలేజీల సమస్త సమాచారం విద్యార్థులకు అందుబాటులో ఉంచేందుకు యూజీసీ చర్యలు తీసుకుంటోంది. మరోవైపు వివిధ రాష్ట్రాల్లో 21 నకిలీ వర్సిటీలు ఉన్నట్లు గుర్తించామని, విద్యార్థులు వాటిల్లో చేరవద్దని యూజీసీ తెలిపింది. వివిధ రాష్ట్రాల్లోని నకిలీ యూనివర్సిటీల జాబితాను ugc.ac.in వెబ్‌సైట్‌లో ఉంచింది. ఇందులో తెలంగాణ, ఏపీల నుంచి నకిలీ వర్సిటీలు లేవు.
19 కాలేజీలకు యూజీసీ వారసత్వ హోదా
దేశంలోని వందేళ్లకు పైబడిన కాలేజీల్లో 19 కాలేజీలకు యూజీసీ వారసత్వ హోదా ఇచ్చింది. వాటి అభివృద్ధి, హోదా పెంపునకు ఆర్థిక సాయం అందించడానికి ఆమోదం తెలిపింది. పురాతన విద్యాసంస్థల పరిరక్షణకు ఈ నిర్ణయం తీసుకుంది. హెరిటేజ్ కాలేజ్ స్కీం కింద 60 కాలేజీల నుంచి ప్రతిపాదనలు రాగా 19 కాలేజీలకు వారసత్వ హోదా కల్పించామని యూజీసీ ఓ ప్రకటనలో తెలిపింది. వీటిలో ఏపీ, తెలంగాణ కాలేజీలు లేవు.