సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కోట్లాది మంది చదువుతున్న అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) డిగ్రీ స్వరూపం క్రమంగా మారబోతోంది. ఇప్పటిలా మూడేళ్ళు కాకుండా, నాలుగేళ్ళ కాలపరిమితితో డిగ్రీ (యూజీ ఆనర్స్) ఉండనుంది. సాధారణ సంప్రదాయ కోర్సులు భవిష్యత్‌లో తెరమరుగయ్యే వీలుంది. బీఏ, బీకాం, బీఎస్సీ..లాంటివి ప్రత్యేకంగా ఉండకుండా వీటికి కంప్యూటర్స్, డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ).. లాంటి కోర్సులు జత కానున్నాయి. విద్యార్థికి లోతైన పరిజ్ఞానం అందించడమే లక్ష్యంగా ఈ కోర్సులు ఉండనున్నాయి.
ఆర్ట్స్ విద్యారి్థకి కంప్యూటర్ పరిజ్ఞానం.. సైన్స్ విద్యార్థికి సామాజిక అవగాహన కోర్సుల వంటి మార్పులతో నాలుగేళ్ల డిగ్రీ ఉండనుంది. జాతీయ విద్యావిధానం–2020లో భాగంగా ఈ తరహా బోధన ప్రణాళికను (కొత్త కరిక్యులం ఫ్రేమ్‌వర్క్) యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇప్పటికే సిద్ధం చేసింది. యూజీసీ కొత్త ప్రణాళికలను అన్ని రాష్ట్రాలూ ఆమోదించాయి. తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల్లో నాలుగేళ్ల యూజీ ఆనర్స్ డిగ్రీ కోర్సులను పరిమితంగా ప్రవేశపెట్టారు. భవిష్యత్తులో ఇది మరింత విస్తృతం కానుండగా..రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీలు కూడా ఆనర్స్ డిగ్రీ కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ముందుకొస్తున్నాయి.
ఇకనుంచి క్రెడిట్స్ విధానం
ఇక నుంచి డిగ్రీ పట్టాలు క్రెడిట్స్ ఆధారంగా ఉంటాయి. ఒక్కో స్థాయికి కొన్ని క్రెడిట్స్ ఉంటాయి. విద్యార్థులు మూడేళ్లలో 120 క్రెడిట్లు పూర్తి చేస్తేనే యూజీ డిగ్రీకి అర్హులవుతారు. సబ్జెక్టులను బట్టి క్రెడిట్లు ఉంటాయి. కాగా విద్యార్థి నాలుగేళ్లలో 160 క్రెడిట్లను పూర్తి చేస్తేనే యూజీ ఆనర్స్ డిగ్రీ పట్టా లభిస్తుంది. అలాగే ఆనర్స్ డిగ్రీ కోర్సుల్లో చేరేవారు రీసెర్చ్ కోసం వెళ్లాలనుకుంటే తమ నాలుగేళ్ల కోర్సులోనే రీసెర్చ్ ప్రాజెక్టులను చేపట్టాల్సి ఉంటుంది. మొదటి ఆరు సెమిస్టర్లలో 75 శాతం అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు పరిశోధనలు చేపట్టాలనుకుంటే నాలుగో ఏడాదిలో పరిశోధనా ప్రాజెక్టును ఎంచుకోవచ్చు. దీన్ని పూర్తి చేస్తే వారికి యూజీ ఆనర్స్ విత్ రీసెర్చ్ డిగ్రీని ప్రదానం చేస్తారు.
మూడేళ్ల కోర్సు చేస్తున్నవారికీ అవకాశం
ప్రస్తుతం మూడేళ్ల డిగ్రీ కోర్సులు చేస్తున్నవారు కూడా నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులకు మారేందుకు కొత్త కరిక్యులం ఫ్రేమ్‌వర్క్ అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) ప్రకారం మూడేళ్ల యూజీ కోర్సుల్లో పేర్లు నమోదు చేసుకున్న, అభ్యసిస్తున్న విద్యార్థులు కూడా నాలుగేళ్ల యూజీ ఆనర్స్ కొనసాగించడానికి అర్హులని నిబంధనల్లో పేర్కొన్నారు. ఇలాంటి విద్యార్థులు బ్రిడ్జి కోర్సులు పూర్తి చేయడం తప్పనిసరి అని యూజీసీ పేర్కొంది.
ఏడాది చదివితే సరి్టఫికెట్.. రెండేళ్లయితే డిప్లొమా
నాలుగేళ్ల యూజీ ఆనర్స్ కోర్సు విద్యార్థులకు బహుళ ప్రవేశ, నిష్క్రమణలకు అవకాశం కల్పించనున్నారు. ఇందులో భాగంగా మొదటి ఏడాది పూర్తి చేస్తే ఆ మేరకు విద్యారి్థకి సర్టిఫికెట్ లభిస్తుంది. రెండేళ్లు చదివితే డిప్లొమా లభిస్తుంది. మూడేళ్లు చదివితే డిగ్రీ పట్టా లభిస్తుంది. నాలుగేళ్లు పూర్తి చేస్తే ఆనర్స్ బ్యాచిలర్ డిగ్రీ పట్టా అందుతుంది.
బోధనలోనూ మార్పులు..
ళీయూజీ ఆనర్స్‌ను మార్కెట్లో తక్షణ ఉపాధి లభించేలా, వైవిధ్యంగా నైపుణ్యాత్మకంగా అందించాలని నిర్ణయించారు. మెయిన్, మైనర్ స్ట్రీమ్ కోర్సులు, భాష, నైపుణ్య కోర్సులు, పర్యావరణ విద్య, డిజిటల్, సాంకేతిక పరిష్కారాలు తదితర విభాగాల కోర్సులు ఉంటాయి. కొత్తగా ఆరోగ్యం, యోగా, క్రీడలు, ఫిట్‌నెస్ వంటివి కూడా చేర్చారు. ఆధునిక భారతీయ భాష, సంస్కృతి, ఆంగ్ల భాష, నైపుణ్యాల పెంపుదల, నైతిక విలువల కోర్సులు ఉంటాయి. అలాగే విద్యార్థుల ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి ఆచరణాత్మక నైపుణ్యాలు, శిక్షణ, సాఫ్ట్ స్కిల్స్ అందించడం లక్ష్యంగా ప్రత్యేక కోర్సులను చేర్చారు.
లోతైన పరిజ్ఞానం అందించడమే లక్ష్యం
ఆనర్స్ డిగ్రీ కోర్సుల్లో లోతైన పరిజ్ఞానం అందించేలా బోధన ఉంటుంది. బహుళ ప్రయోజనాలు ఉండాలన్నదే సరికొత్త మార్పుల లక్ష్యం. భవిష్యత్‌లో ఇక నాలుగేళ్ళ ఆనర్స్ కోర్సులే ఉండే వీలుంది. ఇందుకు అనుగుణంగానే తెలంగాణలోనూ బోధన ప్రణాళిక, పరీక్ష విధానంపై మార్పులకు అధ్యయనాలు జరుగుతున్నాయి.
– ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యా మండలి చైర్మన్
ఆనర్స్ వైపే అందరిచూపు..
విద్యార్థులు డిగ్రీ విద్యలో మార్పు కోరుకుంటున్నారు. ఆనర్స్ కోర్సులకు ప్రాధాన్యత పెరుగుతోంది. అందుకే ప్రైవేటు కాలే జీలు కూడా విద్యార్థులు కోరుకుంటున్న ఆనర్స్ కోర్సులు అందించేందుకు యతి్నస్తున్నాయి. ఈ మేరకు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నాయి.
– ఎక్కల్‌దేవి పరమేశ్వర్, ప్రైవేటు డిగ్రీ కాలేజీల సంఘం ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment