యూజీసీ మార్గదర్శకాల మేరకు కోర్సులు, సిలబస్
ఏఐ, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్‌చైన్ టెక్నాలజీ కోర్సులు
నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులకు పెరుగుతున్న డిమాండ్
క్లాస్ రూం లెర్నింగ్‌తో పాటు ఇంటర్న్‌షిప్ కూడా..
అధ్యయనం చేస్తున్న తెలంగాణ ఉన్నత విద్యా మండలి
విద్యార్థి నైపుణ్యాలకు మెరుగులు అద్దటమే లక్ష్యం
మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: సంప్రదాయ డిగ్రీ కోర్సులను సరికొత్తగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మార్గదర్శకాలకు అనుగుణంగా డిగ్రీ లో కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం, సంప్రదాయ కోర్సుల్లో ఆధునిక అవసరాలకు తగ్గట్లుగా సిలబస్‌ను మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. యూజీసీ మార్గదర్శకాలపై అధ్యయనానికి తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఇప్పటికే కమిటీ వేసింది.
త్వరలో సిలబస్‌ను ఖరారు చేయబోతోంది. త్వరలోనే విధివిధానాలను వెల్లడిస్తామని మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థి పూర్తి నైపుణ్యంతో ధైర్యంగా ఉపాధి కోసం వెళ్లేలా సిలబస్ ఉండబోతోందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఆనర్స్ కోర్సులకు ప్రాధాన్యత పెరుగుతుండటాన్ని కూడా పరిగణనలోనికి తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.
క్రెడిట్స్‌కే ప్రాధాన్యం..
ప్రపంచవ్యాప్తంగా విద్యా విధానం క్రెడిట్ స్కోర్ ఆధారంగా నడుస్తోంది. టెన్త్, డిగ్రీ, పీజీ, సాంకేతిక విద్యకు ప్రత్యేకంగా క్రెడిట్స్ ఇవ్వనున్నారు. ఈ విధానం వల్ల ఇతర దేశాల్లోనూ ఉపాధి కోసం వెళ్లవచ్చని అధికారులు అంటున్నారు. విద్యార్థులు మూడేళ్లలో 120 క్రెడిట్లు పూర్తి చేస్తేనే అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) డిగ్రీకి అర్హులవుతారు. అదే విద్యార్థి నాలుగేళ్లలో 160 క్రెడిట్లను పూర్తి చేస్తేనే యూజీ ఆనర్స్ డిగ్రీ పట్టా లభిస్తుంది.
ఆనర్స్ డిగ్రీ కోర్సుల్లో చేరేవారు రీసెర్చ్ కోసం వెళ్లాలనుకుంటే నాలుగేళ్ల కోర్సులోనే ప్రాజెక్టులను చేపట్టాల్సి ఉంటుంది. మొదటి ఆరు సెమిస్టర్లలో 75 శాతం.. అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు యూజీ స్థాయిలో పరిశోధనలు చేపట్టాలనుకుంటే నాలుగో ఏడాది పరిశోధనా ప్రాజెక్టును ఎంచుకోవచ్చు. దీన్ని పూర్తి చేస్తే వారికి యూజీ (ఆనర్స్ విత్ రీసెర్చ్) డిగ్రీని ప్రదానం చేస్తారు.
ఆనర్స్‌కు కొత్త బోధనా ప్రణాళిక..
ప్రస్తుతం మూడేళ్ల డిగ్రీ కోర్సులు చేస్తున్నవారు కూడా నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులకు మారేందుకు కొత్త కరిక్యులం ఫ్రేమ్ వర్క్ అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) ప్రకార మూడేళ్ల యూజీ కోర్సుల్లో పేర్లు నమోదు చేసుకున్న, అభ్యసిస్తున్న విద్యార్థులు కూ డా నాలుగేళ్ల యూజీ ఆనర్స్ కొనసాగించడానికి అర్హులని కొత్త నిబంధనల్లో పేర్కొన్నారు. అయితే, ఆనర్స్ కోర్సుల్లోకి మారడానికి ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో వర్సిటీలు అందించే బ్రిడ్జ్ కోర్సు లు చేయటం తప్పనిసరి. నాలుగేళ్ల యూజీ ఆనర్స్ కోర్సుల్లో విద్యార్థులకు బహుళ ప్రవేశ, నిష్క్రమణలకు అవకాశం కల్పించబోతున్నారు.
మొదటి ఏడాది పూర్తి చేస్తే సర్టీఫికెట్ లభిస్తుంది. రెండేళ్లు చదివితే డిప్లొమా ఇస్తారు. మూడేళ్లు చది వితే బ్యాచిలర్ డిగ్రీ పట్టా లభిస్తుంది. నాలుగేళ్లు పూర్తి చేస్తే ఆనర్స్ బ్యాచిలర్ డిగ్రీ పట్టా అందుతుంది. ఈ మేరకు విద్యార్థులు తమ ప్రాధాన్యతలను ఎంచుకోవడానికి అనుమతిస్తారు. నాలుగేళ్ల ఆనర్స్‌లో చేరినవారు మూడేళ్లలోపు నిష్క్రమిస్తే, అప్పటి నుంచి మూడేళ్లలోపు మళ్లీ కోర్సులో చేరేందుకు అవకాశం ఇస్తారు. అలాంటి వారు ఏడేళ్ల వ్యవధిలో కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది.
డిగ్రీలోనూ ఏఐ కోర్సులు
డిగ్రీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వాలని యూజీసీ మార్గదర్శకాల్లో సూచించింది. తెలంగాణలో నాలుగేళ్ల బీఎస్సీ (హానర్స్) కంప్యూటర్స్‌ను 50కి పైగా కాలేజీల్లో అందుబాటులోకి తెచ్చా రు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి అంశాలు హానర్స్‌లో చోటు చేసుకోబోతున్నాయి. కంప్యూటర్ పరిజ్ఞానంతో కూడిన అనలిస్టులు, అకౌంటెంట్లకు మంచి వేతనాలతో కూడిన ఉపాధి లభిస్తోంది.
ఈ కారణంగా డిగ్రీ కోర్సుల్లో కామర్స్‌ను ఎంచుకునే వారి సంఖ్య 36 శాతం నుంచి 41 శాతానికి పెరిగింది. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) లో చేరికలు కూడా ఆరేళ్లలోనే ఏడు రెట్లు పెరిగాయి. బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ)లో ప్రవేశాలు 9 రెట్లు పెరిగాయి. దీంతో బీకాం కోర్సులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. బీకాం జనరల్‌తో పాటు, కంప్యూటర్స్, ట్యాక్సేషన్, ఆనర్స్, బిజినెస్ అనలిటిక్స్ వంటి కొత్త స్పెషలైజేషన్లను తీసుకొచ్చారు. బీమా, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెరగడం, జీఎస్‌టీ తీసుకురావడంతో ట్యాక్స్ నిపుణుల అవసరం రెట్టింపైంది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఈ కామర్స్, రిటైల్ సంస్థల పెరుగుదల కూడా కలిసివచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment