మన సంప్రదాయ విద్యావ్యవస్థ తయారు చేస్తున్న విద్యావంతులు నైపుణ్యాల లేమితో కునారిల్లుతున్నారు. ఒకవైపు ఏటికేడాది నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూ ఉంటే... మరోవైపు పరిశ్రమలు నైపుణ్యం గలవారు దొరక్క సమస్యల నెదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితిని మార్చడం కోసం తెలంగాణ ప్రభుత్వం ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ని స్థాపించింది. విద్యా సంస్థలు– పరిశ్రమల సమన్వయం ఆధారంగా ఇది పనిచేస్తుంది.
విద్యార్థులు సంప్రదాయ పరీక్షల విధానంలోనే కాకుండా... ఫ్యాక్టరీల్లో, పెద్ద పెద్ద కంపెనీల్లో ‘ఆన్ హ్యాండ్’ పద్ధతిలో నైపుణ్యాలను నేర్చుకుంటారు. అప్రెంటిస్‌లుగా పనిచేస్తారు. మొత్తం మీద రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు దారి చూపే ఒక చుక్కాని లాంటి దార్శనిక సంస్థ ఇది.
భారతదేశం ఇప్పుడు ఓ పరివర్తన దశలో ఉంది. నవ నవోన్మేషంతో ఉరకలెత్తే యువత అభివృద్ధిలో మరింత ఎత్తుకు ఎదిగే అవకాశం ఒకపక్క ఉంటే... నిరు ద్యోగం మునుపెన్నడూ లేనంత స్థాయిలో ఉండటం, నైపుణ్యాలతో కూడిన మానవ వనరుల కోసం కర్మాగారాలు సమస్యలను ఎదుర్కో వడం ఇంకో పక్కన ఉన్నాయి. ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సి టీ’ని స్థాపించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఈ సవాలును ఎదు ర్కొనేందుకు సిద్ధమైంది.
దేశంలో మునుపెన్నడూ లేని చందంగా విద్య, ఉపాధుల మధ్య వారధిగా నిలవడంతోపాటు... రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు దారి చూపే ఒక చుక్కానిలాంటి దార్శనిక సంస్థ ఇది. నైపుణ్యాలతో కూడిన మానవ వనరులను అందించి పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయడానికి ఈ వర్సిటీ ఎంతగానో ఉపకరిస్తుంది. ఎందుకంటే... ఇక్కడ పరిశ్రమలే తమకు అవసరమైన నైపు ణ్యాల్లో యువతకు శిక్షణ ఇచ్చి కార్మికులుగా, ఉద్యోగులుగా, ఇంజ నీర్లుగా ఉద్యోగాలిస్తాయి.
దేశంలో ఏటా కొన్ని లక్షల మంది విద్యార్థులు పట్టభద్రులు అవు తున్నారు. పట్టభద్రుల్లో 47 శాతం మందికి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు లేని కారణంగా ఉద్యోగార్హత లేదని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ విషయానికి వస్తే ఏటా రెండు లక్షల మంది ఇంజినీర్లు, మరో రెండు లక్షల మంది సాధారణ డిగ్రీలు, ఐటీఐ, డిప్లోమా కోర్సులు పూర్తి చేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.
దురదృష్టవశాత్తు సంప్రదాయ విద్యా వ్యవస్థలో సిద్ధాంతాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటోంది. ఫలితంగా ఈ వ్యవస్థ నుంచి బయ టకు వచ్చేవారికి నిజ జీవిత సవాళ్లను ఎదుర్కోవడం కష్టసాధ్య మవుతోంది. పాతబడిపోయిన పాఠ్యాంశాలు, ప్రాక్టికల్ ట్రెయినింగ్ తక్కువగా ఉండటం, సాఫ్ట్ స్కిల్స్‌కు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వంటివి... నైపుణ్యాల కొరతను ఎక్కువ చేశాయి. ఐటీ, ఉత్పాదన, ఆరోగ్య రంగం, సంప్రదాయేతర విద్యుత్తు... ఇలా ఏ రంగం తీసు కున్నా చాలామంది తాజా పట్టభద్రుల్లో నైపుణ్యాల లేమి స్పష్టంగా కనిపిస్తోంది.
ఫలితంగా ఓ విచిత్రమైన ద్వైదీభావం ఏర్పడుతోంది. విద్యార్థులేమో ఉద్యోగాల కోసం... పరిశ్రమల వారేమో శిక్షణ, తగిన నైపుణ్యాలున్న వారి కోసం నిత్యం వెతుకుతూనే ఉన్న పరిస్థితి ఉంది. అందుకే నైపుణ్యాలే కేంద్ర బిందువుగా ఉండే విద్యా వ్యవస్థలోభాగంగా పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టు నైపుణ్యాలను ప్రోదిచేసే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటైంది.
ఈ యూనివర్సిటీ దేశంలోనే మొట్ట మొదటిది మాత్రమే కాదు, విప్లవాత్మకమైంది కూడా. నిరుద్యోగ యువత సాధికారత కోసం ఉద్దే శించింది. వివిధ రంగాల్లో డిమాండ్ ఉన్న నైపుణ్యాలను గుర్తించి వాటిల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది. ఆధునిక టెక్నాలజీలను నిజ జీవిత పరిస్థితుల్లో విద్యార్థులకు ప్రాక్టికల్‌గా ట్రెయినింగ్ ఇస్తారు. తద్వారా విద్యార్థులు కేవలం పట్టభద్రుల్లా కాకుండా... అసలైన వృత్తి నిపుణుల్లా తయారవుతారు.
విద్యా సంస్థలు, పరిశ్రమల సమన్వయం ఆధారంగానే ఈ వర్సిటీ పనిచేస్తుంది. విద్యార్థులు సంప్రదాయ పరీక్షల విధానంలోనే కాకుండా... ఫ్యాక్టరీల్లో, పెద్ద పెద్ద కంపెనీల్లో ‘ఆన్ హ్యాండ్’ పద్ధతిలో నైపుణ్యాలను నేర్చుకుంటారు. అప్రెంటిస్‌లుగా పనిచేస్తారు. అది కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సంప్రదాయేతర ఇంధన వనరుల వంటి అత్యాధునిక టెక్నాలజీరంగాల్లో! పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా బోధనాంశాలను రూపొందించడం వల్ల తెలంగాణ విద్యార్థులకు డిమాండ్ పెరుగుతుంది. మంచి జీతం వచ్చే అవకాశం ఉంటుంది. వీరంతా ఉద్యోగాల్లో స్థిరపడితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటును అందించిన వారవుతారు.
ఈ ఏడాది నవంబరు 4న ఏడు కోర్సులతో అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించడం తెలిసిందే. పూర్తి స్థాయిలో కార్యకలాపాలు మొదలు పెడితే తయారీ, సేవా రంగాలకు చెందిన 18 అంశాల్లో కోర్సులు ఉంటాయి. వర్సిటీ నిర్మాణం కోసం ముచ్చెర్ల వద్ద ‘నెట్‌జీరో సిటీ’లో 150 ఎకరాల స్థలం కేటాయించాం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మేఘా ఇంజినీరింగ్ సంస్థ రూ. 200 కోట్లతో వర్సిటీ నిర్మాణాన్ని చేపట్టింది. దేశంలోనే దిగ్గజ పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రా ఇప్పటికే వర్సిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు కూడా. ఆనంద్ మహింద్రా నాయకత్వం, దార్శనికతలు ఈ విశ్వవిద్యాలయాన్ని నైపుణ్యాభివృద్ధి విషయంలో దేశానికే ఆదర్శంగా నిలుపుతాయనడంలో సందేహం లేదు.
మరో పక్క రాష్ట్రంలోని 65 ప్రభుత్వ ఐటీఐల ఆధునికీకరణ కూడా చేపట్టాం. అడ్వాన్స్‌డ్ ట్రెయినింగ్ సెంటర్లుగా వీటిని ఇప్పటికే అప్ గ్రేడ్ చేసే కార్యక్రమం జరుగుతోంది. ఇకపై ఈ సెంటర్లు స్కిల్స్ యూనివర్సిటీ సిలబస్ ప్రకారం విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్‌నిఅందిస్తూ... ప్రస్తుతం పరిశ్రమల్లో అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణఅందిస్తాయి. ఈ ఆధునికీకరణ కారణంగా నైపుణ్యాభివృద్ధిలో తెలంగాణలో ఒక సమగ్రమైన ప్రతిభావంతుల వ్యవస్థ ఏర్పాటు అవు
తుంది. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ పరిశ్రమలు కూడా పాలుపంచు కునేలా చేస్తున్నాం. తద్వారా వారు తమకు అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చుకునే వీలేర్పడుతుంది. అంటే పరిశ్రమలే తమకు అవసర మైన మానవ వనరులను తయారు చేసుకుంటాయన్నమాట.
ప్రత్యేక కార్యక్రమాలు, కోర్సుల ద్వారా పరిశ్రమల అవసరాల న్నింటినీ వర్సిటీ తీరుస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్క్, నాయకత్వం వంటి సాఫ్ట్ స్కిల్స్‌పై కూడా శిక్షణ ఇస్తుండటం వల్ల పరిశ్రమలకు అన్ని నైపుణ్యాలున్న మానవ వనరులు లభిస్తాయి. యువత సొంతంగా పరిశ్రమలు స్థాపించుకునేలా ప్రోత్సహించేందుకు కూడా ఈ వర్సిటీ చర్యలు తీసుకుంటుంది.
ఉపాధి అవకాశాల్లో గేమ్ ఛేంజర్
స్కిల్స్ యూనివర్సిటీ ఉద్యోగ ప్రపంచంపై చూపే ప్రభావాన్ని ఏమాత్రం తక్కువ చేయలేం. ఆధునిక నైపుణ్య శిక్షణకు వాస్తవిక విద్య కూడా తోడవడం వల్ల నిరుద్యోగ సమస్యను ఎదుర్కొనేందుకు ఇదో మేలిమి సాధనంగా మారనుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు లక్షల్లో ఉంటే ఖాళీలు వేలల్లో మాత్రమే ఉంటా యన్నది తెలిసిన విషయమే. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించేందుకు ఉన్న అవకాశం 0.1 నుంచి ఒక శాతం మాత్రమే అన్నమాట.
ప్రత్యామ్నాయ ఉద్యోగ అవకాశాల అవసరాన్ని ఈ అంకెలే చెబు తున్నాయి. ప్రైవేట్ రంగంలో నైపుణ్యాలున్న వారికి ఉద్యోగ అవ కాశాలు మెండు. అందుకే తెలంగాణ ప్రభుత్వపు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ దేశానికి ఒక మోడల్‌గా ఉపయోగపడుతుందని చెప్పడం!
స్కిల్స్ యూనివర్సిటీలో కోర్సులు రెండు వేల మందితో మొద లవుతాయి. వచ్చే ఏడాది ఈ సంఖ్య పదివేలకు చేరుతుంది. క్రమంగా ఇది 30 వేలకు చేరుతుంది. యూనివర్సిటీ భవన నిర్మాణాలు పూర్త య్యేంత వరకు గచ్చిబౌలిలోని ‘ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్‌ఇండియా’ (ఈఎస్‌సీఐ), హైటెక్ సిటీలోని ‘నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్’ ప్రాంగణాల్లో ప్రస్తుతం శిక్షణ తరగతులు జరుగుతున్నాయి.
వర్సిటీ ఫీజుల విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల వారందరికీ ఫీజుల్లో రాయితీ ఉంటుంది. వర్సిటీ కార్యకలాపాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ. 100 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఇది ప్రారంభమే కాదు... ఉపాధి విప్లవానికి రాచబాట!
- వ్యాసకర్త తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి
- దుద్దిళ్ల శ్రీధర్ బాబు
Comments
Please login to add a commentAdd a comment