స్కిల్స్ వర్సిటీలో అడ్మిషన్ పొందితే ఉద్యోగం గ్యారంటీ: సీఎం రేవంత్
నాలుగేళ్లలో న్యూయార్క్ కంటే మెరుగైన నగరంగా బేగరికంచె
హెల్త్, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, హాస్పిటాలిటీ టూరిజం అభివృద్ధి
ప్రపంచ స్థాయి వర్సిటీలు, జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు తెస్తాం
మీర్‌ఖాన్‌పేటలో ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’కి సీఎం శంకుస్థాపన
సాక్షి, రంగారెడ్డి జిల్లా: నీళ్లు, నిధులు, నియామ కాల పేరుతో సాధించుకున్న తెలంగాణలో ఉద్యమ స్ఫూర్తితో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కలి్పంచనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోతున్న వర్సిటీలో ప్రవేశం పొందిన ప్రతి ఒక్కరికీ గ్యారంటీగా ఉపాధి లభిస్తుందని హామీ ఇచ్చారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో 57 ఎకరాల విస్తీర్ణంలో రూ.150 కోట్లతో నిర్మించతలపెట్టిన ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’కి గురువారం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. తర్వాత నెట్ జీరో సిటీలో భాగంగా బేగరికంచె గ్రామ పరిధిలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్, మోడ్రన్ స్కూల్, ప్రైమరీ హెల్త్ సెంటర్, కమ్యూనిటీ సెంటర్ల నిర్మాణాలకు కూడా శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
నాలుగో నగరంగా బేగరికంచె అభివృద్ధి
‘హైదరాబాద్‌ను నవాబులు, సికింద్రాబాద్‌ను బ్రిటిషర్లు, సైబరాబాద్‌ను చంద్రబాబు, వైఎస్సార్‌లు నిర్మిస్తే.. నాలుగో నగరంగా బేగరికంచెను మేము అభివృద్ధి చేయబోతున్నాం. నాలుగేళ్లలోనే న్యూయార్క్‌ను మించిన నగరంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతాం. హెల్త్, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, హాస్పిటాలిటీ టూరిజంగా అభివృద్ధి చేస్తాం. ప్రపంచ స్థాయి యూనివర్సిటీలు, జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను ఇక్కడికి తీసుకొస్తాం. నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కలి్పస్తాం. తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగ సమస్యపై కొనసాగింది. అందులో యువత కీలక పాత్ర పోషించింది.
ఏటా లక్ష మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు బయటికి వస్తున్నా ఆశించిన స్థాయిలో ఉపాధి లభించడం లేదు. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బులు ఖర్చు పెడుతూ అశోక్‌నగర్ చౌరస్తాలోని కోచింగ్ సెంటర్లలో చేరినా, సరైన నైపుణ్యం లేక ఉద్యోగాలు దొరకడం లేదు. పీజీ, పీహెచ్‌డీ పట్టాలు పొంది కూడా నిరుద్యోగులుగా మిగులుతున్న యువతకు ఈ స్కిల్స్ యూనివర్సిటీలో డిప్లొమా, డిగ్రీ సరి్టఫికెట్ కోర్సులు అందించడంతో పాటు ఆయా సంస్థల్లో ఉపాధి కలి్పస్తాం. ఇక్కడ అడ్మిషన్ పొందితే చాలు.. జాబ్ గ్యారంటీ. జాతీయ, అంతర్జాతీయ కంపెనీల అవసరాలకు తగ్గట్లుగా శిక్షణ ఇప్పించి ఉపాధి కలి్పస్తాం..’అని సీఎం చెప్పారు.
3 నెలల్లో ఆర్‌ఆర్‌ఆర్ పనులు షురూ
‘రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఒకప్పుడు వేలల్లో ఉన్న భూముల ధరలు ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్ రాకతో ప్రస్తుతం కోట్లకు చేరాయి. మరో మూడు నెలల్లో ఆర్‌ఆర్‌ఆర్ పనులను ప్రారంభిస్తాం. నెట్ జీరో సిటీ నుంచి ఓఆర్‌ఆర్ వరకు 200 అడుగుల ఎలివేటెడ్ కారిడార్ రోడ్డు సహా మెట్రో రైలు నిర్మాణానికి భూసేకరణ పనులు చేపడతాం. నాగోల్ నుంచి ఎల్‌బీనగర్, ఓవైసీ ఆస్పత్రి, చాంద్రాయణగుట్ట, ఎయిర్‌పోర్టు మీదుగా బేగరికంచె వరకు మెట్రో రైలును విస్తరింపజేస్తాం.
కడ్తాల్ అడవుల్లో నైట్ సఫారీ
కడ్తాల్, ఆమనగల్లు అడవుల్లో నైట్ సఫారీ ఏర్పాటు చేస్తాం. ఈ ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతాం. ఫార్మాసిటీ కోసం భూములు త్యాగం చేసిన రైతులు అధైర్యపడొద్దు, కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీ పిల్లలను చదివించి వారికి మంచి భవిష్యత్తును ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వమే తీసుకుంటుంది. భవిష్యత్తులో ఈ ప్రాంతంలోనే అన్ని మౌలిక సదుపాయాలు సమకూరుతాయి. విమానం కొనాలన్నా, ఎక్కాలన్నా ఇక్కడి నుంచే అవకాశాలు ఉంటాయి.
ఈ ప్రాంతానికి తాగునీరు సహా రోడ్లు, పార్కులు ఇతర మౌలిక సదుపాయాలు కలి్పంచి అత్యాధునిక నగరంగా తీర్చిదిద్దుతాం..’అని రేవంత్ చెప్పారు. ‘పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ విద్య, నీటి పారుదలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన చొరవతోనే అనేక యూనివర్సిటీలు, ప్రాజెక్టులు వచ్చాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్, భాక్రానంగల్ తదితర నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మించడంతో రైతాంగానికి సాగు నీరు అందుతోంది..’అని అన్నారు.
ప్రపంచానికే తలమానికం: డిప్యూటీ సీఎం భట్టి
‘స్కిల్స్ యూనివర్సిటీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించడమే కాకుండా శంకుస్థాపన కూడా చేసుకోవడం సువర్ణ అక్షరాలతో లిఖించదగినది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లకు మించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయబోతున్నాం. ఇది ప్రపంచానికే తలమానికం కాబోతోంది. భూములు కోల్పోయిన వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఆలోచనతో 600 ఎకరాల్లో అద్భుతమైన కమ్యూనిటీ భవనాలను నిర్మిస్తున్నాం. ప్లాట్లు పొందిన ప్రతి రైతు ఇక్కడే ఇల్లు కట్టుకుని జీవించే విధంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతాం. ఇందిరమ్మ పథకం ద్వారా ఇంటిì నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తాం..’అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
మాది చేతల ప్రభుత్వం: మంత్రి కోమటిరెడ్డి
తమది మాటల ప్రభుత్వం కాదు..చేతల ప్రభుత్వమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో వందలకొద్దీ కాలుష్య కారక ఫార్మా కంపెనీలు ఒకే చోట వస్తున్నాయని తెలిసి అప్పట్లో ఎంపీగా ఆందోళన చెందానని అన్నారు. ఫార్మాను రైతులతో పాటు తాను కూడా వ్యతిరేకించానని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత ఫార్మాసిటీని రద్దు చేసి దాని స్థానంలో ఫార్మా విలేజ్‌లు చేపట్టామని తెలిపారు.
కొత్త ఆలోచన, కొత్త గమ్యం: మంత్రి శ్రీధర్‌బాబు
కొత్త ఆలోచన, కొత్త గమ్యం, కొత్త నగరం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. ఉద్యోగాలు కావాలని ఉద్యమాలు చేసిన యువత కల నెరవేరబోతోందన్నారు. ఇప్పటికే 40 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, రాష్ట్రంలో మిగిలిన మరో 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కలి్పంచాలనే ఆలోచనతో స్కిల్స్ యూనివర్సిటీని తీసుకొచ్చామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment