2028 నాటికి వార్షిక బడ్జెట్‌ను రూ.7 లక్షల కోట్లకు చేరుస్తాం
‘ఎంఎస్‌ఎంఈ పాలసీ 2024’ ఆవిష్కరణలో సీఎం రేవంత్‌రెడ్డి
వ్యవసాయ కుటుంబాలు ఉపాధి, వ్యాపార రంగాల్లోనూ ఎదగాలి
స్కిల్స్ యూనివర్సిటీ కోసం రూ.500 కోట్ల కార్పస్ ఫండ్ సేకరిస్తాం
అప్పట్లో ఏపీలో ఎకరం అమ్మితే తెలంగాణలో పదెకరాలు వచ్చేవి
ఇప్పుడు ఇక్కడ ఎకరం అమ్మితే.. ఏపీలో వందెకరాలు కొనొచ్చు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వడ్డించిన విస్తరి వంటిదని.. చైనా బయట పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా నిలిచేందుకు అనేక అనుకూలతలు ఉన్నాయని ముఖ్యమంత్రి ఎను ముల రేవంత్‌రెడ్డి చెప్పారు.
సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగం బలోపేతంతో వేగంగా ఆర్థికాభివృద్ధి సాధిస్తామని పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈల ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చి.. ప్రస్తుతం రూ.3 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను 2028 నాటికి రూ.7 లక్షల కోట్లకు చేర్చడం లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు.
బుధవారం హైదరాబాద్ శిల్ప కళావేదికలో ‘తెలంగాణ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పాలసీ–2024’ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, పరిశ్రమల శాఖ అధికారులు, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్న ఈ భేటీలో పారిశ్రామిక ప్రగతికి సంబంధించిన పలు అంశాలను సీఎం ప్రస్తావించారు.
పెట్టుబడులతో సంపద పెంచుతాం
‘‘ఏ రంగంలోనైనా పాలసీ లేకుండా పురోగతి సాధ్యం కాదు. ఎంఎస్‌ఎంఈలో పెట్టుబడులు రాబడుతూ సంపద పెంచడంతోపాటు దళితులు, గిరిజనులు, మహిళలను ప్రోత్సహించే వాతా వరణం సృష్టిస్తాం. భేషజాలకు పోకుండా గత ప్రభుత్వం చేసిన మంచి పనులు కొనసాగిస్తూ.. నష్టం చేసే విధానాలను తొలగిస్తాం. పారిశ్రామిక అభివృద్ధితోనే తెలంగాణ ఆర్థికంగా బలోపేతం అవుతుంది..’’ అని సీఎం రేవంత్ చెప్పారు.
వ్యవసాయ రంగంపై ఎక్కువ మంది ఆధారపడటంతో రైతులకు ప్రభుత్వపరంగా ఎన్ని విధాలుగా సాయం అందించినా వారి పరిస్థితి మెరుగుపడటం లేదని పేర్కొన్నారు. వ్యవసాయ కుటుంబాలు ఉద్యోగ, ఉపాధి కల్పన, వ్యాపార రంగాల్లోనూ ఎదగాలన్నారు.
గతంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎకరం అమ్మితే తెలంగాణలో పది ఎకరాలు కొనే పరిస్థితి ఉండేదని.. తెలంగాణ యువత ఐటీ రంగంలో అడుగుపెట్టి సిలికాన్ వ్యాలీని శాసించే స్థాయికి ఎదగడంతో ఇప్పుడు పరిస్థితి తారుమారైందని, ఇక్కడ ఎకరా అమ్మితే ఆంధ్రాలో వంద ఎకరాలు కొనొచ్చని వ్యాఖ్యానించారు.
స్కిల్ యూనివర్సిటీకి విరాళాలు సేకరిస్తాం
నైపుణ్య శిక్షణ కోసం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకోసం యూనివర్సిటీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా నేతృత్వంలో రూ.300 కోట్ల నుంచి రూ. 500 కోట్ల కార్పస్ ఫండ్ సేకరిస్తామని సీఎం రేవంత్ చెప్పారు. భూములు కోల్పోయే వారిని అభివృద్ధిలో భాగస్వాములను చేస్తామన్నారు.
అమెరికాలో హడ్సన్, లండన్‌లోని థేమ్స్ తరహాలో మూసీ నదిని అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాష్ట్రంలో 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.లక్ష కోట్లను సున్నా వడ్డీపై రుణాలుగా ఇస్తామని ప్రకటించారు. శిల్పారామంలో మహిళా ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం మూడు ఎకరాలు కేటాయిస్తున్నామని చెప్పారు.
సామాజిక న్యాయానికి పునాది: భట్టి విక్రమార్క
కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతోనే రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈ రంగం వేళ్లూనుకుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. దేశవ్యాప్తంగా ఎంఎస్‌ఎంఈలు మూతపడుతున్నా తెలంగాణలో ఆ రేటు తక్కువగా ఉందని పేర్కొన్నారు.
చిన్న పరిశ్రమల టేకోవర్ల సమస్య కూడా తక్కువగా ఉంటోందని తెలిపారు. తాము ఎంఎస్‌ఎంఈ పాలసీ ద్వారా సామాజిక న్యాయానికి పునాదులు వేశామని... గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రూ.2వేల కోట్ల సబ్సిడీని ఎంఎస్‌ఎంఈలకు విడతల వారీగా చెల్లిస్తామని ప్రకటించారు.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాలసీ: మంత్రి శ్రీధర్‌బాబు
అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఎంఎస్‌ఎంఈలను తీర్చిదిద్దే లక్ష్యంతో కొత్త విధానం తెస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఎంఎస్‌ఎంఈలను గ్రోత్ సెంటర్లుగా మారుస్తామన్నారు. అన్ని జిల్లాల్లో ఎంఎస్‌ఎంఈలు, పారిశ్రామిక పార్కులు, స్టార్టప్‌ల కోసం ప్రత్యేక పార్కులు ఏర్పాటు చేసి... మహిళలకు 5శాతం, ఎస్సీ, ఎస్టీ ఎంట్రప్రెన్యూర్లకు 15శాతం రిజర్వు చేస్తామని ప్రకటించారు.
119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళలను ప్రోత్సహిస్తూ ‘ఫ్లాట్ ఫ్యాక్టరీలు’, ఎస్‌ఎంఎస్‌ఈ క్లస్టర్లలో పది చోట్ల కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎంఎస్‌ఎంఈలకు సులభంగా ఆర్థికసాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. రూ.100 కోట్లతో యంత్రాల ఆధునీకరణకు నిధి ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఎంఎస్‌ఎంఈల ఉత్పత్తుల కొనుగోలు కోసం ‘ప్రొక్యూర్‌మెంట్ పాలసీ’, బహుళ జాతి కంపెనీలతో భాగస్వామ్యాలు, పాలసీ అమలు కోసం టాస్‌్కఫోర్స్, లీజు పాలసీ వంటివాటిని కొత్త విధానంలో పొందుపర్చామని వెల్లడించారు.
కేంద్ర పథకంపై ఒప్పందం..
కేంద్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) శాఖ ప్రపంచ బ్యాంకు సహకారంతో దేశంలో ఎంఎస్‌ఎంఈల పనితీరును మెరుగుపర్చడం, వేగవంతం చేయడం కోసం పథకాన్ని అమలు చేస్తోంది. కరోనా సమయంలో దెబ్బతిన్న ఎంఎస్‌ఎంఈలు తిరిగి కోలుకునేందుకు ఉద్దేశించిన ఈ పథకంలో భాగంగా.. రాష్ట్రంలో స్టేట్ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ యూనిట్ ఏర్పాటు కోసం బుధవారం ఎంఓయూ కుదుర్చుకున్నారు.
కాగా.. పాలసీ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లు నిర్మల జగ్గారెడ్డి, రాయల నాగేశ్వర్‌రావు, ఐత ప్రకాశ్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment