స్కిల్స్ వర్సిటీ’కి ముందడుగు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ భవనాల నిర్మాణాలకు మరో ముందడుగు పడింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐల్) అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఈ క్యాంపస్‌ను నిర్మించేందుకు అంగీకరించింది. అంతేకాదు కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఇందుకు రూ.200 కోట్ల భూరి విరాళాన్ని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.
నవంబర్ 8న అకాడమిక్, పరిపాలన, ల్యాబొరేటరీ, గ్రంథాలయం, పార్కింగ్, ఫుడ్‌కోర్టు, 700 మంది కూర్చొనే సామర్థ్యం గల ఆడిటోరియం, భద్రతా సిబ్బంది వసతి గృహాలు, క్రీడా మైదానాల పనులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే టీఎస్‌ఐఐసీ, జిల్లా రెవెన్యూ యంత్రాంగాలు ఆయా భూములను సేకరించి, చదును చేసి వర్సిటీకి అప్పగించాయి.
17 కోర్సులు.. ఏటా 20 వేల మందికి శిక్షణ
కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట సర్వే నంబర్ 112లోని 57 ఎకరాల విస్తీర్ణంలో రూ.150 కోట్ల అంచనా వ్యయంతో ‘యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ’ నిర్మాణానికి ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. వర్సిటీలో ఫార్మా, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, బ్యాంకింగ్, ఫైనాన్స్, రిటైల్, ఈ కామర్స్, లాజిస్టిక్, ప్యాకింగ్, హార్డ్‌వేర్, ఎలక్ట్రీషిన్ వంటి 17 రంగాల్లోæ నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్, మూడేళ్ల డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్ ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ కోర్సులను అందించనున్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు, పరిశ్రమల భాగస్వామ్యంతో ఈ కోర్సులను నిర్వహించనున్నారు. ఏటా 20 వేల మందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ‘యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ పబ్లిక్ ప్రైవేటు పార్ట్‌నర్‌షిప్ బిల్లు–2024’ను కూడా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే .
గవర్నర్/ సీఎం ఈ వర్సిటీకి చాన్స్‌లర్‌గా వ్యవహరించనున్నారు. వీసీ సహా 15 మందితో పాలకమండలి ఉంటుంది. ఇందులో ఏడుగురు సభ్యులు పరిశ్రమలకు చెందిన వారే ఉంటారు. వర్సిటీ మూడేళ్ల నిర్వహణకు రూ.312 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేసింది. రూ.170 కోట్లు కేవలం కోర్సుల ఫీజుల రూపంలో సమకూరనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment