ఉన్నత విద్యకు ‘స్కిల్‌’ జత | Skill Development Courses in Degree and BTech | Sakshi
Sakshi News home page

ఉన్నత విద్యకు ‘స్కిల్‌’ జత

Published Sun, Feb 18 2024 4:05 AM | Last Updated on Sun, Feb 18 2024 4:05 AM

Skill Development Courses in Degree and BTech - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉన్నత విద్యలో నైపుణ్యం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే స్వల్పకాలిక నైపుణ్యాభివృద్ధి కోర్సులను కాలేజీలు, యూనివర్సిటీలు అందుబాటులోకి తెచ్చేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ అంగీకారం తెలిపింది. తాజా బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రస్తావించింది. విధాన పరమైన నిర్ణయాన్ని ప్రకటించినప్పటీకీ పెద్దగా నిధులు కేటాయించక పోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిగ్రీ, ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన విద్యార్థుల్లో నైపుణ్యం ఉండటం లేదన్నది భారత పారిశ్రామిక వేత్తల అభిప్రాయం. సీఐఐ, ఎఫ్‌ఐఐ, నాస్కామ్‌ వంటి సంస్థల అధ్యయనంలోనూ ఇదే వెల్లడైంది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక భాగస్వామ్యంతో ఈ కోర్సులను ముందుకు తీసుకెళ్ళాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కన్పిస్తోంది.  

తక్షణ అవసరం ఇదే..: దేశంలో ఇంజనీరింగ్‌ పూర్తి చేసే విద్యార్థుల్లో కేవలం 8 శాతం మంది మాత్రమే నైపుణ్యం (స్కిల్‌)తో బయటకు వస్తున్నారు. మిగతా వాళ్ళలో కొంతమంది స్కిల్‌ కోసం ప్రత్యేక కోర్సులు నేర్చుకుంటున్నారు. అయితే వాళ్లలో కోర్సు నేర్చుకునే నాటికే కొత్త నైపుణ్యాలు మార్కెట్లోకి వస్తున్నాయి. దీంతో మళ్ళీ కొత్త టెక్నాలజీ నేర్చుకుంటే తప్ప మంచి వేతనంతో ఉద్యోగం లభించే అవకాశం కన్పించడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకునే విశ్వవిద్యాలయాలకు యూజీసీ తక్షణ మార్పులను సూచించింది. నైపుణ్యాభివృద్ధి మండళ్లు స్వల్ప వ్యవధి కోర్సులను ప్రారంభించేందుకు అనుమతి అక్కర్లేదని కూడా తెలిపింది.

కాకపోతే పారిశ్రామిక భాగస్వామ్యం తప్పనిసరి. అప్పుడే విద్యార్థి అనుభవ పూర్వకంగా నైపుణ్యం సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. ఇంటర్‌ ఉత్తీర్ణత సాధించి డిగ్రీ, బీటెక్‌ కోర్సుల్లో చేరే విద్యార్థులకు 3–6 నెలల వ్యవధిలో 27 రకాల నైపుణ్య కోర్సులను యూజీసీ సూచిస్తోంది. వీటికి 12 నుంచి 30 క్రెడిట్స్‌ ఇవ్వాలని కూడా నిర్ణయించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సమీక్ష జరిపింది. ఏయే కోర్సులు అందుబాటులోకి తేవచ్చు అనే విషయాన్ని ప్రభుత్వానికి ఉన్నతాధికారులు వివరించారు. 

ఇవీ స్కిల్‌ కోర్సులు 
అండర్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసే కాలంలో మొత్తం 27 స్కిల్‌ కోర్సులను నేర్చుకోవడానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. మార్కెట్లో డిమాండ్‌ ఉన్న కోర్సులకే అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో ఏఐ అండ్‌ ఎంఎల్, రోబోటిక్స్, ఐవోటీ, ఇండ్రస్టియల్‌ ఐవోటీ, స్మార్ట్‌ సిటీస్, డేటా సైన్స్‌ అండ్‌ అనలిటిక్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్, వీఆర్‌ టెక్నాలజీ, సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ ఫోరెన్సిక్, 5 జీ కనెక్టివిటీ, ఇండ్రస్టియల్‌ ఆటోమేషన్, ఎల్రక్టానిక్స్‌ సిస్టమ్‌ డిజైన్, వీఎస్‌ఎస్‌ఐ డిజైన్స్, కంప్యూటర్‌ భాషలో ప్రాథమిక అవగాహన, మెకానికల్‌ టూలింగ్, మొబైల్‌ కమ్యూనికేషన్‌ లాంటి ప్రధానమైన కోర్సులున్నాయి.

తెలంగాణలో కొన్ని సాఫ్ట్‌వేర్‌ కంపెనీల భాగస్వామ్యంతో ఐవోటీ, ఏఐఎంఎల్‌ సహా ఇతర కంప్యూటర్‌ కోర్సుల్లో స్వల్పకాలిక కోర్పులు నిర్వహించవచ్చని అధికారులు అంటున్నారు. సైబర్‌ సెక్యూరిటీ, డేటా అనాలసిస్‌ వంటి వాటికి విస్తృత అవకాశాలున్నాయని భావిస్తున్నారు. తొలి దశలో ప్రైవేటు యూనివర్సిటీలు మాత్రమే ఈ దిశగా ముందుకు వెళ్ళే వీలుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కొన్ని డీమ్డ్‌ వర్సిటీలు ఈ దిశగా కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాయి.  

స్కిల్‌తో ఉద్యోగం సులభం 
డిగ్రీతో పాటు నైపుణ్యం ఉంటే ఉద్యోగం లభించడమే కాదు.. అందులో రాణించడం కూడా సులభం. కంపెనీలు ఇలాంటి అర్హతలే కోరుకుంటున్నాయి. అండర్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యే నాటికి ఏదైనా ఒక రంగంలో నైపుణ్యం అవసరం. ఈ దిశగా ప్రభుత్వం, వర్సిటీలు అడుగులు వేయడం అభినందనీయం.  – శ్రీరాం వెంకటేష్‌ (ఉన్నత విద్య మండలి కార్యదర్శి) 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement