ఈసారి అమలు చేయలేం!
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ, పీజీ కోర్సుల్లో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్) 2015-16 విద్యా సంవత్సరంలో అమలు చేయడం సాధ్యం కాదని రాష్ట్రంలోని వర్సీటీలు స్పష్టం చేశాయి. ఫ్యాకల్టీ, సదుపాయాలు లేకుండా సీబీసీఎస్‌ను అమలు చేయలేమని చేతులెత్తేశాయి. సీబీసీఎస్‌కు అనుగుణంగా సిలబస్ విభజన సులభమే అయినా.. 60 శాతానికిపైగా ఖాళీలు ఉండడంతో అమలు చేయడమెలాగని ప్రశ్నిస్తున్నాయి.
ఈ విషయాన్నే ఉన్నత విద్యా మండలి వర్గాలకు తెలియజేశాయి. అంతేగాకుండా అనుబంధ కా లేజీలపై నియంత్రణ సరిగ్గా లేని పరిస్థితుల్లో సీబీసీఎస్‌ను ఎలా అమలు చేస్తామని పేర్కొంటున్నాయి.
అనుసంధానమెప్పుడు?
సాధారణంగా అన్ని కాలేజీల్లో అన్ని రకాల కోర్సులు అందుబాటులో ఉండవు. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్) విధానంలో ఇష్టమైన సబ్జెక్టును ఎంచుకుని, చదువుకోవాలంటే ఆయా కోర్సులు అందుబాటులో ఉండే కాలేజీల మధ్య అనుసంధానం అవసరం. కానీ ఇలాంటి వ్యవస్థను యూనివర్సిటీలు ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. యూనివర్సిటీల్లో సరిపడా సిబ్బంది లేకపోవడమే దీనికి కారణం. అసలు రెగ్యులర్ కోర్సులను బోధించే ఫ్యాకల్టీనే యూనివర్సిటీల్లో లేనపుడు సీబీసీఎస్ ఎలా సాధ్యమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పాత కోర్సుల్లో సీబీసీఎస్ అమలు చేయాలని భావించినా.. ఫ్యాకల్టీ లేకుండా, పక్కాగా ల్యాబ్ సదుపాయాలు లేకుండా అమలు చేయడం సాధ్యం కాదని వర్సిటీల వర్గాలు తేల్చిచెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారికి సీబీసీఎస్ అమలు నుంచి మినహాయింపు ఇవ్వాలని... ఇందుకోసం యూజీసీ నుంచి అనుమతి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. మరోవైపు యూజీసీ మాత్రం ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీసీఎస్ అమలు చేయాల్సిందేనని ఇప్పటికే స్పష్టం చేసింది.
అంతేకాదు తాము సూచించిన సిలబస్‌లో 30 శాతం వరకు మాత్రమే మార్పులు చేసుకోవచ్చని, అదికూడా సిలబస్ పరిధిలోనే చేసుకోవాలని స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగా 2015-16లోనే సీబీసీఎస్ అమలు చేస్తామని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కూడా యూజీసీకి తెలియజేసింది. కానీ ఫ్యాకల్టీ, వసతులు లేకుండా కుదరదని వర్సిటీలు చెబుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరిస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయగలమని పేర్కొంటున్నాయి.
సీబీసీఎస్ అమలు చేయాలంటే దరఖాస్తు నమూనాలోనూ మార్పు చేయాల్సి ఉంటుందని.. కాని ఇప్పటికే డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు కాలేజీలు, వర్సిటీలు పాత పద్ధతిలోనే దరఖాస్తులను ఆహ్వానించాయని స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించకపోవడం కూడా గందరగోళానికి కారణం అవుతోంది.