ఇంజనీరింగ్‌లోనూ సీబీసీఎస్!
సాక్షి, హైదరాబాద్: సాధారణ డిగ్రీ, పీజీ కోర్సులతోపాటు ఇంజనీరింగ్ వంటి వృత్తివిద్యా కోర్సుల్లోనూ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్)ను అమలు చేసేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం-హైదరాబాద్ (జేఎన్‌టీయూహెచ్) తన పరిధిలోని కాలేజీల్లో సీబీసీఎస్ అమలుకు సంబంధించిన ప్రతిపాదనలను ఇటీవల ప్రభుత్వానికి పంపించింది. దీనిపై ప్రభుత్వం త్వరలోనే చర్చించి నిర్ణయం ప్రకటించనుంది.
సీబీసీఎస్ అమల్లోకి వస్తే మార్కుల విధానం ఇకపై ఉండదు. విద్యార్థుల మార్కుల రేంజ్‌నుబట్టి గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు, క్రెడిట్ పాయింట్ల విధానం రానుంది. ప్రస్తుతం జేఎన్‌టీయూహెచ్ పరిధిలో 500కుపైగా ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర కోర్సులను నిర్వహించే డి గ్రీ, పీజీ కాలేజీలు ఉండగా వాటిన్నింటిలోనూ దీన్ని అమలు చేయనున్నారు. అలాగే జేఎన్‌టీయూహెచ్ ఇన్నాళ్లూ ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరంలో సెమిస్టర్ విధానాన్ని అమలు చేయట్లేదు.
తాజా మార్గదర్శకాల ప్రకారం ఇకపై ప్రథమ సంవత్సరంతోపాటు అన్ని సంవత్సరాల్లోనూ సెమిస్టర్ విధానాన్ని అమల్లోకి తేనున్నారు. విద్యార్థికి ఇష్టమైన సబ్జెక్టులు చదువుకునే అవకాశం కల్పించడంతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సీబీసీఎస్‌ను 2015-16 విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి తేవాలని స్పష్టం చేసింది.