CBCS implementation
-
నాలుగేళ్లు చదివితేనే ఆనర్స్ డిగ్రీ
సాక్షి, అమరావతి: అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) డిగ్రీ కోర్సుల్లో చేరే విద్యార్థులకు ఇకపై కొత్త కరిక్యులం ఫ్రేమ్ వర్క్‌ను అనుసరించి డిగ్రీలను ప్రదానం చేయనున్నారు. నూతన జాతీయ విద్యా విధానం–2020లో పేర్కొన్న ప్రకారం.. బహుళ ప్రవేశ, నిష్క్రమణలతో ఆనర్స్ డిగ్రీ కోర్సులు అమలు కానున్నాయి. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కొత్త కరిక్యులం ఫ్రేమ్ వర్క్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. దీని విధివిధానాలను యూజీసీ సోమవారం నోటిఫై చేయనుంది. 160 క్రెడిట్లను పూర్తి చేస్తేనే..యూజీసీ కొత్త కరిక్యులం ఫ్రేమ్ వర్క్ నిబంధనల ప్రకారం.. విద్యార్థులు నాలుగేళ్లు పూర్తి చేశాకే యూజీ ఆనర్స్ డిగ్రీని అందుకోగలుగుతారు. అన్ని ఆనర్స్ డిగ్రీ కోర్సుల కాలపరిమితిని మూడేళ్లకు బదులుగా నాలుగేళ్లకు తప్పనిసరి చేసింది. విద్యార్థులు మూడేళ్లలో 120 క్రెడిట్లు పూర్తి చేస్తేనే అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) డిగ్రీకి అర్హులవుతారు. అదే విద్యార్థి నాలుగేళ్లలో 160 క్రెడిట్లను పూర్తి చేస్తేనే యూజీ ఆనర్స్ డిగ్రీ పట్టా లభిస్తుంది. అలాగే ఆనర్స్ డిగ్రీ కోర్సుల్లో చేరేవారు రీసెర్చ్ కోసం వెళ్లాలనుకుంటే తమ నాలుగేళ్ల కోర్సులోనే రీసెర్చ్ ప్రాజెక్ట్‌ను చేపట్టాల్సి ఉంటుంది. మొదటి ఆరు సెమిస్టర్లలో 75 శాతంఅంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు యూజీ స్థాయిలో పరిశోధనలు చేపట్టాలనుకుంటే నాలుగో ఏడాది పరిశోధనా ప్రాజెక్టును ఎంచుకోవచ్చు. దీన్ని పూర్తి చేస్తే వారికి యూజీ (ఆనర్స్ విత్ రీసెర్చ్) డిగ్రీని ప్రదానం చేస్తారు. మూడేళ్ల డిగ్రీ చేస్తున్నా ఆనర్స్‌కు.. ప్రస్తుతం మూడేళ్ల డిగ్రీ కోర్సులు చేస్తున్నవారు కూడా నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులకు మారేందుకు కొత్త కరిక్యులం ఫ్రేమ్ వర్క్ అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) ప్రకారం.. మూడేళ్ల యూజీ కోర్సుల్లో పేర్లు నమోదు చేసుకున్న, అభ్యసిస్తున్న విద్యార్థులు కూడా నాలుగేళ్ల యూజీ ఆనర్స్ కొనసాగించడానికి అర్హులని కొత్త నిబంధనల్లో పేర్కొన్నారు. వారు ఆనర్స్ కోర్సుల్లోకి మారడానికి వర్సిటీలు వారికి బ్రిడ్జ్ కోర్సులను (ఆన్‌లైన్‌తో సహా) అందించవచ్చని యూజీసీ తెలిపింది. డిగ్రీ కోర్సు నుంచి ఆనర్స్ కోర్సుల్లో చేరడానికి ఇది తప్పనిసరి అని వివరించింది. బహుళ ప్రవేశ, నిష్క్రమణలకు అవకాశం నాలుగేళ్ల యూజీ ఆనర్స్ కోర్సుల్లో విద్యార్థులకు బహుళ ప్రవేశ, నిష్క్రమణలకు అవకాశం ఉంది. ఇందులో భాగంగా మొదటి ఏడాది పూర్తి చేస్తే విద్యార్థికి సర్టిఫికెట్ లభిస్తుంది. రెండేళ్లు చదివితే డిప్లొమా లభిస్తుంది. మూడేళ్లు చదివితే బ్యాచిలర్ డిగ్రీ పట్టా లభిస్తుంది. నాలుగేళ్లు పూర్తి చేస్తే ఆనర్స్‌తో బ్యాచిలర్ డిగ్రీ పట్టా అందుతుంది. ఈ మేరకు విద్యార్థులు తమ ప్రాధాన్యతలను ఎంచుకోవడానికి అనుమతిస్తారు. నాలుగేళ్ల ఆనర్స్‌లో చేరినవారు మూడేళ్లలోపు నిష్క్రమిస్తే, అప్పటి నుంచి మూడేళ్లలోపు మళ్లీ చేరేందుకు అవకాశం ఉంటుంది. అలాంటి వారు ఏడేళ్ల వ్యవధిలో కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. వైవిధ్యంతో పాఠ్యాంశాలు.. నూతన కరిక్యులం ఫ్రేమ్ వర్క్ ప్రకారం.. కోర్సుల పాఠ్యాంశాలు వైవిధ్యంతో ఉంటాయి. యూజీసీ నిర్దేశించిన పాఠ్యాంశాల్లో మెయిన్, మైనర్ స్ట్రీమ్ కోర్సులు, భాషా, నైపుణ్య కోర్సులు, పర్యావరణ విద్య, డిజిటల్, సాంకేతిక పరిష్కారాలు తదితర విభాగాల కోర్సులు ఉంటాయి. కొత్తగా ఆరోగ్యం, యోగా, క్రీడలు, ఫిట్నెస్ వంటివాటిని కూడా చేర్చారు. ఆధునిక భారతీయ భాష, సంస్కృతి, ఆంగ్ల భాష, నైపుణ్యాల పెంపుదల, నైతిక విలువల కోర్సులు ఉంటాయి. అలాగే విద్యార్థుల ఉపాధిని పెంపొందించడానికి ఆచరణాత్మక నైపుణ్యాలు, శిక్షణ, సాఫ్ట్ స్కిల్స్ అందించడం లక్ష్యంగా ప్రత్యేక కోర్సులనూ చేర్చారు. నూతన విధానం ప్రకారం విద్యార్థులు ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు మారొచ్చు. ఓపెన్, దూరవిద్య, ఆన్లైన్ లెర్నింగ్ లేదా హైబ్రిడ్ మోడ్ వంటి ప్రత్యామ్నాయ విధానాలకు కూడా మారేందుకు అవకాశముంది. -
సీబీసీఎస్ అమలులో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: డిగ్రీలో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్) నిర్వహించడంలో వైస్ చాన్స్లర్లు అనుసరిస్తున్న ఇష్టారాజ్య విధానాలు విద్యార్థులను గందరగోళంలో పడేస్తున్నాయి. ఫలితంగా కొన్ని యూనివర్సిటీల్లో ఇంకా డిగ్రీ వార్షిక పరీక్షలు కొనసాగుతుండగా మరికొన్ని యూనివర్సిటీల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభించేందుకు చర్యలు మొదలు పెట్టాయి. కొన్ని యూనివర్సిటీలు అయితే ఇటు పరీక్షలు నిర్వహిస్తూనే.. అటు కొత్త విద్యా సంవత్సర తరగతుల ప్రారంభానికి ప్రకటనలు చేస్తుండటంతో విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. గత విద్యా సంవత్సరంలో సీబీసీఎస్ అమలులో వైఫల్యం కారణంగానే డిగ్రీ పరీక్షలు మే నెలలో మొదలై ఇప్పటికీ పూర్తి కాకుండా జూలై వరకు కొనసాగించే పరిస్థితి నెలకొంది. ఉస్మానియాలో జూలై 8వ తేదీ వరకు, కాకతీయలో జూలై 2 వరకు, తెలంగాణ విశ్వవిద్యాలయంలో జూలై 6 వరకు, పాలమూరు వర్సిటీలో జూన్ 29 వరకు, శాతవాహన వర్సిటీలో జూన్ 24 వరకు, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో జూన్ 22వ తేదీ వరకు 2018–19 విద్యా సంవత్సర డిగ్రీ వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు పూర్తి కాకుండానే డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులకు శాతవాహన, కాకతీయ, ఉస్మానియా, మహా త్మాగాంధీ విశ్వవిద్యాలయాలు జూన్ 17వ తేదీ నుంచి, పాలమూరు విశ్వవిద్యాలయం జూన్ 19వ తేదీ నుంచి, తెలంగాణ వర్సిటీ 26వ తేదీ నుంచి ఈ విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించాయి. దీంతో విద్యార్థులే కాదు.. అధ్యాపకుల్లోనూ గందరగోళం నెలకొంది. విద్యార్థుల్లో అయోమయం.. ఓవైపు పరీక్షలు పూర్తి కాకుండానే యూనివర్సిటీలు మరుసటి విద్యాసంవత్సరం ప్రారంభించబోతున్నట్టు ప్రకటించడం చూసి విద్యార్థులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. విశ్వవిద్యాలయ అధికారుల అసమర్థత వల్ల మండుటెండల్లో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు అసలు పరీక్షలు పూర్తి కాకుండా తరగతులకు ఎలా హాజరవుతారని వారు ప్రశ్నిస్తున్నారు. ఒక విద్యాసంవత్సరం పూర్తి చేసి పరీక్షలు రాసిన విద్యార్థులకు కనీసం రెండు వారాలైనా సెలవులు ఉండాలని ఆ తర్వాతే తరగతులు ప్రారంభించాలని వారు కోరుతున్నారు. పరీక్షల నిర్వహణలో అసమర్థత వల్ల డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ ఎంట్రన్స్ రాయలేకపోయారని, రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ఐసెట్, లాసెట్ లాంటి పరీక్షలకు కూడా పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేకపోయామని, ఫలితంగా నష్టపోవాల్సి వచ్చిందని వాపోతున్నారు. ఈసారి అయినా పక్కా చర్యలు చేపట్టాలి కామన్ అకడమిక్ క్యాలెండర్ అన్ని యూనివర్సిటీల్లో అమలు చేసేలా చూడాలని ఉన్నత విద్యామండలిని మే మొదటి వారంలోనే తెలంగాణ ప్రభుత్వ కళాశాలల గెజిటెడ్ అధ్యాపక సంఘం కోరింది. అయినప్పటికీ ఉన్నత విద్యా మండలి పూర్తిస్థాయిలో శ్రద్ధ కనబరచడం లేదని సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ సంజీవయ్య, డాక్టర్ కె.సురేందర్‌రెడ్డి ఆరోపించారు. యూనివర్సిటీ అధికారులు కూడా నిర్ణయాలు తీసుకోవడంలో తమకు స్వేచ్ఛ ఉందని, ఎవరి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని వారు ఆరోపించారు. -
ఉన్నతవిద్యకు అవరోధాలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా లో ఉన్నత విద్యకు అడుగడునా అవరోదాలు ఎదురవుతున్నా యి. అక్షరాస్యతలో అత్యంత వెనకబడిన ఈ ప్రాంత విద్యార్థులకు విద్యాప్రదాయినిగా ఉన్న పాలమూరు యూనివర్సిటీ పలు సమస్యలతో సతమతమవుతోంది. ముఖ్యంగా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న పీజీ కాలేజీల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. యూనివర్సిటీ పరిపాలన విభాగం పర్యవేక్షణలో విఫలం కావడంతో ఆ ప్రభావం విద్యార్థులపై పడుతోంది. ముఖ్యంగా పీజీ కళాశాలల్లో కొలిక్కిరాని వివాదాలు కూడా ప్రధాన సమస్యగా మారింది. వనపర్తి పీజీ కాలేజీలో రెండు నెలల క్రితం జరగాల్సిన ప్రాక్టికల్స్ ఇప్పటివరకు నిర్వహించలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. పాలనా యంత్రాంగం జాప్యం ప్రభుత్వం 2008లో పాలమూరు యూనివర్సిటీని నెలకొల్పింది. విద్యార్థులకు ఉన్నత విద్యను మరింత చేరువ చేసేందుకు నాలుగు చోట్ల పీజీ సెంటర్లను నియమించింది. అం దుకు అనుగుణంగా యూనివర్సిటీ ఆధ్వర్యంలో వనపర్తి, గద్వాల, కొల్లాపూర్‌లలో పీజీ సెంటర్లను ఏ ర్పాటు చేసింది. మౌళిక వసతుల కల్పన అటుంచితే కనీస సౌకర్యాలు కూడా లేక విద్యార్థులు ఇబ్బంది ప డుతున్నారు. సైన్స్ ప్రాక్టికల్స్, సీబీసీఎస్ (చాయస్బే స్డ్ క్రెడిట్ సిస్టం) నిర్వీర్యమవుతున్నాయి. సీబీసీఎ స్ విధానంలో విద్యార్థులకు వారు పీజీలో ఎం చుకున్న సబ్జెక్టుతో పాటు ఈ విధానం ద్వారా అద నంగా సబ్జెక్టులు చదువుకునేందుకు వీలుంటుంది. వేధిస్తున్న అధ్యాపకుల కొరత పీజీ కళాశాలల్లో రెగ్యులర్ అధ్యాపకులు లేకపోగా చాలా మంది అధ్యాపకులు కాంట్రాక్టు పద్ధతిలోనే పనిచేస్తున్నారు. ప్రతి పీజీ కోర్సులో కనీసం ఐదు సబ్జెక్టులు ఉంటే అన్ని సబ్జక్టులకు అధ్యాపకులు ఉండాలి. కానీ పొలిటికల్ సైన్స్ విభాగంలో కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు. మొదట్లో ఆరు మంది అధ్యాపకులు ఉండగా వారిలో ఇద్దరిని తొలగించడంతో ప్రస్తుతం నలుగురు మాత్రమే ఉన్నారు. దీంతో విద్యార్థులకు సబ్జెక్టులు ఎంపిక చేసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా అధ్యాపకులు సూచించిన ఐదు సబ్జెక్టులను మాత్రమే విద్యార్థులు చదవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రైవేటు కళాశాలల్లో చదవుతున్న విద్యార్థులకు కూడా ఇవే సమస్యలు ఎదురవుతున్నాయి. వనపర్తి పీజీ కాలేజీలో వివాదం వనపర్తిలో ఉన్న పీజీ కళాశాలకు కనీసం సొంత భవనం కూడా లేదు. కొన్నేళ్లుగా ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలోనే నిర్వహణ సాగిస్తున్నారు. డిగ్రీ కళాశాలకు చెందిన తరగతి గదులు, ల్యాబ్‌లు, స్టాఫ్రూంలలోనే పీజీ కళాశాల సిబ్బంది సర్దుకుంటున్నారు. డిగ్రీ కళాశాల సమయం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు ఉండడంతో పీజీ కళాశాల తరగతులను మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.30 గంటల వరకు కొనసాగిస్తున్నారు. గతంలో పీజీ తరగతులు నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో అధ్యాపక సిబ్బంది లేక డిగ్రీ కళాశాల అధ్యాపకులు పీజీ తరగతులు, ల్యాబ్ పాఠాలు బోధించే వారు. దాంతోపాటు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రఘునాథ్‌రెడ్డి పీజీ కళాశాల వ్యవహారాలను చూసుకోవాలని పీయూ అధికారులు మౌఖికంగా ఆదేశించడంతో పీజీ కళాశాల తరగతులను పర్యవేక్షణ చేస్తున్నారు. కొంతకాలంగా పీయూ అధికారులు ప్రిన్సిపాల్, అధ్యాపకులు, కంప్యూటర్ ఆపరేటర్, నాన్‌టీచింగ్ స్టాఫ్‌కు ఇతర సిబ్బందికి కొంత నగదు చొప్పున ప్రతీనెల గౌరవవేతనం చెల్లించారు. ప్రస్తుతం పీజీ కళాశాలకు పూర్తి స్థాయిలో అధ్యాపక సిబ్బంది రావడంతో ఏడాది కాలంగా నిలిపి వేశారు. ఇటీవల వీసీ రాజరత్నం కళాశాలను సందర్శించి ల్యాబ్‌లకు హెచ్ఓడీలుగా పీజీ అధ్యాపకులే వ్యవహరించాలని ఆదేశించారు. దీంతో కాలేజీలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. డిగ్రీ కాలేజీ సిబ్బంది పూర్తిగా సహాయ నిరాకరణ చేపట్టారు. దీంతో సాయంత్రం 3.30 కాగానే డిగ్రీ సిబ్బంది మొత్తం కాలేజీకి తాళాలు వేసుకొని వెళ్తున్నారు. అటు యూనివర్సిటీ అధికారులు, ఇటు డిగ్రీ కళాశాల సిబ్బంది వైఖరి వల్ల విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. 4వ సెమిస్టర్ తరగతులు ప్రారంభమైనా ప్రాక్టికల్స్‌కు దిక్కేలేదు. ప్రాక్టికల్స్ జరగలేదు మా కాలేజీలో కొన్ని నెలలుగా ప్రాక్టికల్స్ తరగతులు జరగలేదు. ఒకప్పుడు డిగ్రీ కళాశాల ల్యాబ్‌లోనే పీజీ విద్యార్థులకు కూడా తరగతులు నిర్వహించారు. కానీ ఇప్పుడు అవికూడా నిలిచిపోయాయి. – అశోక్, ఎంఎస్సీ, సెకండియర్, వనపర్తి అధికారులు స్పందించాలి ఫోర్త్ సెమిస్టర్ తరగతులు కూడా మొదలయ్యాయాయి. మా కాలేజీలో ఇంతకు సైన్స్ ప్రాక్టికల్స్ నిర్వహిస్తారో లేదో యూనివర్సిటీ అధికారులు చెప్పాలి. సైన్స్ గ్రూప్‌లో ప్రాక్టికల్స్ చాలా ముఖ్యం. వివాదాలు పక్కనబెట్టి తరగతులు నిర్వహించాలి. – కృష్ణవేణి, ఎంఎస్సీ, సెకండియర్, వనపర్తి సమస్యలు పరిష్కరిస్తున్నాం యూనివర్సిటీ పరిధిలోని పీజీ కళాశాలల్లోని సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. వనపర్తి పీజీ కాలేజీలో ప్రాక్టికల్స్ జరగడం లేదన్న విషయం నాకు తెలియదు. ఎగ్జామ్స్ షెడ్యూల్స్ అంతా రిజిస్ట్రార్ చూసుకుంటారు. విచారణ చేసి వనపర్తి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాస్తాం. – రాజారత్నం, పాలమూరు యూనివర్సిటీ వీసీ -
అన్ని వర్సిటీల్లో ఒకేలా సీబీసీఎస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్) అమలుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు అన్ని విద్యా సంస్థల్లో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ఒకే విధంగా సెమిస్టర్, క్రెడిట్లు, గ్రేడింగ్ విధానం, సిలబస్ ఉండాలన్న నిర్ణయానికి వచ్చింది. కోర్సుల వారీగా ఒకే రకమైన సెమిస్టర్, క్రెడిట్లు, గ్రేడింగ్ ఖరారు చేసేందుకు ఒక కమిటీని, అన్ని కోర్సుల్లో ఒకే రకమైన సిలబస్ కోసం మరో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కమిటీలను ఒకటి లేదా రెండ్రోజుల్లో ఏర్పాటు చేయనుంది. -
డిగ్రీలో డిటెన్షన్..?
♦ సీబీసీఎస్ అమలుకు కసరత్తు ♦ ఇంజనీరింగ్ తరహాలో క్రెడిట్పాయింట్లు సాక్షి, హైదరాబాద్: వృత్తి విద్యా కోర్సుల తోపాటు డిగ్రీ కోర్సుల్లోనూ ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంను (సీబీసీఎస్), సెమిస్టర్ విధా నాన్ని అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం డిగ్రీ లోనూ డిటెన్షన్ విధానం అమల్లోకి తెచ్చేం దుకు ఆలోచిస్తోంది. ఇంజనీరింగ్ సెమిస్టర్ లో ఫస్టియర్ నుంచే డిటెన్షన్ విధానాన్ని గత ఏడాది నుంచి అమలు చేస్తోంది. ఈ ఏడాది నుంచి డిగ్రీలోనూ దానిని అమలు చేయాలని యోచిస్తోంది. ఇంజనీరింగ్ ఫస్టియర్‌లో ఉండే రెండు సెమిస్టర్లలో విద్యార్థి కనీసంగా సగం క్రెడిట్స్ (పాయింట్లు) సంపాదిస్తేనే సెకండియర్లోని మూడో సెమిస్టర్‌కు అవకా శం కల్పిస్తారు. మొదటి సెమిస్టర్లో అన్ని సబ్జెక్టులు పాస్ కాపోయినా, అటెండెన్స్ ఉంటే రెండో సెమిస్టర్‌కు అనుమతి ఇస్తు న్నాయి. రెండో సెమిస్టర్ పూర్తయ్యే నాటికి మొదటి రెండు సెమిస్టర్లలోని సగం క్రెడిట్లను ఆ విద్యార్థి సంపాదించాలి. లేదంటే మూడో సెమిస్టర్లో ప్రవేశం ఉండదు. ఇదే తరహా విధానాన్ని డిగ్రీలోనూ అమలు చేసేందుకు కసరత్తు ప్రా రంభించింది. దీనిపై త్వరలోనే వైస్ ఛాన్స్లర్ల సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
ఈసారి అమలు చేయలేం!
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ, పీజీ కోర్సుల్లో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్) 2015-16 విద్యా సంవత్సరంలో అమలు చేయడం సాధ్యం కాదని రాష్ట్రంలోని వర్సీటీలు స్పష్టం చేశాయి. ఫ్యాకల్టీ, సదుపాయాలు లేకుండా సీబీసీఎస్‌ను అమలు చేయలేమని చేతులెత్తేశాయి. సీబీసీఎస్‌కు అనుగుణంగా సిలబస్ విభజన సులభమే అయినా.. 60 శాతానికిపైగా ఖాళీలు ఉండడంతో అమలు చేయడమెలాగని ప్రశ్నిస్తున్నాయి. ఈ విషయాన్నే ఉన్నత విద్యా మండలి వర్గాలకు తెలియజేశాయి. అంతేగాకుండా అనుబంధ కా లేజీలపై నియంత్రణ సరిగ్గా లేని పరిస్థితుల్లో సీబీసీఎస్‌ను ఎలా అమలు చేస్తామని పేర్కొంటున్నాయి. అనుసంధానమెప్పుడు? సాధారణంగా అన్ని కాలేజీల్లో అన్ని రకాల కోర్సులు అందుబాటులో ఉండవు. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్) విధానంలో ఇష్టమైన సబ్జెక్టును ఎంచుకుని, చదువుకోవాలంటే ఆయా కోర్సులు అందుబాటులో ఉండే కాలేజీల మధ్య అనుసంధానం అవసరం. కానీ ఇలాంటి వ్యవస్థను యూనివర్సిటీలు ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. యూనివర్సిటీల్లో సరిపడా సిబ్బంది లేకపోవడమే దీనికి కారణం. అసలు రెగ్యులర్ కోర్సులను బోధించే ఫ్యాకల్టీనే యూనివర్సిటీల్లో లేనపుడు సీబీసీఎస్ ఎలా సాధ్యమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాత కోర్సుల్లో సీబీసీఎస్ అమలు చేయాలని భావించినా.. ఫ్యాకల్టీ లేకుండా, పక్కాగా ల్యాబ్ సదుపాయాలు లేకుండా అమలు చేయడం సాధ్యం కాదని వర్సిటీల వర్గాలు తేల్చిచెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారికి సీబీసీఎస్ అమలు నుంచి మినహాయింపు ఇవ్వాలని... ఇందుకోసం యూజీసీ నుంచి అనుమతి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. మరోవైపు యూజీసీ మాత్రం ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీసీఎస్ అమలు చేయాల్సిందేనని ఇప్పటికే స్పష్టం చేసింది. అంతేకాదు తాము సూచించిన సిలబస్‌లో 30 శాతం వరకు మాత్రమే మార్పులు చేసుకోవచ్చని, అదికూడా సిలబస్ పరిధిలోనే చేసుకోవాలని స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగా 2015-16లోనే సీబీసీఎస్ అమలు చేస్తామని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కూడా యూజీసీకి తెలియజేసింది. కానీ ఫ్యాకల్టీ, వసతులు లేకుండా కుదరదని వర్సిటీలు చెబుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరిస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయగలమని పేర్కొంటున్నాయి. సీబీసీఎస్ అమలు చేయాలంటే దరఖాస్తు నమూనాలోనూ మార్పు చేయాల్సి ఉంటుందని.. కాని ఇప్పటికే డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు కాలేజీలు, వర్సిటీలు పాత పద్ధతిలోనే దరఖాస్తులను ఆహ్వానించాయని స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించకపోవడం కూడా గందరగోళానికి కారణం అవుతోంది.