నాలుగేళ్లు చదివితేనే  ఆనర్స్‌ డిగ్రీ | Honours Degree only after 4 years in new UGC norms | Sakshi
Sakshi News home page

నాలుగేళ్లు చదివితేనే  ఆనర్స్‌ డిగ్రీ

Published Mon, Dec 12 2022 10:19 AM | Last Updated on Mon, Dec 12 2022 4:41 PM

Honours Degree only after 4 years in new UGC norms - Sakshi

సాక్షి, అమరావతి: అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ) డిగ్రీ కోర్సుల్లో చేరే విద్యార్థులకు ఇకపై కొత్త కరిక్యులం ఫ్రేమ్‌ వర్క్‌ను అనుసరించి డిగ్రీలను ప్రదానం చేయనున్నారు. నూతన జాతీయ విద్యా విధానం–2020లో పేర్కొన్న ప్రకారం.. బహుళ ప్రవేశ, నిష్క్రమణలతో ఆనర్స్‌ డిగ్రీ కోర్సులు అమలు కానున్నాయి. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) కొత్త కరిక్యులం ఫ్రేమ్‌ వర్క్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. దీని విధివిధానాలను యూజీసీ సోమవారం నోటిఫై చేయనుంది. 

160 క్రెడిట్లను పూర్తి చేస్తేనే..యూజీసీ కొత్త కరిక్యులం ఫ్రేమ్‌ వర్క్‌ నిబంధనల ప్రకారం.. విద్యార్థులు నాలుగేళ్లు పూర్తి చేశాకే యూజీ ఆనర్స్‌ డిగ్రీని అందుకోగలుగుతారు. అన్ని ఆనర్స్‌ డిగ్రీ కోర్సుల కాలపరిమితిని మూడేళ్లకు బదులుగా నాలుగేళ్లకు తప్పనిసరి చేసింది. విద్యార్థులు మూడేళ్లలో 120 క్రెడిట్‌లు పూర్తి చేస్తేనే అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూ­జీ) డిగ్రీకి అర్హులవుతారు. అదే విద్యార్థి నాలు­గేళ్ల­లో 160 క్రెడిట్‌లను పూర్తి చేస్తేనే యూజీ ఆనర్స్‌ డిగ్రీ పట్టా లభిస్తుంది. అలాగే ఆనర్స్‌ డిగ్రీ కోర్సు­ల్లో చేరేవారు రీసెర్చ్‌ కోసం వెళ్లాలనుకుంటే తమ నాలుగేళ్ల కోర్సులోనే రీసెర్చ్‌ ప్రాజెక్ట్‌ను చేపట్టాల్సి ఉంటుంది. మొదటి ఆరు సెమిస్టర్‌లలో 75 శాతంఅంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యా­ర్థులు యూజీ స్థాయిలో పరిశోధనలు చేపట్టాలను­కుంటే నాలుగో ఏడాది పరిశోధనా ప్రాజెక్టును ఎంచుకోవచ్చు. దీన్ని పూర్తి చేస్తే వారికి యూజీ (ఆనర్స్‌ విత్‌ రీసెర్చ్‌) డిగ్రీని ప్రదానం చేస్తారు. 

మూడేళ్ల డిగ్రీ చేస్తున్నా ఆనర్స్‌కు..
ప్రస్తుతం మూడేళ్ల డిగ్రీ కోర్సులు చేస్తున్నవారు కూడా నాలుగేళ్ల ఆనర్స్‌ కోర్సులకు మారేందుకు కొత్త కరిక్యులం ఫ్రేమ్‌ వర్క్‌ అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికే చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌ (సీబీసీఎస్‌) ప్రకారం.. మూడేళ్ల యూజీ కోర్సుల్లో పేర్లు నమోదు చేసుకున్న, అభ్యసిస్తున్న విద్యార్థులు కూడా నాలుగేళ్ల యూజీ ఆనర్స్‌ కొనసాగించడానికి అర్హులని కొత్త నిబంధనల్లో పేర్కొన్నారు. వారు ఆనర్స్‌ కోర్సుల్లోకి మారడానికి వర్సిటీలు వారికి బ్రిడ్జ్‌ కోర్సులను (ఆన్‌లైన్‌తో సహా) అందించవచ్చని యూజీసీ తెలిపింది. డిగ్రీ కోర్సు నుంచి ఆనర్స్‌ కోర్సుల్లో చేరడానికి ఇది తప్పనిసరి అని వివరించింది. 

బహుళ ప్రవేశ, నిష్క్రమణలకు అవకాశం
నాలుగేళ్ల యూజీ ఆనర్స్‌ కోర్సుల్లో విద్యార్థులకు బహుళ ప్రవేశ, నిష్క్రమణలకు అవకాశం ఉంది. ఇందులో భాగంగా మొదటి ఏడాది పూర్తి చేస్తే విద్యార్థికి సర్టిఫికెట్‌ లభిస్తుంది. రెండేళ్లు చదివితే డిప్లొమా లభిస్తుంది. మూడేళ్లు చదివితే బ్యాచిలర్‌ డిగ్రీ పట్టా లభిస్తుంది. నాలుగేళ్లు పూర్తి చేస్తే ఆనర్స్‌తో బ్యాచిలర్‌ డిగ్రీ పట్టా అందుతుంది. 

ఈ మేరకు విద్యార్థులు తమ ప్రాధాన్యతలను ఎంచుకోవడానికి అనుమతిస్తారు. నాలుగేళ్ల ఆనర్స్‌లో చేరినవారు మూడేళ్లలోపు నిష్క్రమిస్తే, అప్పటి నుంచి మూడేళ్లలోపు మళ్లీ చేరేందుకు అవకాశం ఉంటుంది. అలాంటి వారు ఏడేళ్ల వ్యవధిలో కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది.

వైవిధ్యంతో పాఠ్యాంశాలు.. నూతన కరిక్యులం ఫ్రేమ్‌ వర్క్‌ ప్రకారం.. 
కో­ర్సు­ల పాఠ్యాంశాలు వైవిధ్యంతో ఉంటాయి. యూ­జీసీ నిర్దేశించిన పాఠ్యాంశాల్లో మెయిన్, మైనర్‌ స్ట్రీమ్‌ కోర్సులు, భాషా, నైపుణ్య కో­ర్సు­లు, ప­ర్యా­వరణ విద్య, డిజిటల్, సాంకేతిక పరి­ష్కా­రాలు తదితర విభాగాల కోర్సులు ఉంటాయి. కొత్తగా ఆరోగ్యం, యోగా, క్రీడలు, ఫిట్‌నెస్‌ వంటివాటిని కూడా చేర్చారు. ఆధునిక భారతీయ భాష, సంస్కృతి, ఆంగ్ల భాష, నైపు­ణ్యా­ల పెంపుదల, నైతిక విలువల కోర్సులు ఉంటా­యి. అలాగే విద్యార్థుల ఉపాధిని పెంపొం­దించడానికి ఆచరణాత్మక నైపుణ్యాలు, శిక్షణ, సాఫ్ట్‌ స్కిల్స్‌ అందించడం లక్ష్యంగా ప్ర­త్యే­క కోర్సులనూ చేర్చారు. నూతన విధానం ప్ర­కా­రం విద్యార్థులు ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు మారొచ్చు. ఓపెన్, దూరవిద్య, ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ లేదా హైబ్రిడ్‌ మోడ్‌ వంటి ప్రత్యామ్నా­య విధానాలకు కూడా మారేందుకు అవకాశముంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement