Higher education in United States
-
సిలబస్ అయ్యేదెప్పుడు? శిక్షణ ఇచ్చేదెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: జేఈఈ పరీక్ష జనవరి 22వ తేదీ నుంచి జరుగుతుందంటూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఈ ఏడాది ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీజీఈఏపీ సెట్) గతానికంటే నెల రోజుల ముందు ఏప్రిల్‌లోనే నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. దీంతో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. కాలేజీల్లో ఇప్పటికీ 80 శాతం సిలబస్ కూడా పూర్తి కాకపోవడంతో, సిలబస్ పూర్తయ్యేదెప్పుడు? జేఈఈ శిక్షణ పొందేదెప్పుడు? అనే టెన్షన్ మొదలైనట్లు ఇంటర్ బోర్డు వర్గాలే వెల్లడిస్తున్నాయి. కొన్ని కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్లను తీసుకోవడం ఆలస్యం కావడం, కొత్త కాలేజీలకు సిబ్బందిని ఇవ్వకపోవడంతో ఇంటర్ సిలబస్ అరకొరగానే పూర్తయింది. దీంతో జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధమవ్వడం ఎలా అనే ఆందోళన విద్యార్థుల్లో కన్పిస్తోంది. ఇంటర్ బోర్డులోనూ ఆందోళన..: ఇంటర్ బోర్డు తాజాగా సేకరించిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల్లో ఎక్కువ మందిలో టెన్షన్ కన్పిస్తోంది. దీంతో దీన్ని దూరం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు బోర్డు సూచించింది. మరోవైపు విద్యార్థుల్లో ఆందోళనకు సంబంధించి వైద్య, విద్యాశాఖ గత ఏడాది ఇచ్చిన నివేదిక బోర్డు అధికారులకు ఆందోళన కల్గిస్తోంది. పరీక్ష ఫెయిల్ అవుతున్న వారిలో 48 శాతం టెన్షన్ కారణంగానే విఫలమవుతున్నట్టు తేల్చారు. వీరిలో 36 శాతం తీవ్రమైన టెన్షన్‌కు లోనవుతున్నారు. 23 శాతం విద్యార్థులు పరీక్షల తేదీ ప్రకటించినప్పటి నుంచే టెన్షన్ పడుతూ, పరీక్ష అనుకున్న విధంగా రాయలేకపోతున్నారని తేలింది. మొదటి పరీక్ష ఏమాత్రం కష్టంగా ఉన్నా, ఆ ప్రభావం రెండో పరీక్షపై పడుతోందని అధ్యయనంలో వెల్లడైంది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు కలిపి ఏటా సగటున 4 లక్షల మందికి పైగా ఫస్టియర్ పరీక్షలు రాస్తున్నారు. రెండో ఏడాది పరీక్షలు 3.80 లక్షల మందికి పైగా రాస్తుండగా సగటున 40 శాతం మంది ఫెయిల్ అవుతున్నారు. మూడంచెల సన్నద్ధతవిద్యార్థుల్లో టెన్షన్‌ను దూరం చేసే కార్యాచరణ చేపట్టడంతో పాటు, జేఈఈ, ఈఏపీ సెట్‌కు సన్నద్ధం చేయడానికి ఇదే మంచి తరుణమని ఇంటర్ బోర్డు అధికారులు అంటున్నారు. ఇందుకు ప్రణాళికబద్ధమైన కార్యాచరణ అవసరమని సూచిస్తున్నారు. మూడంచెల విధానం ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేయాలని భావిస్తున్న అధికారులు, ఒత్తిడికి గురయ్యే విద్యార్థులను గుర్తించి పరీక్షలపై కౌన్సెలింగ్ ఇచ్చేందుకు నిపుణులను రప్పించే యోచనలో ఉన్నారు. దీని తర్వాత 60 రోజుల పాటు ముఖ్యమైన పాఠ్యాంశాలపై అధ్యాపకులు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇక మూడో దశలో పరీక్షలపై భయం పోగొట్టేందుకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. కొన్ని జిల్లాలపై ప్రత్యేక ఫోకస్సిలబస్ పూర్తి కాకపోవడం విద్యార్థుల్లో ఆందోళనకు ప్రధాన కారణమని అధ్యయనాల్లో తేలింది. దీనివల్ల పరీక్షల్లో ఏమొస్తుందో? ఎలా రాయాలో? అన్న ఆందోళన పరీక్షల సమయంలో పెరుగుతోందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఫెయిల్ అవుతున్న 40 శాతం విద్యార్థుల్లో కనీసం 22 శాతం మంది ఈ తరహా ఆందోళన ఎదుర్కొంటున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని కొన్ని జిల్లాలపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని ఇంటర్ బోర్డు అధికారులు నిర్ణయించారు. ఇంటర్ ఫస్టియర్‌లో 50 శాతం కన్నా తక్కువ ఫలితాలు సాధిస్తున్న జిల్లాల్లో జగిత్యాల, నిర్మల్, యాదాద్రి, జనగాం, కరీంనగర్, సూర్యాపేట, సిద్దిపేట, మేడ్చల్ ఉండగా.. సెకండియర్‌లో మెదక్, నాగర్‌కర్నూల్, వరంగల్, నారాయణపేట, సూర్యాపేట, హైదరాబాద్, పెద్దపల్లి జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం ఆయా జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టనున్నారు. ప్రైవేటులో ఇప్పటికే రివిజన్ షురూరాష్ట్రంలో జూనియర్ కళాశాలల్లో ఏటా ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు రాసే విద్యార్థుల్లో సుమారు మూడు వంతులు ప్రైవేటు కాలేజీల విద్యార్థులే కావడం గమనార్హం. అంటే మొత్తం 7.8 లక్షలకు పైగా విద్యార్థుల్లో సుమారు 6 లక్షల మంది ప్రైవేటు విద్యార్థులే ఉంటున్నారు. కాగా ఈ కాలేజీల్లో ఇప్పటికే ఇంటర్మీడియెట్ సిలబస్ పూర్తయింది. రివిజన్ కూడా చేపట్టారు. దీంతో జేఈఈ ప్రిపరేషన్ దిశగా యాజమాన్యాలు సన్నాహాలు మొదలు పెట్టాయి. బోధనా సిబ్బంది, ప్రత్యేక తరగతుల ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇప్పట్నుంచే తర్ఫీదు ఇవ్వాలివిద్యార్థులకు ఇప్పట్నుంచే పోటీ పరీక్షల దిశగా శిక్షణ ఇవ్వాలి. చాలా కాలేజీల్లో ప్రత్యేక శిక్షణ మొదలైంది. అయితే కొత్త కాలేజీలకు తగిన సిబ్బందిని కేటాయించడం, గెస్ట్ లెక్చరర్లను తీసుకోవడంలో జరిగిన ఆలస్యంతో ప్రైవేటు కాలేజీలతో సమానంగా ప్రభుత్వ కాలేజీలు పోటీ పడలేని పరిస్థితి నెలకొంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని బోర్డు ప్రత్యేక శిక్షణా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. – మాచర్ల రామకృష్ణ గౌడ్ (ప్రభుత్వ లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) -
చదువుకు.. చలో దుబాయ్
ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల్లో ఒకటి. ఆకాశహర్మ్యాలతో మెట్రోపాలిటన్ సంస్కృతికి అద్దం పట్టేలా నైట్ లైఫ్. అబ్బురపరిచే షాపింగ్ ఫెస్టివల్స్. ఒంటెలపై సఫారి. వీటితోనే ఎడారి దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ నగరం అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇంతకాలం టూరిస్ట్ స్పాట్‌గా వెలుగొందిన దుబాయ్ ఇప్పుడు అంతర్జాతీయ ఉన్నత విద్యకు గమ్యస్థానంగా మారుతోంది. ముఖ్యంగా భారతీయ విద్యార్థులు అత్యధిక సంఖ్యలో దుబాయ్‌లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు పయనమవుతున్నారు. 60కి పైగా విదేశీ వర్సిటీలు, కాలేజీల క్యాంపస్‌లకు దుబాయ్ నిలయంగా ఉంది. ఇప్పటికే యూఎస్, యూకేకు చెందిన వర్సిటీలు సైతం దుబాయ్‌లో క్యాంపస్‌లను నెలకొల్పగా.. మరిన్ని సంస్థలు సేవలందించేందుకు సిద్ధమవుతున్నాయి. భారతీయ సంస్కృతితో ముడిపడి..భారతీయులకు అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యలో ప్రపంచస్థాయి గమ్యస్థానంగా దుబాయ్ మారుతోంది. గత ఏడాది 2.43 లక్షల మంది విద్యార్థులు చదువు కోసం అక్కడికి వెళ్లారు. భారత్‌కు దుబాయ్ మూడు గంటల ప్రయాణ దూరంలో ఉండటం ఎక్కువగా విద్యార్థులకు కలిసివస్తోంది. ప్రధాన భారతీయ నగరాల నుంచి నేరుగా విమాన సౌకర్యాలు అందుబాటులో ఉండటం మరో అంశం. దుబాయ్ కృత్రిమ మేధస్సు, సుస్థిరత, నిర్మాణం, పర్యాటక రంగంలో వినూత్న ప్రాజెక్టులు రూపొందిస్తోంది. ఈ తరుణంలో దుబాయ్ దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మానవ వనరులు ఎంతో కీలకం.అందుకే అకడమిక్–పరిశ్రమల మధ్య భాగస్వామ్యం పెంచుతూ తరగతి గదికి మించిన విజ్ఞానాన్ని అందించేందుకు దుబాయ్ అవకాశాలు కల్పిస్తోంది. చాలామంది విద్యార్థులు తమ చదువు సమయంలో దుబాయ్‌లో ఉపాధి సైతం పొందుతున్నారు. దుబాయ్‌లోని బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో 95 దేశాలకుపైగా విద్యార్థులు ప్రాతినిధ్యం వహించే అధ్యయన గమ్యస్థానంగా పేరొందింది. అంతర్జాతీయ విద్యార్థులలో భారతీయ విద్యార్థులే అగ్రస్థానంలో నిలుస్తున్నారు. దుబాయ్‌లో భాష, ఆచారాలు, వంటకాలు, సంస్కృతితో భారతీయుల్లో ప్రత్యేకమైన అనుబంధం ఉన్నందున అక్కడకు వెళ్లేందుకు విద్యార్థులు ఇష్టపడుతున్నారుగోల్డెన్ వీసాతో..దుబాయ్ వృద్ధికి గోల్డెన్ వీసా కీలకంగా మారింది. యూఏఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీర్ఘకాలిక రెసిడెన్సీ వీసా విదేశీ ప్రతిభను, పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. గోల్డెన్ వీసా పెట్టుబడిదారులు, ఎంట్రపెన్యూర్స్, ప్రత్యేక ప్రతిభావంతులు, పరిశోధకులు, అత్యుత్తమ విద్యార్థులు, సైన్స్, ఇంజినీరింగ్, ఆరోగ్యం, విద్య, కళల వంటి రంగాలలో అసాధారణ నైపుణ్యాలు కలిగిన వ్యక్తులకు ఎంతగానో ఉపయోగపడుతోంది.ఈ వీసాను సాధారణంగా 5–10 సంవత్సరాలకు జారీ చేస్తారు. మళ్లీ పునరుద్ధరించుకోవచ్చు. గోల్డెన్ వీసా హోల్డర్లను జాతీయ స్పాన్సర్ అవసరం లేకుండా యూఏఈలో నివసించడానికి, పని చేయడానికి చదువుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఇప్పటివరకు దుబాయ్‌లో పోస్ట్–స్టడీ ఉపాధి వీసాలు లేవు. అయితే.. అంతర్జాతీయ విద్యార్థులు తమ విద్యను పూర్తిచేసిన తర్వాత అక్కడే ఉండేందుకు గోల్డెన్ వీసా కాకుండా ఉపాధి వీసా, ఉద్యోగార్థుల వీసా, ఫ్రీలాన్స్ వీసా, ఇన్వెస్టర్ వీసా, ఫ్యామిలీ స్పాన్సర్షిప్ ద్వారా రెసిడెన్సీ వీసాలను తీసుకొచ్చారు. భద్రతలోనూ ఇదే టాప్భద్రతా ప్రమాణాలు, వ్యక్తులకు సురక్షితమైన దేశాలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అంతర్జాతీయంగా ఖ్యాతి గడించింది. అబుదాబి, దుబాయ్‌లలో నేరాల శాతం చాలా తక్కువగా ఉంది. ఇది సురక్షితమైన విద్యార్థి వాతావరణానికి దోహదం చేస్తుంది. గతేడాది అబుదాబి 11.5 క్రైమ్ ఇండెక్స్, 88.5 సేఫ్టీ ఇండెక్స్‌తో ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా ర్యాంక్ పొందింది. దుబాయ్ నేరాల సూచిక 16.5, భద్రతా సూచిక 83.5గా ఉంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు హాయిగా విద్యపై దృష్టి పెట్టొచ్చు.జాబ్ ఓరియంటెడ్ కోర్సులుదుబాయ్లోని చాలా విశ్వవిద్యాలయాలు వ్యాపార రంగంలోని మానవ వనరుల కొరతను అధిగమించేందుకు జాబ్ ఓరియంటెడ్ కోర్సులను అందిస్తున్నాయి. మనస్తత్వ శాస్త్రం, వ్యాపారం, మార్కెటింగ్, ఆర్థిక శాస్త్రం, ఫైనాన్స్‌తోపాటు అత్యధికంగా కంప్యూటర్ సైన్స్, బయో మెడికల్ సైన్సెస్‌పై భారతీయ విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ వంటి ప్రోగ్రామ్‌లు సైతం అక్కడ క్రమంగా విస్తరిస్తున్నాయి.అంతర్జాతీయంగా పేరొంచిన పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ హెల్త్ సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), కంప్యూటర్ సైన్స్–ఇంజనీరింగ్, ఐటీ వంటివి ఉన్నాయి. ఉద్యోగాలను సృష్టించే ఎంట్రపెన్యూరల్ వాతావరణాన్ని ప్రఖ్యాత ప్రపంచ విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లతో దుబాయ్‌లో చదువుకునేందుకు అవకాశాలు పెరిగాయి. దుబాయ్‌లో చదువుకోవాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులకు అనేక స్కాలర్షిప్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. అకాడెమిక్ ఎక్స్‌లెన్స్ స్కాలర్షిప్లు, మల్టీ కల్చరల్ స్టూడెంట్ స్కాలర్షిప్, ఇంటర్నేషనల్ స్టూడెంట్ ట్యూషన్ స్కాలర్షిప్లు పొందొచ్చు. -
విదేశీ విద్యపైనే మోజు!
విదేశాల్లో చదువుకునేందకు ఇష్టపడే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. మధ్య తరగతి ప్రజల్లో ఆదాయం పెరగడం, విదేశాల్లో అధిక జీతాలందించే ఉపాధి అవకాశాలుండటంతో పదేళ్లలో వీరి సంఖ్య రెట్టింపైంది. అదే సమయంలో విదేశాల నుంచి మనదేశంలో చదువుకునేందుకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. అయితే భారతీయ విద్యార్థులు విదేశాలకు భారీగా తరలిపోవడం, వారి ఆదాయ, వ్యయాలు అన్నీ ఇతర దేశాల్లోనే జరుగుతుండటంతో దేశీయ కరెంట్ అకౌంట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.సాక్షి, అమరావతి: విదేశాల్లో ఉన్నత విద్య చదువుకునేందుకు భారతీయ విద్యార్థులు ఆసక్తి మరింత పెరుగుతోంది. అదే సమయంలో భారతీయ విశ్వవిద్యాలయాల్లో అంతర్జాతీయ విద్యార్థుల నమోదు తగ్గుతోంది. దీని కారణంగా భారతదేశ కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది. విదేశాల్లో చదువుకుంటూ.. అక్కడే పని చేసుకుంటున్న వారు డబ్బును తిరిగి భారతదేశానికి పంపడం లేదు. ఫలితంగా సుమారు రూ.50 వేల కోట్ల కరెంట్ అకౌంట్ లోటును తెచ్చిపెట్టినట్టు ఆర్బీఐ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రిజర్వ్ బ్యాంకు చెబుతున్నదాని ప్రకారం గత పదేళ్లలో భారతీయుల విద్యా ప్రయాణానికి సంబంధించిన వ్యయం రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. 2014–15లో రూ.20,597 కోట్ల నుంచి 2023–24లో రూ.52 వేల కోట్లకు పెరిగింది. ఈ మొత్తం 2025 నాటికి దేశం నుంచి విదేశాలకు వేళ్లే విద్యార్థుల మొత్తం ఖర్చు రూ.5 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా. మన విద్యార్థులు ఇష్టపడుతున్న దేశాలు యునైటెడ్ స్టేట్స్(అమెరికా), కెనడా, యునైటెడ్ కింగ్డమ్(యూకే), ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అధిక ఫీజులు, అత్యధిక జీవన వ్యయాలున్నా భారతీయ విద్యార్థుల విదేశీ విద్యకు ప్రసిద్ధ గమ్యస్థానాలుగా ఉన్నాయి. ఆ తర్వాత జర్మనీ, ఐర్లాండ్, సింగపూర్, రష్యా, ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్, న్యూజిలాండ్‌లను ఎంపిక చేసుకుంటున్నారు. అలాగే, దేశానికి వచ్చే విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ మంది దక్షిణాసియా, ఆఫ్రికన్ దేశాలకు చెందినవారే. నేపాల్ అత్యధిక సంఖ్యలో విద్యార్థులను భారతదేశానికి పంపుతోంది. 2014–15లో 21 శాతం నుంచి 2021–22లో 28శాతానికి పెరిగింది. 2014–15తో పోలిస్తే ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, మలేషియా, సూడాన్, నైజీరియా విద్యార్థుల శాతం తగ్గింది. భారత్‌కు ఎక్కువ మంది విద్యార్థులను పంపుతున్న దేశాల వరుసలో ఆఫ్ఘనిస్తాన్ 6.72 శాతంతో రెండో, భూటాన్ 3.33 శాతంతో ఆరో దేశంగా నిలుస్తోంది. 2021–22లో అమెరికా విద్యార్థులు 6.71 శాతంతో మూడో స్థానాన్ని, బంగ్లాదేశ్ 5.55 శాతం, యూఏఈ 4.87 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఎన్ని చేసినా ప్రయోజనం స్వల్పమే..అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య క్షీణిస్తున్న క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) 2020ను తెచ్చింది. ఎక్కువ మంది అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించే లక్ష్యంతో ప్రపంచ అధ్యయన గమ్యస్థానంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు అనేక ప్రతిపాదనలను రూపొందించింది. ఈ క్రమంలోనే యూజీసీ సైతం ద్వంద్వ, ఉమ్మడి డిగ్రీ ప్రోగ్రామ్‌లను అనుమతించేలా మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. 2018లో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఫ్లాగ్షిప్ ప్రాజెక్టుగా స్టడీ ఇన్ ఇండియా ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. దీని ద్వారా అత్యుత్తమ స్కాలర్షిప్లు, ఫీజు మినహాయింపులను అందించేలా రూపొందించింది. అయితే భాగస్వామ్య దేశాలతో ఒప్పందాల ద్వారా విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలు ప్రారంభించారు. కానీ, తగినన్ని నిధులు కేటాయించకపోవడంతో విదేశీ విద్యార్థులను దేశానికి ఆకర్షించడంలో ఈ కార్యక్రమం నత్తనడకన సాగడంతో విఫలమైంది. ప్రభుత్వం తీసుకున్న చొరవతో 2014–15 నుంచి 2019–20 ఆర్థిక సంవత్సరాల వరకు విదేశీ విద్యార్థుల నమోదు కేవలం 16.68శాతం మాత్రమే పెరిగిందని ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ డేటా చెబుతోంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో కరోనా ఎఫెక్ట్‌తో విదేశీ విద్యార్థుల సంఖ్య 48,035కు, 2021–22లో 46,878కి తగ్గింది. విదేశీ విద్యకు రుణాలు పెరిగాయి..దేశంలో ఉన్నత విద్య కోసం విద్యార్థులు విదేశాలకు వెళ్లిపోతుండటంతో డెమోగ్రాఫిక్ సమతౌల్యం దెబ్బతింటోంది. మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతిలో ఆదాయం పెరుగుతోంది. స్టాక్ మార్కెట్లు వంటివి లాభాలను సృష్టిస్తున్నాయి. నాన్ బ్యాంక్ ఫైనాన్సియల్ కంపెనీలు సైతం విద్యా రుణాలను గణనీయంగా పెంచాయి. ఫలితంగా విదేశాల్లో ఫీజులు చెల్లించే సామర్థ్యం పెద్ద సమస్య కాకుండాపోయింది. – మహేశ్వర్ పెరి, ఛైర్మన్,కెరీర్స్ 360 సీఈవో దేశంలో అంతర్జాతీయ విద్యార్థుల క్షీణత..భారతీయ విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ విద్యార్థుల నమోదులో గణనీయమైన క్షీణతను నమోదు చేస్తున్నాయి. ఆర్బీఐ నివేదిక ప్రకారం భారత్‌లో విద్యా సంబంధిత అంశాల ద్వారా వచ్చే ఆదాయం సగానికి సగం తగ్గింది. 2014–15లో రూ.4,345 కోట్ల నుంచి 2023–24కు రూ.2,068 కోట్లకు పడిపోయింది. అయితే 2022–23తో పోలిస్తే కేవలం విదేశీ మారకపు ఆదాయం స్వల్పంగా పెరిగింది. కోవిడ్ తర్వాత 2021–22లో రూ.912 కోట్ల కనిష్ట స్థాయి నుంచి పుంజుకుంది. అయినప్పటికీ 2014–15తో పోలిస్తే చాలా తక్కువగానే నమోదైంది. -
భద్రత ఉంటేనే అమెరికా చదువులకు!
సాక్షి, హైదరాబాద్: విదేశాలకు తమ పిల్లలను పంపే తల్లిదండ్రులు ఇప్పుడు అక్కడి భద్రతపై దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో డిగ్రీలకన్నా తమ పిల్లలు భద్రంగా ఉంటారా లేదా అనే ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు. అగ్రరాజ్యంలో ఇటీవలికాలంలో భారతీయ విద్యార్థులపై వరుస దాడుల ఉదంతాల నేపథ్యంలో ఈ తరహా జాగ్రత్త కనిపిస్తోంది. ఈ క్రమంలో సవాలక్ష సందేహాలు తల్లిదండ్రుల నుంచి వస్తున్నాయని అమెరికా వర్సిటీల్లో మన విద్యార్థులు ప్రవేశాలు పొందడంలో సాయం చేసే కన్సల్టెంట్లు చెబుతున్నారు. చేర్చాలనుకునే వర్సిటీలో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు కొందరు తల్లిదండ్రులు ముందుగా ఓ వ్యక్తిని పంపి అక్కడి పరిస్థితుల గురించి వాకబు చేయిస్తున్నారు. 2024 అడ్మిషన్ల ఫలితాలు వెల్లడువుతున్న తరుణంలో ఇలాంటి భయాలు తల్లిదండ్రుల్లో ఎక్కువయ్యాయని కన్సల్టెంట్లు అంటున్నారు. అమ్మాయిలను అమెరికాలో పైచదువులకు పంపే తల్లిదండ్రులు మరింత ఎక్కువగా విచారణ చేయిస్తున్నారని బెంగుళూరుకు చెందిన ఓ కన్సల్టెన్సీ సంస్థ సీఈవో ఆదర్శ ఖండేల్వాల్ తెలిపారు. ‘ప్రస్తుతం అడ్మిషన్ ఫలితాలు వెలువడుతున్నాయి. 2024లో భద్రత అనేది ఒక ప్రధాన అంశంగా మారింది’ అని ఆయన వ్యాఖ్యానించారు. క్రైం రేటుపై వాకబు.. అమెరికాలోని ఏయే యూనివర్సిటీల పరిధిలో ఎంత క్రైం రేటు ఉంది? ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి? డ్రగ్స్ ప్రభావం ఏమైనా ఉందా? అనే అంశాలను తల్లిదండ్రులు ఎక్కువగా పరిశీలిస్తున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ చదువుల కోసం పిల్లలను పంపే తల్లిదండ్రుల్లో నేరాలపై ఎక్కువ ఆందోళన కనిపిస్తోంది. తొలిసారి దేశానికి, కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావడమే దీనికి ప్రధాన కారణమని విదేశీ కన్సల్టెన్సీలు విశ్లేషిస్తున్నాయి. షికాగో, బోస్టన్, ఇండియానా వంటి ప్రాంతాల్లో భారతీయ విద్యార్థులపై దాడులతోపాటు అక్కడ ఎక్కువ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజా నివేదికలు ఇవే వెల్లడించడంతో ఈ ప్రాంతాలకు పంపాలంటే తల్లిదండ్రులు వెనుకంజ వేస్తున్నారు. అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థుల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రా నూయి ఇటీవల ఓ వీడియో విడుదల చేయడం కలకలం రేపింది. సమస్యాత్మకం కాని వర్సిటీల వైపే అమెరికన్ యూనివర్సిటీలకు వస్తున్న దరఖాస్తులను పరిశీలిస్తే తక్కువ సమస్యాత్మకమైన వాటినే భారతీయ విద్యార్థులు ఇష్టపడుతున్నారు. దీనిపై సమగ్ర అవగాహన కలిగాకే విదేశీ చదువులపై ప్రణాళిక రచిస్తున్నారని విదేశాల్లోని స్టడీ కెరీర్ కన్సల్టెన్సీ వ్యవస్థాపకుడు కరణ్ గుప్తా తెలిపారు. పెద్ద నగరాలు లేదా తక్కువ సమస్యాత్మకమైనవిగా గుర్తించే యూఎస్ వర్సిటీల ఆఫర్లను మాత్రమే ఇష్టపడుతున్నారని తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి ఫ్లోరిడాలోని ‘చి’ యూనివర్సిటీని ఎంపిక చేసుకున్నాడు. అయితే ఆ ప్రాంతంపై సమగ్ర సమాచారం సేకరించిన తల్లిదండ్రులు తమ కుమారుడిని ఆ వర్సిటీలో కాకుండా ఎన్‌వైయూ యూనివర్సిటీ మంచిదని అందులో చేర్పించారు. 95% కేసుల్లో, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం తల్లిదండ్రులు స్వీయ నిర్ణయాలు తీసుకుంటున్నారని మరో కన్సల్టెంట్ గుప్తా తెలిపారు. ఆరిజోనా, ఒహాయో, టెక్సాస్, లాస్ ఏంజిలెస్, కాలిఫోర్నియా, డాలస్ వంటి ప్రాంతాలకు తమ పిల్లలను పంపాలనుకొనే తల్లిదండ్రులు ఎక్కువ జాగ్రత్తలు కోరుతున్నారు. వరంగల్‌కు చెందిన ఓ విద్యార్థి కాలిఫోర్నియాలోని క్లేర్మాంట్ మెక్కెన్నా కాలేజీలో చేరాలని ఇష్టపడ్డాడు. కానీ అతని తల్లిదండ్రులు మాత్రం దానికి బదులుగా బోస్టన్ విశ్వవిద్యాలయం నుంచి ఆఫర్‌ను తీసుకోవాలని పట్టుబట్టారు, విద్యార్థి మేనమామ అక్కడ నివసిస్తున్నాడని, అది భద్రత కల్పిస్తుందని భావించారు. కన్సల్టెన్సీల్లోనూ ఆందోళన భారతీయ విద్యార్థులపై ఆందోళనల నేపథ్యంలో కన్సల్టెన్సీలూ జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులను మెప్పించే రీతిలో వ్యవహరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా కన్సల్టెన్సీలన్నీ కలిపి తొలిసారిగా విద్యార్థుల భద్రత కోసం కొన్ని మార్గదర్శకాలు రూపొందించాయి. ముందుగా విద్యార్థుల భద్రతపై అవగాహన కల్పిస్తున్నాయి. ఆన్లైన్లో ఆయా ప్రదేశాల సమాచారం అందుబాటులోకి తేవడంతోపాటు అవసరమైతే విద్యార్థులు, తల్లిదండ్రుల బృందాలు కూడా ఆయా వర్శిటీలను సందర్శించేందుకు, అక్కడి సీనియర్ విద్యార్థులతో సంప్రదింపులు జరిపేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. -
విదేశాలకు వెళ్లాలా? వద్దా?
సాక్షి, హైదరాబాద్: ప్రతిభావంతులైన పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు ఆర్థిక సాయం అందించే ఓవర్సీస్ విదేశీ విద్యానిధి పథకాల లబ్ధిదారుల ఖరారు అంశం పెండింగ్‌లో పడింది. లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో సంక్షేమ శాఖలు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కొంతకాలం ఆపేయాలని నిర్ణయించాయి. వివిధ సంక్షేమ శాఖలు క్షేత్రస్థాయి నుంచి దరఖాస్తుల స్వీకరించడంతోపాటు ఆయా విద్యార్థుల ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను సైతం పూర్తి చేశాయి. మెరిట్ ఆధారంగా వడపోసినప్పటికీ అర్హుల జాబితాలను మాత్రం ప్రకటించలేదు. నెలన్నరపాటు వివిధ దశల్లో వడపోత చేపట్టినా... సకాలంలో ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి చర్యలు చేపట్టలేదు. ఇదే సమయంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో సంక్షేమ శాఖలు ఒక్కసారిగా ఈ ప్రక్రియను నిలిపివేశాయి. విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన పార్లమెంటు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి దాదాపు పక్షం రోజులవుతోంది. రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ మే 13తో పూర్తి కానుంది. కానీ దేశవ్యాప్తంగా జూన్ 1న ఎన్నికలు ముగియనుండగా, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో అప్పటివరకు కోడ్ అమల్లో ఉంటుంది. అప్పటివరకు విదేశీ విద్యానిధి పథకం లబ్ధిదారుల ఎంపిక జాబితా వెలువడే అవకాశం లేదు. ఈ క్రమంలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. విదేశీ వర్సిటీల్లో ఏప్రిల్ నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగానే సంక్షేమ శాఖలు ఓవర్సీస్ విద్యానిధి లబ్ధిదారుల ఎంపికను జనవరిలోనే మొదలుపెడతాయి. దరఖాస్తుల స్వీకరణ, ధ్రువపత్రాల పరిశీలన, ఇతర ప్రక్రియ పూర్తి చేసి మార్చి మొదటి వారంలో లబ్ధిదారుల జాబితాలను ఖరారు చేసేది. కానీ ఈ దఫా అర్హుల జాబితా విడుదలలో జాప్యం జరిగింది. విదేశీ విద్యానిధి సాయం వస్తుందన్న ఆశతో వందల సంఖ్యలో విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అప్పు చేసి మరీ... ఈ పథకం కింద అర్హత సాధిస్తేనే ఉన్నత విద్యలో చేరేందుకు సిద్ధమయ్యే పరిస్థితి ఉండగా... ఇప్పుడు పథకం కింద లబ్ధి చేకూరుతుందా? లేదా? అనే గందరగోళం అభ్యర్థుల్లో నెలకొంది. దీంతో విదేశాలకు వెళ్లాలా? వద్దా? అనేది తేల్చుకోలేక సతమతమవుతున్నారు. మరికొందరు మాత్రం అర్హత సాధిస్తామనే ధీమాతో అప్పు చేసి మరీ విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. విమానం టికెట్లు బుక్ చేసుకుని గడువులోగా యూనివర్సిటీలో చేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఓవర్సీస్ విద్యానిధి కింద బీసీ సంక్షేమ శాఖ ద్వారా 300 మందికి, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల నుంచి 350 మందికి, మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా 500 మందికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఒక్కో విద్యార్థికి ఉన్నత విద్యా కోర్సు పూర్తి చేసే వరకు రూ.20 లక్షలు రెండు వాయిదాల్లో ఇస్తారు. ఈ మొత్తాన్ని సదరు విద్యార్థి తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. -
ఉన్నత విద్యకు ‘స్కిల్’ జత
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో నైపుణ్యం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే స్వల్పకాలిక నైపుణ్యాభివృద్ధి కోర్సులను కాలేజీలు, యూనివర్సిటీలు అందుబాటులోకి తెచ్చేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంగీకారం తెలిపింది. తాజా బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రస్తావించింది. విధాన పరమైన నిర్ణయాన్ని ప్రకటించినప్పటీకీ పెద్దగా నిధులు కేటాయించక పోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థుల్లో నైపుణ్యం ఉండటం లేదన్నది భారత పారిశ్రామిక వేత్తల అభిప్రాయం. సీఐఐ, ఎఫ్ఐఐ, నాస్కామ్ వంటి సంస్థల అధ్యయనంలోనూ ఇదే వెల్లడైంది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక భాగస్వామ్యంతో ఈ కోర్సులను ముందుకు తీసుకెళ్ళాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కన్పిస్తోంది. తక్షణ అవసరం ఇదే..: దేశంలో ఇంజనీరింగ్ పూర్తి చేసే విద్యార్థుల్లో కేవలం 8 శాతం మంది మాత్రమే నైపుణ్యం (స్కిల్)తో బయటకు వస్తున్నారు. మిగతా వాళ్ళలో కొంతమంది స్కిల్ కోసం ప్రత్యేక కోర్సులు నేర్చుకుంటున్నారు. అయితే వాళ్లలో కోర్సు నేర్చుకునే నాటికే కొత్త నైపుణ్యాలు మార్కెట్లోకి వస్తున్నాయి. దీంతో మళ్ళీ కొత్త టెక్నాలజీ నేర్చుకుంటే తప్ప మంచి వేతనంతో ఉద్యోగం లభించే అవకాశం కన్పించడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకునే విశ్వవిద్యాలయాలకు యూజీసీ తక్షణ మార్పులను సూచించింది. నైపుణ్యాభివృద్ధి మండళ్లు స్వల్ప వ్యవధి కోర్సులను ప్రారంభించేందుకు అనుమతి అక్కర్లేదని కూడా తెలిపింది. కాకపోతే పారిశ్రామిక భాగస్వామ్యం తప్పనిసరి. అప్పుడే విద్యార్థి అనుభవ పూర్వకంగా నైపుణ్యం సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. ఇంటర్ ఉత్తీర్ణత సాధించి డిగ్రీ, బీటెక్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు 3–6 నెలల వ్యవధిలో 27 రకాల నైపుణ్య కోర్సులను యూజీసీ సూచిస్తోంది. వీటికి 12 నుంచి 30 క్రెడిట్స్ ఇవ్వాలని కూడా నిర్ణయించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సమీక్ష జరిపింది. ఏయే కోర్సులు అందుబాటులోకి తేవచ్చు అనే విషయాన్ని ప్రభుత్వానికి ఉన్నతాధికారులు వివరించారు. ఇవీ స్కిల్ కోర్సులు అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే కాలంలో మొత్తం 27 స్కిల్ కోర్సులను నేర్చుకోవడానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులకే అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో ఏఐ అండ్ ఎంఎల్, రోబోటిక్స్, ఐవోటీ, ఇండ్రస్టియల్ ఐవోటీ, స్మార్ట్ సిటీస్, డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, వీఆర్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్, 5 జీ కనెక్టివిటీ, ఇండ్రస్టియల్ ఆటోమేషన్, ఎల్రక్టానిక్స్ సిస్టమ్ డిజైన్, వీఎస్‌ఎస్‌ఐ డిజైన్స్, కంప్యూటర్ భాషలో ప్రాథమిక అవగాహన, మెకానికల్ టూలింగ్, మొబైల్ కమ్యూనికేషన్ లాంటి ప్రధానమైన కోర్సులున్నాయి. తెలంగాణలో కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీల భాగస్వామ్యంతో ఐవోటీ, ఏఐఎంఎల్ సహా ఇతర కంప్యూటర్ కోర్సుల్లో స్వల్పకాలిక కోర్పులు నిర్వహించవచ్చని అధికారులు అంటున్నారు. సైబర్ సెక్యూరిటీ, డేటా అనాలసిస్ వంటి వాటికి విస్తృత అవకాశాలున్నాయని భావిస్తున్నారు. తొలి దశలో ప్రైవేటు యూనివర్సిటీలు మాత్రమే ఈ దిశగా ముందుకు వెళ్ళే వీలుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కొన్ని డీమ్డ్ వర్సిటీలు ఈ దిశగా కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాయి. స్కిల్‌తో ఉద్యోగం సులభం డిగ్రీతో పాటు నైపుణ్యం ఉంటే ఉద్యోగం లభించడమే కాదు.. అందులో రాణించడం కూడా సులభం. కంపెనీలు ఇలాంటి అర్హతలే కోరుకుంటున్నాయి. అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే నాటికి ఏదైనా ఒక రంగంలో నైపుణ్యం అవసరం. ఈ దిశగా ప్రభుత్వం, వర్సిటీలు అడుగులు వేయడం అభినందనీయం. – శ్రీరాం వెంకటేష్ (ఉన్నత విద్య మండలి కార్యదర్శి) -
విదేశీ విద్యానిధికి డాలర్ రూట్.. ఉన్నత విద్య కోసం భారీ వ్యయం
హైదరాబాద్‌కు చెందిన వర్ధన్‌కు ఇద్దరు పిల్లలు సంతానం. ఒకరు పదో తరగతి చదువుతుంటే, మరొకరు ఐదో తరగతిలో ఉన్నారు. వీరిద్దరినీ అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం విదేశాలకు పంపాలన్నది అతడి లక్ష్యం. వర్ధన్ కేవలం ఆకాంక్షతోనే సరిపెట్టలేదు. తమ పిల్లలు మూడేళ్ల వయసులో ఉన్నప్పటి నుంచే ఆయన వారి భవిష్యత్ విద్య కోసం పెట్టుబడులు ప్రారంభించారు. అది కూడా డాలర్‌తో కోల్పోతున్న రూపాయి విలువ క్షీణతను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించారు. తన పెట్టుబడులను డాలర్ మారకంలో ఉండేలా చూసుకున్నారు. మరో రెండేళ్ల తర్వాత తన కుమారుడు గ్రాడ్యుయేషన్ కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉంది. వర్ధన్ ముందస్తు ప్రణాళిక వల్ల నిశి్చంతగా ఉన్నాడు. విదేశాల్లో కోర్సుల కోసం పెద్ద మొత్తంలోనే ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే పిల్లలు స్కూల్ ఆరంభంలో ఉన్నప్పటి నుంచే పెట్టుబడుల ప్రణాళికలు అమలు చేయాలి. ఈ విషయంలో వర్ధన్ అనుసరించిన మార్గం ఎంతో మందికి ఆదర్శం అవుతుంది. పిల్లలకు అత్యుత్తమ విదేశీ విద్యావకాశాలు ఇవ్వాలని కోరుకునే తల్లిదండ్రులు, అందుకు కావాల్సిన వనరులను సమకూర్చుకునే మార్గాలను చర్చించేదే ఈ కథనం. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతూ వెళుతోంది. భారత విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం 2021 జనవరి నాటికి 85 దేశాల్లో సుమారు 11 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో ఎక్కువ మంది కెనడాలో చదువుతున్నారు. ఆ తర్వాత అమెరికా, యూఏఈ, ఆ్రస్టేలియా, యూకే భారత విద్యార్థుల ముఖ్య ఎంపికలుగా ఉన్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏటేటా క్షీణిస్తూనే ఉండడాన్ని చూస్తున్నాం. గడిచిన 20 ఏళ్ల కాలాన్ని పరిశీలిస్తే డాలర్‌తో రూపాయి ఏటా సగటున 3 శాతం విలువను నష్టపోతూ వచ్చింది. 2009లో డాలర్‌తో రూపాయి విలువ 46.5గా ఉంటే, ఇప్పుడు 83కు చేరింది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే పిల్లల చదువు కోసం చెల్లించాల్సిన ఫీజులు, ఇతర ఖర్చులన్నీ కూడా డాలర్ రూపంలో ఉంటుంటే.. మనం సంపాదించేది రూపాయిల్లో. అందుకుని పిల్లల విద్య కోసం పెట్టుబడులను డాలర్ మారకంలో చేసుకోవడమే మెరుగైన మార్గం అవుతుంది. మొత్తంగా కాకపోయినా, పెట్టుబడుల్లో చెప్పుకోతగ్గ మేర డాలర్ మారకంలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఒకవైపు డాలర్‌తో రూపాయి మారకం క్షీణిస్తూ పోతుంటే, మరోవైపు ద్రవ్యోల్బణం సైతం కరెన్సీ విలువను కొంత హరిస్తుంటుంది. వీటిని తట్టుకుని పెట్టుబడులపై మెరుగైన రాబడులు వచ్చేలా చూసుకోవాలి. అప్పుడే లక్ష్యం తేలికవుతుంది. ఏమిటి మార్గం..? విదేశీ విద్య కోసం డాలర్ మారకంలో పెట్టుబడులు మేలైన మార్గం అన్నది నిపుణుల సూచన. కానీ, ఒక ఇన్వెస్టర్‌గా తాను చేసే పెట్టుబడులను అర్థం చేసుకుని, వాటి పనితీరును ట్రాక్ చేసుకునే విషయ పరిజ్ఞానం తప్పనిసరి. ఎందుకంటే అంతర్జాతీయ పెట్టుబడులపై ఎన్నో అంశాల ప్రభావం ఉంటుంది. దేశీయ అంశాలతో సంబంధం ఉండదు. అందుకని వాటిని విడిగా ట్రాక్ చేసుకోవాల్సిందే. ‘‘అంతర్జాతీయ పెట్టుబడులను ఎంపిక చేసుకునే ముందు చార్జీలను తప్పకుండా చూడాలి. సరైన స్టాక్‌ను సరైన ధరల వద్ద కొనుగోలు చేసే నైపుణ్యాలు కూడా అవసరం’’ అని మహేశ్వరి తెలిపారు. తమ మొత్తం పెట్టుబడుల్లో 10–15 శాతం మేర విదేశీ స్టాక్స్ కోసం వైవిధ్యం కోణంలో కేటాయించుకోవచ్చు. పిల్లల విదేశీ విద్యకు ఎంత ఖర్చు అవుతుందో, ఆ అంచనాల మేరకు కేటాయింపులు చేసుకోవాలి. స్టాక్స్ ఎంపిక తెలియని వారు, ఈ రిస్క్ తీసుకోకుండా విదేశీ స్టాక్స్‌తో కూడిన మ్యూచువల్ ఫండ్స్ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ యూఎస్ బ్లూచిప్ ఈక్విటీ ఫండ్ ఏడాది కాలంలో 17 శాతం వరకు రాబడులు ఇచ్చింది. డీఎస్పీ యూఎస్ ఫ్లెక్సిబుల్ ఈక్విటీ ఫండ్ 15 శాతం రాబడులు తెచ్చి పెట్టింది. ఇలాంటి ఎన్నో ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. డాలర్ మారకంలో పెట్టుబడులకు అవసరమైతే ఆరి్థక సలహాదారులను సంప్రదించడానికి వెనుకాడొద్దు. యూఎస్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ దారి నేరుగా స్టాక్స్ ► దేశీయ బ్రోకరేజీ, విదేశీ బ్రోకరేజీ సంస్థ లేదా ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ► దేశీయ బ్రోకరేజీ సంస్థలు విదేశీ బ్రోకరేజీ సంస్థలతో జట్టు కట్టి సేవలందిస్తున్నాయి. ► ఎన్ఎస్ఈ, ఐఎఫ్ఎస్సీ ద్వారా కొన్ని విదేశీ స్టాక్స్‌లో పెట్టుబడులకు అవకాశం ఉంది. ఈటీఎఫ్‌లు ► ఆర్బీఐ పరిమితుల వల్ల కొన్ని ఈటీఎఫ్‌లు మినహా.. మిగిలిన ఈటీఎఫ్‌లు అందుబాటులో ఉన్నాయి. ► కింగ్ ఎర్రర్, పెట్టుబడుల విధానంపై అవగాహన కలిగి ఉండాలి. ► ఈ పెట్టుబడులు ఆర్బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కిందకు వస్తాయి. ఏడాదిలో 2,50,000 డాలర్లు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రూపాయి విలువ క్షీణత.. గడిచిన కొన్ని దశాబ్దాల కాలంలో డాలర్‌తో రూపాయి ఎంతో నష్టపోయింది. ముఖ్యంగా గత దశాబ్ద కాలంలోనే 50 శాతం విలువను కోల్పోయింది. ఈ క్షీణత ఇక ముందూ కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘‘యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కఠిన వైఖరి తీసుకోవడంతో రూపాయి క్షీణతను ఇక ముందూ చూడనున్నాం. ఎందుకంటే యూఎస్ ఫెడ్ వైఖరితో డాలర్ సరఫరా తగ్గుతుంది. అది వర్ధమాన మార్కెట్లలోకి పెట్టుబడుల రాకపై ప్రభావం చూపిస్తుంది’’అని జేఎం ఫైనాన్షియల్ చీఫ్ ఎకనమిస్ట్ ధనుంజయ్ సిన్హా వివరించారు. రూపాయి విలువను కాపాడేందుకు ఆర్బీఐ సైతం ఫారెక్స్ నిల్వలను ఉపయోగించుకుంటోంది. డాలర్ ఇదే మాదిరిగా గరిష్ట స్థాయిలో కొనసాగితే, అధిక ముడి చమురు ధరల కారణంగా భారత్‌తో వాణిజ్య లోటు ఎగువనే ఉంటుందన్నది నిపుణుల విశ్లేషణగా ఉంది. ఇది రూపాయి విలువను మరింత కిందకు తోసేస్తుందన్న విశ్లేషణ వినిపిస్తోంది. ‘‘స్వల్ప కాలంలో డాలర్‌తో రూపాయి విలువ 6–7 శాతం మేర క్షీణించొచ్చని భావిస్తున్నాం’’ అని ధనుంజయ్ సిన్హా చెప్పారు. 1947లో స్వాంతంత్య్రం సిద్ధించే నాటికి మన రూపాయి విలువ డాలర్ మారకంలో 4గా ఉంటే, ఇప్పుడు 83 స్థాయిలకు చేరుకోవడం గమనించొచ్చు. ఫీజులపై రూపాయి ప్రభావం ‘విదేశాల్లో చదువుకు, ముఖ్యంగా అమెరికాలో.. ఎంతలేదన్నా అండర్ గ్రాడ్యుయేషన్‌కు 10 వేల నుంచి 50 వేల డాలర్ల వరకు ఖర్చు అవుతుంది. పీజీ చేసేందుకు 12,000 డాలర్ల నుంచి 80,000 డాలర్ల వరకు (స్కాలర్షిప్ కలపకుండా) వ్యయం చేయాల్సి వస్తుంది. వీటికి తోడు నివసించే ప్రాంతం ఆధారంగా జీవన వ్యయాలకు అదనంగా ఖర్చు చేయాలి. కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని విదేశాల్లోని విద్యా సంస్థలు ఇప్పటి వరకు ట్యూషన్ ఫీజుల పెంపులకు దూరంగా ఉన్నాయి. ఇప్పుడు ఖర్చులు భారీగా పెరిగాయంటే అది కేవలం కరెన్సీ కారణంగానే’ అని విదేశీ! విద్యా కన్సల్టెన్సీ సంస్థ ఏపీఎస్ వరల్డ్ సీఈవో అనిర్బన్ సిర్కార్ తెలిపారు. ఏటా రూపాయి విలువ క్షీణిస్తుందని భావిస్తే.. దీనికి అనుగుణంగా విదేశీ కోర్సుల వ్యయం పెరుగుతూ వెళుతుంది. ‘‘విదేశీ విద్యా వ్యయం ఏటా పెరుగుతూనే ఉంది. దీనికి ద్రవ్యోల్బణం ఒక్కటే కారణం కాదు. డాలర్‌తో రూపాయి విలువ క్షీణిస్తుండడం కూడా కారణమే’’ అని యూఎస్‌లో పెట్టుబడులకు వీలు కలి్పంచే వేదిక వెస్టెడ్ ఫైనాన్స్ సీఈవో విరమ్షా చెప్పారు. 2012 జూలైలో రూపాయి విలువ డాలర్‌తో 55గా ఉంది. అప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ ట్యూషన్ ఫీజు ఏడాదికి 20,000 డాలర్లు ఉందని అనుకుందాం. నాడు డాలర్‌తో రూపాయి విలువ 55 ప్రకారం ఒక ఏడాదికి రూ.11 లక్షలు ఫీజు కోసం చెల్లించాల్సి వచ్చేది. అదే ఫీజు ఇప్పుటికీ పెరగకుండా అక్కడే ఉన్నా కానీ, రూపాయి విలువ క్షీణత ఫలితంగా కోర్సు వ్యయం రూ.16.60 లక్షలకు పెరిగినట్టు అవుతుంది. అంటే రూ.5 లక్షలకు పైగా పెరిగింది. ద్రవ్యోల్బణం ప్రభావాన్ని కూడా కలిపిచూస్తే ఈ భారం ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. అందుకని పిల్లల విదేశీ విద్య కోసం పొదుపు చేసే వారు కేవలం ద్రవ్యోల్బణం ఒక్కటే కాకుండా, రూపాయి క్షీణతను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అంతర్జాతీయ పెట్టుబడుల మార్గం విదేశీ విద్య కోసం చేసే పెట్టుబడులను అంతర్జాతీయ మార్కెట్లకు కేటాయించుకోవడం అర్థవంతంగా ఉంటుంది. జపాన్, బ్రిటన్, యూఎస్ తదితర దేశాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పెట్టుబడులకు వైవిధ్యం కూడా తోడవుతుంది. భారత ఇన్వెస్టర్లలో ఎక్కువ మంది అమెరికన్ మార్కెట్లలోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికైతే డాలర్ ఆధిపత్యానికి ఎలాంటి ఇబ్బంది లేదన్న విశ్లేషణ వినిపిస్తోంది. యూఎస్ పెట్టుబడులు కరెన్సీ విలువ పతనానికి హెడ్జింగ్గానే కాకుండా పెట్టుబడుల్లో వైవిధ్యానికీ వీలు కలి్పస్తాయన్నది నిపుణుల సూచన. ‘‘విదేశీ విద్య కోసం, డాలర్ మారకంలో లక్ష్యాల కోసం యూఎస్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టుకోవడం మంచి విధానం అవుతుంది. దీనివల్ల గమ్యస్థానంలో (చదువుకునే) ద్రవ్యోల్బణానికి తోడు, రూపాయి విలువ క్షీణతకు హెడ్జింగ్‌గా పనిచేస్తుంది. చాలా దేశాల్లో రిటైల్ ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఉన్నత విద్య ద్రవ్యోల్బణం ఎక్కువే ఉంటుంది’’ అని ఫింజ్ స్కాలర్జ్ వెల్త్ మేనేజర్ సీఈవో రేణు మహేశ్వరి సూచించారు. డాలర్‌తో ఇన్వెస్ట్ చేసినప్పుడు, తిరిగి డాలర్‌తో ఉపసంహరించుకునేట్టుగా ఉంటే, అది అధిక ప్రయోజనాన్నిస్తుంది. ఉదాహరణకు 2012లో నిఫ్టీ 500 ఈటీఎఫ్‌లో, ఎస్అండ్పీ 500లో 100 డాలర్లు చొప్పున ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. నాడు డాలర్‌తో రూపాయి విలువ 55గా ఉంది. అప్పటి నుంచి ఈ రెండు సూచీలు ఏటా 13 శాతం రాబడులు ఇచ్చాయి. దీంతో నిఫ్టీ 500 ఈటీఎఫ్‌లో 100 డాలర్ల పెట్టుబడి నేడు రూ.18,000 అవుతుంది. ఎస్అండ్పీ 500 ఈటీఎఫ్‌లో పెట్టుబడి రూ.25,000 అయి ఉండేది. 40 శాతం అధికంగా ఎస్అండ్పీ 500 ఈటీఎఫ్‌లో రాబడులు వచ్చాయి. రెండు సూచీలు ఒకే విధమైన రాబడిని ఇచి్చనా.. రెండు దేశాల కరెన్సీ విలువల్లో మార్పుల ఫలితంగా ఎస్అండ్పీ 500లో అధిక రాబడులు వచ్చాయి. డాలర్‌తో రూపాయి క్షీణించడం వల్లే ఇలా జరిగింది. -
KTR: భావోద్వేగానికి గురైన ఓ నాన్న
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వ్యక్తిగత జీవితానికి సంబంధించి భావోద్వేగానికి గురయ్యారు. తన కొడుకు కల్వకుంట్ల హిమాన్షు రావు ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్తున్న విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారాయన. నిన్న మొన్నటి వరకు కళ్ళముందే అల్లరిగా ఉండే ఈ పిల్లాడు పెరిగి, కాలేజీకి వెళ్లడాన్ని నమ్మలేకపోతున్నా. నాలోని కొంత భాగాన్ని కూడా తీసుకెళ్తున్నాడు అంటూ కొడుక్కి సంబంధించిన చిన్ననాటి నుంచి ఫొటోలను ఎక్స్(ట్విటర్)లో షేర్ చేశారాయన. Most cliched line probably from a parent but here we go Can’t believe this Boy who was a naughty little kid till yesterday is all grown up and now off to College!! As he goes, he’s taking a part of me with him ❤️ Daddy duties; off to the US with family for over a week where I… pic.twitter.com/7k3G9oEi0u — KTR (@KTRBRS) August 19, 2023 తాను కూడా ఫ్యామిలీతో కలిసి వారం పాటు అమెరికాలో ఉంటానని, పనిలో పనిగా తాను కూడా తన విధుల్ని నిర్వహిస్తానని తెలిపారాయన.కేటీఆర్ వెంట ఆయన భార్య, కుమారుడు హిమాన్షు వెళ్లారు. పర్యటన చివర్లో హిమాన్షును అమెరికా యూనివర్సిటీలో డిగ్రీ కోర్సులో చేర్పించనున్నారు. మరోవైపు హిమాన్షు కూడా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. pic.twitter.com/sZbnjOovBs — Himanshu Rao Kalvakuntla (@TheRealHimanshu) August 19, 2023 మంత్రి కేటీఆర్ శనివారం రాత్రి అమెరికాకు బయల్దేరి వెళ్లారు. పెట్టుబడుల కోసం న్యూయార్క్, చికాగోలో పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల అధిపతులతో సమావేశం అవుతారు. మంత్రితో పాటు రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. -
అగ్రరాజ్యంలో తెలుగు తేజం
తెనాలి: అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నత విద్యకు విశేష కృషి చేసినందుకు ఇమ్మిగ్రెంట్ అచీవ్మెంట్ అవార్డ్ అందుకున్నారు గుంటూరుకు చెందిన తెలుగు మహిళ నీలి బెండపూడి (59). అమెరికాలోని ప్రతిష్టాత్మక పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ అధ్యక్షురాలిగా నియమితులైన తొలి మహిళ నీలి బెండపూడి గత నెలలో భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఆయనతో సమావేశమైన వ్యక్తిగా వార్తల్లోకి వచ్చారు. భారతదేశంలోని గొప్ప విద్యాలయాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు రెండు దేశాలకు అవసరమైన సిఫార్సులను చేసే కోచర్‌గా ఆమె నియమితులయ్యారు. గుంటూరు జిల్లాకు చెందిన ప్రొఫెసర్ నీలి విశాఖపట్నంలో చదువుకున్నారు. అక్కడినుంచే అమెరికా వెళ్లారు. ఆమె జీవిత విశేషాల్లో విశాఖ వాసిగానే పేర్కొంటున్నారు. నిజానికి ప్రొఫెసర్ నీలి గుంటూరులో జన్మించారు. తల్లి దత్తావఝుల పద్మ, తండ్రి రమేష్. ఇద్దరూ ఆంధ్రా యూనివర్సిటీలో పనిచేశారు. ఈ కారణంగా నీలి బీఏ, ఎంబీఏ వరకు చదువు మొత్తం అక్కడే సాగింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. ఉన్నత చదువుల కోసం 1986లో నీలి బెండపూడి అమెరికా వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్‌లో మార్కెటింగ్‌లో పీహెచ్డీ చేశారు. అకడమిక్ అడ్మినిస్ట్రేటర్‌గా నైపుణ్యం సాధించి.. తాను విద్య అభ్యసించిన కాన్సాస్ యూని వర్సిటీలో ప్రొవోస్ట్, ఎగ్జిక్యూటివ్ వైస్ చాన్సలర్, స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్‌తో సహా అనేక అడ్మినిస్ట్రేటివ్ హోదాల్లో సేవలందించారు. ఓహియో స్టేట్ యూనివర్సిటీలో ఇనీషి యేటివ్ ఫర్ మేనేజింగ్ సర్వీసెస్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా పనిచేశారు. అంతకుముందు హంటింగ్టన్ నేషనల్ బ్యాంక్‌కు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ కస్టమర్ ఆఫీ సర్గానూ విధులు నిర్వర్తించారు. అకాడమీ ఆఫ్ మార్కె టింగ్, అత్యుత్తమ మార్కెటింగ్ టీచర్ అవార్డుతో సహా అనేక జాతీయ అవార్డులను అందుకున్నారు. 2018–21లో కెంటకీలోని లూయిస్విల్లే యూనివర్సిటీకి 18వ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. 2022 మే 10న పెన్సిల్వేనియా స్టేట్ వర్సిటీ 19వ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ పదవికి ఎన్నికైన తొలి మహిళగా గుర్తింపు పొందారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రతిష్టాత్మక ‘ఇమ్మిగ్రెంట్ ఎచీవ్మెంట్’ అవార్డు అందుకు న్నారు. ప్రొఫెసర్ నీలి బెండపూడిని భారత్‌లోని ప్రముఖ వర్సిటీల్లో పరిశోధనను మెరుగుపరచి ఉన్నత స్థాయిలో నిలబెట్టేలా 2 దేశాల మధ్య ఆరంభమైన కార్యక్రమానికి అవసరమైన సిఫార్సులను ప్రొఫెసర్ నీలి చేశారు. ఇందుకోసం ఆమె కోచర్‌గా నియమితులయ్యారు. -
విదేశాలకు విద్యార్థినుల క్యూ
‘ఆకాశంలో సగం.. అవకాశాల్లోనూ సగం’ అనే నినాదాన్ని భారతీయ విద్యార్థినులు విదేశీ విద్యను అభ్యసించే విషయంలోనూ చాటుకుంటున్నారు. ఉన్నత విద్య కోసం విదేశాల బాట పడుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రధానంగా 2019 తరువాత ఉన్నత విద్య కోసం దేశంలోని విద్యార్థినులు విదేశాలకు వెళ్లడం దాదాపు 150 శాతం పెరగడం విశేషం. దేశంలోని నగరాల నుంచే కాకుండా.. చిన్న పట్టణాల నుంచి కూడా విద్యార్థినులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళుతుండటం పెరుగుతోందని ప్రపంచ బ్యాంక్ నివేదికను ఉటంకిస్తూ విద్యారంగంలోని ప్రముఖ కన్సల్టెన్సీ ప్రొడిగీ ఫైనాన్స్ నివేదిక వెల్లడించింది. అమెరికా, బ్రిటన్‌లతోపాటు యూరప్‌లోని పలుదేశాల్లో ఉన్నత విద్య పట్ల మన విద్యార్థినులు ఆసక్తి చూపిస్తున్నారు. విదేశీ విద్య కన్సల్టెన్సీలను, విదేశీ విద్య రుణం కోసం బ్యాంకులను సంప్రదిస్తున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. – సాక్షి, అమరావతి విద్యా రుణాల కోసం పోటీ విదేశీ విద్య కోసం బ్యాంకులకు వస్తున్న దరఖాస్తుల్లో కూడా పురుషులతోపాటు మహిళలు సమానంగా ఉంటుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. 2019కి ముందు విదేశీ విద్య కోసం బ్యాంకులకు అందే దరఖాస్తుల్లో విద్యార్థినులు 10శాతం మంది మాత్రమే ఉండేవారు. కాగా.. 2022లో విదేశీ విద్యా రుణాల కోసం బ్యాంకులను ఆశ్రయించే విద్యార్థినుల దరఖాస్తులు ఏకంగా 49 శాతానికి పెరగడం విశేషం. మేనేజ్మెంట్, మెడిసిన్ రంగాల్లో ఉన్నత విద్య కోసం బ్యాంకు రుణాల కోసం భారతీయ విద్యార్థినుల నుంచి 145 శాతం దరఖాస్తులు పెరిగాయని ప్రముఖ కన్సల్టెన్సీ ప్రొడిగీ ఫైనాన్స్ వెల్లడించింది. విదేశీ విద్యలోనూ సగం 2019కు ముందు దేశంలోని మెట్రో నగరాల నుంచి విదేశీ విద్య కోసం వెళ్లే పురుషులు, మహిళల నిష్పత్తి 70:30గా ఉండేది. అంటే విదేశాలకు వెళ్లేవారిలో పురుషులు 70 శాతం, మహిళలు 30 శాతం మంది ఉండేవారు. కానీ.. 2022లో మెట్రో నగరాల నుంచి విదేశాల్లో విద్య కోసం వెళ్లిన పురుషులు, మహిళల నిష్పత్తి 50:50గా ఉండటం విశేషం. అంటే పురుషులు, మహిళలు సమానంగా ఉన్నారు. దేశంలోని చిన్న నగరాల నుంచి 2019కి ముందు విద్య కోసం విదేశాలకు వెళ్లే పురుషులు, మహిళల నిష్పత్తి 80:20గా ఉండేది. కానీ 2022లో దేశంలో చిన్న నగరాల నుంచి విదేశాల్లో విద్య కోసం వెళ్లిన పురుషులు, మహిళల నిష్పత్తి 60:40గా ఉండటం విశేషం. 2019కి ముందు దేశంలోని చిన్న పట్టణాల నుంచి విదేశాల్లో విద్య కోసం వెళ్లే పురుషులు, మహిళల నిష్పత్తి 80:20గా ఉండేది. 2022లో చిన్న పట్టణాల విదేశాల్లో విద్య కోసం వెళ్లిన పురుషులు, మహిళల నిష్పత్తి 55:45గా ఉంది. ప్రపంచ బ్యాంక్ ప్రశంసలు ప్రపంచంలో మిగిలిన దేశాల కంటే భారతీయ విద్యార్థినులు అత్యున్నత విద్యా ప్రమాణాలు సాధిస్తున్నారని ప్రపంచ బ్యాంక్ నివేదిక ఇటీవల ప్రశంసించడం విశేషం. భారత్‌లో సైన్స్–టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమెటిక్స్ సబ్జెక్టుల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారిలో మహిళలు 43 శాతంగా ఉన్నారని పేర్కొంది. విద్య, ఉపాధి రంగాల్లో ఆడ పిల్లలను ప్రోత్సహించే దృక్పథం భారతీయ తల్లిదండ్రుల్లో పెరుగుతుండటమే అందుకు కారణమని చెప్పింది. విద్యార్థినుల కోసం స్కాలర్షిప్లు, ఫెలోషిప్‌లు పెరుగుతుండటం కూడా అందుకు దోహదపడుతోందని చెప్పింది. ఈ సానుకూల దృక్పథం రానున్న కాలంలో మరింతగా పెరుగుతుందని కూడా పేర్కొంది. -
పోదామా అమెరికా.. ఆ పొరపాట్లు చేయొద్దు
అమెరికా.. భారతీయ విద్యార్థుల కల! ఏటా లక్షల మంది యూఎస్ యూనివర్సిటీల్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. కాని ఈ సంవత్సరం కరోనా కారణంగా అమెరికాలో ఉన్నత విద్య స్వప్నం సందిగ్ధంలో పడింది. కొవిడ్ నేపథ్యంలో.. అమెరికాలో ఉన్నత విద్యకు వెళ్లడం సరైందేనా.. అక్కడి వర్సిటీలు ఎలాంటి వెసులుబాట్లు కల్పిస్తున్నాయి. ఇప్పటికే చేరిన విద్యార్థులకు తరగతుల నిర్వహణ ఎలా ఉంది? ఫీజులు ఏమైనా తగ్గిస్తున్నారా.. మన విద్యార్థుల స్పందన ఎలా ఉంది.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు హైదరాబాద్‌లోని యూఎస్–ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ రీజనల్ ఆఫీసర్ మోనికా సెటియాతోపాటు అమెరికాలోని టాప్ యూనివర్సిటీల అధికారులు స్వయంగా సమాధానాలు ఇస్తున్నారు!! ఆంధ్రప్రదేశ్/తెలంగాణ విద్యార్థుల నుంచి అమెరికాలో ఉన్నత విద్య పరంగా ఎలాంటి కోర్సులకు డిమాండ్ ఉంది? ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్(ఐఐఈ) ఓపెన్ డోర్స్ వార్షిక నివేదిక ప్రకారం–2018–2019 విద్యాసంవత్సరంలో స్టెమ్,మ్యాథ్స్/కంప్యూటర్ సైన్స్ కోర్సులకు భారతీయ విద్యార్థుల్లో ఎక్కువ ఆదరణ ఉంది. 2018–2019 విద్యా సంవత్సరంలో అమెరికాలో ఉన్నత విద్యకు వెళ్లిన భారత విద్యార్థుల్లో 37శాతం మంది మ్యాథ్స్ /కంప్యూటర్ సైన్స్, 34.2 శాతం మంది స్టెమ్ కోర్సుల్లో చేరారు. ఆ తర్వాత స్థానంలో బిజినెస్/మేనేజ్మెంట్ 10.3 శాతం,ఫిజికల్/లైఫ్‌సైన్సెస్ 5.6శాతం ఉన్నాయి. రాష్ట్రస్థాయి డేటా అందుబాటులో లేనప్పటికీ.. ఆంధ్రప్రదేశ్, తెలం గాణ, ఒడిషా రాష్ట్రాల విద్యార్థులు ఎక్కువగా కంప్యూ టర్సైన్స్, స్టెమ్ ప్రోగ్రామ్స్‌లో చేరుతున్నట్లు ట్రెండ్‌ను బట్టి అర్థమవుతోంది. 2009–2010లో19.8 శాతం మంది విద్యా ర్థులు మ్యాథ్స్/కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో చేరగా..అది 2018–2019 నాటికి 37శాతానికి పెరిగింది. అదే సమయంలో బిజినెస్/మేనేజ్మెంట్, ఫిజికల్/లైఫ్ సైన్సెస్ పట్ల ఆసక్తి కొద్దిగా తగ్గింది. గత దశాబ్ద కాలంగా సోషల్ సైన్సెస్, హుమానిటీస్, ఆర్ట్స్, ఎడ్యుకేషన్, హెల్త్ కోర్సులకు డిమాండ్ స్థిరంగా ఉంది. అలాగే 2018–2019 విద్యా సంవత్సరంలో ఉన్నత విద్యలో చేరిన భారతీయ విద్యా ర్థుల్లో 3.2శాతం మంది హెల్త్‌కేర్ కోర్సులను ఎంచు కున్నారు. 2010 నుంచి దాదాపు ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. అమెరికాలో ఉన్నత విద్య కోర్సులకు దరఖాస్తు చేసుకునేటప్పుడు విద్యార్థులు ఎలాంటి పొరపాట్లు చేస్తున్నారు? వాటిని ఎలా అధిగమించవచ్చో తెలపండి? దరఖాస్తు సందర్భంగా విద్యార్థులు చాలా పరిమిత సంఖ్యలో యూనివర్సిటీలను ఎంచుకుంటున్నారు. వాస్తవానికి అమెరికా ఉన్నత విద్యావ్యవస్థ 4500 కాలేజీలు /యూనివర్సిటీల్లో కోర్సులను ఎంచుకునే అవకాశం విద్యార్థులకు కల్పిస్తోంది. అలాగే కాలేజీకి, కోర్సుకు అక్రిడి టేషన్ ఉందో లేదో పరిశీలించకుండానే దరఖాస్తు చేసుకో వడం చాలామంది విద్యార్థుల చేస్తున్న మరో పొర పాటు. అదేవిధంగా యూఎస్‌లో ఉన్నత విద్య కోర్సులో ప్రవేశం పొందడంలో విద్యార్థి ఆర్థిక స్థితి కూడా కీలకంగా నిలుస్తుంది. కాబట్టి దరఖాస్తు చేసుకోవడానికి ముందే చదువుకు అయ్యే ఖర్చు, సదరు నిధులు ఎక్కడ నుంచి సమకూరుతాయి అనే విషయంలో స్పష్టత అవసరం. దరఖాస్తు టైమ్‌లైన్, విద్యార్థి వీసా అప్లికేషన్స్, ఇంటర్వ్యూ కూడా అడ్మిషన్ పొందడంలో అత్యంత కీలకమైన అంశాలుగా పేర్కొనవచ్చు. ► విద్యార్థులు అమెరికాలో చదువులకు పయనమవడానికి ముందే అక్కడి భిన్నమైన అకడెమిక్, సోషల్ కల్చర్‌పై అవగాహన పెంచుకోవాలి. లేకుంటే అక్కడ కుదురు కోవడానికి చాలా సమయం పట్టే ఆస్కారం ఉంటుంది. ► అమెరికా యూనివర్సిటీలోకి దరఖాస్తు ప్రక్రియ, ప్రవేశ విధానం తదితర అన్ని అంశాలపై సలహాలు సూచనల కోసం విద్యార్థులు https://educationusa.org/ను సందర్శించి అవసరమైన సమాచారం పొందొచ్చు. ► ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా విద్యార్థులకు ఎలాంటి సందేహం ఉన్నా...usiefhyderabad @usief.org.in కు మెయిల్ చేయొచ్చు. మోనికా సేటియా, రీజనల్ ఆఫీసర్, యునైటెడ్ స్టేట్స్–ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్–హైదరాబాద్ ప్రవేశాలు పెరిగాయి ప్రస్తుత కొవిడ్–19 పరిస్థితుల్లో అమెరికా యూనివర్సిటీల్లో చేరే విషయంలో భారతీయ విద్యార్థుల నుంచి ఎలాంటి స్పందన ఉంది? మేం 2019 ఆగస్టు, నవంబర్ మధ్య భారత్‌లో విస్తృతంగా పర్యటించాం. దేశవ్యాప్తంగా పది పట్టణాల్లో ఎడ్యుకేషన్ ఫెయిర్స్లో పాల్గొన్నాం. ఫలితంగా 2020 ఫాల్లో అండర్గ్రాడ్యయేట్ ఫ్రెష్‌మెన్ ప్రవేశాలు 5.5 శాతం పెరిగాయి. క్యాంపస్‌కు రాలేని 58 మంది విద్యార్థులు ఇంటర్నేషనల్ అడ్వెంచర్ లెర్నింగ్ కమ్యూనిటీ ప్రోగ్రామ్ ద్వారా యూనివర్సిటీలో ప్రవేశం పొందారు. ఈ విద్యార్థులు ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, బిజినెస్, జనరల్ ట్రాక్స్ విధానంలో ఆన్లైన్లో క్లాసులకు హాజరవుతున్నారు. విద్యార్థులు ఐవోవా యూనివర్సిటీలో ఎలాంటి కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు? ద ఐవోవా స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.. స్టెమ్/ఇంజనీరింగ్/సైన్స్ కోర్సుల్లో విద్యార్థులను ఆకర్షించడంలో ముం దుంటోంది. భారతీయ విద్యార్థులు ఎక్కువగా స్టెమ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో చేరుతున్నారు. ఆ తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ బిజినెస్ అనలిటిక్స్, ఇండస్ట్రియల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్, ఎయిరోస్పేస్ ఇంజనీరింగ్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, హుమాన్ కంప్యూటర్ ఇంటరాక్షన్, స్టాటిస్టిక్స్, అండ్ ఆర్కిటెక్చర్ వంటి కోర్సులవైపు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుత కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో తరగతుల నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఐవోవా స్టేట్ యూనివర్సిటీ తెరిచే ఉంది. క్యాంపస్‌లో విద్యార్థులు ఉన్నారు. మేం ముఖాముఖి, ఆన్లైన్, హైబ్రిడ్, అరేంజ్డ్ విధానంలో తరగతుల నిర్వహణ విధానం అమలు చేస్తున్నాం. కొవిడ్ పరిస్థితుల్లో జీఆర్ఈ, ప్రామాణిక ఇంగ్లిష్ టెస్టింగ్ పరీక్షల పరంగా ఏమైనా మినహాయింపు ఉందా? యూనివర్సిటీలోని పలు విభాగాలు జీఆర్ఈ/జీమ్యాట్కు మినహా యింపు ఇస్తున్నాయి. అలాగే డుయోలింగో ఇంగ్లిష్ టెస్ట్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నాం. దీనికి విద్యార్థులు తమ ఇంటి నుంచే హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే మేం టోఫెల్ స్పెషల్ హోం ఎడిషన్‌ను కూడా అంగీకరిస్తున్నాం. ఈ సంవత్సరంతోపాటు వచ్చే స్ప్రింగ్ సెషన్‌కు కోర్సు ఫీజు ఏమైనా తగ్గిస్తున్నారా? స్కాలర్షిప్స్ అందుబాటులో ఉన్నాయా? యూనివర్సిటీలో చేరిన అంతర్జాతీయ విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఫాల్ 2021 ఎంట్రీ నుంచి మా అంతర్జాతీయ స్కాలర్షిప్ ప్రోగ్రామ్‌ను విస్తరించనున్నాం. దీనిద్వారా విద్యార్థులకు మద్దతుగా నిల్వనున్నాం. ప్రస్తుత కొవిడ్–19 పరిస్థితుల్లో విద్యార్థులు చదువుతోపాటు క్యాంపస్‌లో పనిచేసే అవకాశం ఉందా? యూనివర్సిటీ క్యాంపస్‌లో వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి. డైనింగ్ సెంటర్, రెసిడెన్స్ హాల్స్, లైబ్రరీ, బుక్‌స్టోర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, పెయిడ్ అండర్గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఆపర్చునిటీస్, పెయిడ్ స్టూడెంట్ కన్సల్టింగ్ ప్రోగ్రామ్స్, ఇంటర్న్షిప్స్ వంటì వి చేసే అవకాశం ఉంది. కొవిడ్ బారిన పడకుండా యూనివర్సిటీ క్యాంపస్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఐవోవా స్టేట్ యూనివర్సిటీలో కొవిడ్–19 నివారణ చర్యల్లో భాగంగా టెస్టింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్, మాస్క్‌లు ధరించడం వంటివి తప్పనిసరి చేశాం. తరగతిలో విద్యార్థుల సంఖ్యను తగ్గించాం. వివిధ విధానాల్లో బోధన అందిస్తున్నాం. ఐసోలేషన్, క్వారంటైన్ సౌకర్యం, సమావేశాలపై ఆంక్షలు తదితర చర్యలు తీసుకుంటున్నాం. కేథరిన్ జాన్సన్ సుస్కి,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ అండ్ న్యూ స్టూడెంట్ ప్రోగ్రామ్స్–ఆఫీస్ ఆఫ్ అడ్మిషన్స్, ఐవోవా స్టేట్ యూనివర్సిటీ. క్యాంపస్ తెరిచే ఉంది కొవిడ్–19 పరిస్థితుల్లో అమెరికా యూనివర్సిటీల్లో ప్రవేశాల పరంగా భారతీయ విద్యార్థుల స్పందన ఎలా ఉంది? 2020 నవంబర్ నాటికి పెన్సెల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో ఫాల్సె మిస్టర్ (ఆగస్టు 2021)కు దరఖాస్తు చేసుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య 27 శాతం పెరిగింది. ఈ యూనివర్సిటీ ప్రపంచంలోనే టాప్1 శాతం విశ్వవిద్యాల యాల జాబితాలో నిలుస్తుంది. అమెరికాలో ఎక్కువమంది అంతర్జాతీయ విద్యార్థులను కలిగిన యూనివర్సిటీల జాబితాలో 12వ స్థానంలో ఉంది. అలాగే కెరీర్ సర్వీస్‌లో 9వ స్థానంలో నిలిచింది. మా విద్యార్థుల ఆరోగ్య భద్రతకు మేం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. ఫాల్ సీజన్లో యూఎస్‌లోని పలు ఇన్స్టిట్యూ ట్స్‌ను మూసేసినా.. మేం మాత్రం మా విద్యార్థులను క్యాంపస్‌కు స్వాగత పలికాం. విద్యార్థులు ఎక్కువగా కోరుకుంటున్న కోర్సుల(అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యు యేట్) గురించి చెప్పండి? కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో 14 అండర్గ్రాడ్యుయేట్ మేజర్స్, 13 మాస్టర్స్ డిగ్రీలకు బాగా ఆదరణ ఉంది. వీటితోపాటు పెన్సెల్వేనియా యూనివ ర్సిటీ ఎయిరోస్పేస్ ఇంజనీరింగ్, బయలాజికల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్ వంటి పాపులర్ కోర్సులను కూడా అందిస్తోంది. భారతీయ విద్యార్థులు కంప్యూటర్ సైన్స్‌లో చేరడానికి బాగా ఆసక్తి చూపుతున్నారు. అలాగే బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, బిజినెస్ కోర్సులను చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల్లో తరగతుల నిర్వహణకు యూనివర్సిటీ ఎలాంటి ప్రణాళిక రూపొందిస్తోంది. స్టెమ్ కోర్సులకు ప్రాక్టికల్స్ ఎలా నిర్వహిస్తారు? మా యూనివర్సిటీ క్యాంపస్‌లు అన్నీ అంతర్జాతీయ విద్యార్థుల కోసం తెరిచే ఉన్నాయి. ఈ సంవత్సరం యూఎస్‌కు రాగలిగే కొత్త విద్యార్థులు క్యాంపస్‌లో ఉండొచ్చు. కొంతమంది విద్యార్థులకు మహమ్మారి సమయంలో తమ కుటుంబాలకు దగ్గరగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అలాంటి విద్యార్థుల కోసం పెన్సెల్వేనియా యూనివర్సిటీలో పూర్తి స్థాయి టెక్నాలజీతో ఆన్లైన్ క్లాస్ వర్క్ విధానం ఉంది. కొవిడ్ పరిస్థితుల్లో జీఆర్ఈ, ఇంగ్లిష్ టెస్టింగ్ పరీక్షల నుంచి సడలింపు కల్పిస్తున్నారా? 2021 అండర్గ్రాడ్యుయేట్ అడ్మిషన్లకు ఎస్ఏటీ, ఎసీటీ టెస్ట్ ఆప్షనల్. అంటే.. విద్యార్థి ఈ టెస్ట్‌లకు హాజరుకావాల్సిన పనిలేదు. అలాగే 2022, 2023 లోనూ ఇదే విధానం కొనసాగుతుందని భావిస్తున్నాం. ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ టెస్టుకు సంబంధించి టోఫెల్, ఐఈఎల్టీఎస్తోపాటు డుయోలింగో, ద టోఫెల్ ఎట్ హోం ఎడిషన్, ఐఈఎల్టీఎస్ ఇండికేటర్లను పరిగణనలోకి తీసుకుం టున్నాం. కొన్ని ప్రోగ్రామ్‌లకు జీఆర్ఈ, జీమ్యాట్ అవసరం లేదు. ఈ సంవత్సరంతోపాటు వచ్చే స్ప్రింగ్ సెషన్లో ఫీజులు తగ్గించే అవకాశం ఉందా? విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందుబాటులో ఉన్నాయా? ఈ సంవత్సరం మేం ట్యూషన్ ఫీజు పెంచలేదు. వచ్చే ఏడాదికి సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. యూనివర్సిటీ విద్యార్థుల అవసరా లను సదా దృష్టిలో పెట్టుకుంటుంది. మాస్టర్స్, డాక్టోరల్ స్థాయిలో గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అసిస్టెంట్‌షిప్స్, ఫెలోషిప్స్‌ను పెద్ద సంఖ్యలో కొనసాగిస్తున్నాం. మా ఓపీటీ ప్లేస్‌మెంట్స్ ప్రక్రియ అద్భుతంగా ఉంది. అలాగే గ్రాడ్యుయేట్ స్థాయిలో విద్యార్థులకు ఆర్థికంగా మద్దతు అందిస్తున్నాం. ప్రస్తుత కొవిడ్–19 పరిస్థితుల్లో విద్యార్థులు చదువుతోపాటు యూనివర్సిటీ క్యాంపస్‌లో పనిచేసేందుకు అవకాశం ఉందా? చదువుతోపాటు యూనివర్సిటీ క్యాంపస్‌లో గ్రాడ్యుయేట్ అసిస్టెంట్‌గా పని చేసేందుకు అవకాశం ఉంది. అండర్గ్రాడ్యుయేట్ స్థాయిలో ప్రతి అంతర్జాతీయ విద్యార్థి వారానికి 20 గంటలు పనిచేసేందుకు అనుమతి ఉంది. కొవిడ్–19 బారిన పడకుండా క్యాంపస్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? పెన్సెల్వేనియా యూనివర్సిటీలో అద్భుతమైన మెడికల్ స్కూల్, నర్సింగ్, పబ్లిక్ హెల్త్ కాలేజీ ఉన్నాయి. మా ఫ్యాకల్టీలో అంతర్జాతీయ స్థాయి అంటువ్యాధుల నిపుణులు ఉన్నారు. ఆగస్టు 2020 నుంచి క్యాంపస్‌లో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించేలా నిబంధనలు అమలు చేస్తున్నాం. కొవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నాం. అలాగే కాంటాక్ట్ ట్రేసింగ్ విధానం, ఐసోలేషన్, క్వారంటైన్ కోసం అవసరమైన సౌకర్యాలు ఉన్నాయి. ఫలితంగా ఫాల్ సెమిస్టర్ మొత్తం యూనివర్సిటీ తెరిచే ఉంది. స్ప్రింగ్ సెషనల్లో కూడా తెరిచే ఉంచాలని భావిస్తున్నాం. డాక్టర్ రోజర్ బ్రిండ్లీ, వైస్ ప్రోవోస్ట్ ఫర్ గ్లోబల్ ప్రోగ్రామ్స్, ద పెన్సెల్వేనియా స్టేట్ యూనివర్సిటీ. స్టెమ్, ఎంబీఏవైపు మొగ్గు కొవిడ్–19 పరిస్థితుల్లో యూఎస్ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం చూస్తున్న భారతీయ విద్యార్థుల నుంచి స్పందన ఎలా ఉంది? గతంలో భారతదేశంలో ఎడ్యుకేషన్ ఫెయిర్స్ నిర్వహించినప్పటితో పోలిస్తే ప్రస్తుత పరిస్థితులు కొంత మందకొడిగా ఉందనే చెప్పొచ్చు. యూఎస్ విద్యా సంస్థల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య మాత్రం స్థిరంగా ఉంది. హూస్టన్ ప్రాంతంలో ఇండియా నుంచి వచ్చిన హెచ్–1బీ వీసాదారులతోపాటు వారిపై ఆధారపడిన హెచ్4 వీసాదారులు కూడా తమ విద్యార్హతలను పెంచుకునేందుకు కోర్సుల్లో చేరుతున్నారు. యూఎస్‌లో చదువు పూర్తిచేసుకొని భారత్‌కు తెరిగి వెళ్లిన విద్యార్థులు సైతం అమెరికాలో కొత్త కోర్సులు పూర్తిచేసేందుకు తిరిగి దరఖాస్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఎంబీఏ చేసేందుకు వస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ స్థాయిలో ఏ కోర్సుల్లో విద్యార్థులు ఎక్కువగా చేరుతున్నారు? ఎక్కువగా స్టెమ్, ఎంబీఏ ప్రోగ్రామ్స్‌ను ఎంచుకుంటున్నారు. ఇండియా నుంచి వచ్చే విద్యార్థులు ముఖ్యంగా కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ డిజిటల్ గేమింగ్‌లో డిగ్రీ చేసేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. దీంతోపాటు సైకాలజీలో అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ కోర్సులు చేసేందుకు వచ్చే విద్యార్థినుల సంఖ్య కూడా పెరుగుతోంది. కొవిడ్ మహమ్మారి పరిస్థితిలో క్లాస్‌వర్క్ కోసం వర్సిటీ ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తోంది? మహమ్మారి ప్రారంభమైన మార్చిలో మా విశ్వవిద్యాలయాన్ని మూసివేశాం. క్యాంపస్‌లో ఉండి ముఖాముఖి బోధన కావాలనుకునే విద్యార్థులకు అనువుగా ఫాల్ సెషన్లో క్యాంపస్‌ను తెరిచాం. కొత్త అంతర్జాతీయ విద్యార్థులందరూ యూఎస్ వీసాలు పొందగానే క్యాంపస్‌కు వచ్చారు. కోర్సులను ముఖాముఖి, హైబ్రిడ్ అండ్ ఆన్లైన్లో అందించేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. మా వర్సిటీ కొవిడ్–19 టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసింది. కొవిడ్ –19 దృష్ట్యా మీ వర్సిటీ జీఆర్ఈ స్కోరు లేదా ప్రామాణిక ఇంగ్లిష్ టెస్టింగ్ నిబంధనల్లో సడలింపు ఇస్తోందా? ఇంగ్లిష్ స్కిల్స్ కోసం డుయోలింగోను అమలు చేశాం. డుయోలింగో ఒక కొత్త ఇంగ్లిష్ స్కిల్ టెస్ట్, దీనిద్వారా విద్యార్థులు తమ ఇంటి నుంచే పరీక్ష రాసేందుకు వీలుంది. ఇక, విదేశీ విద్యార్థుల కోసం హూస్టన్ యూనివర్సిటీ శాట్/ఆక్ట్ స్కోర్స్‌ను గతంలోనే రద్దు చేసింది. మేము విద్యార్థుల ప్రతిభను వారి జాతీయ పరీక్షల్లోను, లేదా వారి హైస్కూల్, మాధ్యమిక, పోస్ట్–సెకండరీ స్కూలింగ్ తీరును ఆయా సంస్థల నుంచి తెలుసుకుంటాం. ప్రస్తుత కొవిడ్ సంక్షోభ సమయంలో విద్యార్థులు చదువుతోపాటు క్యాంపస్‌లో పనిచేసే అవకాశం ఉందా? మా విద్యార్థులు ఆన్ క్యాంపస్గాను, రిమోట్గాను పనిచేస్తున్నారు. మా గ్రాడ్యుయేట్ కోర్సుల విద్యార్థులు..స్టెమ్‌లోనే కాకుండా.. బిజినెస్ కోర్సుల్లో కూడా గ్రాడ్యుయేట్ అసిస్టెంట్‌షిప్స్ పొందారు. కొవిడ్ నివారణకు వర్సిటీ క్యాంపస్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? క్యాంపస్‌లో సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్(సిడిసి) మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి భవనం ప్రవేశద్వారం వద్ద శానిటైజింగ్ అండ్ టెంపరేచర్ స్టేషన్లు ఉన్నాయి. స్టడీ డెస్క్‌ల చుట్టూ ప్లెక్సీ షీల్డ్స్‌ను ఏర్పాటు చేశాం. భారతీయ విద్యార్థులను ఆకర్షించేందుకు వర్సిటీ ఏమైనా ప్రత్యేక ఆఫర్లు ఇస్తోందా? భారతీయ విద్యార్థులు యూనివర్సిటీ ఆఫ్ హూస్టన్‌ను ఎంచుకోవడానికి కారణం.. ఇక్కడి స్టెమ్(సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్) కోర్సులు. అలాగే మేము విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలను కల్పిస్తున్నాం. లుడ్మి హెరాత్ డైరెక్టర్, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్, సీనియర్ ఇంటర్నేషనల్ ఆఫీసర్(ఎస్ఐఓ),యూనివర్సిటీ ఆఫ్ హుస్టన్. -
హెచ్1బీ వీసాదారులకు శుభవార్త
న్యూయార్క్: హెచ్1 బీ వీసాదారుల పిల్లల కాలేజీ చదువుల ఆర్థిక భారాన్ని తగ్గించే దిశగా అమెరికాలోని న్యూజెర్సీ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువస్తోంది. అమెరికాలో హెచ్1 బీ వీసా కలిగి ఉన్న భారతీయుల సంఖ్య అధికమే. వారికి, ముఖ్యంగా న్యూజెర్సీలో ఉండే భారతీయులకు తమ పిల్లల పై చదువుల భారం ఈ కొత్త చట్టంతో కొంత తగ్గనుంది. ఈ ‘ఎస్2555’పై న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ మంగళవారం సంతకం చేశారు. ఈ చట్టం ప్రకారం తల్లిదండ్రులు, లేదా గార్డియన్లు హెచ్1 బీ వీసాదారులైనట్లయితే.. వారి డిపెండెంట్ పిల్లలకు కాలేజీ లేదా యూనివర్సిటీ కోర్సులో ‘అవుట్‌ఆఫ్ స్టేట్ ట్యూషన్’ ఫీజు ఉండదు. అయితే, ఈ అవకాశం కొన్ని షరతులకు లోబడి లభిస్తుంది. ఈ పిల్లలు న్యూజెర్సీ హైస్కూలు నుంచి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి లేదా న్యూజెర్సీ హైస్కూల్లో కనీసం మూడేళ్లు చదవి ఉండాలి అనేది ఆ షరతుల్లో ఒకటి. న్యూజెర్సీలో ప్రిన్స్టన్ వంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు ఉన్నాయి. న్యూజెర్సీ వాసులకు ఉన్నత విద్యను మరింత చేరువ చేసే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. -
ఆటా ఆధ్వర్యంలో 'యూఎస్ హయ్యర్ ఎడ్యుకేషన్' సెమినార్
హైదరాబాద్ : అమెరికన్ తెలుగు అసొసియేషన్(ఆటా), తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్(టీఎస్సీహెచ్ఈ) ఆధ్వర్యంలో ' యూఎస్ హయ్యర్ ఎడ్యుకేషన్' పై గురువారం సెమినార్ నిర్వహించారు. అమెరికాలో ఉన్నత విద్యను చదవాలనుకుంటున్న విద్యార్థులకు సరైన ప్రణాళిక, అనుసరించాల్సిన వ్యూహం, మార్గదర్శనం చేయడమే ఈ సెమినార్ ముఖ్య ఉద్దేశం.తెలంగాణ ఉన్నత విద్య మండలి చైర్మన్ టి. పాపిరెడ్డి మాట్లాడుతూ.. ఆటా ఆధ్వర్యంలో ఈ సెమినార్‌ను నిర్వహించడం గర్వంగా ఉందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా అమెరికా వెళ్లే తెలంగాణ విద్యార్థులకు సరైన కాలేజీని ఎంపిక చేసుకునే అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. దీని ద్వారా విద్యార్థులకు సమయం ఆదా అవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సెమినార్ నిర్వహించిన ఆటాకు, యూస్ కాన్సులేట్ జనరల్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ బి. వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి వచ్చేవారు 80శాతం మంది గ్రామీణ విద్యార్థులే ఉంటారని, అందులోనూ మద్య,దిగువ తరగతికి చెందినవారే ఉంటారని పేర్కొన్నారు. దీంతోపాటు ప్రాజెక్టు వర్క్‌కోసం వచ్చే విద్యార్థులకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విశేషాలను వివరించేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూఎస్ కాన్సులేట్ కన్సులర్ సెక్షన్ హెడ్ ఎరిక్ అలెగ్జాండర్, స్టేట్ యునివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ రిజిష్ట్రార్ రాజశేఖర్ వంగపతి, ఆటా ప్రెసిడెంట్ పరమేశ్ భీమ్‌రెడ్డి, భువనేశ్ కుమార్, జయదేవ్ చల్లా, కవిత(తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం), జాఫర్ జావేద్, ఫ్రొపెసర్ లింబాద్రి, ఫ్రొపెసర్ వి. వెంకటరమణ(టీఎస్సీహెచ్ఈ వైస్ చైర్మన్), సుల్తాన్ ఉల్ ఉలూం యునివర్సిటికీ చెందిన 50 మంది విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. -
యూస్‌లో హైదరాబాద్‌వాసి దుర్మరణం
హైదరాబాద్: అమెరికాలో ఉన్నతవిద్యను అభ్యసించి కలల కొలువులో చేరేందుకు సిద్ధమవుతున్న ఓ యువకుడిని రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. అమెరికాలోని ఉత్తర కరోలినా రాష్ట్రం కేరీ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన గొంగళ్ల సాహిత్‌రెడ్డి (25) దుర్మరణం పాలయ్యాడు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 4 గంటలకు వాకింగ్ కోసం బయలుదేరిన సాహిత్‌రెడ్డిని వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఢీ కొట్టిన వ్యక్తి తిరిగి రెండు గంటల తరువాత ప్రమాదం జరిగిన ప్రదేశానికి వచ్చి చూడగా అప్పటికే సాహిత్‌రెడ్డి మృతి చెందాడు. దీంతో అతనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయితే ప్రమాద సమయంలో సాహిత్‌రెడ్డి వద్ద ఐడీకార్డులేవీ లేకపొవడంతో స్థానిక పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిగా పేర్కొంటూ పోస్టుమార్టం నిమిత్తం అతని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. రెండు రోజులుగా దోరకని ఆచూకి.. వాకింగ్ కోసం వెళ్లిన సాహిత్‌రెడ్డి శనివారం సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో అతనితో కలసి ఉంటున్న మిత్రులు ఆందోళన చెందారు. దీనికితోడు ప్రతిరోజూ తల్లిదండ్రులతో మాట్లాడే సాహిత్‌రెడ్డి చివరిసారిగా 11వ తేదీన వారితో మాట్లాడటం, 12వ తేదీన కుమారునికి తల్లిదండ్రులు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో వారు స్నేహితులను సంప్రదించారు. అప్పటికే రెండు రోజులుగా అతని ఆచూకీ తెలియలేదని వారు చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. దీనిపై అతని స్నేహితులు పోలీసులను ఆశ్రయించగా మార్చురీలో భద్రపరిచిన మృతదేహాన్ని పోలీసులు చూపడంతో అది సాహిత్రెడ్డిదేనని వారు గుర్తించారు. ఉద్యోగంలో చేరాల్సి ఉండగా... నల్లకుంటలోని పద్మాకాలనీకి చెందిన బీహెచ్ఈఎల్ రిటైర్డ్ ఉద్యోగి మధుసూధన్‌రెడ్డి, లక్ష్మీరెడ్డిల పెద్ద కుమారుడైన సాహిత్‌రెడ్డి నారాయణగూడలోని బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్లో పదవ తరగతి వరకు చదివి ఇంటర్ ఫిడ్జ్‌లో, ఇంజనీరింగ్‌ను సీబీఐటీలో పూర్తి చేశాడు. 2016 అగష్టులో ఎంఎస్ కోర్సు కోసం అమెరికా వెళ్లాడు. కనెక్టికట్ రాష్ట్రంలోని సేక్రెడ్ హార్ట్ యూనివర్సిటీలో కోర్సు పూర్తి చేశాక ఉద్యోగ అన్వేషణలో విజయం సాధించాడు. ఉత్తర కరోలినీలోని కేరీలో ఉన్న హెచ్‌సీఎల్ కంపెనీలో ఉద్యోగం సంపాదించి సోమవారం ఆ ఉద్యోగంలో చేరాల్సి ఉండగా శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో అతను మృతి చెందడం అందరినీ కలచి వేసింది. 18లోగా నగరానికి భౌతికకాయం... సాహిత్‌రెడ్డి భౌతికకాయం నగరానికి శుక్రవారం సాయంత్రం లేదా శనివారం ఉదయం చేరుకోవచ్చునని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ముందుగా సాహిత్‌రెడ్డి డెత్ సర్టిఫికెట్ తీసుకొని న్యూజెర్సీలోని హిందూ ఫ్యూనరల్ హోంలో సమర్పించాల్సి ఉంటుందని డాక్యుమెంటేషన్ పూర్తయ్యాక బాడీ నగరానికి బయలుదేరుతుందని తెలిసింది. మరోవైపు బీజేపీ మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డిని కలిసిన సాహిత్‌రెడ్డి బంధువులు... సాహిత్ భౌతికకాయాన్ని త్వరగా నగరానికి తరలించేలా విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు లేఖ రాయాలని కోరారు. తలసాని పరామర్శ... నగరంలోని పద్మాకాలనీలో ఉంటున్న సాహిత్‌రెడ్డి కుటుంబాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ భౌతికకా యాన్ని త్వరగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వపరం గా అన్ని చర్యలు చేపడతామన్నారు. ఇప్పటికే అమెరికాలోని తెలంగాణ ఎన్నారై కమిటీతో మా ట్లాడామని, అక్కడి భారత రాయబార కార్యాలయంతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. -
‘అంబేడ్కర్ ఓవర్సీస్ విద్య’ అద్భుతం
సాక్షి, హైదరాబాద్: అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి(ఏవోవీఎన్) పథకం అద్భుత ఫలితాలు సాధిస్తోంది. విదేశాల్లో ఉన్నతవిద్య అభ్యసించాలనే ప్రతిభావంతులైన దళిత, గిరిజన యువత కల సాకారం చేసే పథకం ఇది. ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు విదేశాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేస్తే ప్రభుత్వం తరఫున గరిష్టంగా రూ.20 లక్షల ఆర్థికసాయం అందుతుంది. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఉన్నత విద్యావకాశాన్ని సాకారం చేస్తున్న ఏవోవీఎన్ సత్ఫలితాలిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారుల తాజా పరిస్థితిని తెలుసుకునేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ ఇటీవల ఒక పరిశీలన చేసింది. 117 మంది విద్యార్థుల వివరాలు తెలుసుకుని వారి పరిస్థితిని ఆరా తీసింది. ఇందులో మెజార్టీ విద్యార్థులు ఉద్యోగాలు సంపాదించి జీవితంలో స్థిరపడినట్లుగా గుర్తించింది. ఐటీ రంగంలోనే అధికం... ఈ పథకం కింద ఇప్పటివరకు 518 మందిని అధికారులు ఎంపిక చేశారు. వీరిలో 407 మంది ఆయాదేశాల్లోని వర్సిటీల్లో ప్రవేశాలు పొందారు. 2017 వరకు ఎంపికైన విద్యార్థులు కోర్సులు పూర్తిచేయగా మిగతావారు కోర్సు కొనసాగిస్తున్నారు. పరిశీలన చేసిన 117 మందిలో 74 మంది ఇప్పటికే ఉద్యోగాలు పొంది జీవితంలో స్థిరపడ్డారు. ఇందులో అత్యధికులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఉద్యోగాలు సాధించారు. వారిలో దాదాపు 65 శాతం మంది చదువుకున్న చోటే ఉద్యోగాలు పొందారు. మరో 30 మంది అత్యుత్తమ ఉద్యోగాల కోసం ప్రయత్ని స్తున్నట్లు గుర్తించారు. మరో 13 మంది మాత్రం కోర్సు తుదిదశలో ఉన్నట్లు నిర్ధారించారు. ఈ పథకం కింద ఇప్పటివరకు రూ.63.03 కోట్లు ఖర్చు చేయగా 78.57 శాతం సక్సెస్ రేటు సాధించినట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మరో ఆర్నెళ్లలో సక్సెస్‌రేటు 95 శాతం ఉంటుందని ఆ శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఐదేళ్లలో ఏవోవీఎన్ పథకం అమలుతీరు ఏవోవీఎన్‌కు ఎంపికైన విద్యార్థులు : 518 కోర్సుల కోసం విదేశాలకు వెళ్లినవారు : 407 సక్సెస్ రేట్: 78.57 శాతం పథకం కింద ఖర్చు చేసిన మొత్తం: రూ. 63.03 కోట్లు ఏవోవీఎన్ లబ్ధిదారుల పరిశీలన ఇలా... పరిశీలించిన విద్యార్థులు : 117 ఉద్యోగాలు పొందినవారు : 74 ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారు : 30 మాస్టర్స్ కోర్సు కొనసాగిస్తున్నవారు : 13 సంతృప్తికర స్థాయిలో లబ్ధి ఏవోవీఎన్ పథకం కింద లబ్ధిదారుల సంఖ్యను అపరిమితం చేశాం. అర్హులు ఎంతమంది వస్తే అంతమందికీ లబ్ధి కలిగేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడిప్పుడే లబ్ధిదారుల సంఖ్య పెరుగుతోంది. ఈ పథకం నిధులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రతిపాదనలు సమర్పించిన వెంటనే ప్రభుత్వం ఆమోదిస్తుండడంతో విద్యార్థులు సైతం సాఫీగా కోర్సు పూర్తి చేయగలుగుతున్నారు. – పి.కరుణాకర్ ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు -
మే 3 నుంచి ఎంసెట్
సాక్షి, హైదరాబాద్: వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సెట్)లకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (టీఎస్సీహెచ్ఈ) తేదీలను ఖరారు చేసింది. సెట్ల పరీక్షల సమయంతోపాటు వాటిని నిర్వహించే యూనివర్సిటీలను పేర్కొంటూ శనివారం ప్రకటన విడుదల చేసింది. సెట్ల నిర్వహణ యూనివర్సిటీల నుంచి కన్వీనర్ల నియామకం కోసం ముగ్గురు చొప్పున పేర్లు పంపించాలని సోమవారం ఆయా యూనివర్సిటీలకు లేఖలు రాయనుంది. వర్సిటీలు పంపించే మూడేసి పేర్లలో ఒకరి పేరును ఖరారు చేసి సెట్ కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించనుంది. కన్వీనర్ల నియామకం పూర్తయిన వెంటనే సెట్లవారీగా నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. మే 3 నుంచి 9 వరకు వరుసగా ఎంసెట్ పరీక్షలు జరుగుతాయి. తొలుత ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ నిర్వహించిన తర్వాత అగ్రికల్చర్ స్ట్రీమ్ పరీక్షలు జరుగుతాయి. టీఎస్ పీఈసెట్ మినహా మిగతా అన్ని పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగానే జరుగుతాయి. టీఎస్ పీఈసెట్ మాత్రం శారీరక దృఢత్వం, నైపుణ్యాల ఆధారంగా నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. -
బోధన నైపుణ్యాలు, ఆధునిక పరిజ్ఞానాల్లో సహకారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. బోధన నైపుణ్యాల పెంపు, ఆధునిక పరిజ్ఞానంలో పరస్పర సహకారం, విద్యార్థులకు విదేశాల్లో విద్య, ఉపాధి అవకాశాల కల్పనలో తోడ్పాటును అందించేందుకు ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌తో (ఐఏ సీసీ) గురువారం ఉన్నత విద్యా మండలి ఒప్పందం చేసు కుంది. ఈ సందర్భంగా పాపిరెడ్డి మాట్లాడుతూ అమెరికా, తెలంగాణలోని వర్సిటీల మధ్య పరస్పర అవగాహన ఏర్పడుతుందన్నారు. అమెరికా వర్సిటీల్లో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం, మంచి సిలబస్, విద్యార్థులకు ఉపయోగపడే అంశాలు, బోధనా పద్ధతుల్లో అనుసరిస్తున్న విధానం వంటి అనేక అంశాలను విద్యార్థులకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ఆర్.లింబాద్రి, వెంకటరమణ, ఓయూ వీసీ ఎస్.రామచంద్రం, జేఎన్టీయూహెచ్ వీసీ వేణుగోపాలరెడ్డి, వరంగల్ ఎన్ఐటీ డైరెక్టర్ ఎన్వీ రమణారావు మాట్లాడారు. -
‘అమెరికాలో ఉన్నత విద్యపై హైదరాబాద్ విద్యార్థుల్లో పెరుగుతున్న ఆసక్తి’
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆసక్తి హైదరాబాద్ విద్యార్థుల్లో ఏటేటా పెరుగు తోందని హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ మైకేల్ ముల్లిన్స్ పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలోని పలు యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూ ట్లలో 97 వేల మంది భారత విద్యార్థులున్నారని చెప్పారు. అమెరికాలోని విద్యా సంస్థల్లో ఫాల్ సెషన్ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో మైకేల్ ముల్లిన్స్ మాట్లాడారు. ఔత్సాహిక విద్యార్థులకు పలు సూచనలు చేశారు. యునెటైడ్ స్టేట్స్- ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఎడ్యుకేషనల్ అడ్వైజర్ తనుష్క బాలి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్ కార్యాలయ ప్రాంగణంలో యుఎస్‌ఐఈఎఫ్ కేంద్రం నెలకొల్పామని.. విద్యార్థులు సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 12:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల మధ్యలో ఈ సెంటర్‌కు వచ్చి తమ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. ఇందుకోసం విద్యార్థులు ఒక రోజు ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. టోల్ ఫ్రీ నెంబర్ 1800 103 1231 ద్వారా కూడా సంప్రదించవచ్చని చెప్పారు. www.usief.org.in వెబ్సైట్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చన్నారు. సిల్వర్ ఓక్స్ స్కూల్లో డిజైన్ ఫెస్టివల్ సృజనాత్మకత, వైవిధ్యమైన ఆలోచనలే ప్రపంచాన్ని నడిపిస్తాయని అంటున్నారీ చిన్నారులు. నైపుణ్యాలను పెంచుకుంటే ప్రతి వస్తువునూ అందంగా తీర్చిదిద్దవచ్చని నిరూపిస్తు న్నారు. చిట్టిబుర్రలకు పదునుపెట్టేలా నిర్వహించిన ప్రోగ్రామ్‌కు హైదరాబాద్‌లోని సిల్వర్‌ఓక్స్ పాఠశాల వేదికైంది. విద్యార్థుల్లోని నైపుణ్యాలను వెలికితీసేందుకు ‘చిల్డ్రన్ డిజైన్ ఫెస్టివల్’ పేరిట ఓ వినూత్న కార్యక్రమం నిర్వహించారు. దేశవ్యాప్తంగా సుమారు 500 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్కిటెక్చర్, డిజైన్, ఆటోమొబైల్, ఫిల్మ్‌మేకింగ్, గ్రాఫిక్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, ఫొటోగ్రఫీ, శిల్పకళ తదితర అంశాల్లో విద్యార్థుల ప్రతిభా పాటవాలను పెంపొందించుకునేందుకు అనువైన వాతావరణం కల్పించారు.