సాహిత్‌రెడ్డి తండ్రిని ఓదారుస్తున్న తలసాని
హైదరాబాద్: అమెరికాలో ఉన్నతవిద్యను అభ్యసించి కలల కొలువులో చేరేందుకు సిద్ధమవుతున్న ఓ యువకుడిని రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. అమెరికాలోని ఉత్తర కరోలినా రాష్ట్రం కేరీ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన గొంగళ్ల సాహిత్‌రెడ్డి (25) దుర్మరణం పాలయ్యాడు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 4 గంటలకు వాకింగ్ కోసం బయలుదేరిన సాహిత్‌రెడ్డిని వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఢీ కొట్టిన వ్యక్తి తిరిగి రెండు గంటల తరువాత ప్రమాదం జరిగిన ప్రదేశానికి వచ్చి చూడగా అప్పటికే సాహిత్‌రెడ్డి మృతి చెందాడు. దీంతో అతనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయితే ప్రమాద సమయంలో సాహిత్‌రెడ్డి వద్ద ఐడీకార్డులేవీ లేకపొవడంతో స్థానిక పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిగా పేర్కొంటూ పోస్టుమార్టం నిమిత్తం అతని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
రెండు రోజులుగా దోరకని ఆచూకి..
వాకింగ్ కోసం వెళ్లిన సాహిత్‌రెడ్డి శనివారం సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో అతనితో కలసి ఉంటున్న మిత్రులు ఆందోళన చెందారు. దీనికితోడు ప్రతిరోజూ తల్లిదండ్రులతో మాట్లాడే సాహిత్‌రెడ్డి చివరిసారిగా 11వ తేదీన వారితో మాట్లాడటం, 12వ తేదీన కుమారునికి తల్లిదండ్రులు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో వారు స్నేహితులను సంప్రదించారు. అప్పటికే రెండు రోజులుగా అతని ఆచూకీ తెలియలేదని వారు చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. దీనిపై అతని స్నేహితులు పోలీసులను ఆశ్రయించగా మార్చురీలో భద్రపరిచిన మృతదేహాన్ని పోలీసులు చూపడంతో అది సాహిత్‌రెడ్డిదేనని వారు గుర్తించారు.
ఉద్యోగంలో చేరాల్సి ఉండగా...
నల్లకుంటలోని పద్మాకాలనీకి చెందిన బీహెచ్‌ఈఎల్ రిటైర్డ్ ఉద్యోగి మధుసూధన్‌రెడ్డి, లక్ష్మీరెడ్డిల పెద్ద కుమారుడైన సాహిత్‌రెడ్డి నారాయణగూడలోని బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్‌లో పదవ తరగతి వరకు చదివి ఇంటర్ ఫిడ్జ్‌లో, ఇంజనీరింగ్‌ను సీబీఐటీలో పూర్తి చేశాడు. 2016 అగష్టులో ఎంఎస్ కోర్సు కోసం అమెరికా వెళ్లాడు. కనెక్టికట్ రాష్ట్రంలోని సేక్రెడ్ హార్ట్ యూనివర్సిటీలో కోర్సు పూర్తి చేశాక ఉద్యోగ అన్వేషణలో విజయం సాధించాడు. ఉత్తర కరోలినీలోని కేరీలో ఉన్న హెచ్‌సీఎల్ కంపెనీలో ఉద్యోగం సంపాదించి సోమవారం ఆ ఉద్యోగంలో చేరాల్సి ఉండగా శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో అతను మృతి చెందడం అందరినీ కలచి వేసింది.
18లోగా నగరానికి భౌతికకాయం...
సాహిత్‌రెడ్డి భౌతికకాయం నగరానికి శుక్రవారం సాయంత్రం లేదా శనివారం ఉదయం చేరుకోవచ్చునని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ముందుగా సాహిత్‌రెడ్డి డెత్ సర్టిఫికెట్ తీసుకొని న్యూజెర్సీలోని హిందూ ఫ్యూనరల్ హోంలో సమర్పించాల్సి ఉంటుందని డాక్యుమెంటేషన్ పూర్తయ్యాక బాడీ నగరానికి బయలుదేరుతుందని తెలిసింది. మరోవైపు బీజేపీ మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డిని కలిసిన సాహిత్‌రెడ్డి బంధువులు... సాహిత్ భౌతికకాయాన్ని త్వరగా నగరానికి తరలించేలా విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు లేఖ రాయాలని కోరారు.
తలసాని పరామర్శ...
నగరంలోని పద్మాకాలనీలో ఉంటున్న సాహిత్‌రెడ్డి కుటుంబాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ భౌతికకా యాన్ని త్వరగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వపరం గా అన్ని చర్యలు చేపడతామన్నారు. ఇప్పటికే అమెరికాలోని తెలంగాణ ఎన్నారై కమిటీతో మా ట్లాడామని, అక్కడి భారత రాయబార కార్యాలయంతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment