
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. బోధన నైపుణ్యాల పెంపు, ఆధునిక పరిజ్ఞానంలో పరస్పర సహకారం, విద్యార్థులకు విదేశాల్లో విద్య, ఉపాధి అవకాశాల కల్పనలో తోడ్పాటును అందించేందుకు ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌తో (ఐఏ సీసీ) గురువారం ఉన్నత విద్యా మండలి ఒప్పందం చేసు కుంది.
ఈ సందర్భంగా పాపిరెడ్డి మాట్లాడుతూ అమెరికా, తెలంగాణలోని వర్సిటీల మధ్య పరస్పర అవగాహన ఏర్పడుతుందన్నారు. అమెరికా వర్సిటీల్లో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం, మంచి సిలబస్, విద్యార్థులకు ఉపయోగపడే అంశాలు, బోధనా పద్ధతుల్లో అనుసరిస్తున్న విధానం వంటి అనేక అంశాలను విద్యార్థులకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ఆర్.లింబాద్రి, వెంకటరమణ, ఓయూ వీసీ ఎస్.రామచంద్రం, జేఎన్టీయూహెచ్ వీసీ వేణుగోపాలరెడ్డి, వరంగల్ ఎన్‌ఐటీ డైరెక్టర్ ఎన్‌వీ రమణారావు మాట్లాడారు.