ప్రభుత్వ ఇంటర్ విద్యార్థుల్లో ఆందోళన
ముందే ఈఏపీ సెట్ అంటున్న ఉన్నత విద్యా మండలి
ఇప్పటికి 80 శాతం సిలబస్ మాత్రమే పూర్తి
దీంతో పాటు జేఈఈకి శిక్షణపై టెన్షన్
ఆందోళనతో పరీక్షల్లో విఫలమవుతున్న విద్యార్థులు.. విద్యార్థుల్లో ఒత్తిడిని దూరం చేయడంపై ఇంటర్ బోర్డు దృష్టి
సాక్షి, హైదరాబాద్: జేఈఈ పరీక్ష జనవరి 22వ తేదీ నుంచి జరుగుతుందంటూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఈ ఏడాది ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీజీఈఏపీ సెట్) గతానికంటే నెల రోజుల ముందు ఏప్రిల్‌లోనే నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. దీంతో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
కాలేజీల్లో ఇప్పటికీ 80 శాతం సిలబస్ కూడా పూర్తి కాకపోవడంతో, సిలబస్ పూర్తయ్యేదెప్పుడు? జేఈఈ శిక్షణ పొందేదెప్పుడు? అనే టెన్షన్ మొదలైనట్లు ఇంటర్ బోర్డు వర్గాలే వెల్లడిస్తున్నాయి. కొన్ని కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్లను తీసుకోవడం ఆలస్యం కావడం, కొత్త కాలేజీలకు సిబ్బందిని ఇవ్వకపోవడంతో ఇంటర్ సిలబస్ అరకొరగానే పూర్తయింది. దీంతో జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధమవ్వడం ఎలా అనే ఆందోళన విద్యార్థుల్లో కన్పిస్తోంది.
ఇంటర్ బోర్డులోనూ ఆందోళన..: ఇంటర్ బోర్డు తాజాగా సేకరించిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల్లో ఎక్కువ మందిలో టెన్షన్ కన్పిస్తోంది. దీంతో దీన్ని దూరం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు బోర్డు సూచించింది. మరోవైపు విద్యార్థుల్లో ఆందోళనకు సంబంధించి వైద్య, విద్యాశాఖ గత ఏడాది ఇచ్చిన నివేదిక బోర్డు అధికారులకు ఆందోళన కల్గిస్తోంది. పరీక్ష ఫెయిల్ అవుతున్న వారిలో 48 శాతం టెన్షన్ కారణంగానే విఫలమవుతున్నట్టు తేల్చారు.
వీరిలో 36 శాతం తీవ్రమైన టెన్షన్‌కు లోనవుతున్నారు. 23 శాతం విద్యార్థులు పరీక్షల తేదీ ప్రకటించినప్పటి నుంచే టెన్షన్ పడుతూ, పరీక్ష అనుకున్న విధంగా రాయలేకపోతున్నారని తేలింది. మొదటి పరీక్ష ఏమాత్రం కష్టంగా ఉన్నా, ఆ ప్రభావం రెండో పరీక్షపై పడుతోందని అధ్యయనంలో వెల్లడైంది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు కలిపి ఏటా సగటున 4 లక్షల మందికి పైగా ఫస్టియర్ పరీక్షలు రాస్తున్నారు. రెండో ఏడాది పరీక్షలు 3.80 లక్షల మందికి పైగా రాస్తుండగా సగటున 40 శాతం మంది ఫెయిల్ అవుతున్నారు.
మూడంచెల సన్నద్ధత
విద్యార్థుల్లో టెన్షన్‌ను దూరం చేసే కార్యాచరణ చేపట్టడంతో పాటు, జేఈఈ, ఈఏపీ సెట్‌కు సన్నద్ధం చేయడానికి ఇదే మంచి తరుణమని ఇంటర్ బోర్డు అధికారులు అంటున్నారు. ఇందుకు ప్రణాళికబద్ధమైన కార్యాచరణ అవసరమని సూచిస్తున్నారు. మూడంచెల విధానం ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేయాలని భావిస్తున్న అధికారులు, ఒత్తిడికి గురయ్యే విద్యార్థులను గుర్తించి పరీక్షలపై కౌన్సెలింగ్ ఇచ్చేందుకు నిపుణులను రప్పించే యోచనలో ఉన్నారు. దీని తర్వాత 60 రోజుల పాటు ముఖ్యమైన పాఠ్యాంశాలపై అధ్యాపకులు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇక మూడో దశలో పరీక్షలపై భయం పోగొట్టేందుకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు.
కొన్ని జిల్లాలపై ప్రత్యేక ఫోకస్
సిలబస్ పూర్తి కాకపోవడం విద్యార్థుల్లో ఆందోళనకు ప్రధాన కారణమని అధ్యయనాల్లో తేలింది. దీనివల్ల పరీక్షల్లో ఏమొస్తుందో? ఎలా రాయాలో? అన్న ఆందోళన పరీక్షల సమయంలో పెరుగుతోందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఫెయిల్ అవుతున్న 40 శాతం విద్యార్థుల్లో కనీసం 22 శాతం మంది ఈ తరహా ఆందోళన ఎదుర్కొంటున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని కొన్ని జిల్లాలపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని ఇంటర్ బోర్డు అధికారులు నిర్ణయించారు.
ఇంటర్ ఫస్టియర్‌లో 50 శాతం కన్నా తక్కువ ఫలితాలు సాధిస్తున్న జిల్లాల్లో జగిత్యాల, నిర్మల్, యాదాద్రి, జనగాం, కరీంనగర్, సూర్యాపేట, సిద్దిపేట, మేడ్చల్ ఉండగా.. సెకండియర్‌లో మెదక్, నాగర్‌కర్నూల్, వరంగల్, నారాయణపేట, సూర్యాపేట, హైదరాబాద్, పెద్దపల్లి జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం ఆయా జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టనున్నారు.
ప్రైవేటులో ఇప్పటికే రివిజన్ షురూ
రాష్ట్రంలో జూనియర్ కళాశాలల్లో ఏటా ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు రాసే విద్యార్థుల్లో సుమారు మూడు వంతులు ప్రైవేటు కాలేజీల విద్యార్థులే కావడం గమనార్హం. అంటే మొత్తం 7.8 లక్షలకు పైగా విద్యార్థుల్లో సుమారు 6 లక్షల మంది ప్రైవేటు విద్యార్థులే ఉంటున్నారు. కాగా ఈ కాలేజీల్లో ఇప్పటికే ఇంటర్మీడియెట్ సిలబస్ పూర్తయింది. రివిజన్ కూడా చేపట్టారు. దీంతో జేఈఈ ప్రిపరేషన్ దిశగా యాజమాన్యాలు సన్నాహాలు మొదలు పెట్టాయి. బోధనా సిబ్బంది, ప్రత్యేక తరగతుల ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇప్పట్నుంచే తర్ఫీదు ఇవ్వాలి
విద్యార్థులకు ఇప్పట్నుంచే పోటీ పరీక్షల దిశగా శిక్షణ ఇవ్వాలి. చాలా కాలేజీల్లో ప్రత్యేక శిక్షణ మొదలైంది. అయితే కొత్త కాలేజీలకు తగిన సిబ్బందిని కేటాయించడం, గెస్ట్ లెక్చరర్లను తీసుకోవడంలో జరిగిన ఆలస్యంతో ప్రైవేటు కాలేజీలతో సమానంగా ప్రభుత్వ కాలేజీలు పోటీ పడలేని పరిస్థితి నెలకొంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని బోర్డు ప్రత్యేక శిక్షణా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
– మాచర్ల రామకృష్ణ గౌడ్ (ప్రభుత్వ లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
Comments
Please login to add a commentAdd a comment