నిఘా నీడన ప్రయోగ పరీక్షలు నిర్వహించనున్న బోర్డు
ప్రతి పరీక్ష కేంద్రంలోనూ సీసీ కెమెరాల ఏర్పాటు
అధికారులకు బోర్డు కార్యదర్శి ఆదేశం
ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభం కానున్న ప్రాక్టికల్స్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్ పరీక్షలపై ఇంటర్ బోర్డు ప్రత్యేక దృష్టి పెట్టింది. నిఘా నీడలో ప్రయోగ పరీక్షలు జరగాలని బోర్డు కార్యదర్శి అన్ని జిల్లాల ఇంటర్ అధికారులను ఆదేశించారు. దీంతో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు సమీక్ష జరిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వాటిని ఇంటర్ బోర్డ్ ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేయాలని నిర్ణయించారు. ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
ప్రైవేటు కాలేజీల్లో ప్రయోగాలు చేయకున్నా మార్కులు!
ఏటా ప్రాక్టికల్ పరీక్షలపై అనేక ఫిర్యాదులొస్తున్నాయి. ప్రైవేటు కాలేజీల్లో తూతూ మంత్రంగా ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారని, విద్యార్థులు ప్రయోగాలు చేయకపోయినా మార్కులు వేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
పర్యవేక్షణకు ఇన్విజిలేటర్లుగా వెళ్ళే ప్రభుత్వ లెక్చరర్లను కాలేజీలు ముందే ఆకట్టుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ కారణంగా ప్రభుత్వ కాలేజీలకన్నా, ప్రైవేటు కాలేజీ విద్యార్థులకు ఎక్కువ మార్కులు వస్తున్నాయన్న విమర్శలున్నాయి. దీన్ని అడ్డుకునేందుకు కొన్నేళ్ళుగా ఇంటర్ బోర్డ్ ప్రత్యేక చర్యలు చేపట్టింది.
మార్కులపై దృష్టి
రాష్ట్రంలో ఈ ఏడాది 3,80,960 మంది విద్యార్థులు ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాస్తున్నారు. వారిలో ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్స్ పరీక్షలు ఉన్నాయి. అలాగే అన్ని గ్రూపుల విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ ఉన్నాయి. ఇందులో 1,20,515 మంది ఎంపీసీ విద్యార్థులు, 75,040 మంది బైపీసీ విద్యార్థులు ఉన్నారు.
ఎంపీసీ విద్యార్థులకు కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లో ప్రయోగ పరీక్షలు ఉండగా బైపీసీ విద్యార్థులకు ఈ రెండింటితోపాటు బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో ప్రాక్టికల్స్ ఉన్నాయి. రెండేళ్లుగా ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు ప్రయోగ పరీక్షల్లో 75 శాతం మార్కులు వస్తుండగా కార్పొరేట్ కాలేజీల్లో ఏకంగా 90 శాతంపైనే మార్కులు వస్తున్నాయి.
వాస్తవానికి ప్రభుత్వ కాలేజీల్లో ప్రాక్టికల్స్ చేయిస్తుండగా చాలా వరకు ప్రైవేటు కాలేజీల్లో కనీసం లేబొరేటరీలు, రసాయనాలు కూడా ఉండటం లేదని పలువురు లెక్చరర్లు బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాలేజీలపై నిఘా పెట్టాలని నిర్ణయించారు. ఆరోపణలున్న కాలేజీల సీసీ ఫుటేజ్‌ను పరీశీలించే ఆలోచన ఉందని ఓ అధికారి తెలిపారు.
పరీక్షలపై రోజూ నివేదిక
ఇంటర్ పరీక్షల తీరుతెన్నులపై ప్రతిరోజూ నివేదిక ఇవ్వాలని అధికారులను ఇంటర్ బోర్డు ఆదేశించింది. ఏ కాలేజీలో ఎందరు విద్యార్థులు ఏయే ప్రాక్టికల్స్ చేశారనే అంశాలను అందులో పొందుపర్చాలని సూచించింది. గతంలో ఒక కాలేజీకి పంపిన లెక్చరర్‌ను ఈసారి వేరే కాలేజీకి పంపాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment