పబ్‌లపై డేగ కన్ను | Hyderabad Police Focused On New Year Celebrations | Sakshi
Sakshi News home page

పబ్‌లపై డేగ కన్ను

Dec 29 2024 8:16 AM | Updated on Dec 29 2024 8:16 AM

Hyderabad Police Focused On New Year Celebrations

డ్రగ్‌ పెడ్లర్లపై నిఘా పబ్‌ల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి 

బంజారాహిల్స్‌: పబ్‌లు అంటేనే గుర్తుకు వచ్చేది జూబ్లీహిల్స్‌... నగరంలో ఎక్కడా లేనంత హడావుడి, హంగామా జూబ్లీహిల్స్‌ పబ్‌లలోనే కనిపిస్తుంది. చుక్కేసినా... చిందేసినా జూబ్లీహిల్స్‌ పబ్‌లో ఉంటేనే ఆ కిక్కెక్కుతుంది. అందుకే యువత కళ్లన్నీ జూబ్లీహిల్స్‌ పబ్‌లపైనే ఉంటాయి. మామూలు రోజుల్లోనే హంగామా జరిగే ఈ పబ్‌లలో న్యూ ఇయర్‌ విషయం చెప్పనక్కర్లేదు...ఈ నెల 31న రాత్రి న్యూ ఇయర్‌ వేడుకలకు జూబ్లీహిల్స్‌లోని పబ్‌లన్నీ సరికొత్త వేదికలతో సిద్ధమవుతున్నాయి. ప్రత్యేక ఆకర్శన కోసం బాలీవుడ్, టాలీవుడ్‌ తారలను రప్పిస్తున్నారు. అయితే పబ్‌ నిర్వాహకులు న్యూ ఇయర్‌ వేడుకల్లో శ్రుతిమించితే ఊరుకునే ప్రసక్తే లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

ఏ మాత్రం హద్దు మీరినా కేసులు నమోదు చేస్తామన్నారు. ఏం చేయాలి.. ఏం చేయకూడదన్న దానిపై పబ్‌ల నిర్వాహకులకు పోలీసులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఒక పబ్‌లో మద్యం సేవించి ఆ నిషాలో మరో పబ్‌కు వెళ్లి తాగుతామంటే ఇప్పుడు కుదరదు అని చెప్పాలని.. నిషాలో ఉన్న వ్యక్తికి మద్యం సరఫరా చేయకూడదని ఒక వేళ అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పబ్‌ల నిర్వాహకులకు సమావేశాలు నిర్వహించిన పోలీసులు హద్దుమీరి ప్రవర్తిస్తే బాగుండదని హెచ్చరించారు. ప్రతి పబ్‌లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పబ్‌ ముందు, పార్కింగ్‌ ప్లేస్‌లోనూ సీసీ కెమెరాలు ఉండాలని సూచిస్తున్నారు. 

పబ్‌లలో డ్రగ్స్‌ సరఫరా అయ్యే సూచనలు ఉండటంతో గత పది రోజులుగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, స్థానిక పోలీసులు గతంలో డ్రగ్స్‌ సరఫరా చేసిన పెడ్లర్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. వారంతా ఇప్పుడు ఎక్కడున్నారు. ఎక్కడెక్కడ తిరుగుతున్నారు. ఎవరెవరితో మాట్లాడుతున్నారు అన్న అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ నెల 30, 31 తేదీల్లో న్యూ ఇయర్‌ వేడుకలు జరిగే అన్ని పబ్‌లపై పోలీసులు డేగ కన్ను వేయనున్నారు. అనుమానితుల కదలికలపై ఇప్పటికే దృష్టి సారించారు. ప్రతి పబ్‌లోనూ మెటల్‌ డిటెక్టర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గంజాయి సరఫరాదారులపై నిఘా ఉచిన పోలీసులు గతంలో గంజాయి కేసులు నమోదైన వారిపై దృష్టి సారించారు. న్యూ ఇయర్‌ వేడుకలకు సంబంధించి అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత మద్యం సేవించే వారు జాగ్రత్తగా ఇంటికి వెళ్లేలా  నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని లేని పక్షంలో వారినే  బాధ్యులను చేస్తామని హెచ్చరించారు.  

నాలుగు పబ్‌లకు అనుమతి నో...  
జూబ్లీహిల్స్‌లోని హార్ట్‌కప్, అమ్నేషియా, బ్రాడ్‌వే, బేబీలాన్‌ పబ్‌లకు పోలీసులు అనుమతి ఇవ్వడం లే దు. గతంలో ఆయా పబ్‌లలో జరిగిన గొడవలు, పో లీసు కేసుల కారణంగా వాటిపై ఆంక్షలు విధిస్తూ వేదికలకు అనుమతులు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.  

సిద్ధమవుతున్న పబ్‌లు ఇవే...  
జూబ్లీహిల్స్‌లో మొత్తం 36 పబ్‌లు ఉండగా ఇందులో నాలుగింటికి అనుమతులు నిరాకరించారు. కొన్నింట్లో మాత్రం ప్రత్యేక వేడుకలు జరగడం లేదు. అయితే న్యూ ఇయర్‌ వేడుకల కోసం దరఖాస్తు చేసుకున్న వాటిలో లుఫ్ట్, క్లబ్‌ రోగ్, పోష్‌ నాష్, తబలారసా, జోరా, లార్డ్‌ ఆఫ్‌ డ్రింక్స్, ప్రోస్ట్, జిందగీ స్కై బార్, ఫోర్జ్‌ బ్రీవ్, 040 బ్రీవ్, హలో, ఎల్యూజన్, ఎయిర్‌లైవ్, గ్రీజ్‌ మంకీ, పోర్‌ ఫాదర్స్, జైథుమ్, స్టోన్‌ వాటర్, పోయిస్ట్‌ తదితర పబ్‌లు వేడుకలకు అనుమతులు పొందాయి. యువతను ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా జాతీయ, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన డీజేలను రప్పిస్తున్నారు. గోవా నుంచి పేరొందిన డీజేలతో పాటు గాయనీ, గాయకులను పిలిపిస్తున్నారు. కొన్ని పబ్‌లకు బాలీవుడ్‌ తారలు కూడా వస్తుండటం గమనార్హం.

అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి 
బంజారాహిల్స్‌:  నూతన సంవత్సర వేడుకలను నిర్వహించే ఈవెంట్‌ ఆర్గనైజర్లు, పబ్‌లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్ల నిర్వాహకులు భద్రతా ప్రమాణాలు పాటించాలని, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని వెస్ట్‌జోన్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ అన్నారు. ఈ నెల 31న నూతన సంవత్సర వేడుకల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శనివారం పబ్‌లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ పబ్‌లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, స్టార్‌ హోటళ్ల నిర్వాహకులు మెటల్‌ డిటెక్టర్లను ఏర్పాటు చేసుకోవాలని, భద్రతా సిబ్బందిని నియమించుకోవాలన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరిగితే వెంటనే డయల్‌ 100కు ఫోన్‌ చేయాలన్నారు. అన్ని పబ్‌లు, బార్లు మైనర్లను అనుమతించరాదన్నారు. అర్ధరాత్రి ఒంటి గంటలోగా తమ ప్రాంగణాలను ఖాళీ చేయించాలన్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటుచేసుకోవాలన్నారు. విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో వెస్ట్‌జోన్‌ అడిషనల్‌ కమిషనర్‌తో పాటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్‌ఆర్‌నగర్‌ డివిజన్‌ పోలీసులు పాల్గొన్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement