టీజీ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పటిష్ట చర్యలు
నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ వినియోగంపై నిఘా
మాదకద్రవ్యాల విక్రేతలు, సరఫరాదారులపై ఫోకస్
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సర (2025) వేడుకలు మాదకద్రవ్య రహితంగా జరిగేలా చూడటమే లక్ష్యంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీఏఎన్‌బీ) పటిష్ట చర్యలు ప్రారంభించింది. వేడుకల్లో మత్తుపదార్థాల వినియోగాన్ని కట్టడి చేసేందుకు టీజీఏఎన్‌బీ బృందాలు నిఘా పెంచాయి. తనిఖీలు ముమ్మరం చేయడంతోపాటు మత్తు పదార్థాలు విక్రయించే, సరఫరా చేసే వారిపై ఫోకస్ పెంచినట్టు అధికారులు తెలిపారు.
రంగంలోకి 266 పోలీస్ స్నిఫర్ డాగ్స్
స్థానిక పోలీస్, ఎక్సైజ్, టీజీఏఎన్‌బీ అధికారుల సోదాలు ముమ్మరం కావడంతో డ్రగ్స్, గంజాయి ముఠాలు కొత్త ఎత్తులు వేస్తున్నాయి. అధికారులకు పట్టుబడకుండా వాహనాల్లోని రహస్య ప్రదేశాల్లో దాచి డ్రగ్స్, గంజాయి రవాణా చేస్తున్నాయి. ట్రాక్టర్లు, బస్సుల్లో, సీఎన్జీ వాహనాల్లోని సిలిండర్లలో, ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ అనిపించేలా ఉండే డబ్బాలలో..ఇలా రకరకాల పద్ధతులలో పోలీసుల కన్నుగప్పి రవాణా చేస్తున్న మాదక ద్రవ్యాలను పోలీసులు గతంలో స్వా«దీనం చేసుకున్నారు.
నిరుద్యోగులైన యువతుల్ని కూడా డ్రగ్స్ రవాణా కోసం మాఫియా వినియోగిస్తోంది. ఇలాంటి ముఠాలపై పటిష్టమైన నిఘా వేయడంతో పాటు ఇన్‌ఫార్మర్ వ్యవస్థతో మత్తు ముఠాల ఆటకు టీజీఏఎన్‌బీ కృషి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ యూనిట్లలో కలిపి 266 పోలీసు జాగిలాలకు మాదకద్రవ్యాల గుర్తింపు శిక్షణ ఇచి్చంది. వాటి ద్వారా డ్రగ్స్ రవాణాను సమర్థంగా అడ్డుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
ఇటీవల వరంగల్ రైల్వేస్టేషన్లో స్నిఫర్ డాగ్‌తో తనిఖీ చేస్తుండగా..అక్కడికి వంద మీటర్ల దూరంలో ఉన్న ఒక ఇంటి మొదటి అంతస్తులో గంజాయి మొక్కలను కుండీలలో పెంచుతున్న విషయాన్ని ఈ స్నిఫర్ డాగ్ గుర్తించిందని చెప్పారు. టీజీఏఎన్‌బీ తీసుకుంటున్న చర్యలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రశంసించినట్టు తెలిపారు.
ఇటీవల గుర్తించిన మరికొన్ని కేసులు
» గంజాయి చాక్లెట్లతో స్కూలు విద్యార్థులను, దినసరి కూలీలను టార్గెట్ చేస్తున్న ముఠాలను రాజస్తాన్ వరకు వెళ్లి పట్టుకోవడమే కాకుండా తయారు చేస్తున్న ఫ్యాక్టరీని కూడా అక్కడి అధికారుల సహాయంతో టీజీఏఎన్‌బీ మూయించగలిగింది.
» ఇటీవలే 120 కిలోల ఎఫిడ్రెన్ (ఎండీఎంఏ తయారీకి ఉపయోగించే ముడి సరుకు) తయారీ కేంద్రాన్ని గుర్తించడంలో సఫలీకృతమైంది.
» ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి ఈనెల 20 వరకు 641 కిలోల గంజాయి, 15 కిలోల గంజాయి చాక్లెట్స్ , 1600 గ్రాముల హాష్ ఆయిల్, 1383 గ్రాముల ఎండీఎంఏ, కిలో ఓపియం, 115 గ్రాముల చరాస్, 53 కిలోల పాపి స్ట్రా, 44 గ్రాముల హెరాయిన్‌ను సీజ్ చేశారు.
» మొత్తం 148 కేసులను రిజిస్టర్ చేయించడంతో పాటు స్థానిక పోలీసులతో కలిసి 315 మంది నేరస్తులను అరెస్టు చేశారు.
» ఈనెల 1 నుంచి 20 వరకు మొత్తం రూ.4.45 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను సీజ్ చేశారు.
» రూ.200 కోట్ల పైగా విలువ చేసే డ్రగ్స్‌ను పర్యావరణహిత పద్ధతులలో కాల్చివేశారు.
మత్తు కేసుల్లో ఇరుక్కోవద్దు
నూతన ఏడాది వేడుకలను మీ కుటుంబ స భ్యులతో కలిసి సంతోషంగా జరుపుకోండి. అంతే తప్ప మాదకద్రవ్యాల కేసుల్లో ఇరుక్కుని మీరు ఇబ్బందిపడి, మీ కుటుంబ సభ్యులను బాధ పెట్టకండి. మేము ఎక్కడికక్కడ ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాం.
మాదకద్రవ్యాల వినియోగం, సరఫరాకు సంబంధించి ఎటు వంటి సమాచారం ఉన్నా 1908 టోల్ ఫ్రీ నంబర్ లేదా 8712671111 నంబర్‌లో లేదా http://tganb.tspolice.gov.in లో ఫిర్యాదు చేయవచ్చు. – సందీప్ శాండిల్య, డైరెక్టర్, టీజీఏఎన్‌బీ
Comments
Please login to add a commentAdd a comment