inter practicals
-
ఇంటర్లో ఉత్తుత్తి ప్రాక్టికల్స్‌కు చెక్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్ పరీక్షలపై ఇంటర్ బోర్డు ప్రత్యేక దృష్టి పెట్టింది. నిఘా నీడలో ప్రయోగ పరీక్షలు జరగాలని బోర్డు కార్యదర్శి అన్ని జిల్లాల ఇంటర్ అధికారులను ఆదేశించారు. దీంతో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు సమీక్ష జరిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వాటిని ఇంటర్ బోర్డ్ ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేయాలని నిర్ణయించారు. ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రైవేటు కాలేజీల్లో ప్రయోగాలు చేయకున్నా మార్కులు! ఏటా ప్రాక్టికల్ పరీక్షలపై అనేక ఫిర్యాదులొస్తున్నాయి. ప్రైవేటు కాలేజీల్లో తూతూ మంత్రంగా ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారని, విద్యార్థులు ప్రయోగాలు చేయకపోయినా మార్కులు వేస్తున్నారనే ఆరోపణలున్నాయి.పర్యవేక్షణకు ఇన్విజిలేటర్లుగా వెళ్ళే ప్రభుత్వ లెక్చరర్లను కాలేజీలు ముందే ఆకట్టుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ కారణంగా ప్రభుత్వ కాలేజీలకన్నా, ప్రైవేటు కాలేజీ విద్యార్థులకు ఎక్కువ మార్కులు వస్తున్నాయన్న విమర్శలున్నాయి. దీన్ని అడ్డుకునేందుకు కొన్నేళ్ళుగా ఇంటర్ బోర్డ్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. మార్కులపై దృష్టి రాష్ట్రంలో ఈ ఏడాది 3,80,960 మంది విద్యార్థులు ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాస్తున్నారు. వారిలో ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్స్ పరీక్షలు ఉన్నాయి. అలాగే అన్ని గ్రూపుల విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ ఉన్నాయి. ఇందులో 1,20,515 మంది ఎంపీసీ విద్యార్థులు, 75,040 మంది బైపీసీ విద్యార్థులు ఉన్నారు. ఎంపీసీ విద్యార్థులకు కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లో ప్రయోగ పరీక్షలు ఉండగా బైపీసీ విద్యార్థులకు ఈ రెండింటితోపాటు బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో ప్రాక్టికల్స్ ఉన్నాయి. రెండేళ్లుగా ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు ప్రయోగ పరీక్షల్లో 75 శాతం మార్కులు వస్తుండగా కార్పొరేట్ కాలేజీల్లో ఏకంగా 90 శాతంపైనే మార్కులు వస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వ కాలేజీల్లో ప్రాక్టికల్స్ చేయిస్తుండగా చాలా వరకు ప్రైవేటు కాలేజీల్లో కనీసం లేబొరేటరీలు, రసాయనాలు కూడా ఉండటం లేదని పలువురు లెక్చరర్లు బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాలేజీలపై నిఘా పెట్టాలని నిర్ణయించారు. ఆరోపణలున్న కాలేజీల సీసీ ఫుటేజ్‌ను పరీశీలించే ఆలోచన ఉందని ఓ అధికారి తెలిపారు. పరీక్షలపై రోజూ నివేదిక ఇంటర్ పరీక్షల తీరుతెన్నులపై ప్రతిరోజూ నివేదిక ఇవ్వాలని అధికారులను ఇంటర్ బోర్డు ఆదేశించింది. ఏ కాలేజీలో ఎందరు విద్యార్థులు ఏయే ప్రాక్టికల్స్ చేశారనే అంశాలను అందులో పొందుపర్చాలని సూచించింది. గతంలో ఒక కాలేజీకి పంపిన లెక్చరర్‌ను ఈసారి వేరే కాలేజీకి పంపాలని ఆదేశించింది. -
తెలంగాణ ఇంటర్ ప్రాక్టికల్స్ ఎప్పటి నుంచి అంటే..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రేపట్నుంచి ఏప్రిల్ 8 వరకు ఇంటర్ సెకండియర్ ప్రాక్టికల్స్ జరగనున్నాయి. దాదాపు 3 లక్షల మంది సైన్స్ విద్యార్థులు ఈ పరీక్షలకు హాజ రవనున్నారు. ఈ ఏడాది కూడా జంబ్లింగ్ విధానాన్ని ఎత్తేయడంతో విద్యార్థులు వారు చదువుతున్న కాలేజీల్లోనే ప్రయోగ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఎంసెట్ పరీక్షకు ఇంటర్ మార్కుల వెయిటేజ్ ఉండదని అధికారులు ఇప్పటికే తెలిపారు. దీంతో ప్రాక్టికల్స్‌పై పెద్దగా ఆసక్తి కన్పించడం లేదని అధ్యాకులు చెబుతున్నారు. అదీగాక కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రైవేటు కాలేజీల్లో ఇప్పటివరకు లేబొరేటరీల్లో ప్రాక్టికల్స్ ఏవీ జరగలేదని తెలుస్తోంది. కాగా, ప్రాక్టికల్స్‌కు సంబంధించి ఏమైనా సందేహా లుంటే నివృత్తి చేసేందుకు 040–24600110 నంబర్‌తో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. -
చై.. నా... గిమ్మిక్కులు చానా!
ఇంటర్లో ప్రభంజనం.. స్టేట్ టాపర్ మా కళాశాల విద్యార్థే.. అంటూ రిజల్ట్ రోజున చెవులు చిల్లులు పడేలా టీవీల్లో నిమిషానికోసారి ప్రచారం చేసే కార్పొరేట్ కళాశాలల డొల్లతనం తేలిపోయింది. మనీతో మార్కులు సాధించిన తీరు బట్టబయలైంది. ప్రాక్టికల్స్‌లో కార్పొరేట్ కళాశాలలు చేసే గిమ్మిక్కులను టాస్క్‌ఫోర్స్ కమిటీ పట్టేసింది. 30కి 30 మార్కులు సాధించిన విద్యార్థుల పేపర్లను పునర్ మూల్యాకనం చేసి బోగస్ మార్కులకు చెక్‌పెట్టింది. కాసులకు కక్కుర్తి పడిన ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ల లెక్కలు కూడా వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ పరిణామంతో అందరిలో టెన్షన్ మొదలైంది. అనంతపురం విద్య: ఇంటర్ మార్కుల వెయిటేజీతో ర్యాంకులు తారుమారవుతాయి. అందుకే విద్యార్థి గణనీయమైన మార్కులు సాధించేలా కళాశాలలు ప్రణాళిక సిద్ధం చేస్తాయి. ఈ క్రమంలో కొన్ని కళాశాలలు అడ్డదారులు తొక్కుతున్నాయి. ప్రాక్టికల్స్‌లో గంపగుత్తగా మార్కులు కొట్టేసేందుకు మనీతో మాయ చేస్తున్నాయి. ఈ సారి కూడా కార్పొరేట్ కళాశాలలన్నీ ఏకమయ్యాయి. తమ కళాశాలల విద్యార్థులకు మంచి మార్కులు తెప్పించుకునేందుకు డబ్బు కుమ్మరించాయి. ఏకంగా ఎక్స్టర్నల్ అధికారులను కొనేసి మార్కులు వేయించాయి. అయితే ప్రాక్టికల్స్‌పై కన్నేసిన రాష్ట్ర ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ కమిటీని రంగంలోకి దించింది. దీంతో కార్పొరేట్ ఖరత్నాక్ కథలన్నీ ఒక్కొక్కటిగా వెలుగుచూశాయి. కాసులకు ఆశపడిన అధికారులపై వేటు రంగం సిద్ధమవుతోంది. టార్గెట్ 30కి 30 ఇంటర్లో జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బోటనీ సబ్జెక్టుల్లో ప్రతి సబ్జెక్టుకు 30 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇంటర్ స్కోర్ బాగా ఉండాలంటే తప్పకుండా ప్రాక్టికల్స్‌లోనూ మంచి మార్కులు రావాల్సి ఉంటుంది. అందుకే కార్పొరేట్ కళాశాలలు తమ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌లో వీలైనన్ని మార్కులు తెప్పించుకునేందుకు కృషి చేస్తాయి. జిల్లా వ్యాప్తంగా 62 పరీక్ష కేంద్రాల్లో ఫిబ్రవరి 4 నుంచి 19 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించగా... 14వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే ప్రాక్టికల్స్‌పై ఎప్పటినుంచో పథకం రచించిన జిల్లాలోని పలు కార్పొరేట్ కళాశాలలు.. అందులోనూ నారాయణ, చైతన్య జూనియర్ కళాశాలల యాజమాన్యాలు తమదైన శైలిలో చక్రం తిప్పాయి. దీంతో చాలా మందికి 30కి 30 మార్కులు వచ్చాయి. షరా మామూలేనని భావించి... ఇంటర్మీడియెట్ పరీక్షలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ప్రాక్టికల్స్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించింది. సీసీ కెమెరాలతో ప్రాక్టికల్స్ నిర్వహిస్తూ జంబ్లింగ్ విధానాన్ని అనుసరించి పరీక్షలు నిర్వహించాలని నిర్దేశించింది. దీంతో ఇంటర్‌బోర్డు అధికారులు కూడా రోజూ పరీక్ష ముగిసిన వెంటనే వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి ఆర్ఐఓలతో సమీక్ష నిర్వహించారు. అయితే కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలు మాత్రం షరా మామూలేనన్న రీతిలో వ్యవహరించాయి. ఎప్పటిలాగే ఎక్స్టర్నల్ ఎగ్జామినర్లను పెద్దమొత్తంలో నగదు ముట్టజెప్పి ‘మార్కులు’ కొనుగోలు చేసేశారు. టాస్క్‌ఫోర్స్ కమిటీలను నియామకాన్ని గోప్యంగా ఉంచిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రాక్టికల్స్ ముగిసే రోజున రంగంలోకి దింపింది. దీంతో కార్పొరేట్ కళాశాల బాగోతం బట్టబయలైంది. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులపై వివక్ష ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థులపై ఎక్స్టర్నల్ ఎగ్జామినర్లు వివక్ష చూపారు. ప్రతిభ కనబరిచినప్పటికీ మామూళ్లు ఇవ్వలేదనే కారణంతో వారికి ఇవ్వాల్సి మార్కులు కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. కార్పొరేట్ కళాశాల విద్యార్థులకు వచ్చిన మార్కులు, ప్రతిభ ప్రదర్శించినప్పటికీ ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు వచ్చిన మార్కుల్లో భారీ వ్యత్యాసం ఉండడంతో టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులు చర్యలకు ఉపక్రమించారు. అధికంగా వేసిన మార్కుల్లో కోత విధించి.. మార్కులు ఎన్ని రావాల్సి ఉందో.. అన్నే మార్కులు వేశారు. రంగంలోకి టాస్క్ఫోర్క్ ఇంటర్ ప్రాక్టికల్స్ మార్కులను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం.. వెంటనే టాస్క్‌ఫోర్స్ కమిటీని రంగంలోకి దింపింది. 30కి 30 మార్కులు వచ్చిన ప్రతి పేపర్‌ను పరిశీలించి పునర్ మూల్యాంకనం(రీవాల్యుయేషన్ ) చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో 16 మందితో కూడిన నాలుగు బృందాలు రంగంలోకి దిగాయి. జిల్లాలోని నారాయణ, చైతన్యతో పాటు ఇతర కార్పొరేట్ కళాశాలల విద్యార్థుల మార్కులను పరిశీలించాయి. నారాయణ కళాశాలలో చదివిన ఒక విద్యార్థికి కెమిస్ట్రీలో 30 మార్కులు వచ్చాయి. టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులు పునఃపరిశీలన చేస్తే 10 మార్కులు కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు. దీంతో కమిటీ సభ్యులు నివ్వెరపోయారు. ఎక్కువ మార్కులు వేశారు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్లు ప్రాక్టికల్స్‌లో విద్యార్థి చేసిన దానికంటే అదనంగా మార్కులు వేసినట్లు టాస్క్‌ఫోర్స్ కమిటీలు గుర్తించాయి. ఇందుకు కారణాలను ఆరా తీశారు. ముఖ్యంగా 30కి 30 మార్కులు వచ్చిన జవాబుపత్రాలను పునర్మూల్యాంకనం చేశారు.– వెంకటరమణ నాయక్,ఆర్ఐఓ, అనంతపురం -
ఇంటర్ పరీక్షల్లో జంబ్లింగ్ కంటిన్యూ
-
తేడావస్తే ఇంటికే
– ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం – సెంటర్లు తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణలో ఏమాత్రం తేడా వచ్చినా ఇంటికి పంపుతామని జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం హెచ్చరించారు. శుక్రవారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జంబ్లింగ్ విధానంలో నిర్వహించడంతో విద్యార్థులతో పాటు అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది. మొత్తం 66 కేంద్రాలకు గాను మొదటి విడత తొలిరోజున జిల్లా వ్యాప్తంగా 27 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. 1378 మంది విద్యార్థులకు గాను 19 మంది గైర్హాజరయ్యారు. 1359 మంది విద్యార్థులు హాజరయ్యారు. జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం, ఆర్ఐఓ వెంకటేశులు జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్బీఎన్, ఎస్ఎస్ఎస్ జూనియర్ కళాశాల కేంద్రాలను తనిఖీ చేశారు. జేసీ మాట్లాడుతూ అందరూ సమన్వయంతో పని చేసి ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా చూడాలని ఆదేశించారు. హిందూపురం లాంటి ఘటనలు పునరావృతమైతే ఉద్యోగాల నుంచి తొలిగించడంతో పాటు, క్రిమినల్ కేసుల నమోదుకు సిఫార్సు చేస్తామని జేసీ హెచ్చరించారు. తొలివిడత 7 వరకు, రెండో విడత 8 నుంచి 12 వరకు, మూడో విడత 13 నుంచి 17 వరకు, నాల్గో విడత 18 నుంచి 22 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయన్నారు. ఇదిలాఉండగా జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్‌రావు అనంతపురం, ధర్మవరంలో పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. -
నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22 వరకు కొనసాగుతాయి. జంబ్లింగ్ విధానంలో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసింది. మొత్తం 66 కేంద్రాల్లో 16,297 మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకానున్నారు. తొలివిడత ఈ నెల 3 నుంచి 7 వరకు, రెండో విడత 8 నుంచి 12 వరకు, మూడో విడత 13 నుంచి 17 వరకు, నాల్గో విడత 18 నుంచి 22 వరకు జరుగుతాయని ప్రాంతీయ తనిఖీ అధికారి (ఆర్ఐఓ) వెంకటేశులు తెలిపారు. ఏ చిన్న పొరపాటుకు తావు లేకుండా చూడాలని, తేడావస్తే క్రిమినల్ కేసులు నమోదవుతాయని పరీక్షా సిబ్బందిని ఆయన హెచ్చరించారు. తనతో పాటు డీవీఈఓ, డీఈసీ మెంబర్లు, హైçపవర్ కమిటీ సభ్యులు, జిల్లా అధికారులు పరీక్షలను పర్యవేక్షిస్తారన్నారు. -
నిర్లక్ష్యం చేస్తే భారీమూల్యం!
– ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిష్పక్షపాతంగా నిర్వహించండి – ఎగ్జామినర్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు ఆర్ఐఓ, డీవీఈఓ సూచన అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా భారీమూల్యం చెల్లించుకోక తప్పదని ఆర్ఐఓ వెంకటేశులు, డీవీఈఓ చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. ఈ పరీక్షలకు సంబంధించి బుధవారం స్థానిక ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఎగ్జామినర్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్ఐఓ, డీవీఈఓ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 66 కేంద్రాల్లో 16,297 మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరవుతారన్నారు. ఇప్పటికే హాల్‌టికెట్లు, ప్రశ్నపత్రాలు, టైంటేబుల్, ఎన్ఆర్లు, బ్యాచ్‌ల వివరాలు ఆయా కేంద్రాలకు పంపిణీ చేశామన్నారు. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు. నాలుగు విడతలుగా ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయన్నారు. తొలివిడత ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు, రెండో విడత 8 నుంచి 12 వరకు, మూడో విడత 13 నుంచి 17 వరకు, నాల్గో విడత 18 నుంచి 22 వరకు జరుగుతాయన్నారు. జంబ్లింగ్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎగ్జామినర్లు, డీఓలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఏమాత్రం తేడా వచ్చినా క్రిమినల్ కేసుల నమోదు చేయాలని కమిషనర్ ఆదేశించారని గుర్తు చేశారు. కేటాయించిన కేంద్రాలకు ఒకరోజు ముందుగానే వెళ్లాలన్నారు. అక్కడ సరిపడా మెటీరియల్ ఉందో లేదో చూసుకోవాలన్నారు. ఏదైనా సమస్య ఉంటే ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలన్నారు. తీరా పరీక్షల సమయంలో విద్యార్థులు ఇబ్బందులు పడితే మాత్రం చాలా సీరియస్‌గా ఉంటుందన్నారు. విధుల్లో ఉన్నవారు ఐడీ కార్డులు తప్పనిసరిగా ధరించాలన్నారు. పరీక్షల సమయంలో ఏవైనా సమస్యలు ఎదురైతే ఆర్ఐఓ, డీవీఈఓ, డీఈసీ మెంబర్లు, హైçపవర్ కమిటీకి ఫిర్యాదు చేయాలని తెలిపారు. సమావేశంలో జిల్లా పరీక్షల కమిటీ (డీఈసీ) మెంబర్లు టి. రాజారాం, ఎం. వెంకటరమణనాయక్, ఎం. కృష్ణమూర్తి, హైపవర్ కమిటీ మెంబరు కె. శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు సర్వం సిద్ధం!
– జిల్లాలో 66 కేంద్రాలు...16,297 మంది విద్యార్థులు – నాలుగు విడతలుగా నిర్వహణ...ఒక్కో విడత ఐదు రోజులు – ఇప్పటికే మెటీరియల్ పంపిణీ, ఎగ్జామినర్లకు నేరుగా బోర్డు నుంచి ఉత్తర్వులు – 1న ఎగ్జామినర్లకు సమావేశం అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ ›ప్రాక్టికల్ పరీక్షలకు సర్వం సిద్ధం చేశారు. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు నిర్వహించే ఈ పరీక్షలకు జిల్లాలో 16,297 మంది ఫిజిక్స్, జువాలజీ, కెమిస్ట్రీ, బాటనీ విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందుకోసం 66 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 43 ప్రభుత్వ కళాశాలలు, 23 ప్రైవేట్ కళాశాలల కేంద్రాలు ఉన్నాయి. ఇప్పటికే హాల్‌టికెట్లు, ప్రశ్నపత్రాలు, టైంటేబుల్, ఎన్ఆర్లు, బ్యాచ్‌ల వివరాలు ఆయా కేంద్రాలకు పంపిణీ చేశారు. నాలుగు విడతలుగా ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి.తొలివిడత ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు, రెండో విడత 8 నుంచి 12 వరకు, మూడో విడత 13 నుంచి 17 వరకు, నాల్గో విడత 18 నుంచి 22 వరకు జరుగుతాయి. ఎగ్జామినర్లకు పోస్టల్ ద్వారా ఉత్తర్వులు ఆయా కేంద్రాల్లో ఎగ్జామినర్లుగా నేరుగా బోర్డు అధికారులే నియమించారు. కనీసం మూడేళ్లు అనుభవం అర్హతగా పరిగణలోకి తీసుకున్నారు. అన్ని యాజమాన్యాల కింద పని చేస్తున్న కళాశాలల నుంచి అధ్యాపకులను ఎంపికచేశారు. ఎవరిని ఏ సెంటర్‌కు నియమించారనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఉత్తర్వులు రెండు రోజుల కిందటే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు పోస్టల్ ద్వారా పంపారు. ఈ నెల 31 నాటికి దాదాపు అందరికీ ఉత్తర్వులు అందే అవకాశం ఉంది. మూడురోజులకో ఎగ్జామినర్ ఎగ్జామినర్లను మూడు రోజులకోసారి మారుస్తారు. ఒకసారి నియమించిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి నియమించరు. ఈ లెక్కన జిల్లాలో సుమారు 270 మంది దాకా ఎగ్జామినర్లను నియమించనున్నారు. ప్రైవేట్ కళాశాలలు కేంద్రాలుగా ఉన్నవాటికి డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించనున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకులు డీఓలుగా ఉంటారు. డీఓలను కూడా ప్రతి ఐదు రోజులకు ఒకర్ని మారుస్తారు. పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు పరీక్షల నిర్వహణకు ప్రత్యేక బృందాలను నియమించారు. ఆర్ఐఓ వెంకటేశులుతో పాటు జిల్లా పరీక్షల కమిటీ (డీఈసీ) మెంబర్లు టి. రాజారాం, ఎం. వెంకటరమణనాయక్, ఎం. కృష్ణమూర్తి పర్యవేక్షిస్తారు. హైఫవర్ కమిటీ మెంబరుగా కె. శ్రీనివాసులును నియమించారు. ఇద్దరు సభ్యులను ఫ్లయింగ్ స్క్వాడ్‌గా నియమించారు. వీరిలో ఒకరు విద్య, మరొకరు రెవెన్యూ శాఖ నుంచి ఉంటారు. అలాగే ఆర్జేడీ వెంకటరమణ, జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్‌రావు అబ్జర్వర్లుగా ఉంటారు. వీరే కాకుండా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు, డీఆర్వో, ఆర్డీఓలతో పాటు కేంద్రాలున్న ప్రాంతాల తహసీల్దార్లు కూడా పర్యవేక్షిస్తారు. 1న ఎగ్జామినర్లతో సమావేశం పరీక్ష ఎగ్జామినర్లతో ఫిబ్రవరి 1న స్థానిక కొత్తూరు ప్రభుత్వ ఒకేషన్ జూనియర్ కళాశాలలో సమావేశం నిర్వహించనున్నారు. నియామక ఉత్తర్వులు అందిన ప్రతి అధ్యాపకుడూ విధిగా హాజరుకావాలని అధికారులు తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని ఆర్ఐఓ వెంకటేశులు తెలిపారు. పరికరాలు, ఇతర మెటీరియల్ అందుబాటులోని కేంద్రాలకు బడ్జెట్ కూడా కేటాయిస్తున్నామన్నారు. -
ల్యాబ్‌లలో బూజు దులపాల్సిందే..!
* జంబ్లింగ్‌లోనే ఇంటర్ ప్రాక్టికల్స్ * ఇప్పటికే స్పష్టంచేసిన రాష్ట్ర సర్కారు * జిల్లాలో 61 ప్రాక్టికల్స్ కేంద్రాల కేటాయింపు! శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలకు వారం రోజుల ముందుగా ల్యాబ్‌లను తెరచే సంస్కృతికి ఈ ఏడాది చరమగీతం పడనుంది. ప్రాక్టికల్స్ ల్యాబ్‌లలో బూజు దులిపే సమయం ఆసన్నమైంది. ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు జంబ్లింగ్ పద్ధతిలో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపధ్యంలో మూడు రోజుల కిందట అన్ని జిల్లాల ఆర్ఐవోలు, సిబ్బందితో సమీక్షించి జంబ్లింగ్ పద్దతిపై ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఎం.వి.సత్యనారాయణ దిశానిర్దేశం చేశారు. ఈ నేపధ్యంలో మంగళవారం జిల్లాలోన్ని అన్ని యాజమాన్యాల జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో జిల్లా ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు నిర్వహించనున్న కీలక సమావేశంపై ఆసక్తి నెలకొంది. 2017 ఫిబ్రవరి మొదటి వారం నుంచి నెలాఖరు వరకు జరగనున్న ప్రాక్టికల్ పరీక్షలను ఇప్పటి నుంచే విద్యార్థులను సన్నద్ధం చేయాలని, కళాశాలలను తనిఖీలు నిర్వహించాలని ఉన్నతాధికారులు స్పష్టంచేసినట్టు జిల్లా ఇంటర్‌బోర్డు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 17 వేల మంది.. జిల్లాలో 43 ప్రభుత్వ, 11 సాంఘిక, 4 గిరిజన సంక్షేమ, 14 మోడల్, 90కు పైగా ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. ఇందులో ద్వితీయ సంవత్సరం నుంచి సుమారు 17వేల మంది వరకు సైన్స్ విద్యార్థులు పాక్టికల్స్‌కు హాజరుకానున్నారు. 61 కేంద్రాల్లో ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసే దిశగా అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇందులో 37 సర్కారీ కళాశాలలు ఉన్నట్టు తెలిసింది. నేడు ప్రిన్సిపాళ్లతో సమావేశం ఇదిలా ఉండగా జిల్లాలోని అన్ని యాజమాన్యాల జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో మంగళవారం కీలక సమావేశాన్ని నిర్వహించనున్నట్టు జిల్లా ఆర్ఐఓ పాపారావు వెల్లడించారు. శ్రీకాకుళం బాలుర జూనియర్ కళాశాలలో జరగనున్న ఈ సమావేశం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లతో పాటు కంప్యూటర్ ఆపరేటర్ విధిగా హాజరుకావాలని సూచించారు. -
జంబ్లింగ్ విధానంలోనే ఇంటర్ ప్రాక్టికల్స్
ఫిబ్రవరి 4 నుంచి పరీక్షలు ప్రారంభం సాక్షి,హైదరాబాద్: ఏపీలో ఈ ఏడాది ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు జంబ్లింగ్ విధానంలోనే జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియెట్ విద్యా మండలి కార్యదర్శి ఎంవీ సత్యనారాయణ శనివారం ఓ ప్రకటన జారీ చేశారు. ఫిబ్రవరి 4 నుంచి 24వ తేదీ వరకు జంబ్లింగ్ విధానంలో ఈ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. 723 పరీక్ష కేంద్రాలను ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. ఇందులో 378 ప్రభుత్వ కళాశాలలు కాగా 345 ప్రైవేటు, అన్ ఎయిడెడ్ కాలేజీలు. ఈ పరీక్షలకు 2,99,476 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. -
ఫిబ్రవరి 5 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే నెల 3 నుంచి ప్రారంభం కావాల్సిన ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలను స్వల్ప వాయిదా వేయనున్నారు. వీటిని 5వ తేదీ నుంచి నిర్వహించాలన్న నిర్ణయానికి ఇంటర్మీడియెట్ బోర్డు వచ్చింది. జీఎహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఈ మార్పులు చేసేందుకు చర్యలు చేపట్టింది. వచ్చే నెల 2న ఎన్నికలు ఉండటం, ఎన్నికల విధుల్లో పాల్గొనే ఇంటర్మీడియెట్ అధికారులు, సిబ్బంది ఆ రోజు రాత్రి వరకు అక్కడే ఉండాల్సి ఉంటుంది. దీంతో 3న సెలవు ప్రకటించే అవకాశం ఉంది. పైగా ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యే సిబ్బంది రెండు రోజుల ముందుగా రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 3 నుంచి ప్రాక్టికల్స్ నిర్వహణ సాధ్యం కాదని బోర్డు అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి నుంచే కాకుండా నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల నుంచి కూడా ఇంటర్మీడియెట్ విభాగం సిబ్బందికి ఎన్నికల విధులు వేశారు. అయినా 4 వేల మంది సిబ్బంది కొరత ఉన్నందున కరీంనగర్, వరంగల్ నుంచి కూడా ఇంటర్ సిబ్బందిని తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రాక్టికల్ పరీక్షల వాయిదా తప్పడం లేదని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. 1,300 కేంద్రాల్లో పరీక్షలు ఉంటాయి. 2.42 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. మరోవైపు ఈనెల 28న ఎన్విరాన్మెంటల్ సైన్స్, 30న మోరల్ సైన్స్ పరీక్షలు యథావిధిగా జరిగే అవకాశం ఉంది. -
ఇంటర్ ప్రాక్టికల్స్‌కు ప్రత్యేక బస్సులు
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులను నడపాలని ఏజేసీ ఆర్.ఎస్.రాజ్‌కుమార్ ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. బుధవారం నుంచి జరగనున్న పరీక్షల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణపై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా పరీక్షల షెడ్యూల్, ఇతర విషయాలను ఏజేసీ వెల్లడించారు. ఈ నెల 12 నుంచి మార్చి నాలుగో తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ సమయంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్ణీత సమయం కంటే ముందుగా, కేంద్రాలకు చేరేందుకు వీలుగా బస్సులకు నడపాలని ఆర్టీసీ అధికారులను కోరారు. 117 కేంద్రాల్లో జరగనున్న ప్రాక్టీకల్ పరీక్షలకు అనుగుణంగా రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద వైద్యసిబ్బందిని అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు. పరీక్షలు ముగిసిన అనంతరం జవాబు పత్రాలను నిర్దేశిత ప్రాంతాలను స్పీడ్‌పోస్టులో పంపించేందుకు అవసరమైన సహకారాన్ని అందించాలని పోస్టల్ అధికారులను కోరారు. ఫ్లైయింగ్ స్క్వాడ్‌గా ఉపతహశీల్దార్లను నియమించాల్సి ఉన్నప్పటికీ రెవెన్యూ సిబ్బంది సమ్మె లో ఉన్నందున..వారి స్థానంలో ఉప జిల్లా విద్యాశాఖ, రాజీవ్ విద్యామిషన్ అధికారులను నియమిస్తున్నట్టు పేర్కొన్నారు. పరీక్షా సామాగ్రిని భద్రపరిచేందుకు, తరలించేందుకు అవసరమైన రక్షణ కల్పించాలని పోలీసు అధికారులకు సూచించారు. మార్చి 12 నుంచి థియరీ పరీక్షలు మార్చి 12వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం అవుతాయని ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ఎ.అన్నయ్య చెప్పారు. జంబ్లింగ్ పద్ధతిలో పరీక్షలు జరుగుతాయన్నారు. ప్రాక్టికల్ పరీక్షలు 20 రోజులు, థియరీ పరీక్షలు 16 రోజులుంటాయన్నారు. జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు, ప్రధానాచార్యలు జి. అప్పలనాయుడు, డీఈవో ఎస్.అరుణకుమారి, ఆర్టీసీ డిపో మేనేజర్ ఎం. సన్యాసిరావు, డీపీఆర్వో ఎల్.రమేష్ పాల్గొన్నారు. -
ఈసారీ జంబ్లింగ్ లేకుండానే..
తాండూరు టౌన్, న్యూస్‌లైన్: త్వరలో ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ నిర్వహణ నుంచి డిపార్ట్మెంటల్ అధికారులను తొలగించడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఇంటర్ విద్య ప్రాంతీయ పర్యవేక్షకుడు (ఆర్ఐఓ) ప్రతాప్ పేర్కొన్నారు. బుధవారం ఆయన తాండూరులోని జూనియర్ కళాశాలలను తనిఖీచేశారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ ప్రాక్టికల్స్‌కు డిపార్ట్మెంట్ అధికారులను కేటాయించకపోవడంపై నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ప్రాక్టికల్స్ నిర్వహణ నుంచి డిపార్ట్మెంట్ అధికారులను తొలగిస్తారని వస్తున్న వార్తలపై ఆయన పైవిధంగా స్పందించారు. గతేడాది మాదిరిగానే ప్రాక్టికల్స్ జంబ్లింగ్ లేకుండానే జరుగుతాయన్నారు. జిల్లాలో మొత్తం 530 ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉండగా త్వరలో జరుగనున్న పరీక్షలకు 308 కేంద్రాలను కేటాయించామన్నారు. ఇంటర్ ప్రాక్టికల్స్, థియరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. థియరీ పరీక్షలు పూర్తయ్యేనాటికే పేపర్ వాల్యుయేషన్ ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. గతేడాది మాదిరిగానే సమాధానపత్రాలు రాష్ర్టంలోని ఏ జిల్లాకైనా వెళ్లవచ్చన్నారు. ఒకవేళ అప్పటిలోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏ ప్రాంతానికి చెందిన పేపర్లు ఆయా ప్రాంతాల్లోనే వాల్యుయేషన్ చేస్తారన్నారు. అంతకుముందు ఆర్ఐఓ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, సిద్ధార్థ, అంబేద్కర్, సింధు, చైతన్య, విజ్ఞాన్ కళాశాలలను తనిఖీచేశారు. ముఖ్యంగా ప్రాక్టికల్స్ నిర్వహణకు కావాల్సిన ప్రయోగశాలలను పరిశీలించారు. ఆయన వెంట డెక్ సభ్యుడు బాలకృష్ణ ఉన్నారు.