తేడావస్తే ఇంటికే
– ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం
– సెంటర్లు తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం
అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణలో ఏమాత్రం తేడా వచ్చినా ఇంటికి పంపుతామని జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం హెచ్చరించారు. శుక్రవారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జంబ్లింగ్ విధానంలో నిర్వహించడంతో విద్యార్థులతో పాటు అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది. మొత్తం 66 కేంద్రాలకు గాను మొదటి విడత తొలిరోజున జిల్లా వ్యాప్తంగా 27 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. 1378 మంది విద్యార్థులకు గాను 19 మంది గైర్హాజరయ్యారు. 1359 మంది విద్యార్థులు హాజరయ్యారు.
జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం, ఆర్‌ఐఓ వెంకటేశులు జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎస్‌బీఎన్, ఎస్‌ఎస్‌ఎస్ జూనియర్ కళాశాల కేంద్రాలను తనిఖీ చేశారు. జేసీ మాట్లాడుతూ అందరూ సమన్వయంతో పని చేసి ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా చూడాలని ఆదేశించారు. హిందూపురం లాంటి ఘటనలు పునరావృతమైతే ఉద్యోగాల నుంచి తొలిగించడంతో పాటు, క్రిమినల్ కేసుల నమోదుకు సిఫార్సు చేస్తామని జేసీ హెచ్చరించారు. తొలివిడత 7 వరకు, రెండో విడత 8 నుంచి 12 వరకు, మూడో విడత 13 నుంచి 17 వరకు, నాల్గో విడత 18 నుంచి 22 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయన్నారు. ఇదిలాఉండగా జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్‌రావు అనంతపురం, ధర్మవరంలో పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.