jc laxmikantham
-
రూ.50కి కిలో కందిపప్పు
– ఏప్రిల్ నుంచి తొలి విడతగా మున్సిపాలిటీల్లో పంపిణీ – జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం అనంతపురం అర్బన్ : జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోని చౌక ధరల దుకాణాల్లో ఏప్రిల్ నెల నుంచి తెల్లకార్డుదారులకు కిలో కందిపప్పు, శనగ పప్పు, ఉద్దిపప్పు రూ.50 చొప్పున పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తొలి విడతగా మున్సిపాలిటీల్లో అమలు చేస్తున్నామని, తరువాత మండలాల్లో పంపిణీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంపిణీలో డీలర్లు అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా డీలరు కంది పప్పు, శనగ పప్పు, ఉద్ది పప్పు ఇవ్వకున్నా, తక్కువ తూకంతో ఇస్తున్నా తక్షణం జిల్లా సరఫరాల అధికారి 80083 01418 నంబర్‌కి ఫిర్యాదు చేయాలని తెలియజేశారు. -
వంట నూనె విక్రయాలపై కేసులు
అనంతపురం అర్బన్ : నాణ్యత లేని వంట నూనె విక్రయాలపై కేసులు నమోదు చేసినట్లు జేసీ లక్ష్మీకాంతం తెలిపారు. శనివారం ఆయన తన చాంబర్లో నిర్వహించిన ఎన్ఫోర్స్మెంట్ సమావేశంలో మాట్లాడుతూ ఆహార పరిరక్షణ అధికారులు జిల్లావ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి 14 ఆహార నమూనాలను పరీక్ష నిమిత్తం ప్రయోగశాలకు పంపించారన్నారు. గతంలో వచ్చిన నివేదికల మేరకు శబరి పామెలిన్ (అనంతపురం), జీఎన్ఎస్ గోల్డ్ పామోలిన్ (అనంతపురం) నమూనాలపై కేసులు నమోదు చేసి చట్టపరంగా శిక్షలు విధించామన్నారు. మరో మూడు నమూనాలు సురక్షితం కాదని తేలడంతో కదిరి, హిందూపురం కోర్టుల్లో కేసు నమోదు చేశామన్నారు. విచారణ ముగిసన తర్వాత జరిమానా, శిక్ష ఉంటుందన్నారు. ఔషధ నియంత్రణ అధికారులు దాడులు నిర్వహించి 68 తనిఖీలు చేశారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న 18 దుకాణాలపై కేసులు నమోదు చేశారని, 12 దుకాణాల లైసెన్స్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేశారని తెలిపారు. తూనికలు, కొలతల శాఖ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించి 55 కేసులు నమోదు చేశారని, రూ.7.75 లక్షలు అపరాధ రుసుం విధించారని చెప్పారు. -
పాఠశాలల్లోనే కుల ధృవీకరణ పత్రాలు
అనంతపురం అర్బన్ : ఇక నుంచి కుల ధృవీకరణ పత్రాలు పాఠశాలల్లోనే ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జేసీ లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహిస్తూనే, తహశీల్దారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘జిల్లాలో దాదాపు 700 ఉన్నత పాఠశాలల ఉన్నాయి. పదవ తరగతి పూర్తి చేసి వెళ్లే విద్యార్థులు కళాశాలల్లో చేరేందుకు కుల ధృవీకరణ పత్రం అవసరమవుతుంది. కళాశాలల్లో చేరే సమయంలో వారు ఇబ్బంది పడకుండా ఉండేందుకు పాఠశాలలకే మొబైల్ మీ - సేవ పంపిస్తాము. వాటి ద్వారా ధృవీకరణ పత్రాలు అందించేందుకు చర్యలు తీసుకోండి.’ అని ఆదేశించారు. జిల్లాలో తొలిసారిగా పాఠశాలల వద్దకే మొబైల్ మీ - సేవ పంపిస్తున్నామన్నారు. ప్రధానోపాధ్యాయులు కుల ధృవీకరణ పత్రం కావాల్సిన విద్యార్థుల నుంచి దరఖాస్తులను తీసుకుని మీ-సేవ సిబ్బందికి అందజేయాలన్నారు. వారు వాటిని ఆన్లైన్లో ఉంచి, తహశీల్దారు ద్వారా ధృవపత్రాలు సిద్ధం చేయించి ప్రధానోపాధ్యాయులకు అందజేస్తారన్నారు. అనంతరం పశుగ్రాసం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, తదితర అంశాలపై మాట్లాడారు. చెరువుల్లో పశుగ్రాసం పెంపకానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీరు - చెట్టు ద్వారా చెరువుల్లో కంపచెట్లు, పిచ్చి మొక్కల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అక్టోబరు 2వ తేదీ గాంధీ జయంతి రోజున జిల్లాను బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్)జిల్లాగా ప్రకటించాల్సి ఉందన్నారు. స్వచ్ఛభారత్ కింద ఆర్డబ్ల్యూఎస్, ఉపాధి హామీ పథకం కింద డ్వామా, డీఆర్డీఏ శాఖలు అన్ని పంచాయతీల్లో వ్యక్తిగత మరుగుదొడ్లను వంద శాతం నిర్మించాలన్నారు. నిధుల కొరత లేదన్నారు. జిల్లాలో 1,003 పంచాయతీలు ఉంటే ఇప్పటికే 275 పంచాయతీలను ఓడీఎఫ్‌గా మార్చామన్నారు. మిగిలిన పంచాయతీలను ఏడు నెలల వ్యవధిలో మార్చాల్సి ఉందన్నారు. -
తేడావస్తే ఇంటికే
– ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం – సెంటర్లు తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణలో ఏమాత్రం తేడా వచ్చినా ఇంటికి పంపుతామని జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం హెచ్చరించారు. శుక్రవారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జంబ్లింగ్ విధానంలో నిర్వహించడంతో విద్యార్థులతో పాటు అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది. మొత్తం 66 కేంద్రాలకు గాను మొదటి విడత తొలిరోజున జిల్లా వ్యాప్తంగా 27 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. 1378 మంది విద్యార్థులకు గాను 19 మంది గైర్హాజరయ్యారు. 1359 మంది విద్యార్థులు హాజరయ్యారు. జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం, ఆర్ఐఓ వెంకటేశులు జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్బీఎన్, ఎస్ఎస్ఎస్ జూనియర్ కళాశాల కేంద్రాలను తనిఖీ చేశారు. జేసీ మాట్లాడుతూ అందరూ సమన్వయంతో పని చేసి ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా చూడాలని ఆదేశించారు. హిందూపురం లాంటి ఘటనలు పునరావృతమైతే ఉద్యోగాల నుంచి తొలిగించడంతో పాటు, క్రిమినల్ కేసుల నమోదుకు సిఫార్సు చేస్తామని జేసీ హెచ్చరించారు. తొలివిడత 7 వరకు, రెండో విడత 8 నుంచి 12 వరకు, మూడో విడత 13 నుంచి 17 వరకు, నాల్గో విడత 18 నుంచి 22 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయన్నారు. ఇదిలాఉండగా జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్‌రావు అనంతపురం, ధర్మవరంలో పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. -
అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి
అనంతపురం అర్బన్ : జిల్లా అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని అధికారులు, సిబ్బందికి జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం సూచించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. జేసీ–2 సయ్యద్ ఖాజా మొహిద్ధీన్, డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవి పాల్గొన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. ఆ దిశగా అందరూ నడవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ ఆనంద్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు జయరామప్ప, తహశీల్దార్లు వరప్రసాద్, హరికుమార్, సుబ్బయ్య, వెంకటనారాయణ, సర్వే శాఖ ఏడీ మశ్ఛేంద్రనాథ్, తదితరులు పాల్గొన్నారు. -
మొబైల్ య్యాప్ ద్వారా నగదురహిత లావాదేవీలు
హిందూపురం అర్బన్ : స్వైపింగ్ మిషన్ల ఉత్పత్తి కొరత ఉన్నందున మొబైల్లోనే బీమ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని తద్వారా నగదు రహిత లావాదేవీలు కొనసాగించేందుకు కృషి చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం అన్నారు. శుక్రవారం హిందూపురంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిని ఆయన తనిఖీ చేశారు. లేబర్‌వార్డు, చిన్నపిల్లల వార్డుతో పాటు, డయాలసిస్ సెంటర్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆస్పత్రిలో వైద్యసిబ్బంది కొరత ఉన్నందున కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు చేయడానికి కృషి చేస్తామన్నారు. హంద్రీ-నీవా పూర్తయితే నీటికొరత లేకుండా చూస్తామన్నారు. రెడ్‌క్రాస్ సొసైటీ వారితో సంప్రదించి రక్త ప్యాకెట్ల కొరత లేకుండా చూస్తామన్నారు. త్వరలోనే తూమకుంట పారిశ్రామివాడ సందర్శించి ప్రభుత్వానికి నివేదికలు పంపి అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలోని అన్నా క్యాంటీన్లో ఆహార పదార్థాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఆస్పత్రి కమిటీ అధ్యక్షుడు జేఈ వెంకటస్వామి, సూపరింటెండెంట్ డాక్టర్ కేశవులు, ఆర్ఎంఓ రుక్మిణమ్మ పాల్గొన్నారు. -
నెట్ బ్యాంకింగ్‌పై అవగాహన తప్పనిసరి
అనంతపురం న్యూసిటీ : డ్వాక్రా మహిళలు నెట్ బ్యాకింగ్‌పై అవగాహన పెంచుకోవాలని ఇన్చార్జ్ కలెక్టర్ లక్ష్మీకాంతం అన్నారు. ఆదివారం స్థానిక ఉమానగర్‌లోని మొరార్జీదేశాయ్ పాఠశాలలో మెప్మా ఆధ్వర్యంలో నగదు రహిత చెల్లింపులు, బ్యాంకింగ్‌పై జరిగిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అందరికీ బ్యాంకు ఖాతా తప్పనిసరి అని, అలాగే నెట్ బ్యాంకింగ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. రూపే కార్డులను తీసుకుని దాని ద్వారా నగదు రహిత లావాదేవీలు చేసుకోవాలన్నారు. జన్‌ధన్ యోజన కింద అకౌంట్ ఉండే వారు రూ 50 వేలు జమ చేసుకునే సదుపాయం ఉందన్నారు. స్వైపింగ్ మిషన్లు కావాలనుకునే వారికి వారం రోజుల్లో బ్యాంకర్లు అందజేస్తారన్నారు. చౌకధాన్యపు డిపోల్లో సైతం రూపే కార్డులను ఉపయోగించి నితావసర సరుకులు పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ సావిత్రి, టీపీఓ కృష్ణమూర్తి, సిండికేట్ బ్యాంకు మేనేజర్ వంశీకిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
1 నుంచి నగదు రహిత చెల్లింపులు
అనంతపురం టౌన్ : నగదు రహిత చెల్లింపులు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు ఇన్చార్జ్ కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. ఆలోగా ఉపాధి కూలీలు, మహిళా సంఘాల సభ్యులు, రైతులందరికీ బ్యాంక్ ఖాతాలు తెరిపించాలని అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక ట్రైనింగ్ సెంటర్లో డ్వామా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఉపాధి కూలీలందరికీ బ్యాంక్ అకౌంట్లు తప్పనిసరని, ఆధార్‌తో అనుసంధానం చేయాలని సూచించారు. అందరికీ రూపే కార్డులు అందజేయాలన్నారు. అలాగే ఒకటో తేదీలోగా మండలానికి ఒక ఓడీఎఫ్ (బహిరంగ మల విసర్జన రహిత) గ్రామాన్ని ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ నాగభూషణం, ఏపీడీలు, ఏపీఓలు, ఐడబ్ల్యూఎంపీ పీఓలు, జేఈలు పాల్గొన్నారు. -
ఉజ్వల యోజన కింద 10 వేల గ్యాస్ కనెక్షన్లు
అనంతపురం అర్బ¯Œన్ : ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద జిల్లాకు 10 వేల ఉచిత గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయని జాయింట్ కలెక్టర్ బీ లక్ష్మీకాంతం తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు, డీఎస్‌ఓతో ఉజ్వల యోజనపై సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు గ్యాస్ కనెక్ష¯ŒS లేని వారిని గుర్తించి వచ్చే వారానికి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించారు. సబ్సిడీ ద్వారా వీటిని మంజూరు చేస్తారని, ముందుగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. 14 నియోజకవర్గాల పరిధిలో లబ్ధిదారులను తహశీల్దారులు, సీఎస్డీటీలు గుర్తించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆర్డీఓలను ఆదేశించారు. -
జిల్లాకు 6 వేల టన్నుల బియ్యం
- ఆహార భద్రత చట్టం కింద కేంద్రం కేటాయింపు - త్వరలో పంపిణీ – జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం అనంతపురం అర్బన్ : జాతీయ ఆహార భద్రత చట్టం కింద జిల్లాకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 6 వేల టన్నుల బియ్యాన్ని త్వరలోనే పంపిణీ చేస్తామని జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఒక ప్రకటనలో తెలిపారు. తెల్ల కార్డులు కలిగిన వారు కాకుండా మిగిలినవారు తమ ఆధార్ కార్డు ద్వారా చౌక దుకాణాల నుంచి బియ్యం పొందవచ్చునన్నారు. కిలో రూ.23.50 పైసలుగా ఒక్కొక్క కుటుంబానికి ఐదు కిలోలు ఇస్తారని తెలిపారు. ఈ బియ్యం అమ్మకం కూడా ఈ–పాస్ ద్వారానే జరుగుతుందని తెలిపారు. పంపిణీకి సంబంధించి తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు. -
మార్కెట్ విలువ ప్రకారం పరిహారమివ్వండి
అనంతపురం అర్బన్ : విడపనకల్లు మండలం డొనేకల్ గ్రామంలో గుత్తి–బెంగుళూరు జాతీయ రహదారి ఆనుకుని రైతుల భూములు ఉన్నాయని, వాటికి మార్కెట్ విలువ ప్రకారం పరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ను ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరెడ్డి కోరారు. జాయింట్ కలెక్టర్‌ను శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కలిసి పరిహారం అంశంపై మాట్లాడారు. ఇళ్ల స్థలాల కోసం రైతుల భూముల విలువ బేసిక్ విలువ ఎకరాకు రూ.3.50 లక్షలుగా ధర ను నిర్ధారణ చేశారని తెలిపారు. వాస్తవంగా ఇక్కడ మార్కెట్ విలువ ప్రకారం రూ.15 లక్షలు ఉందన్నారు. ప్రభుత్వం ఇక్కడి భూముల ధరలను తారతమ్యంగా నిర్ణయించిందని, దీని వల్ల రైతులు చాలా నష్టపోతారని చెప్పారు. ఎమ్మెల్యేతో పాటు జేసీని కలిసిన వారిలో గడేకల్ సర్పంచ్ పంపావతి, ఎంపీటీసీలు ప్రసాద్, ఓబిలేసు, వైఎస్సార్సీపీ నాయకులు డొనేకల్ హనుమంతు, రమేశ్, సురేష్, శివ, నారాయణస్వామి, లాయర్ గోపాల్, లేపాక్షి ఉన్నారు. -
రూ.120కే కిలో కందిపప్పు
ఆగస్టు నుంచి చౌక దుకాణాల్లో విక్రయం అనంతపురం అర్బన్: ఆగస్టు నుంచి చౌక దుకాణాల్లో కందిపప్పు కిలో రూ.120కి అందించేందుకు చర్యలు చేపట్టామని జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం తెలిపారు. ఇందుకు సంబంధించి వివరాలను ఆయన వెల్లడించారు. తొలి దశలో అనంతపురం, తాడిపత్రి, హిందూపురం, గుంతకల్, రాయదుర్గం, కళ్యాణదుర్గ, గుత్తి, కదిరి మునిసిపాలిటీల్లోని చౌక దుకాణాల్లో కార్డుదారులకు ఒక కిలో కందిపప్పును రూ.120కి ఇస్తారన్నారు. ఇందుకు సంబంధించి 175 టన్నులు కందిపప్పు స్టాక్ తెప్పిస్తున్నామన్నారు. కిలో రూ.119.45 పైసలు చొప్పున అవసరమైన మొత్తానికి డీలర్లతో డీడీలు తీయించాలని తహసీల్దార్లను ఆదేశించామన్నారు. ఈ ఎనిమిది మునిసిపాలిటీల్లో విక్రయాలను పరిశీలించిన తరువాత పుట్టపర్తి, పామిడి మునిసిపాలిటీల్లో అమలు చేస్తామన్నారు.