అనంతపురం అర్బన్ : ఇక నుంచి కుల ధృవీకరణ పత్రాలు పాఠశాలల్లోనే ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జేసీ లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహిస్తూనే, తహశీల్దారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘జిల్లాలో దాదాపు 700 ఉన్నత పాఠశాలల ఉన్నాయి. పదవ తరగతి పూర్తి చేసి వెళ్లే విద్యార్థులు కళాశాలల్లో చేరేందుకు కుల ధృవీకరణ పత్రం అవసరమవుతుంది. కళాశాలల్లో చేరే సమయంలో వారు ఇబ్బంది పడకుండా ఉండేందుకు పాఠశాలలకే మొబైల్ మీ - సేవ పంపిస్తాము. వాటి ద్వారా ధృవీకరణ పత్రాలు అందించేందుకు చర్యలు తీసుకోండి.’ అని ఆదేశించారు. జిల్లాలో తొలిసారిగా పాఠశాలల వద్దకే మొబైల్ మీ - సేవ పంపిస్తున్నామన్నారు.
ప్రధానోపాధ్యాయులు కుల ధృవీకరణ పత్రం కావాల్సిన విద్యార్థుల నుంచి దరఖాస్తులను తీసుకుని మీ-సేవ సిబ్బందికి అందజేయాలన్నారు. వారు వాటిని ఆన్‌లైన్‌లో ఉంచి, తహశీల్దారు ద్వారా ధృవపత్రాలు సిద్ధం చేయించి ప్రధానోపాధ్యాయులకు అందజేస్తారన్నారు. అనంతరం పశుగ్రాసం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, తదితర అంశాలపై మాట్లాడారు. చెరువుల్లో పశుగ్రాసం పెంపకానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీరు - చెట్టు ద్వారా చెరువుల్లో కంపచెట్లు, పిచ్చి మొక్కల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అక్టోబరు 2వ తేదీ గాంధీ జయంతి రోజున జిల్లాను బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్)జిల్లాగా ప్రకటించాల్సి ఉందన్నారు. స్వచ్ఛభారత్ కింద ఆర్‌డబ్ల్యూఎస్, ఉపాధి హామీ పథకం కింద డ్వామా, డీఆర్‌డీఏ శాఖలు అన్ని పంచాయతీల్లో వ్యక్తిగత మరుగుదొడ్లను వంద శాతం నిర్మించాలన్నారు. నిధుల కొరత లేదన్నారు. జిల్లాలో 1,003 పంచాయతీలు ఉంటే ఇప్పటికే 275 పంచాయతీలను ఓడీఎఫ్‌గా మార్చామన్నారు. మిగిలిన పంచాయతీలను ఏడు నెలల వ్యవధిలో మార్చాల్సి ఉందన్నారు.
పాఠశాలల్లోనే కుల ధృవీకరణ పత్రాలు
Published Fri, Feb 3 2017 11:43 PM | Last Updated on Tue, Sep 5 2017 2:49 AM
Advertisement