caste certificates
-
21 లక్షల మందికి.. ఒక్కరోజులోనే 'కుల ధ్రువీకరణ పత్రాలు'
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంస్కరణలు ప్రజలకు ఎంతో మేలుచేస్తున్నాయి. ముఖ్యంగా కుల వీకరణ పత్రాల జారీలో సర్కారు తీసుకొచ్చిన కొత్త విధానం వారి కష్టాలు తీరుస్తోంది. ఎందుకంటే.. ఈ పత్రాల జారీని ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. గతంలో ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే గరిష్టంగా 30 రోజుల్లోగానీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ అయ్యేవి కావు. ఆ తర్వాత ఏదేని కారణంతో మళ్లీ అవసరమైనా మరోసారి 30రోజులు నిరీక్షించాల్సిందే. ఈ ఇబ్బందుల్ని పసిగట్టిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అలాంటి వారికి సాంత్వన చేకూర్చే నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం.. కుల ధృవీకరణ పత్రం పొందిన వారికి, మళ్లీ దాని అవసరం ఎప్పుడైనా ఏర్పడితే కొత్తగా తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరంలేకుండా అంతకుముందు తీసుకున్న వివరాల ప్రకారం అడిగిన రోజునే గ్రామ, వార్డు సచివాలయాల్లో మరోసారి ఆ పత్రాలిచ్చే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2022 ఆగస్టు నుంచి అమలుచేస్తోంది. దీని ద్వారా గత ఏడాది కాలంలో రాష్ట్రంలో 21,00,888 మంది దరఖాస్తు చేసుకున్న రోజునే కుల ధ్రువీకరణ పత్రాలను అందుకున్నారు. గతంలో ఒకసారి తీసుకున్న వారికి.. సాధరణంగా.. విద్యార్థుల స్కూళ్లలో లేదంటే కాలేజీల్లో చేరే సమయంలోనూ.. వివిధ ఉద్యోగ నోటిఫికేషన్ల సమయంలో నిరుద్యోగ యువతకు.. వివిధ సంక్షేమ పథకాల అమలులో లబ్ధిదారులకు కుల ధ్రువీకరణ పత్రాల అవసరం ఎక్కువగా ఉంటుంది. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో అమలులో ఉన్న నిబంధన ప్రకారం ఈ కుల ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్న రోజు నుంచి గరిష్టంగా 30 రోజుల్లో సంబంధిత మండల తహసీల్దార్ దానిని జారీచేయాల్సి ఉంటుంది. అయితే, చాలామంది గతంలో ఒకసారి తీసుకున్నా.. సరిగ్గా కాలేజీల ప్రవేశాలు, ఉద్యోగ నోటిఫికేషన్ల సమయంలో వివిధ కారణాలతో మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకుంటుంటారు. ఇలాంటి వారికి సైతం ఏడాది క్రితం వరకు గరిష్టంగా 30 రోజులకు గానీ అవి జారీ అయ్యేవి కావు. ఫలితంగా సకాలంలో అవి అందక అక్కడక్కడ కొందరు తమ అవకాశాలను కోల్పోయేవారు. అయితే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2022 ఆగస్టులో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అలాంటి వారికి అప్పటికప్పుడే సర్టిఫికెట్ల జారీచేయాలని సంకల్పించింది. విద్యార్థులు, నిరుద్యోగ యువత, వివిధ పథకాల లబ్ధిదారులు కీలక సమయాల్లో రెండోసారి అవసరమైతే దరఖాస్తు చేసుకున్న రోజునే ఆ పత్రాలు అందించేలా వీలు కల్పించింది. భవిష్యత్తులోనూ కోటి మందికి అడిగిన రోజునే.. మీ–సేవా కేంద్రాల ద్వారా 2011 నుంచి ఇప్పటివరకు దాదాపు నాలుగున్నర కోట్ల కుల ధృవీకరణ పత్రాలు జారీ అయ్యాయి. అందులో కొందరు నాలుగైదుసార్లు కూడా వాటిని పొంది ఉండొచ్చని.. అయితే, వాటిని ఆధార్ వివరాలతో సరిపోల్చినప్పుడు దాదాపు 75 లక్షల మంది ఆ సర్టిఫికెట్లు తీసుకున్నట్లుగా తాము గుర్తించామని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పాటుచేసిన గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అంటే.. 2020 జనవరి 26 నుంచి ఇంకో కోటిన్నర మందికి ఈ పత్రాలు జారీ అయినట్లు వారు తెలిపారు. ఈ పత్రాలను కూడా ఆధార్ వివరాలతో సరిపోల్చినప్పుడు 75 లక్షల మంది వివరాలను గుర్తించామన్నారు. ఇలా మీ–సేవ కేంద్రాల ద్వారా జారీ అయిన కుల ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన 75 లక్షల మంది.. గ్రామ సచివాలయాల ద్వారా వాటిని పొందిన 75 లక్షల మంది కలిపి కోటిన్నర దాకా ఉన్నా, కొంతమంది రెండుచోట్ల తీసుకుని ఉండొచ్చన్న భావనతో కనీసం కోటి మంది కుల ధృవీకరణ పత్రాలు తీసుకున్న వారి సమాచారం గ్రామ, వార్డు సచివాలయాల అన్లైన్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీరందరికీ భవిష్యత్‌లో వీటి అవసరం ఎప్పుడు ఏర్పడినా, గతంలో మాదిరిగా 30రోజులు వేచి ఉండే పరిస్థితి లేకుండా దరఖాస్తు చేసుకున్న రోజే వారికి గ్రామ, వార్డు సచివాలయాల్లో కుల ధృవీకరణ పత్రం జారీచేసే అవకాశం ఉంటుందన్నారు. -
కుల ధ్రువీకరణ పత్రం ఇక శాశ్వతం
సాక్షి, అమరావతి: ప్రజలు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తీసుకునే విషయంలో ప్రభుత్వం వారికి మరింత వెసులుబాటు కల్పించింది. ఒకసారి కుల ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తే దాన్ని శాశ్వతంగా పరిగణించాలని అన్ని ప్రభుత్వ శాఖలకు స్పష్టం చేసింది. అలాగే ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం ప్రభుత్వ శాఖలు, విద్యా సంస్థలు.. విద్యార్థులు, లబ్ధిదారులను ఒత్తిడి చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఆదాయ ధ్రువీకరణకు గ్రామ సచివాలయాల్లోనే ఆరు దశల తనిఖీ సరిపోతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ సర్టిఫికెట్ల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. డిజీ లాకర్లలో సర్టిఫికెట్లు కులం, స్థానికత, పుట్టిన తేదీ సర్టిఫికెట్ల నిబంధనలకు సంబంధించి జీవో ఎంఎస్ నంబర్ 469, ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి జీవో ఎంఎస్ నంబర్ 484ను తాజాగా విడుదల చేసింది. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీకి పలు మార్గదర్శకాలు ఇచ్చింది. వాటికి సంబంధించి అన్ని శాఖలకు త్వరలో శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ఏటా కుల, ఆదాయ ధ్రువీకరణకు సంబంధించి 1.20 కోట్ల సర్టిఫికెట్లను రెవెన్యూ శాఖ జారీ చేస్తోంది. కొత్త నిబంధనలతో 95 శాతం సర్టిఫికెట్ల జారీ తగ్గిపోనుంది. ప్రభుత్వ శాఖలు మళ్లీ మళ్లీ అడగకూడదు.. సంక్షేమ పథకాల కోసం వచ్చే లబ్ధిదారులను ఆయా ప్రభుత్వ శాఖలు తాజా కుల ధ్రువీకరణ పత్రాలు అడుగుతున్నాయి. దీనివల్ల ప్రజలు వాటికోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సివస్తోంది. గతేడాది 52 లక్షల కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. అలాగే ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో 42 లక్షలకుపైగా పత్రాలు అందజేశారు. వాటికి సంబంధించిన డేటా బేస్ మొత్తం మీసేవ, ఏపీ సేవ కేంద్రాల్లో ఉంది. వాటిద్వారా ఈ సర్టిఫికెట్లను ఎలాంటి విచారణ లేకుండా మళ్లీ జారీ చేసేలా కొత్త నిబంధనలు రూపొందించారు. వీటి ప్రకారం.. ఒకసారి జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం ఎప్పుడైనా చెల్లుబాటవుతుంది. లబ్ధిదారుడు గతంలో జారీ చేసిన సర్టిఫికెట్ సమర్పించినప్పుడు ప్రభుత్వ శాఖలు మళ్లీ తాజా సర్టిఫికెట్‌ను అడగకూడదు. అలాగే మీసేవ ద్వారా గతంలో కుల ధ్రువీకరణ పత్రం పొందిన వారికి ఎ–కేటగిరీ సేవగా తక్షణమే తాజా ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాలి. వారి కుల నిర్ధారణ కోసం తహశీల్దార్, ఇతర అధికారులు దానిపై మళ్లీ విచారణ చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ లబ్ధిదారుడి తండ్రి, సోదరులు ఎవరైనా గతంలో కుల ధ్రువీకరణ పత్రం పొంది ఉంటే వారి బంధుత్వాన్ని పౌరసరఫరాల శాఖ డేటాబేస్ ద్వారా నిర్ధారించుకుని ఈకేవైసీ పూర్తయితే విచారణ లేకుండా వెంటనే సర్టిఫికెట్ జారీ చేయాలి. ఈకేవైసీ పెండింగ్‌లో ఉంటే గ్రామ, వార్డు సచివాలయాల్లో దాన్ని పూర్తి చేసి సర్టిఫికెట్ అందించాలి. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ప్రభుత్వ ఉద్యోగాలు, పథకాల కోసం ప్రస్తుత విధానంలోనే సర్టిఫికెట్లు జారీ చేయాలని ప్రభుత్వం పేర్కొంది. ఆదాయ ధ్రువీకరణకు ఆరు దశల నిర్ధారణే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారి (బీపీఎల్) గురించి తెలుసుకోవడానికి, విద్యా సంస్థల్లో స్కాలర్షిప్లు, ప్రభుత్వ పథకాలు, ఫీజు మినహాయింపులు పొందేందుకు ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా మారింది. గత రెండేళ్లలో 75 లక్షల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు. వీటికోసం రెవెన్యూ అధికారులు ప్రతిసారి విచారణ చేయకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్వహించే 6 దశల నిర్ధారణ ప్రక్రియనే ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ఆయా శాఖలకు తాజాగా స్పష్టం చేసింది. సంక్షేమ, విద్యా, ఇతర శాఖలు తమ పథకాల అమలుకు సంబంధించి ఇకపై ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదు. 6 దశల నిర్ధారణ ప్రక్రియనే ఇందుకు వినియోగించుకోవాలి. ఒకవేళ అందులో దరఖాస్తుదారులు ఎంపిక కాకపోతే ఆ శాఖలు సమాచారాన్ని గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రెవెన్యూ శాఖకు పంపాలి. పది, ఇంటర్ విద్యార్థుల డేటాబేస్‌ను విద్యా శాఖలు గ్రామ, వార్డు సచివాలయాలకు పంపితే అక్కడ 6 దశల నిర్ధారణ ప్రక్రియతో వారి ఆదాయ స్థాయిని నిర్ధారిస్తారు. ఒకవేళ అక్కడ విద్యార్థులు అర్హత సాధించకపోతే ఆ వివరాలను ఆయా శాఖలు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రెవెన్యూ శాఖకు పంపాలి. రెవెన్యూ శాఖ విచారణ చేసి వారికి సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. స్కాలర్షిప్లు, పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు ఆరు దశల నిర్ధారణ ప్రక్రియ సరిపోతుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు, ఇతర కేంద్ర ప్రభుత్వ అవసరాల కోసం జారీ చేసే సర్టిఫికెట్లకు కూడా ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలి. -
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇంటికే ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు.. ఉచితంగానే..
మూడేళ్ల క్రితం.. ఓ పల్లెటూరి కుర్రాడికి ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు అవసరమయ్యాయి. దగ్గరలో ఉన్న పట్నం వెళ్లాడు. రూ. 50 ఫీజు కట్టి మీ సేవ సెంటర్లో దరఖాస్తు చేసుకొన్నాడు. దీనికి ఒక రోజంతా పట్టింది. వారం పది రోజులు మండలాఫీసుల చుట్టూ తిరిగాడు. అప్పటికి గాని సర్టిఫికెట్లు రాలేదు. లంచం వంటివి అదనంగా ఇచ్చుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం.. అదే గ్రామానికి చెందిన మరో యువకుడికి ఆదాయ, కుల ధ్రువీకరణపత్రాల అవసరం వచ్చింది. నేరుగా అదే గ్రామంలోని గ్రామ సచివాలయానికి వెళ్లాడు. అక్కడే ఎటువంటి ఫీజు చెల్లించకుండా దరఖాస్తు చేసి నిమిషాల్లో ఇంటికి వచ్చేశాడు. మండలాఫీసుల చుట్టూ తిరగలేదు. ఎవరినీ కలవాల్సిన పనిలేదు. సర్టిఫికెట్లు చేతికందాయి. ఇక మీదట ఈ మాత్రం కష్టం కూడా ఉండదు. దరఖాస్తు చేసుకోకపోయినా పది, ఇంటర్ చదివే విద్యార్థులకు వారి అర్హత, సామాజిక పరిస్థితి ఆధారంగా ఆదాయ, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లను ప్రభుత్వమే వారి ఇళ్లకు తీసుకొచ్చి అందజేయనుంది. అది కూడా ఉచితంగానే. సాక్షి, అమరావతి: ఆదాయ (ఇన్‌కం), కుల (క్యాస్ట్) ధ్రువీకరణ సర్టిఫికెట్లకు డిమాండ్ చాలా ఎక్కువ. విద్యార్థులకు స్కాలర్ షిప్ మంజూరులో, ఉన్నత చదువుల సీట్ల కేటాయింపుల్లో ఇవే కీలకం. ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లు పొందాలన్నా ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి. మూడేళ్ల క్రితం వరకు వీటి కోసం విద్యార్థులు నానా తిప్పలు పడేవారు. పట్టణాలకో, మండల కేంద్రాలకో వెళ్లి మీ– సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేయాలి. ఒక్కొక్క సర్టిఫికెట్‌కు రూ. 40 నుంచి 50 వరకు ఫీజు చెల్లించాల్సి వచ్చేది. రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. లంచాలు సరేసరి. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విప్లవాత్మకంగా తెచ్చిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థతో పేదలకు ఈ ఇబ్బందులు తప్పాయి. గ్రామంలో, వార్డుల్లో ఉండే సచివాలయాల్లోనే సర్టిఫికెట్ల జారీ ప్రారంభమైంది. ఇంటికి దగ్గరలోనే ఉండే సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకొంటే నాలుగైదు రోజుల్లో సర్టిఫికెట్లు వచ్చేవి. ఫీజు మామూలుగానే చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి, పేదలకు ఈమాత్రం కష్టంకూడా లేకుండా, అసలు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా, పైసా ఖర్చు లేకుండా సర్టిఫికెట్లను ఇంటి వద్దకే అందజేసే ఏర్పాట్లు చేస్తోంది. రెవెన్యూ శాఖ సూచన మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఈ ప్రక్రియను ఇప్పటికే మొదలు పెట్టింది. జారీ ఇలా.. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో పది, ఇంటర్మీడియట్ విద్యార్థుల జాబితాలను రాష్ట్రంలో అన్ని సచివాలయాల్లో పనిచేసే వీఆర్వోల మొబైల్ యాప్‌కు అనుసంధానం చేశారు. వీఆర్వోలు ఆ జాబితా ప్రకారం తమ పరిధిలోని విద్యార్థుల ఇళ్లకు వెళ్లి, వారి ఆర్థిక, సామాజిక పరిస్థితిని పరిశీలిస్తారు. దాని ఆధారంగా అర్హులందరికీ ఆదాయ, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ల జారీకి రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ)కి నివేదిక ఇస్తారు. ఆర్ఐ పరిశీలన చేసి మండల తహసీల్దార్‌కు సిఫార్సు చేస్తారు. తహసీల్దార్ అర్హులకు సర్టిఫికెట్లను జారీ చేస్తారు. ఈ సర్టిఫికెట్లను సచివాలయాల వారీగా డౌన్లోడ్ చేస్తారు. వలంటీర్లు విద్యార్థుల ఇళ్లకే వెళ్లి ఆ సర్టిఫికెట్లను అందజేస్తారు. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ సోమవారంలోగా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయనుంది. టెన్త్‌లో 6 లక్షల మంది, ఇంటర్లో 10 లక్షల మంది! రాష్ట్రంలో ఏటా పదో తరగతిలో 6 లక్షల నుంచి 6.5 లక్షల మంది, ఇంటర్ రెండు సంవత్సరాలు దాదాపు 10 లక్షల మంది చదువుతుంటారని అంచనా. వీరిలో దాదాపు 70 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారేనని అధికార వర్గాలు చెప్పాయి. ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలను ఇళ్ల వద్దే ఉచితంగా పంపిణీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో 10లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రయోజనం పొందుతారని అధికారులు చెబుతున్నారు. సచివాలయ వ్యవస్థ కారణంగానే ఈ వెసులుబాట్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ కారణంగా రాష్ట్రంలో పరిపాలనలోనే విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అప్పటివరకు ప్రజలకు కష్టసాధ్యంగా ఉండే ప్రభుత్వ సేవలు కూడా ఇప్పుడు ఇంటి వద్దే అందుతున్నాయి. కుగ్రామంలో ఉండే ప్రజలు కూడా ఊరు దాటి బయటకు రావాల్సిన అవసరం లేకుండానే ఐదు కోట్లకు పైగా సేవలను ఈ ‘సచివాలయా’లే అందించాయి. నడవలేని స్థితిలో ఉండే అవ్వాతాతలు ప్రతి నెలా పింఛను డబ్బుల కోసం ఆ గ్రామంలో పంచాయతీ ఆఫీసు లేదంటే గ్రామ పెద్ద ఇంటిదాకా వెళ్లే ఇబ్బందులు మూడేళ్ల క్రితమే తొలగిపోయాయి. 34 లక్షల మంది వృద్ధులు (కేవలం వృద్ధాప్య పింఛన్లు), మరో 50 వేల మందికి పైగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రతి నెలా వలంటీర్లు ఇంటి వద్దకు వెళ్లి పింఛను డబ్బులు పంపిణీ చేసే విధానాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చారు. ఇప్పుడు విద్యార్థులకు ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు ఇంటి వద్దనే అందజేసే ప్రక్రియ కూడా మొదలు కాబోతోంది. -
కుల సర్టిఫికేట్ల వివాదాలను పరిష్కరించేందుకు కమిషన్
సాక్షి, అమరావతి : పలు కులాల సర్టిఫికేట్ల వివాదాలను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జేసీ శర్మకు ఈ కమిషన్ బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు గురువారం సాంఘీక సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బేడ, బుడగ జంగం కులాలను ఎస్సీ కేటగిరీలో చేర్చే అంశంపై, బోగస్ ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్లను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఈ కమిషన్‌ను ఆదేశించింది. శ్రీకాకుళం జిల్లాలోని బెంతో, ఒరియా కులాలకు ఎస్టీ సర్టిఫికేట్ ఇచ్చే అంశంపై అధ్యయనం చేయాలని, ఇతర కులాలవారు ఎస్సీ, ఎస్టీ తప్పుడు ధ్రువపత్రాలు పొందకుండా సూచనలు చేయాలని ఆదేశించింది. -
మా ఆవేదన పట్టదా?
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే తెలంగాణలో ఉనికిలో లేవంటూ 2014లో జీవో 3 ద్వారా తెలంగాణ యంత్రాంగం 26 బీసీ కులాల ను తొలగించింది. దీంతో అప్పటివరకు బీసీ జాబితాలో ఉన్న కులాలకు నాలుగు సంవత్సరాలుగా బీసీ సర్టిఫికెట్ల జారీ నిలిచిపోయింది. దీంతో 2014 వరకు రిజర్వేషన్ల కింద ఫీజు రీయింబర్స్మెంట్లు, ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యత పొందిన ఆ 26 కులాలు ప్రభుత్వ నిర్ణయంతో జనరల్ కేటగిరీలో చేరిపోయాయి. దీంతో ఒకే ఇంట్లో 2014 కంటే ముందు చదువు, ఉద్యోగ రిజర్వేషన్ పొందిన వారు బీసీలు ఐతే, తదనంతరం అదే కుటుంబసభ్యులు ఓసీ కేటగిరీలోకి మారిపోయారు. దీంతో అన్యాయానికి గురైన 26 కులాలు ఒక్కటై ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని కూకట్పల్లి ఎన్‌కేఎన్‌ఆర్ గార్డెన్లో ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నాయి. ఉనికిలో లేవని..ఆపై ఉన్నాయని.. అనంతరామన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు మేరకు ఆ 26 కులాలు తెలంగాణలో లేవని చెబుతున్న ప్రభుత్వం, మరో వైపు సమగ్ర కుటుంబ సర్వే ద్వారా సేకరించిన సమాచారంలో ఆ 26 కులాలు భారీ ఎత్తునే స్థిరపడ్డారని పేర్కొంది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే కళింగలు 12,500 కుటుంబాలు, 50 వేల తూర్పుకాపు కుటుంబాలున్నట్లు పేర్కొంది. ఇప్పటికే తాము అన్ని రాజకీయపక్షాలతోపాటు అన్ని కుల సంఘాలు, 18 మంది ఎంఎల్ఏల సిఫారసు లేఖలు ప్రభుత్వానికి ఇచ్చామని జేఏసీ అధ్యక్షులు కడిపోయిన శ్రీనివాస్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ అన్యాయాన్ని సరిదిద్దాలని సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తే ఇంత వరకు సమాధానం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మగౌరవాన్ని చాటుతాం మూడేళ్లుగా మా సమస్యలు వినమని ప్రభుత్వానికి చెబుతున్నా పట్టింపులేదు. అందుకే మా ఆత్మగౌరవాన్ని చాటేందుకు ఆదివారం సభ నిర్వహించి మా బలాన్ని చాటుతాం. మాకు మద్దతిచ్చే వారికి మద్దతిస్తాం’ –బొడ్డేపల్లి శ్రీరాంమూర్తి, కళింగ సంక్షేమ సంఘం సుప్రీంలోనూ పోరాడుతున్నాం ‘‘నగరంలో తూర్పు కాపుల కుటుంబాలు లక్షకు పైగానే ఉన్నా యి. మా కులాన్ని బీసీ జాబితా నుంచి తొల గించటం వల్ల మా పిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మధ్యలోనే చదువు ఆపేస్తున్న వారు ఉన్నారు. –జల్లు హేమసుందర్రావు, తూర్పు కాపు సంక్షేమ సంఘం మే స్థానికులం కాదా? ఇక్కడ పుట్టిన వారంతా తెలంగాణ వాసులే. అయినా మా మీద వివక్ష చూపిస్తున్నారు. మా సమస్యను çపరిష్కరించమని నాలుగేళ్లుగా ప్రాధేయపడుతున్నాం. ఇప్పుడు మా సత్తాచాటి తీరుతాం –గొల్లు బాబూరావు. శెట్టి బలిజ సంక్షేమ సంఘం తొలగించిన కులాలు బీసీ (ఏ): బందర, కోర్చ, కళింగ, కూరాకుల, పొందర, సామంతుల, ఆసాదుల, కివిటి బీసీ(బీ): శెట్టిబలిజ, నాగవడ్డీలు, వక్కలిగ, గుడియ బీసీ(డీ) అగరు, అతగార, గవర, గోదబ, జక్కల, కండ్ర, కొప్పుల వెలమ, నాగవంశం, పోలినాటి వెలమ, తూర్పుకాపు, సాదర, అరవ, బేరిశెట్టి, అతిరాస. -
పాఠశాలల్లోనే కుల ధృవీకరణ పత్రాలు
అనంతపురం అర్బన్ : ఇక నుంచి కుల ధృవీకరణ పత్రాలు పాఠశాలల్లోనే ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జేసీ లక్ష్మీకాంతం అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహిస్తూనే, తహశీల్దారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘జిల్లాలో దాదాపు 700 ఉన్నత పాఠశాలల ఉన్నాయి. పదవ తరగతి పూర్తి చేసి వెళ్లే విద్యార్థులు కళాశాలల్లో చేరేందుకు కుల ధృవీకరణ పత్రం అవసరమవుతుంది. కళాశాలల్లో చేరే సమయంలో వారు ఇబ్బంది పడకుండా ఉండేందుకు పాఠశాలలకే మొబైల్ మీ - సేవ పంపిస్తాము. వాటి ద్వారా ధృవీకరణ పత్రాలు అందించేందుకు చర్యలు తీసుకోండి.’ అని ఆదేశించారు. జిల్లాలో తొలిసారిగా పాఠశాలల వద్దకే మొబైల్ మీ - సేవ పంపిస్తున్నామన్నారు. ప్రధానోపాధ్యాయులు కుల ధృవీకరణ పత్రం కావాల్సిన విద్యార్థుల నుంచి దరఖాస్తులను తీసుకుని మీ-సేవ సిబ్బందికి అందజేయాలన్నారు. వారు వాటిని ఆన్లైన్లో ఉంచి, తహశీల్దారు ద్వారా ధృవపత్రాలు సిద్ధం చేయించి ప్రధానోపాధ్యాయులకు అందజేస్తారన్నారు. అనంతరం పశుగ్రాసం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, తదితర అంశాలపై మాట్లాడారు. చెరువుల్లో పశుగ్రాసం పెంపకానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీరు - చెట్టు ద్వారా చెరువుల్లో కంపచెట్లు, పిచ్చి మొక్కల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అక్టోబరు 2వ తేదీ గాంధీ జయంతి రోజున జిల్లాను బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్)జిల్లాగా ప్రకటించాల్సి ఉందన్నారు. స్వచ్ఛభారత్ కింద ఆర్డబ్ల్యూఎస్, ఉపాధి హామీ పథకం కింద డ్వామా, డీఆర్డీఏ శాఖలు అన్ని పంచాయతీల్లో వ్యక్తిగత మరుగుదొడ్లను వంద శాతం నిర్మించాలన్నారు. నిధుల కొరత లేదన్నారు. జిల్లాలో 1,003 పంచాయతీలు ఉంటే ఇప్పటికే 275 పంచాయతీలను ఓడీఎఫ్‌గా మార్చామన్నారు. మిగిలిన పంచాయతీలను ఏడు నెలల వ్యవధిలో మార్చాల్సి ఉందన్నారు. -
నేడే ఎంసెట్-3
-
నేడే ఎంసెట్-3
- ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష - గంట ముందే పరీక్షా హాల్లోకి అనుమతి - నిమిషం ఆలస్యమైనా అనుమతించం: ఎంసెట్ కన్వీనర్ సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ‘ఎంసెట్-3’ ప్రవేశపరీక్ష జరగనుంది. పరీక్ష కోసం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో 96 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 56,153 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. శనివారం సాయంత్రం 5 గంటలకు గడువు ముగిసే సమయానికి 40,168 మంది మాత్రమే హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ అభ్యర్థులను మాత్రమే పరీక్షకు అనుమతిస్తారు. పాత హాల్‌టికెట్లతో వచ్చే వారిని అనుమతించరు. అభ్యర్థులను గంట ముందే అంటే ఉదయం 9 గంటల నుంచే పరీక్షా హాల్లోకి అనుమతిస్తారు. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని ఎంసెట్-3 కన్వీనర్ యాదయ్య స్పష్టం చేశారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యార్థులు వీలైనంత ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఇవి గుర్తుంచుకోండి ► అభ్యర్థులు పూర్తిచేసిన ఆన్లైన్ దరఖాస్తును పరీక్షా హాల్లో ఇన్విజిలేటర్లకు అందజేయాలి. దానిపై కలర్ పాస్‌పోర్టు సైజు ఫొటోను అతికించి గెజిటెడ్ అధికారి లేదా కళాశాల ప్రిన్సిపాల్‌తో ధ్రువీకరణ చేయించి ఉండాలి. ► పరీక్షా కేంద్రంలోకి బ్లాక్/బ్లూ బాల్‌పాయింట్ పెన్, ఆన్లైన్ దరఖాస్తు, హాల్ టికెట్, కుల ధ్రువీకరణ పత్రాన్ని మాత్రమే తీసుకురావడానికి అనుమతిస్తారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎంసెట్-2 దరఖాస్తుతో పాటు కుల ధ్రువీకరణపత్రం సమర్పించని పక్షంలో ఇప్పుడు కుల ధ్రువీకరణ పత్రాన్ని తీసుకురావాలి. ► పరీక్ష కేంద్రంలోకి కాలిక్యులేటర్లు, మేథమెటికల్/లాగ్ టేబుల్స్, పేజర్లు, సెల్ఫోన్లు, వాచీలు, ఇతర ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలనైనా తీసుకురావడం నిషేధం. ► హాజరు కోసం అభ్యర్థులు బయోమెట్రిక్ (ఫింగర్ ప్రింట్) సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. లేకుంటే పరీక్ష రాయనివ్వరు. ► పరీక్ష ప్రారంభమైనప్పటి నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అభ్యర్థులను పరీక్షా హాల్ నుంచి బయటకు పంపరు. -
రాజకీయ జోక్యాన్ని సహించం
హైదరాబాద్: మా శవాలు కూడా కుల దృవీకరణ పత్రాలు సమర్పించాల్సి వస్తోంది. సెంట్రల్ యూనివర్సిటీలో హిందూత్వ రాజకీయ జోక్యం నశించేంత వరకు నిరాహార దీక్షను ఆపేది లేదు. వివక్షతో చావడం కన్నా, పోరాడి వీరమర ణం పొందడం మేలు. అని హెచ్‌సీయూలో నిరాహారదీక్ష చేస్తున్న విద్యార్థులు పేర్కొన్నారు. రోహిత్ మరణానికి కార కులపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని, వీసీ అప్పారావును పదవినుంచి తొలగించాలని, రోహిత్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి వర్సిటీలో ఉద్యోగం ఇవ్వాలని, అతని కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, స్కాలర్స్‌పై కేసులను ఎత్తివేయాలన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలి సిటీబ్యూరో: హెచ్‌సీయూలో పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై సమగ్ర వి చారణ చేపట్టి, నిందితులను కఠినంగా శిక్షించాలని టీఎస్‌యూటీఎఫ్ నాయకులు పేర్కొన్నారు. రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా గురువారం హై దరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో దోమలగూడలోని కార్యాలయం నుంచి ఇందిరాపార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అ ద్యక్షులు నర్సిరెడ్డి మాట్లాడు తూ.. విజ్ఞాన కేంద్రాలుగా భాసిల్లాల్సిన వర్సిటీలు.. కులమత బేధాలకు నిలయాలుగా మార డం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండల్రావు, సంజీవరా వు, రేణు, శారద, సింహాచలం, రామకృష్ణ, నాగరాజు, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేడు జేఎన్టీయూహెచ్ బంద్ కేపీహెచ్‌బికాలనీ: హెచ్‌సీయూ విద్యార్ధి వేముల రోహిత ఆత్మహత్యకు కారకులైన వారిని శిక్షించాలని కోరుతూ శుక్రవారం జేఎన్టీయూహెచ్ బంద్‌కు పిలుపు ఇచ్చినట్లు జేఎన్టీయూహెచ్ పరిధిలోని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. మా శవాలు కూడా దృవీకరణ పత్రాలు ఇవ్వాలా..! దళితులైనందునే మేం చనిపోతున్నాం. కానీ మా చావు తర్వాత కూడా మా కుల ధ్రువీకరణ పత్రాల్ని సమర్పించుకోవాల్సి వస్తోంది. రోహిత్ మరణానికి కారకులైన కేంద్ర మంత్రి దత్తాత్రేయ సహా అందరిని శిక్షించి, వీసీని తొలగించాలి. వర్సిటీల్లో రాజకీయ జోక్యాన్ని నివారించాలి. ఆర్యత్ వైఖరి, పొలిటికల్ సైన్స్ పీహెచ్డీ స్కాలర్. వివక్షకు కేంద్రబిందువు సెంట్రల్ యూనివర్సిటీ దళితుల వివక్షకు కేంద్రబిందువు. అంబేడ్కర్ స్టుడెంట్స్ అసోసియేషన్ ఆవిర్భావం నుంచి అనేక పోరాటాలు చేసింది. ఒక మేధావి మరణంతో దేశవ్యాప్తంగా ఉద్యమం వెల్లువెత్తింది. నిన్న రాహుల్ గాంధీ, నేడు కేజ్రీవాల్ అన్ని రాజకీయ పార్టీలూ వస్తున్నాయి మద్దతు పలుకుతున్నాయి. గుమ్మడి ప్రభాకర్, హిస్టరీ పీహెచ్డీ స్కాలర్ మాకు విముక్తి కావాలి బ్రాహ్మణికల్ అగ్రహారాల నుంచి మాకు విముక్తి కావాలి. వారికి మా ఉద్యమం ఓ గుణపాఠం కావాలి. రోహిత్‌లా మరోదళిత మేధావి జీవితం అర్థాంతరంగా ముగియకూడదు. అందుకే జాతీయ స్థాయిలో రోహిత్ చట్టం చేయాలి. ఉమామహేశ్వర్ రావు, పొలిటికల్ సైన్స్ పీహెచ్డీ స్కాలర్. డిమాండ్లు నెరవేర్చాలి ఉన్నత విశ్వవిద్యాలయాల్లో దళిత మేధావులను అంతమొందించే హిందూత్వ రాజకీయాలను మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.బీజేపీ అధికారంలోకి వచ్చిన తొలినాటి నుంచే దళితులు, మెనారిటీలపై తీవ్రమైన దాడులకు దిగుతోంది. మా డిమాండ్లు నెరవేరినప్పుడే దీక్షను ఉపసంహరించుకుంటాం. మనోజ్.కె.పి. పీహెచ్డీ విద్యార్థి. -
ఐదుగురు వైద్య విద్యార్థులు అరెస్ట్
-
ఐదుగురు వైద్య విద్యార్థులు అరెస్ట్
తప్పుడు కులద్రువీకరణ పత్రాలను సమర్పించి మెడిసిన్ సీటు సంపాదించిన ఐదుగురు విద్యార్థుల తో పాటు.. వారి తల్లిదండ్రులను పోలీసులు అరెస్టు చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విజయవాడలో కౌన్సెలింగ్ సందర్భంగా తప్పుడు కుల ద్రువీకరణ పత్రాలను సమర్పించిన ఆరుగురు విద్యార్థులపై కేసులు నమోదు చేశారు. సోమవారం వీరిలో ఐదుగురు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. -
తల్లిదండ్రుల అత్యాశకు పరాకాష్ట..!
ఎంసెట్-మెడికల్ కౌన్సెలింగ్‌లో నేరప్రవృత్తి బోగస్ సర్టిఫికెట్లతో ఎంబీబీఎస్‌లో చేరికలు తాజా ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తు.. బోగస్ అభ్యర్థులపై కఠిన చర్యలు సాక్షి, విజయవాడ: ఎంసెట్-మెడికల్ కౌన్సెలింగ్‌లో ఏటా నేరపూరిత అభ్యర్థులు హల్చల్ చేస్తూనే ఉన్నారు. చదవకుండానే తమ పిల్లలు డాక్టర్ కావాలనే తల్లిదండ్రుల అత్యాశకు పరాకాష్టకు నిదర్శనంగా... ప్రతి ఏడాది నేరప్రవృత్తి కొత్త రూపం సంతరించుకొంటోంది. గతేడాది పీజీ మెడికల్ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీని మరువక ముందే... ఈ ఏడాది బోగస్ కుల ధ్రువీకరణ పత్రాలతో ఎంబీబీఎస్ సీట్లు కొట్టేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. కర్నూలు జిల్లా, కల్లూరు మండల తహసీల్దార్ ఇచ్చిన బోగస్ కుల ధ్రువీకరణ పత్రాలతో ఎంబీబీఎస్ సీట్లు కొల్లగొట్టారని హెల్త్ యూనివర్సిటీ అధికారులు పసిగట్టినా... మెడికల్ కౌన్సెలింగ్ ప్రక్రియపై ఎంసీఐ(భారత వైద్య మండలి) కటాఫ్ తేదీ ముగియడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తాజాగా ప్రకటించిన ఏడుగురే కాకుండా ఇంకెంత మంది ఉన్నారనే దానిపై ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు జరిగింది ఇదీ... రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్లను కౌన్సెలింగ్ కేంద్రంలో ఆయా బీసీ/ఎస్సీ/ఎస్టీ శాఖాధికారులతో తనిఖీ చేయిస్తారు. వీరంతా ఎంసెట్ ర్యాంకు కార్డులో ఓసీగా నమోదై ఉంటే, బీసీగా కులధ్రువీకరణ పత్రం తీసుకువచ్చారు. ఇదేమని కౌన్సెలింగ్ అధికారులు ప్రశ్నించగా, ‘మేము చదివిన కళాశాల యాజమాన్యం తమ కులం పేరు తప్పుగా ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు చేసింది. అందుకే ర్యాంకు కార్డులో కులం పేరు తప్పుపడింద’ని చెప్పారు. దీంతో వీరిని బీసీ సర్టిఫికెట్లను పరిశీలించేందుకు వచ్చిన బీసీ వెల్ఫేర్ కమిషన్ అధికారుల వద్దకు పంపించారు. వారు కర్నూలు జిల్లా కల్లూరు తహసీల్దార్ ఇచ్చిన కుల ధ్రువీకరణ పత్రం సంతకాలు, దాని రూపురేఖలు పరిశీలించి బీసీలుగానే తేల్చారు. బీసీ వెల్ఫేర్ అధికారులు ఓకే చెప్పడంతో వర్సిటీ అధికారులు సీట్లు కేటాయించారు. ఒకవేళ కౌన్సెలింగ్ అధికారులకు అనుమానం వచ్చి సీటు కేటాయించేందుకు నిరాకరించినా.. కుల ధ్రువీకరణ పత్రం సరైనదై, సదరు అభ్యర్థి కోర్టు కెళితే రూ.లక్షల్లో జరిమానా కట్టాల్సి వస్తుందని భయపడ్డారు. ఎంసెట్‌లో ర్యాంకులు సాధించిన అభ్యర్థుల జాబితాను ఉన్నత విద్యామండలి నుంచి సంపాదించి ఈ రాకెట్‌ను నిర్వహించినట్లు తెలుస్తోంది. ర్యాంకులను బట్టి బీసీలలో(ఏ,బీ,సీ,డీ,ఈ) ఆయా కేటగిరీల కుల ధ్రువీకరణ పత్రాలిచ్చారు. మరికొన్నింటిపై విచారణ... మెడికల్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయి అడ్మిషన్లు పొందిన అభ్యర్థుల జాబితా ఎంసీఐకి పంపే క్రమంలో ఏడుగురు అభ్యర్థులతో పాటు మరింతమంది బోగస్ సర్టిఫికెట్లు బయటపడ్డాయని తెలుస్తోంది. వీరిపైనా దర్యాప్తు చేస్తున్నారు. ఇలా సీటు పొందిన అభ్యర్థుల్లో ఒకరు ఇటీవలే సీటు రద్దు చేసుకొని వెళ్లిపోయినట్లు వర్సిటీ అధికారులు చెబుతున్నారు. కౌన్సెలింగ్‌కు సదరు అభ్యర్థులతో ఎవరెవరు వచ్చారు అనే విషయమై కౌన్సెలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ టీవీల్లో రికార్డు చేసిన ఫుటేజిని పరిశీలిస్తున్నారు. విద్యార్థులపై కఠిన చర్యలు... బోగస్ సర్టిఫికెట్ల విషయంలో దర్యాప్తు జరుగుతోందని హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ టి.రవిరాజు తెలిపారు. కొద్ది రోజుల్లో విషయం తేలిపోతుందన్నారు. ఈ ఏడుగురు అభ్యర్థులను సస్పెండ్ చేయమని ఆయా మెడికల్ కళాశాలలను ఆదేశిస్తామన్నారు. ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది పరిశీలిస్తున్నట్లు తెలిపారు. -
కులధ్రువీకరణ పత్రాల్లో అవకతవకలు
కుంటాల: ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండలం గుల్లమాడ పంచాయతీ వీఆర్ఏలు కుల ధ్రువీకరణ పత్రాల జారీలో అవకతవకలకు పాల్పడినట్టు వెలుగులోకి వచ్చింది. వీఆర్ఏలు గంగాధర్, సూర్యలపై తహశీల్దార్ సంతోష్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. 1975 కు పూర్వం మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన గిరిజనులకు ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలను ఓటరు జాబితా ఆధారంగా ఇవ్వాలనేది నిబంధన. అయితే, గుల్లమాడ పంచాయతీ అనుబంధ గ్రామం బూరుగుపల్లికి చెందిన సుమారు 43 మంది అనర్హులకు వీఆర్ఏలు లంచం తీసుకుని కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారని విచారణలో తేలడంతో తహశీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఆర్ఐ ఇస్కారి, కార్యాలయ జూనియస్ అసిస్టెంట్ నగేష్‌లకు మెమోలు జారీ చేశారని తెలిసింది.