సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంస్కరణలు ప్రజలకు ఎంతో మేలుచేస్తున్నాయి. ముఖ్యంగా కుల వీకరణ పత్రాల జారీలో సర్కారు తీసుకొచ్చిన కొత్త విధానం వారి కష్టాలు తీరుస్తోంది. ఎందుకంటే.. ఈ పత్రాల జారీని ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. గతంలో ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే గరిష్టంగా 30 రోజుల్లోగానీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ అయ్యేవి కావు. ఆ తర్వాత ఏదేని కారణంతో మళ్లీ అవసరమైనా మరోసారి 30రోజులు నిరీక్షించాల్సిందే. ఈ ఇబ్బందుల్ని పసిగట్టిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అలాంటి వారికి సాంత్వన చేకూర్చే నిర్ణయం తీసుకున్నారు.
దాని ప్రకారం.. కుల ధృవీకరణ పత్రం పొందిన వారికి, మళ్లీ దాని అవసరం ఎప్పుడైనా ఏర్పడితే కొత్తగా తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరంలేకుండా అంతకుముందు తీసుకున్న వివరాల ప్రకారం అడిగిన రోజునే గ్రామ, వార్డు సచివాలయాల్లో మరోసారి ఆ పత్రాలిచ్చే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2022 ఆగస్టు నుంచి అమలుచేస్తోంది. దీని ద్వారా గత ఏడాది కాలంలో రాష్ట్రంలో 21,00,888 మంది దరఖాస్తు చేసుకున్న రోజునే కుల ధ్రువీకరణ పత్రాలను అందుకున్నారు.
గతంలో ఒకసారి తీసుకున్న వారికి..
సాధరణంగా.. విద్యార్థుల స్కూళ్లలో లేదంటే కాలేజీల్లో చేరే సమయంలోనూ.. వివిధ ఉద్యోగ నోటిఫికేషన్ల సమయంలో నిరుద్యోగ యువతకు.. వివిధ సంక్షేమ పథకాల అమలులో లబ్ధిదారులకు కుల ధ్రువీకరణ పత్రాల అవసరం ఎక్కువగా ఉంటుంది. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో అమలులో ఉన్న నిబంధన ప్రకారం ఈ కుల ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్న రోజు నుంచి గరిష్టంగా 30 రోజుల్లో సంబంధిత మండల తహసీల్దార్ దానిని జారీచేయాల్సి ఉంటుంది. అయితే, చాలామంది గతంలో ఒకసారి తీసుకున్నా.. సరిగ్గా కాలేజీల ప్రవేశాలు, ఉద్యోగ నోటిఫికేషన్ల సమయంలో వివిధ కారణాలతో మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకుంటుంటారు.
ఇలాంటి వారికి సైతం ఏడాది క్రితం వరకు గరిష్టంగా 30 రోజులకు గానీ అవి జారీ అయ్యేవి కావు. ఫలితంగా సకాలంలో అవి అందక అక్కడక్కడ కొందరు తమ అవకాశాలను కోల్పోయేవారు. అయితే, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2022 ఆగస్టులో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అలాంటి వారికి అప్పటికప్పుడే సర్టిఫికెట్ల జారీచేయాలని సంకల్పించింది. విద్యార్థులు, నిరుద్యోగ యువత, వివిధ పథకాల లబ్ధిదారులు కీలక సమయాల్లో రెండోసారి అవసరమైతే దరఖాస్తు చేసుకున్న రోజునే ఆ పత్రాలు అందించేలా వీలు కల్పించింది.
భవిష్యత్తులోనూ కోటి మందికి అడిగిన రోజునే..
మీ–సేవా కేంద్రాల ద్వారా 2011 నుంచి ఇప్పటివరకు దాదాపు నాలుగున్నర కోట్ల కుల ధృవీకరణ పత్రాలు జారీ అయ్యాయి. అందులో కొందరు నాలుగైదుసార్లు కూడా వాటిని పొంది ఉండొచ్చని.. అయితే, వాటిని ఆధార్ వివరాలతో సరిపోల్చినప్పుడు దాదాపు 75 లక్షల మంది ఆ సర్టిఫికెట్లు తీసుకున్నట్లుగా తాము గుర్తించామని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పాటుచేసిన గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అంటే.. 2020 జనవరి 26 నుంచి ఇంకో కోటిన్నర మందికి ఈ పత్రాలు జారీ అయినట్లు వారు తెలిపారు.
ఈ పత్రాలను కూడా ఆధార్ వివరాలతో సరిపోల్చినప్పుడు 75 లక్షల మంది వివరాలను గుర్తించామన్నారు. ఇలా మీ–సేవ కేంద్రాల ద్వారా జారీ అయిన కుల ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన 75 లక్షల మంది.. గ్రామ సచివాలయాల ద్వారా వాటిని పొందిన 75 లక్షల మంది కలిపి కోటిన్నర దాకా ఉన్నా, కొంతమంది రెండుచోట్ల తీసుకుని ఉండొచ్చన్న భావనతో కనీసం కోటి మంది కుల ధృవీకరణ పత్రాలు తీసుకున్న వారి సమాచారం గ్రామ, వార్డు సచివాలయాల అన్‌లైన్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీరందరికీ భవిష్యత్‌లో వీటి అవసరం ఎప్పుడు ఏర్పడినా, గతంలో మాదిరిగా 30రోజులు వేచి ఉండే పరిస్థితి లేకుండా దరఖాస్తు చేసుకున్న రోజే వారికి గ్రామ, వార్డు సచివాలయాల్లో కుల ధృవీకరణ పత్రం జారీచేసే అవకాశం ఉంటుందన్నారు.
21 లక్షల మందికి.. ఒక్కరోజులోనే 'కుల ధ్రువీకరణ పత్రాలు'
Published Wed, Oct 18 2023 3:31 AM | Last Updated on Wed, Oct 18 2023 8:24 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment