నిర్లక్ష్యం చేస్తే భారీమూల్యం!
– ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిష్పక్షపాతంగా నిర్వహించండి
– ఎగ్జామినర్లు, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లకు ఆర్‌ఐఓ, డీవీఈఓ సూచన
అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా భారీమూల్యం చెల్లించుకోక తప్పదని ఆర్‌ఐఓ వెంకటేశులు, డీవీఈఓ చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. ఈ పరీక్షలకు సంబంధించి బుధవారం స్థానిక ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఎగ్జామినర్లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్‌ఐఓ, డీవీఈఓ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 66 కేంద్రాల్లో 16,297 మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరవుతారన్నారు. ఇప్పటికే హాల్‌టికెట్లు, ప్రశ్నపత్రాలు, టైంటేబుల్, ఎన్‌ఆర్‌లు, బ్యాచ్‌ల వివరాలు ఆయా కేంద్రాలకు పంపిణీ చేశామన్నారు. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు. నాలుగు విడతలుగా ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయన్నారు.
తొలివిడత ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు, రెండో విడత 8 నుంచి 12 వరకు, మూడో విడత 13 నుంచి 17 వరకు, నాల్గో విడత 18 నుంచి 22 వరకు జరుగుతాయన్నారు. జంబ్లింగ్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎగ్జామినర్లు, డీఓలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఏమాత్రం తేడా వచ్చినా క్రిమినల్ కేసుల నమోదు చేయాలని కమిషనర్ ఆదేశించారని గుర్తు చేశారు. కేటాయించిన కేంద్రాలకు ఒకరోజు ముందుగానే వెళ్లాలన్నారు.
అక్కడ సరిపడా మెటీరియల్ ఉందో లేదో చూసుకోవాలన్నారు. ఏదైనా సమస్య ఉంటే ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలన్నారు. తీరా పరీక్షల సమయంలో విద్యార్థులు ఇబ్బందులు పడితే మాత్రం చాలా సీరియస్‌గా ఉంటుందన్నారు. విధుల్లో ఉన్నవారు ఐడీ కార్డులు తప్పనిసరిగా ధరించాలన్నారు. పరీక్షల సమయంలో ఏవైనా సమస్యలు ఎదురైతే ఆర్‌ఐఓ, డీవీఈఓ, డీఈసీ మెంబర్లు, హైçపవర్ కమిటీకి ఫిర్యాదు చేయాలని తెలిపారు. సమావేశంలో
జిల్లా పరీక్షల కమిటీ (డీఈసీ) మెంబర్లు టి. రాజారాం, ఎం. వెంకటరమణనాయక్, ఎం. కృష్ణమూర్తి, హైపవర్ కమిటీ మెంబరు కె. శ్రీనివాసులు పాల్గొన్నారు.