
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు సర్వం సిద్ధం!
– జిల్లాలో 66 కేంద్రాలు...16,297 మంది విద్యార్థులు
– నాలుగు విడతలుగా నిర్వహణ...ఒక్కో విడత ఐదు రోజులు
– ఇప్పటికే మెటీరియల్ పంపిణీ, ఎగ్జామినర్లకు నేరుగా బోర్డు నుంచి ఉత్తర్వులు
– 1న ఎగ్జామినర్లకు సమావేశం
అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ ›ప్రాక్టికల్ పరీక్షలకు సర్వం సిద్ధం చేశారు. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు నిర్వహించే ఈ పరీక్షలకు జిల్లాలో 16,297 మంది ఫిజిక్స్, జువాలజీ, కెమిస్ట్రీ, బాటనీ విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందుకోసం 66 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 43 ప్రభుత్వ కళాశాలలు, 23 ప్రైవేట్ కళాశాలల కేంద్రాలు ఉన్నాయి. ఇప్పటికే హాల్‌టికెట్లు, ప్రశ్నపత్రాలు, టైంటేబుల్, ఎన్‌ఆర్‌లు, బ్యాచ్‌ల వివరాలు ఆయా కేంద్రాలకు పంపిణీ చేశారు. నాలుగు విడతలుగా ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి.తొలివిడత ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు, రెండో విడత 8 నుంచి 12 వరకు, మూడో విడత 13 నుంచి 17 వరకు, నాల్గో విడత 18 నుంచి 22 వరకు జరుగుతాయి.
ఎగ్జామినర్లకు పోస్టల్ ద్వారా ఉత్తర్వులు
ఆయా కేంద్రాల్లో ఎగ్జామినర్లుగా నేరుగా బోర్డు అధికారులే నియమించారు. కనీసం మూడేళ్లు అనుభవం అర్హతగా పరిగణలోకి తీసుకున్నారు. అన్ని యాజమాన్యాల కింద పని చేస్తున్న కళాశాలల నుంచి అధ్యాపకులను ఎంపికచేశారు. ఎవరిని ఏ సెంటర్‌కు నియమించారనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఉత్తర్వులు రెండు రోజుల కిందటే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు పోస్టల్ ద్వారా పంపారు. ఈ నెల 31 నాటికి దాదాపు అందరికీ ఉత్తర్వులు అందే అవకాశం ఉంది.
మూడురోజులకో ఎగ్జామినర్
ఎగ్జామినర్లను మూడు రోజులకోసారి మారుస్తారు. ఒకసారి నియమించిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి నియమించరు. ఈ లెక్కన జిల్లాలో సుమారు 270 మంది దాకా ఎగ్జామినర్లను నియమించనున్నారు. ప్రైవేట్ కళాశాలలు కేంద్రాలుగా ఉన్నవాటికి డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లను నియమించనున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకులు డీఓలుగా ఉంటారు. డీఓలను కూడా ప్రతి ఐదు రోజులకు ఒకర్ని మారుస్తారు.
పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు
పరీక్షల నిర్వహణకు ప్రత్యేక బృందాలను నియమించారు. ఆర్‌ఐఓ వెంకటేశులుతో పాటు జిల్లా పరీక్షల కమిటీ (డీఈసీ) మెంబర్లు టి. రాజారాం, ఎం. వెంకటరమణనాయక్, ఎం. కృష్ణమూర్తి పర్యవేక్షిస్తారు. హైఫవర్ కమిటీ మెంబరుగా కె. శ్రీనివాసులును నియమించారు. ఇద్దరు సభ్యులను ఫ్లయింగ్ స్క్వాడ్‌గా నియమించారు. వీరిలో ఒకరు విద్య, మరొకరు రెవెన్యూ శాఖ నుంచి ఉంటారు. అలాగే ఆర్జేడీ వెంకటరమణ, జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్‌రావు అబ్జర్వర్లుగా ఉంటారు. వీరే కాకుండా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు, డీఆర్వో, ఆర్డీఓలతో పాటు కేంద్రాలున్న ప్రాంతాల తహసీల్దార్లు కూడా పర్యవేక్షిస్తారు.
1న ఎగ్జామినర్లతో సమావేశం
పరీక్ష ఎగ్జామినర్లతో ఫిబ్రవరి 1న స్థానిక కొత్తూరు ప్రభుత్వ ఒకేషన్ జూనియర్ కళాశాలలో సమావేశం నిర్వహించనున్నారు. నియామక ఉత్తర్వులు అందిన ప్రతి అధ్యాపకుడూ విధిగా హాజరుకావాలని అధికారులు తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని ఆర్‌ఐఓ వెంకటేశులు తెలిపారు. పరికరాలు, ఇతర మెటీరియల్ అందుబాటులోని కేంద్రాలకు బడ్జెట్ కూడా కేటాయిస్తున్నామన్నారు.