
ఫండ్స్‌లోకి భారీగా తగ్గిన పెట్టుబడులు
ఫిబ్రవరిలో 26 శాతం డౌన్
నికరంగా రూ.29,303 కోట్లు రాక
జనవరిలో వచ్చింది రూ.39,688 కోట్లు
స్మాల్, మిడ్‌క్యాప్‌లో గణనీయంగా తగ్గుదల
మూడు నెలల కనిష్టానికి సిప్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితులు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా ఫిబ్రవరి నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు గణనీయంగా పడిపోయాయి. రూ.29,303 కోట్ల పెట్టుబడులు ఈక్విటీ ఫండ్స్‌లోకి వచ్చాయి. ఈ ఏడాది జనవరిలో వచ్చిన రూ.39,688 కోట్లతో పోల్చి చూస్తే 26 శాతం తగ్గిపోయాయి. 2024 డిసెంబర్‌లో ఈక్విటీ పథకాల్లోకి రూ.41,156 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం.
ఇలా చూస్తే వరుసగా రెండో నెలలోనూ ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక తగ్గినట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. ముఖ్యంగా స్మాల్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో పెట్టుబడుల విలువ క్షీణించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపించింది. అటు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో వచ్చిన పెట్టుబడులు సైతం మూడు నెలల కనిష్టానికి చేరాయి.
గత డిసెంబర్‌లో సిప్ ద్వారా ఈక్విటీల్లోకి రూ.26,459 కోట్లు రాగా, జనవరిలో రూ.26,400 కోట్లకు, ఫిబ్రవరిలో రూ.25,999 కోట్లకు క్షీణించాయి. మార్కెట్లలో కరెక్షన్ నేపథ్యంలో ఈక్విటీ ఫండ్స్‌లోకి లమ్సమ్ రూపంలో పెట్టుబడులు గణనీయంగా తగ్గినప్పటికీ, సిప్ పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లు స్థిరత్వాన్ని చూపిస్తున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ‘‘సిప్ పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి.
కానీ, పెద్ద మొత్తమేమీ కాదు. పైగా జనవరితో పోల్చితే ఫిబ్రవరి నెలలో తక్కువ రోజులు ఉంటాయి’’ అని మిరే అస్సెట్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ హెడ్ సురంజన తెలిపారు. మార్కెట్లలో కరెక్షన్ కొనసాగడం ఫిబ్రవరిలో అమ్మకాలపై ప్రభావం చూపించినట్టు మోతీలాల్ ఓస్వాల్ ఏఎంసీ ఈడీ అఖిల్ చతుర్వేది పేర్కొన్నారు. దీర్ఘకాలానికి సెంటిమెంట్ సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు.
స్మాల్, మిడ్‌క్యాప్‌పై ప్రభావం ఎక్కువ
→ స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి ఫిబ్రవరిలో రూ.3,722 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జనవరిలో వచ్చిన రూ.5,721 కోట్లతో పోల్చితే గణనీయంగా తగ్గాయి.
→ మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో పెట్టుబడులు రూ.5,148 కోట్ల నుంచి రూ.3,407 కోట్లకు క్షీణించాయి.
→ గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు)లోకి సైతం పెట్టుబడులు ఫిబ్రవరిలో రూ.1,980 కోట్లకు పరిమితమయ్యాయి. జనవరిలో రూ.3,751 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
→ అన్ని రకాల పథకాల్లోకి ఫిబ్రవరిలో రూ.40,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
→ సిప్ ఖాతాలు 10.16 కోట్లుగా ఉన్నాయి. ఫిబ్రవరిలో కొత్తగా 44.56 లక్షల సిప్ ఖాతాలు ప్రారంభం కాగా, 54.70 లక్షల ఖాతాలను ఇన్వెస్టర్లు నిలిపివేశారు.
ఫండ్స్ ఏయూఎంలో కుదుపు
మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల (ఏయూఎం) విలువ ఫిబ్రవరి నెలలో 4% పతనమైంది. జనవరి చివరికి ఉన్న రూ.67.25 లక్షల కోట్ల నుంచి ఫిబ్రవరి చివరికి రూ.64.53 లక్షల కోట్లకు తగ్గింది. తాజా నిధుల సమీకరణ తక్కువగా ఉండడం, అదే సమయంలో స్టాక్స్ విలువలు పతనం కావడం ఫండ్స్ ఏయూఎం నికరంగా రూ.2.72 లక్షల కోట్ల మేర ఆవిరైంది. 2022 జూన్ తర్వాత నెలవారీ ఏయూఎం(శాతంలో) ఇంత అధికంగా క్షీణించడం ఇదే తొలి సారి. విలువ క్షీణత పరంగా చూస్తే 2020 మార్చి నెల తర్వాత గరిష్టం కావడం గమనార్హం. మార్కెట్లో దిద్దుబాటు ప్రభావం పరిశ్రమపై ఏ మేరకు ఉందో ఈ గణాంకాలు చెబుతున్నాయి.
ఇన్వెస్టర్ల విశ్వాసం బలంగానే..
స్వల్పకాల ప్రతికూలతలు పెట్టుబడులపై ప్రభావం చూపించి ఉండొచ్చు. అయినప్పటికీ ఇన్వెస్టర్ల విశ్వాసం బలంగానే ఉంది. ఇప్పటికీ పెట్టుబడులు సానుకూలంగా ఉండడం దీన్నే సూచిస్తోంది. ఇన్వెస్టర్లు కాస్త అప్రమత్త ధోరణిని అనుసరిస్తూ, తమ దీర్ఘకాల పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోని తిరిగి పరిశీలించుకుంటున్నట్టు కనిపిస్తోంది.
– నేహల్ మెష్రామ్, సీనియర్ అనలిస్ట్, మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్
Comments
Please login to add a commentAdd a comment