
పరీక్ష రాసిన విద్యార్థులు 5.14 లక్షలు
17 వేల మంది గైర్హాజరు
విద్యార్థులకు ఉక్కపోత.. పలుచోట్ల తాగునీటి సమస్య
సాక్షి, హైదరాబాద్: చిన్నచిన్న సమస్యలు ఎదురైనప్పటికీ ఇంటర్మీడియట్ తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఫస్టియర్ ద్వితీయ భాష పరీక్షకు 5,14,184 మంది హాజరుకావాల్సి ఉండగా, 4,96,899 మంది హాజరయ్యారు. మొత్తంగా 17,010 (3.41 శాతం) మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. హైదరాబాద్‌లో అత్యధికంగా 244 పరీక్ష కేంద్రాల్లో 87,523 మంది ఫస్టియర్ పరీక్ష రాశారు.
వరంగల్, హన్మకొండలో రెండు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. పరీక్షల తీరును అధికారులు ప్రతిక్షణం పరిశీలించినట్టు ఇంటర్ పరీక్షల విభాగం ముఖ్య అధికారి జయప్రదాబాయ్ వెల్లడించారు. ఇంటర్ బోర్డ్ కార్యదర్శి కృష్ణ ఆదిత్య హైదరాబాద్ నారాయణగూడలోని రత్నా, జాహ్నవి, శ్రీచైతన్య కాలేజీలకు వెళ్లి పరీక్షల తీరును పరిశీలించారు.
ఇతర అధికారులు కూడా నగరంలోని పలు కాలేజీలను పరిశీలించారు. హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూంలోని 33 స్క్రీన్లను ప్రత్యేక సిబ్బంది పరీక్షలు పూర్తయ్యే వరకూ గమనించారు. పరీక్షకు సకాలంలో రావాలని ఇంటర్ బోర్డ్ పదేపదే సూచించినా కొన్నిచోట్ల విద్యార్థులు ఆలస్యంగా వచ్చారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో 162 మంది 9 గంటల తర్వాత పరీక్షకు హాజరయ్యారు.
అయితే ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్‌తో వారిని పరీక్షకు అనుమతించారు. ఖమ్మంలోని కొన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాల లింక్ ఆలస్యమవడంతో ప్రశ్నపత్రాల బండిల్ తెరవడం ఆలస్యమైంది. దీంతో విద్యార్థులు పావుగంట నష్టపోవాల్సి వచ్చింది. చాలాచోట్ల కమాండ్ కంట్రోల్ రూంనుంచి సకాలంలో సీసీ కెమెరాలు లింక్ అవ్వలేదన్న ఫిర్యాదులు అధికారులకు వచ్చాయి.
మారుమూల ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు. వరంగల్, ములుగు, భద్రాచలం, ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఫ్యాన్లు సరిగా పనిచేయకపోవడంతో ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని విద్యార్థులు తెలిపారు. తాగునీటి కోసం ఏర్పాట్లు చేసినా, ఆఖరి అరగంటలో 26 పరీక్ష కేంద్రాల్లో తాగునీరు అందక విద్యార్థులు సమస్యలు ఎదుర్కొన్నారు.
ఇంటర్ ఫస్టియర్ చదువుతు న్న నిర్మల్‌లోని బుధవార్‌పేట్ కాలనీకి చెందిన జుబేర్ (17) కొన్నేళ్లుగా నరాలకు సంబంధించిన అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. అయిన ప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షలకు హాజరు కావాలనే లక్ష్యంతో బుధవారం కుటుంబ సభ్యుల సహాయంతో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షా కేంద్రానికి హాజరయ్యాడు. స్క్రైబ్(సహాయకుడి) సహాయంతో పరీక్ష రాశాడు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్
పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని..
తండ్రి మృతి చెందినా పరీక్ష రాసిన కుమార్తె
వర్గల్ (గజ్వేల్): తండ్రి మృతి చెందిన బాధలోనూ కుమార్తె ఇంటర్ పరీక్ష రాసిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. వర్గల్‌కు చెందిన పసుల లింగం (50)కు భార్య యాద మ్మ, సాయికుమార్, తేజశ్రీ సంతానం. మంగళవారం రాత్రి కారులో లింగం తూప్రాన్ వెళ్లి తిరిగొస్తుండగా నాచా రం సమీపంలో వాహనం అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన లింగం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కాగా, రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందడం.. బుధవారం రోజే ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో.. పుట్టెడు దుఃఖంతోనూ తేజశ్రీ పరీక్షకు హాజరైంది.
Comments
Please login to add a commentAdd a comment