మంచిమాట
సాధారణంగా సంపద అంటే డబ్బులు అనుకుంటారు. కాని, సనాతన ధర్మం ఎప్పుడు కాగితం ముక్కల్ని కాని, లోహపు బిళ్ళలని కాని ధనంగా పరిగణించినట్టు కనపడదు. అష్టలక్ష్ములు అని చేప్పే సంపదలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ధనంగా చెప్పటం జరిగింది. సత్కార్యాలు చేయటానికి చేతి నిండుగా డబ్బు లేదే అని బాధ పడ నవసరం లేదు. మనకి ఎన్నో రకాలైన సంపదలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేయవచ్చు.
సంపదలు ఉంటే ఎన్నో సత్కార్యాలు చేయవచ్చు అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. సంపదలు అనుభవించటానికి మాత్రమే అని లోకంలో ఉన్న అభిప్రాయం. కానీ, అవి ఎన్ని పనులు చేయటానికో సాధనాలు. దురదష్టవంతులు, దుర్మార్గులు అయినవారికి పతనానికి హేతువులుఅవుతాయి. సంపద అంటే ఇతరులకి ఎంత ఇచ్చినా తరగనంత ఉన్నది. తాను అనుభవించటానికి లేదే అని కొద్దిగా కూడా బాధ పడవలసిన అవసరం లేనంత ఉండటం. ఎవరికైనా ఇవ్వాలంటే ముందు తన దగ్గర ఉండాలి కదా! ఇవ్వాలని ఉద్దేశం ఉంది కాని, తన దగ్గర తగినంత లేక పోతే ఏమి చేయగలరు ఎవరైనా? అందువల్ల ఎవరికైనా సహాయం చేయాలంటే తగినంత సమకూర్చుకోవలసి ఉంటుంది.
అన్నిటిని మించి ఆరోగ్యవంతమైన శరీరం ఉంది. దానితో శారీరకంగా బలహీనంగా ఉన్న వారికి సహాయం చేయ వచ్చు. బలహీనుడు మరొకరికి చేయూత నివ్వలేడు కదా! కనీసం ఈ సంపదని పెంపొందించు కోవచ్చు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం కోసమైనా ఆరోగ్యంగా, బలంగా ఉండాలి. అదీ కాక పోయినా, తాను ఇతరుల పైన ఆధార పడి ఉండకుండా ఉంటే అదే పెద్ద సహాయం. (నట్టింటి నుంచి.. నెట్టింటికి..)
మరొక ప్రధాన మైన సంపద జ్ఞానసంపద. ఇతరులకి జ్ఞానాన్ని పంచాలి అంటే తన దగ్గర ఉండాలి. ఎంత చదువుకుంటే ఏం లాభం? అంటూ ఉంటారు చాలా మంది. నిజమే! దానిని ఎవరికి పంచక, తన జీవితంలో ఉపయోగపరచక పోతే వ్యర్థమే. సార్థకం చేసుకోవాలంటే తనకున్న జ్ఞానాన్ని వీలైనంత మందికి పంచుతూ పోవాలి. ఈ మాట అనగానే నాకు పెద్ద పెద్ద డిగ్రీలు లేవు నేనేం చేయ గలను? అంటారు.
జ్ఞానం అంటే కళాశాలలలోనో, విశ్వవిద్యాలయాలలోనో చదివితే వచ్చేది కాదు. ఆ చదువు సహజంగా ఉన్న దానికి సహకరించ వచ్చు. అనుభవంతో, లోకాన్ని పరిశీలించటంతో వచ్చేది ఎక్కువ. ఆ జ్ఞానాన్ని తన వద్దనే ఉంచుకోకుండా పదిమందికి పంచితే నశించకుండా తరువాతి తరాలకి అందుతుంది. అందుకే ధర్మశాస్త్రాలు కూడా ఏదైనా విషయంలో కలిగిన సందేహానికి పరిష్కారం గ్రంథాలలో లభించక పోతే ఆ కుటుంబంలో వృద్ధురాలైన మహిళని అడగమని చెప్పాయి. అనుభవ జ్ఞానం అంత గొప్పది.
అన్నిటినీ మించినది ప్రేమ. దీనితోఎన్నిటినో సాధించవచ్చు. ఈ సంపద పంచిన కొద్ది పెరుగుతూ ఉంటుంది. మనం ఇచ్చినదే మన సంపద. దాచుకున్నది ఏమవుతుందో తెలియదు. మనం అన్ని విధాలా సంపన్నులం అయే మార్గం తెలిసింది కదా!
శారీరికంగా ఏమీ చేయలేనప్పుడు ఏ మాత్రం కష్టపడకుండా చేయగలిగిన సహాయం కూడా ఉంది. అది మాట సాయం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న వారికి మాట సహాయం చేయవచ్చు. తాను చేయ లేక పోయినా, చేసే వారిని చూపించ వచ్చు. అది కూడా తనకి అందుబాటులో లేక పోతే కష్టంలో ఉన్నప్పుడు ఓదార్పుగా ఒక్క మాట చెపితే ఎంతో ధైర్యం కలుగుతుంది. మాట్లాడితే నోటి ముత్యాలు రాలిపోవుగా! ఇదీ చేయటం రాక పోతే ఊరకున్నంత ఉత్తమం లేదు. పిచ్చి మాటలు మాట్లాడి చెడగొట్టకుండా ఉండటం కూడా గొప్ప సహాయమే అంటారు తెలిసిన పెద్దలు. నేర్పుగా మాట్లాడిన ఒక్క మాటతో సమస్యల పరిష్కారం, బాధల నుండి ఓదార్పు దొరకటం చూస్తూనే ఉంటాం.
– డా. ఎన్. అనంతలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment