Good deeds
-
సంపదలు సత్కార్యాలకు ద్వారాలు
సాధారణంగా సంపద అంటే డబ్బులు అనుకుంటారు. కాని, సనాతన ధర్మం ఎప్పుడు కాగితం ముక్కల్ని కాని, లోహపు బిళ్ళలని కాని ధనంగా పరిగణించినట్టు కనపడదు. అష్టలక్ష్ములు అని చేప్పే సంపదలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ధనంగా చెప్పటం జరిగింది. సత్కార్యాలు చేయటానికి చేతి నిండుగా డబ్బు లేదే అని బాధ పడ నవసరం లేదు. మనకి ఎన్నో రకాలైన సంపదలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేయవచ్చు.సంపదలు ఉంటే ఎన్నో సత్కార్యాలు చేయవచ్చు అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. సంపదలు అనుభవించటానికి మాత్రమే అని లోకంలో ఉన్న అభిప్రాయం. కానీ, అవి ఎన్ని పనులు చేయటానికో సాధనాలు. దురదష్టవంతులు, దుర్మార్గులు అయినవారికి పతనానికి హేతువులుఅవుతాయి. సంపద అంటే ఇతరులకి ఎంత ఇచ్చినా తరగనంత ఉన్నది. తాను అనుభవించటానికి లేదే అని కొద్దిగా కూడా బాధ పడవలసిన అవసరం లేనంత ఉండటం. ఎవరికైనా ఇవ్వాలంటే ముందు తన దగ్గర ఉండాలి కదా! ఇవ్వాలని ఉద్దేశం ఉంది కాని, తన దగ్గర తగినంత లేక పోతే ఏమి చేయగలరు ఎవరైనా? అందువల్ల ఎవరికైనా సహాయం చేయాలంటే తగినంత సమకూర్చుకోవలసి ఉంటుంది. అన్నిటిని మించి ఆరోగ్యవంతమైన శరీరం ఉంది. దానితో శారీరకంగా బలహీనంగా ఉన్న వారికి సహాయం చేయ వచ్చు. బలహీనుడు మరొకరికి చేయూత నివ్వలేడు కదా! కనీసం ఈ సంపదని పెంపొందించు కోవచ్చు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం కోసమైనా ఆరోగ్యంగా, బలంగా ఉండాలి. అదీ కాక పోయినా, తాను ఇతరుల పైన ఆధార పడి ఉండకుండా ఉంటే అదే పెద్ద సహాయం. (నట్టింటి నుంచి.. నెట్టింటికి..)మరొక ప్రధాన మైన సంపద జ్ఞానసంపద. ఇతరులకి జ్ఞానాన్ని పంచాలి అంటే తన దగ్గర ఉండాలి. ఎంత చదువుకుంటే ఏం లాభం? అంటూ ఉంటారు చాలా మంది. నిజమే! దానిని ఎవరికి పంచక, తన జీవితంలో ఉపయోగపరచక పోతే వ్యర్థమే. సార్థకం చేసుకోవాలంటే తనకున్న జ్ఞానాన్ని వీలైనంత మందికి పంచుతూ పోవాలి. ఈ మాట అనగానే నాకు పెద్ద పెద్ద డిగ్రీలు లేవు నేనేం చేయ గలను? అంటారు. జ్ఞానం అంటే కళాశాలలలోనో, విశ్వవిద్యాలయాలలోనో చదివితే వచ్చేది కాదు. ఆ చదువు సహజంగా ఉన్న దానికి సహకరించ వచ్చు. అనుభవంతో, లోకాన్ని పరిశీలించటంతో వచ్చేది ఎక్కువ. ఆ జ్ఞానాన్ని తన వద్దనే ఉంచుకోకుండా పదిమందికి పంచితే నశించకుండా తరువాతి తరాలకి అందుతుంది. అందుకే ధర్మశాస్త్రాలు కూడా ఏదైనా విషయంలో కలిగిన సందేహానికి పరిష్కారం గ్రంథాలలో లభించక పోతే ఆ కుటుంబంలో వృద్ధురాలైన మహిళని అడగమని చెప్పాయి. అనుభవ జ్ఞానం అంత గొప్పది. అన్నిటినీ మించినది ప్రేమ. దీనితోఎన్నిటినో సాధించవచ్చు. ఈ సంపద పంచిన కొద్ది పెరుగుతూ ఉంటుంది. మనం ఇచ్చినదే మన సంపద. దాచుకున్నది ఏమవుతుందో తెలియదు. మనం అన్ని విధాలా సంపన్నులం అయే మార్గం తెలిసింది కదా! శారీరికంగా ఏమీ చేయలేనప్పుడు ఏ మాత్రం కష్టపడకుండా చేయగలిగిన సహాయం కూడా ఉంది. అది మాట సాయం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న వారికి మాట సహాయం చేయవచ్చు. తాను చేయ లేక పోయినా, చేసే వారిని చూపించ వచ్చు. అది కూడా తనకి అందుబాటులో లేక పోతే కష్టంలో ఉన్నప్పుడు ఓదార్పుగా ఒక్క మాట చెపితే ఎంతో ధైర్యం కలుగుతుంది. మాట్లాడితే నోటి ముత్యాలు రాలిపోవుగా! ఇదీ చేయటం రాక పోతే ఊరకున్నంత ఉత్తమం లేదు. పిచ్చి మాటలు మాట్లాడి చెడగొట్టకుండా ఉండటం కూడా గొప్ప సహాయమే అంటారు తెలిసిన పెద్దలు. నేర్పుగా మాట్లాడిన ఒక్క మాటతో సమస్యల పరిష్కారం, బాధల నుండి ఓదార్పు దొరకటం చూస్తూనే ఉంటాం. – డా. ఎన్. అనంతలక్ష్మి -
ప్రవక్త జీవితంలో ముఖ్య ఘట్టం.. మొహర్రం
ఇస్లామీయ క్యాలండర్ ప్రకారం సంవత్సరంలోని మొదటి నెల ‘మొహర్రం ’. ప్రతి సంవత్సరం ఈ నెల వస్తూనే ముహమ్మద్ ప్రవక్త (స) వారి జీవితంలోని ఓ ముఖ్యమైన ఘట్టం మనసులో మెదులుతుంది. అదే ‘హిజ్రత్’. (మక్కా నుండి మదీనాకు వలస). హిజ్రత్ తరువాతనే ధర్మానికి జవసత్వాలు చేకూరాయి, ధర్మం ఎల్లెడలా విస్తరించింది. ధర్మ పరిరక్షణ, మానవ సేవ, మానవులకు సత్య సందేశాన్ని అందించడం లాంటి మహత్తర ఆశయం కోసం కష్ట నష్టాలను సహించాల్సి వచ్చినా, చివరికి స్వదేశాన్ని విడిచి వలస వెళ్ళవలసి వచ్చినా వెనకాడకూడదనే విషయాన్ని ముహర్రం ప్రతి సంవత్సరం విశ్వాసులకు గుర్తు చేస్తూ ఉంటుంది.దేవుడు భూమ్యాకాశాలను సృష్టించిన నాటినుండి నెలల సంఖ్య పన్నెండు మాత్రమే. వాటిలో నాలుగు పవిత్ర మాసాలు’. అందులో ‘మొహర్రం’ కూడా ఒకటి. ప్రవక్త(స) ప్రవచనం ప్రకారం: ‘పన్నెండు నెలలు ఒక సంవత్సరం. అందులో నాలుగు నెలలు గౌరవప్రదమైనవి. జుల్ ఖ అద, జుల్ హిజ్జ, ముహర్రమ్, రజబ్. కనుక ఈ నెలలో ఎక్కువగా సత్కార్యాలు ఆచరిస్తూ పాపాలకు దూరంగా ఉండాలి. సమాజంలో సత్యం, న్యాయం, ధర్మం, మానవీయ విలువల పరిరక్షణకు కృషి చేయాలి. సమాజంలో ప్రబలిన అన్ని రకాల చెడులను రూపుమాపడానికి ప్రయత్నం చేయాలి. సతతం దైవ భీతి (తఖ్వా) తో గడపాలి. అప్పుడే దైవ సహాయం లభిస్తుంది. ఈ నెల ఘనతకు సంబంధించి ముహమ్మద్ ప్రవక్త(స) ఇలా అన్నారు. ‘ముహర్రం అల్లాహ్ నెల. రమజాన్ ఉపవాసాల తరువాత శ్రేష్టమైన ఉపవాసాలు ముహర్రం ఉపవాసాలే.’ (సహీహ్ ముస్లిం: 2755) రమజాను ఉపవాసాలు ఫర్జ్ కాక ముందు ఆషూర (ముహర్రం పదవ తేది) ఉపవాసం విధిగా ఉండేది. అదే రోజు కాబాపై కొత్తవస్త్రం కప్పేవారు. ప్రవక్త మహనీయులు మదీనాకు వలస వెళ్ళిన తరువాత, అక్కడి యూదులు రోజా (ఉపవాసం) పాటించడం గమనించారు. అది ముహర్రం పదవ తేదీ. (యౌమె ఆషూరా) అప్పుడు ప్రవక్త వారు, ‘ఏమిటి ఈరోజు విశేషం?’ అని వారిని అడిగారు. దానికి వారు, ‘ఇది చాలా గొప్పరోజు. ఈ రోజే దైవం మూసా ప్రవక్త(అ) ను, ఆయన జాతిని ఫిరౌన్ బారినుండి రక్షించాడు. అప్పుడు మూసా ప్రవక్త, దైవానికి కృతజ్ఞతగా రోజా పాటించారు. కనుక మేము కూడా ఆయన అనుసరణలో ఈ రోజు ఉపవాసం పాటిస్తాము’. అని చె΄్పారు. అప్పుడు ప్రవక్తమహనీయులు, ‘మూసా ప్రవక్త అనుసరణలో రోజా పాటించడానికి మీకంటే మేమే ఎక్కువ హక్కుదారులం’ అని చెప్పి, తమ అనుచరులకు రోజా పాటించమని ఉపదేశించారు. ముహర్రం మాసం 9, 10 లేదా 10, 11 కాని రెండురోజులు రోజా (ఉపవాసం) పాటించాలి. ఆషూరా ఉపవాసం పాటించడం వల్ల గత సంవత్సరకాలం పాపాలు మన్నించబడతాయని కూడా ఆయన సెలవిచ్చారు. (సహీహ్ ముస్లిం 1162).మొహర్రం నెల ్రపాముఖ్యం, హజ్రత్ ఇమామె హుసైన్ (ర) అమరత్వం మామూలు విషయం కాదు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ, ధర్మసంస్థాపన, దైవప్రసన్నతే ధ్యేయంగా సాగిన సమరంలో హజ్రత్ ఇమామె హుసైన్, ఆయన పరివారం వీరమరణం పొందారు. అందుకని ఆయన ఏ లక్ష్యం కోసం ్రపాణాలను సైతం లెక్క చేయకుండా ΄ోరాడి అమరుడయ్యారో మనం దాని నుంచి ప్రేరణ పొందాలి. సమాజంలో దుర్మార్గం ప్రబలినప్పుడు, ఉన్మాదం జడలు విప్పినప్పుడు, విలువల హననం జరుగుతున్నప్పుడు, సమాజ శ్రేయోభిలాషులు, న్యాయప్రేమికులు, ΄ûరసమాజం తక్షణం స్పందించాలి. న్యాయం కోసం, ధర్మం కోసం, మానవీయ విలువల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం శక్తివంచన లేకుండా ΄ోరాడాలి. ఇదే ఇమామె హుసైన్ అమరత్వం మనకిస్తున్న సందేశం.( 17, బుధవారం మొహర్రం – యౌమె ఆషూరా)కాకతాళీయంగా ‘కర్బలా’ సంఘటన కూడా ఇదే రోజున జరగడం వల్ల దీని ్రపాముఖ్యత మరింతగా పెరిగి΄ోయింది. అంతమాత్రాన ముహర్రం నెలంతా విషాద దినాలుగా పరిగణించనక్కర లేదు. ఎందుకంటే సత్యం కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం, విలువల కోసం, హక్కులకోసం, ఇస్లామీయ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం హజ్రత్ ఇమామె హుసైన్ (ర) అమరగతి పొందిన చారిత్రక రోజది. అమరత్వం అనేది మానవ సహజ భావోద్రేకాల పరంగా బాధాకరం కావచ్చునేమోగాని, విషాదం ఎంతమాత్రం కాదు. ‘కర్బలా’ సాక్షిగా ఒక విశ్వాసి ΄ోషించవలసిన పాత్రను ఆయన ఆచరణాత్మకంగా నిరూపించారు. అందుకే ఆ మహనీయుడు అమరుడై దాదాపు వేయిన్నర సంవత్సరాలు కావస్తున్నా, నేటికీ కోట్లాదిమంది ప్రజలకు, ప్రజాస్వామ్య ప్రియులకు ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలిచారు. అందుకే ప్రతియేటా ‘మొహర్రం’ నెలలో ఆయన త్యాగాన్ని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు స్మరించుకుంటారు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
స్వభావం
‘‘బట్టతలకి స్వభావానికి మందు లేదు.’’ అన్న మాట అందరికీ తెలిసినదే. స్వభావం అంటే ఏమిటి? ‘స్వ’ అంటే తన యొక్క ‘భావం’ అంటే సహజ లక్షణం, లేదా సహజ గుణం. ‘సహ’ అంటే కలిసి ‘జ’ అంటే పుట్టినది. అంటే, ఒక వ్యక్తితో పాటు పుట్టేది అని అర్థం. ఒక గురువుగారు శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. దారిలో ఒక ఏరు దాటవలసి వచ్చింది. ప్రవాహం మధ్యలో ఒక తేలు నీటిలో కొట్టుకుపోతూ కనిపించింది. ఒక ఆకు మీద దానిని ఎక్కించారు. పట్టుకోగానే అది కుట్టింది. బాధగా వేలిని రుద్దుకున్నారు. కొద్దిసేపటికి అది మళ్ళీ నీళ్ళలో పడిపోయింది. తిరిగి అదే పని చేశారు. అది కూడా తన పని తాను చేసింది. చేతిని గట్టిగా విదిలించారు. మూడోసారి మళ్ళీ నీళ్ళలో పడిపోయింది. ఈలోపు గట్టు వచ్చింది. తేలుని పట్టుకుని నేల మీద వదిలారు. మళ్ళీ ముద్దు పెట్టుకుంది. ఒక శిష్యుడికి సందేహం కలిగింది. గురువుగారు మేధావి కదా! ఇంత తెలివితక్కువగా ఎందుకు ప్రవర్తించారు? అని. ‘‘రెండుమార్లు కుట్టినా మూడోమారు కూడా ఎందుకు కాపాడారు?’’ అని అడిగాడు. ‘‘కుట్టటం దాని స్వభావం. దానిని తేలు మార్చుకోలేదు. కాపాడటం అనే నా స్వభావాన్ని నేను ఎందుకు మార్చుకోవాలి?’’ అని సమాధానం చెప్పారు. స్వభావం అంటే తన యొక్క, ‘భావం’ తత్త్వం. తనతనం. అది పుట్టుకతో వస్తుంది. ‘‘పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతోనే’’ అనే సామెత తెలుసు కదా! అంటే మారదు అని అర్థం. దీనిని వంకగా పెట్టుకుని తమలో ఉన్న చెడు స్వభావాన్ని మార్చుకునే ప్రయత్నం చేయరు చాలా మంది. ఇదే మనిషి పురోభివృద్ధిని నిర్ణయించే ప్రధాన అంశం. సుమారుగా అందరికీ చాలా విషయాలు తెలుసు. ఏది మంచి ఏది చెడు అన్నదీ తెలుసు. తెలిసిన దానిని ఎంత వరకు ఆచరణలో పెట్టారు? అన్న దాని వల్ల పురోభివృద్ధిలో వ్యత్యాసం వస్తుంది. దానికి కారణం స్వభావం. స్వభావం సరిదిద్దుకో వలసినది అయితే చాలా ప్రయత్నం చేయ వలసి ఉంటుంది. ముందుగా మార్చుకోవాలి అనే సంకల్పం ఉండాలి. క్రమంగా, నిలకడగా ప్రయత్నం చేయాలి. మూతిని కట్టేసినా మాట్లాడకుండా ఉండలేని వారి చేత పాఠాలని చదివించిన ఉపాధ్యాయులని చూశాం. పెరిగాక వారిని యాంకర్లుగా చేస్తే సరి. పాఠం చదవటం వల్ల ఉచ్ఛారణ స్పష్టంగా ఉంటుంది. ఆగకుండా మాట్లాడి మంచి పేరు తెచ్చుకుంటారు. స్వభావాన్ని అనుకూలంగా ఉపయోగించుకునే మార్గం ఇది. అదేవిధంగా అబద్ధాలు ఆడే పిల్లవాడు ఉంటే, వాడి చేత కథలు రాయిస్తే వాడి సృజనాత్మకత అంతా అక్కడ చూపించటం జరుగుతుంది. నోరు విప్పని వారు ఉంటారు కొందరు. వారు రహస్యసమాచార శాఖలలో రాణిస్తారు. వ్యక్తి స్వభావాన్ని అనుసరించి తగినమార్గంలో పెడితే ఉన్నతస్థితికి చేరుకుంటారు. ఏదీ పనికి రానిది అని చెప్పటానికి వీలు లేదు. ‘స్వభావో దురతిక్రమః’’ మారదు కనుక మలచుకోవచ్చు. మంచి పనులు చేయటం ద్వారా మంచి స్వభావాన్ని పెంపొందించుకోవచ్చు. కనీసం మంచికి, మందికి ఉపయోగ పడవచ్చు. ఉదాహరణకి దేనిని చూసినా సొంతం చేసుకోవాలనే గుణం ఉంది అనుకుందాం. తప్పు అని తెలిసినా మనసు అదుపులో ఉండదు. అటువంటి వారిలో దొంగతనం అనే రోగం పోగొట్టటం ఎట్లా? వారి చేత ఇతరులకి ఇప్పిస్తూ ఉండాలి. అది తనదే కానక్కర లేదు. తీసుకున్న వారి ముఖంలో కనపడే ఆనందం చూసి ‘సెరిటోనిన్’ అనే హార్మోను విడుదల అయి వారికి ఆనందం కలిగిస్తుంది. అప్పుడు ఇతరుల వస్తువులని తీసుకోవాలనే స్వభావం క్రమక్రమంగా దూరమవుతుంది. కనీసం ఆలోచన ఆచరణ రూపం ధరించదు. – డా. ఎన్. అనంతలక్ష్మి -
రెండు నెలల మాసం.. శ్రావణం!.. ఈ నెలంతా శుభకార్యాలకు విరామం
ఖమ్మంగాంధీచౌక్ : ఈ ఏడాది శ్రావణ మాసానికి ఓ ప్రత్యేకత ఉంది. ఏటా నెల పాటు మాత్రమే ఉండే శ్రావణమాసం ఈ ఏడాది రెండు నెలల పాటు ఉండనుంది. ఇందులో ఓ మాసం అశుభకరం.. మరొకటి శుభకరమని పండితులు చెబుతున్నారు. శ్రావణమాసం అనగానే హిందువులు శుభకార్యాలను నిర్వహించుకునే నెలగా భావిస్తారు. అయితే నేటి(మంగళవారం) నుంచి శ్రావణం మొదలవుతున్నా దీనిని అధిక శ్రావణమాసంగా పిలవనుండడంతో శుభకార్యాలు నిర్వహించడానికి వీలుండదు. ఇక ఆగస్టు 17 నుంచి వచ్చే రెండో(నిజ) శ్రావణమాసంలో మాత్రం శుభ కార్యాలు నిర్వహించుకునేందుకు అవకాశం ఉంది. మూడేళ్లకోసారి ఒక నెల అధికం ప్రతీ మూడేళ్లకోసారి ఒక నెల అధికంగా వస్తుంది. ఈ సంవత్సరం తెలుగు క్యాలెండర్లో 13 నెలలు ఉండగా.. దీనిలో శ్రావణ మాసం రెండుసార్లు వచ్చింది. అంటే అధిక మాసం రావడంతో మొదటి నెలకు అధిక శ్రావణంగా, రెండో మాసాన్ని నిజ శ్రావణమాసంగా పిలుస్తారు. సూర్య, చంద్రుల కాలగణన ఆధారంగా ప్రతీ మూడేళ్లకోసారి వచ్చే అధిక మాసం ఈ ఏడాది శ్రావణ మాసంలో.. 19 ఏళ్ల తర్వాత వచ్చిందని, మళ్లీ 2042లో వస్తుందని పండితులు స్పష్టం చేస్తున్నారు. అధిక మాసాన్ని పురుషోత్తమ మాసంగా పిలవనుండగా.. మత విశ్వాసాల ప్రకారం ఎలాంటి శుభ కార్యాలు నిర్వహించరు. నేటి నుంచి అధిక శ్రావణమాసం ఆషాఢ మాసం సోమవారంతో పూర్తి కాగా, మంగళవారం నుంచి శ్రావణ మాసం ఆరంభమవుతోంది. ఆగస్టు 16 వరకు అధిక శ్రావణ మాసంగా ఉండనుండగా.. ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలు తలపెట్టరాదని పండితులు సూచిస్తున్నారు. అలాగే, ప్రత్యేక పూజలు చేయకపోవటం మంచిదని చెబుతున్నారు. ఈ మాసం శ్రీమహా విష్ణువుకు ప్రీతికరమైనది కాగా పురుషోత్తమ మాసంగా పేరు ప్రసాదించారు. ఈ మాసంలో చేపట్టే దైవకార్యాలు ఫలాలను ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో విష్ణుహస్రనామాలు పఠించటం, పితృ ఆరాధన, దాన ధర్మాలు వంటివి చేయటం మంచిదని వెల్లడించిన పండితులు.. వివా హాలు చేయడం, నూతన వ్యాపారాలు ఆరంభించడం, ఆస్తి కొనుగోళ్లు, ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన, ఉపనయనం వంటి కార్యక్రమాలు చేపట్టొద్దని సూచిస్తున్నారు. నెల ఆగితేనే ‘నిజ శ్రావణం’ అధిక శ్రావణ మాసం ఆగస్టు 16తో ముగిశాక 17 నుంచి నిజ శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఈ నెలంతా ఏటా శ్రావణంలో జరుపుకున్నట్లుగా ప్రత్యేక పూజలు, శుభకార్యాలు జరుపుకోవచ్చని అర్చకులు తెలిపారు. సెప్టెంబర్ 15 వరకు కొనసాగే నిజ శ్రావణంలో పండుగలు, శుభ కార్యాలే కాక శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతాలు జరుపుకోవడం, వివాహాలు, గృహ ప్రవేశాలు, నూతన వ్యాపారాల ఆరంభం, నూతన గృహాల శంకుస్థాపనలు వంటివి నిర్వహించవచ్చని పండితులు పేర్కొంటున్నారు. ఆగస్టు వరకు ముహూర్తాలు లేవు... అధిక శ్రావణ మాసం కారణంగా ఆగస్టు నెల వరకు వివాహాలకు ముహూర్తాలు లేవు. ఇతర శుభకార్యాలు చేయడం కూడా మంచిది కాదు. ఆగస్టు 17 నుంచి నిజ శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. అప్పుడే మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఏదైనా శుభకార్యాలు చేయాలనుకునే వారు పురోహితులను సంప్రదించి సరైన తేదీ ఎంచుకుంటే మంచిది. – విశ్వనాథశర్మ, ఉద్యోగ,అర్చక సంఘం జిల్లా అధ్యక్షుడు, భద్రాచలం శుభకార్యాలకు తావులేదు.. అధిక శ్రావణంలో శుభకార్యాలకు తావులేదు. నూతన గృహ ప్రవేశాలు, శంకుస్థాపనల వంటి శుభ కార్యక్రమాలు చేపట్టవద్దు. పితృకార్యాలు చేసేవారు అధిక మాసంతో పాటు నిజమాసంలో రెండు సార్లు చేయాలి. అలాగే, దైవ కార్యాలకు ఎలాంటి నియమం లేదు. నూతనంగా వివాహమైన వధువు నిజ శ్రావణంలో మాత్రమే అత్తవారింటికి వెళ్లాలి. – దాములూరి కృష్ణశర్మ, అర్చకులు,శ్రీ గుంటు మల్లేశ్వర స్వామి ఆలయం, ఖమ్మం -
మంచి మాట: ఆత్మ నిగ్రహం అసలైన బలం
మనస్సు చంచలమైనది. అది నిరంతరం ఏదో ఒక దానిని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలాంటి మనస్సును స్వేచ్ఛగా వదిలేస్తే ఇంద్రియాలకు అధీనమైపోతుంది. కామక్రోధాదులను బలపరుస్తుంది. అహంకార మమకారాలను వృద్ధి చేస్తుంది. ఈ క్రమంలో ఇంద్రియాలకు లాలసుడైన మనిషి విచక్షణను కోల్పోయి క్షణిక సుఖాలకు దగ్గర అవుతాడు. దీంతో అతని అభివృద్ధి నిలిచిపోయి అథః పాతాళంలోకి పడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మనస్సును ఎప్పటికప్పుడు విమర్శ చేసుకొంటూ ఇంద్రియ వశం కాకుండా మంచి పనులు మాత్రమే చేయాలనే నిబద్ధతతో సత్సాంగత్యం తో మనసును అదుపులో పెట్టుకోవాలి. అలా మనస్సును అధీనంలో ఉంచుకోవడమే మనో నిగ్రహం. మనోస్థైర్యం దానికి ఆలంబన. 3చంచలమైన మనస్సును నిశ్చలంగా చేయడం సాధారణమైన విషయం కాదు. సామాన్యులకే కాదు, అత్యంత శూరుడైన అర్జునికి కూడా మనస్సును నిగ్రహించుకోవడం సాధ్యం కాలేదు. యుద్ధంలో ప్రతిపక్షం మీద దృష్టి సారించి తన తాత భీష్ముడు, గురువు ద్రోణాచార్యుడు, గురుపుత్రుడు అశ్వత్థామ, దాయాదులైన కౌరవ సోదరులను చూసి విషాదంలో పడిపోయాడు. వారంతా తన స్వజనం కావడంతో యుద్ధం చేయడానికి అతనికి మనస్కరించలేదు. దాంతో అతని మనస్సు నిగ్రహాన్ని కోల్పోయింది. ధనుర్బాణాలు పక్కన పడేసి, నైరాశ్యంలో కూరుకుపోయాడు. ఇది గమనించిన శ్రీ కృష్ణుడు అర్జునుణ్ణి యుద్ధానికి సన్నద్ధం చేయడానికి ఎంతో శ్రమ పడాల్సి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 అధ్యాయాలుగా ఉండే భగవద్గీతను బోధించాడు. భౌతికమైనవి, తాత్వికమైనవి అనేకానేక విషయాలు తాను గురువుగా మారి అర్జునునికి బోధించాడు. దాంతో అర్జునుడు శత్రువులను సంహరించడానికి సిద్ధపడ్డాడు. అర్జునుడు మనోనిగ్రహాన్ని తిరిగి పొందడం వల్లనే తిరిగి తన ధర్మాన్ని తాను నిర్వర్తించాడు. దీనినే మనం నిత్య జీవిత పోరాటంలో పాఠంగా మలచుకోవాలి. ఆ పాఠం మనల్ని సత్య సంధులుగా, న్యాయపరులుగా, నీతివేత్తలుగా తీర్చిదిద్దుతుంది. అందుకే భగవద్గీతను కంఠోపాఠంగా కాకుండా జీవన వెలుగు దివిటీగా చేసుకోమంటారు పెద్దలు. ప్రవరాఖ్యుడికున్నంత మనోనిగ్రహం అందరికీ ఉండాలన్నది శాస్త్ర వచనం. ప్రవరాఖ్యుడు ఒకసారి హిమాలయాలు చూడడానికి వెళ్ళాడు. సిద్ధుడిచ్చిన లేపనం అక్కడ కరిగి పోయింది. కష్టకాలం వచ్చింది. అక్కడ అమిత సౌందర్యవతి అయిన గంధర్వ కాంత కనిపించింది. ఆమెను దారి చెప్పమని ప్రవరాఖ్యుడు అడిగాడు. కానీ ఆమె అతనిని తనను వివాహమాడమని తియ్యని మాటలెన్నో చెప్పింది. ప్రవరాఖ్యుడు ఆమె మాటలకు చలించలేదు. అందాలు ఆరబోసి అతనిని రెచ్చగొట్టినప్పటికీ అతడు నిగ్రహాన్ని విడిచిపెట్టకుండా తన భార్యను, బంధువులను గుర్తు పెట్టుకున్నాడు. ప్రవరాఖ్యుడి వలెనే అందరూ మనో నిగ్రహంతో ముందుకు వెళ్ళాలంటోంది సనాతన ధర్మం. అయితే దీనిని భక్తిమార్గంలో నడవడం వల్లనే సులువుగా సాధించవచ్చు. మనో నిగ్రహం అలవడితే దివ్యశక్తి ఆవహిస్తుంది. సద్గుణ సంపన్నులు అవుతారు. భక్తి, జ్ఞాన, వైరాగ్య భావనలు కలిగి, సమదృష్టి అలవడుతుంది. ఆత్మజ్ఞానాన్ని అవగతం చేస్తుంది. మనోనిగ్రహం ఆధ్యాత్మిక సాధనకు అత్యవసరం. లౌకిక విషయాల సాధనకు కూడా మనో నిగ్రహం అవసరం. అలాంటపుడే మనిషి సజ్జనుడిగా నలుగురిలో కీర్తింపబడతాడు. చంచల చిత్తమైన మనస్సును, విషయ లోలత్వం నుంచి మరల్చి ఆత్మయందే స్థాపితం చేసి ఆత్మకు సర్వదా అధీనమై ఉండేటట్లు చేయాలని భగవద్గీతతో సహా ఇంచుమించు ఇతర మతగ్రంథాలన్నీ ప్రబోధించాయి. మనస్సును జయిస్తే చాలు. ముల్లోకాలను జయిస్తారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనేవి అదుపులో ఉంటాయి. దుర్గుణాలు సద్గుణాలుగా మారి శాంతి సౌఖ్యాలనిస్తాయి. అయితే ఆత్మనిగ్రహానికి ఆత్మ స్థైర్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఆత్మస్థైర్యం ఉన్న మనిషికి ఆత్మ నిగ్రహం ఏర్పడుతుంది. ఆత్మ పట్ల నమ్మకం, విశ్వాసం ప్రోది చేసుకున్న వ్యక్తి ఆత్మ స్థైర్యాన్ని సంపూర్ణంగా కైవసం చేసుకోవచ్చు. స్వార్థరహితమైన మనసు, ప్రవృత్తి, వ్యాపకం వంటివి మనిషి ధీరోదాత్తతకు ఉపకరణాలు. ఏ ప్రలోభాలకూ లొంగని స్వభావం వల్ల మనిషి ఆత్మస్థైర్యాన్ని సంతరించుకుంటాడు. దైవం పట్ల ప్రత్యేక శ్రద్ధ లేకపోయినప్పటికీ తన పట్ల గురి, నమ్మకం ఉన్న వ్యక్తి ఆత్మస్థైర్య సంభూతుడే అవుతాడు. ప్రతిభ ఉండీ పిరికితనం వల్ల మనిషి చాలా పోగొట్టుకుంటాడు. ఆత్మస్థైర్యం మనిషి శక్తి సామర్థ్యాలను ద్విగుణీకృతం చేస్తుంది. ఆత్మ స్థైర్యం ఓ బలవర్ధక పానీయం వంటిది. అది పిరికితనాన్ని పారదోలుతుంది. విద్యార్జనకు, ఆరోగ్యసాధనకు తోడ్పడుతుంది. భిన్నత్వం గల సమాజంలో ఏకతా భావన సాధించేందుకు తగిన బలాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మిక సాధన లో సైతం ముందుకు సాగేందుకు తోడ్పడుతుంది. అందువల్ల జీవితంలో ఉన్నత సోపానాలను అధిరోహించాలనుకునే ప్రతి వ్యక్తి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకుంటే ఆత్మనిగ్రహం దానికదే సొంతమవుతుంది. ఆత్మనిగ్రహానికి ఆత్మ స్థైర్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఆత్మస్థైర్యం ఉన్న మనిషికి ఆత్మ నిగ్రహం ఏర్పడుతుంది. ఆత్మ పట్ల నమ్మకం, విశ్వాసం ప్రోది చేసుకున్న వ్యక్తి ఆత్మ స్థైర్యాన్ని సంపూర్ణంగా కైవసం చేసుకోవచ్చు. స్వార్థరహితమైన మనసు, ప్రవృత్తి, వ్యాపకం వంటివి మనిషి ధీరోదాత్తతకు ఉపకరణాలు. ఏ ప్రలోభాలకూ లొంగని స్వభావం వల్ల మనిషి ఆత్మస్థైర్యాన్ని సంతరించుకుంటాడు. – దాసరి దుర్గాప్రసాద్ -
మంచి పని దయ ఎక్కడో... దైవం అక్కడ!
కొందరు మంచి పనులు చెయ్యాలనుకుంటారు. కానీ ఏం చేయాలో, ఎలా చేయాలో తెలీదు. ఇంకొందరు తాము చెయ్యాలనుకుంటున్న సాయం ఎంతమేరకు ప్రయోజనకరంగా ఉంటుందో అని సందేహపడుతూ కొంతకాలం, తగిన మార్గం తోచక కొంతకాలం, తోచినా కూడా తర్వాత చేద్దాంలే అని మరికొంతకాలం తాత్సారం చేస్తూ చివరికి ఏ పనీ చేయకుండానే పుణ్యకాలం కాస్తా గడిపేస్తారు. అయితే మంచి పనులు చేసిన వారి జాబితా అంతా ఒక చోట రాసి, అందులో వారు ఏం చేశారో, ఆ పనిని ఎలా చేశారో ఎవరైనా రాస్తే ఎలా ఉంటుంది? అవన్నీ చదివిన తర్వాత తప్పక మంచి ఆలోచనలు వస్తాయి, ‘మంచి’తో మమకారం ఏర్పడుతుంది. సరిగ్గా ఇలాగే ఆలోచించారు ప్రముఖ రచయిత మల్లాది. అందుకే మంచి పనులు చేసిన వారి వివరాలన్నింటినీ ఓపిగ్గా సేకరించి, వాటన్నింటినీ ఒక చోట గుదిగుచ్చారు. దానికి ‘గుడ్ బెటర్ బెస్ట్’ అనే పుస్తక రూపమిచ్చారు. ఇందులో దేశవ్యాప్తంగా రకరకాలైన మంచి పనులు చేసిన వారి గురించి ఎంతో క్లుప్తంగా, మరెంతో ఆప్తంగా పొందుపరిచారు. ప్రపంచ ప్రఖ్యాతుల దగ్గర నుంచి, పేరు కూడా తెలియని వారి వరకు ఉన్న ఈ పుస్తకం చివరలో అవలీలగా ఆచరించదగిన కొన్ని పనుల గురించి రచయత తెలియజేసిన తీరు అభినందనీయం. ఒకవిధంగా ఈ పుస్తకాన్ని చదవడం కూడా మంచి పనే, ఎందుకంటే పదిమందికీ మేలు చేసే పనుల గురించి తెలుస్తుంది. ఆచరణీయ మార్గం దొరుకుతుంది. నాస్తికులకు కూడా నచ్చే ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలోనూ దొరుకుతుంది. - డి.వి.ఆర్