ఖమ్మంగాంధీచౌక్ : ఈ ఏడాది శ్రావణ మాసానికి ఓ ప్రత్యేకత ఉంది. ఏటా నెల పాటు మాత్రమే ఉండే శ్రావణమాసం ఈ ఏడాది రెండు నెలల పాటు ఉండనుంది. ఇందులో ఓ మాసం అశుభకరం.. మరొకటి శుభకరమని పండితులు చెబుతున్నారు. శ్రావణమాసం అనగానే హిందువులు శుభకార్యాలను నిర్వహించుకునే నెలగా భావిస్తారు. అయితే నేటి(మంగళవారం) నుంచి శ్రావణం మొదలవుతున్నా దీనిని అధిక శ్రావణమాసంగా పిలవనుండడంతో శుభకార్యాలు నిర్వహించడానికి వీలుండదు. ఇక ఆగస్టు 17 నుంచి వచ్చే రెండో(నిజ) శ్రావణమాసంలో మాత్రం శుభ కార్యాలు నిర్వహించుకునేందుకు అవకాశం ఉంది.
మూడేళ్లకోసారి ఒక నెల అధికం
ప్రతీ మూడేళ్లకోసారి ఒక నెల అధికంగా వస్తుంది. ఈ సంవత్సరం తెలుగు క్యాలెండర్‌లో 13 నెలలు ఉండగా.. దీనిలో శ్రావణ మాసం రెండుసార్లు వచ్చింది. అంటే అధిక మాసం రావడంతో మొదటి నెలకు అధిక శ్రావణంగా, రెండో మాసాన్ని నిజ శ్రావణమాసంగా పిలుస్తారు. సూర్య, చంద్రుల కాలగణన ఆధారంగా ప్రతీ మూడేళ్లకోసారి వచ్చే అధిక మాసం ఈ ఏడాది శ్రావణ మాసంలో.. 19 ఏళ్ల తర్వాత వచ్చిందని, మళ్లీ 2042లో వస్తుందని పండితులు స్పష్టం చేస్తున్నారు. అధిక మాసాన్ని పురుషోత్తమ మాసంగా పిలవనుండగా.. మత విశ్వాసాల ప్రకారం ఎలాంటి శుభ కార్యాలు నిర్వహించరు.
నేటి నుంచి అధిక శ్రావణమాసం
ఆషాఢ మాసం సోమవారంతో పూర్తి కాగా, మంగళవారం నుంచి శ్రావణ మాసం ఆరంభమవుతోంది. ఆగస్టు 16 వరకు అధిక శ్రావణ మాసంగా ఉండనుండగా.. ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలు తలపెట్టరాదని పండితులు సూచిస్తున్నారు. అలాగే, ప్రత్యేక పూజలు చేయకపోవటం మంచిదని చెబుతున్నారు. ఈ మాసం శ్రీమహా విష్ణువుకు ప్రీతికరమైనది కాగా పురుషోత్తమ మాసంగా పేరు ప్రసాదించారు. ఈ మాసంలో చేపట్టే దైవకార్యాలు ఫలాలను ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో విష్ణుహస్రనామాలు పఠించటం, పితృ ఆరాధన, దాన ధర్మాలు వంటివి చేయటం మంచిదని వెల్లడించిన పండితులు.. వివా హాలు చేయడం, నూతన వ్యాపారాలు ఆరంభించడం, ఆస్తి కొనుగోళ్లు, ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన, ఉపనయనం వంటి కార్యక్రమాలు చేపట్టొద్దని సూచిస్తున్నారు.
నెల ఆగితేనే ‘నిజ శ్రావణం’
అధిక శ్రావణ మాసం ఆగస్టు 16తో ముగిశాక 17 నుంచి నిజ శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఈ నెలంతా ఏటా శ్రావణంలో జరుపుకున్నట్లుగా ప్రత్యేక పూజలు, శుభకార్యాలు జరుపుకోవచ్చని అర్చకులు తెలిపారు. సెప్టెంబర్ 15 వరకు కొనసాగే నిజ శ్రావణంలో పండుగలు, శుభ కార్యాలే కాక శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతాలు జరుపుకోవడం, వివాహాలు, గృహ ప్రవేశాలు, నూతన వ్యాపారాల ఆరంభం, నూతన గృహాల శంకుస్థాపనలు వంటివి నిర్వహించవచ్చని పండితులు పేర్కొంటున్నారు.
ఆగస్టు వరకు ముహూర్తాలు లేవు...
అధిక శ్రావణ మాసం కారణంగా ఆగస్టు నెల వరకు వివాహాలకు ముహూర్తాలు లేవు. ఇతర శుభకార్యాలు చేయడం కూడా మంచిది కాదు. ఆగస్టు 17 నుంచి నిజ శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. అప్పుడే మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఏదైనా శుభకార్యాలు చేయాలనుకునే వారు పురోహితులను సంప్రదించి సరైన తేదీ ఎంచుకుంటే మంచిది. – విశ్వనాథశర్మ, ఉద్యోగ,అర్చక సంఘం జిల్లా అధ్యక్షుడు, భద్రాచలం
శుభకార్యాలకు తావులేదు..
అధిక శ్రావణంలో శుభకార్యాలకు తావులేదు. నూతన గృహ ప్రవేశాలు, శంకుస్థాపనల వంటి శుభ కార్యక్రమాలు చేపట్టవద్దు. పితృకార్యాలు చేసేవారు అధిక మాసంతో పాటు నిజమాసంలో రెండు సార్లు చేయాలి. అలాగే, దైవ కార్యాలకు ఎలాంటి నియమం లేదు. నూతనంగా వివాహమైన వధువు నిజ శ్రావణంలో మాత్రమే అత్తవారింటికి వెళ్లాలి.
– దాములూరి కృష్ణశర్మ, అర్చకులు,శ్రీ గుంటు మల్లేశ్వర స్వామి ఆలయం, ఖమ్మం
Comments
Please login to add a commentAdd a comment