Sravanamasam
-
Sravana Masam 2024: నేటి నుంచే శ్రావణ సందడి
పెద్దపల్లిరూరల్: శుభ ముహూర్తాలకు వేళయింది. సోమవారం నుంచి మొదలయ్యే శ్రావణ మాసంలో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపన తదితర కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఇప్పటికే చాలామంది సన్నద్ధమయ్యారు. శుక్ర మౌఢ్యమి, ఆషాడం, గురుమౌఢ్యమి కారణంగా మూడునెలల పాటు నిలిచిపోయిన శుభ కార్యక్రమాలు శ్రావణంలో జరగనున్నాయి. శుభ కార్యక్రమాల్లో పాలుపంచుకునే పురోహితులు, బ్యాండుమేళం, ఫొటో, వీడియోగ్రాఫర్లు, ఈవెంట్ల నిర్వాహకులు, ప్రింటింగ్‌ప్రెస్, బట్టలు, కిరాణం, పండ్లు, పూలు, క్యాటరింగ్‌తో పాటు నగల వ్యాపారులు శ్రావణమాస ముహూర్తాలకు శ్రీరెడీశ్రీ అయ్యారు. మూడునెలల పాటు ఖాళీగా ఉన్న వీరంతా ఇప్పుడు బిజీ కానున్నారు.శ్రావణంలో పండుగలుశ్రావణమాసంలో వచ్చే పండుగలిలా ఉన్నాయి. సోమవారం (ఈనెల 5) నుంచే శ్రావణం మొదలవుతోంది. 8న నాగుల చవితి, 9న నాగులపంచమి, 16న వరలక్ష్మీ వ్రతం, 19న రాఖీ పౌర్ణమి, 27న కృష్ణాష్టమి ఉన్నాయి. అలాగే ఈనెల 5న తొలి సోమవారంతో పాటు 12,19,26న సోమవారాల్లో శివుడిని, 9,16,23,30వ తేదీల్లో (శుక్రవారాల్లో) లక్ష్మీదేవి, 10,17,24,31వ తేదీల్లో (శనివారాల్లో) విష్ణువును పూజిస్తారు. ఈ రోజుల్లో ఆలయాలన్నీ పూజా కార్యక్రమాలతో బిజీగా మారనున్నాయి.శుభ ముహూర్తాలుఈనెల 5వ తేదీతో మొదలయ్యే శ్రావణమాసం సెప్టెంబర్ 3తో ముగియనుండగా, ఈ నెల 31లోపే శుభకార్యాలను ముగించుకోవాలని అర్చకులు సూచిస్తున్నారు. ఈనెల 7,8,9,10,11,15,16,17,18,21,22,23,24,28 తేదీల్లో పెళ్లిళ్లకు ముహూర్తాలు ఉన్నాయంటున్నారు. మూడునెలల ముందు నుంచే వేచి ఉన్నవారంతా ఈ శుభ ముహూర్తాల్లో తమకు అనుకూల తేదీలను నిర్ణయించుకుని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఇంటింటా పండగే..శ్రావణమాసంలో అందరూ భక్తితో పరవశిస్తారు. ఈ మాసంలో ఇంటింటా పండగ వాతావరణమే. విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం శ్రావణం. అందుకే ఈ మాసంలో అందరూ భక్తి, పవిత్రతో ఉంటూ శుభ కార్యక్రమాలను నిర్వహించుకుంటారు. ఈ నెల 28వరకే శుభముహూర్తాలున్నాయి.– కొండపాక శ్రీనివాసాచార్యులు, అర్చకుడు, పెద్దపల్లి -
న్యూజెర్సీలో సామూహిక వరలక్ష్మి కుంకుమార్చన
-
నేడు నాగ పంచమి? లేక గరుడు పంచమి? అనలా! ఎందుకిలా అంటే..
నిజానికి పంచమి తిథి అనగానే నాగులే గుర్తుకొస్తాయి. చాలామంది పంచమి తిథి రోజున పుట్టలో పాలు పోయడం, నాగ్రేంద్రుడుని పూజించడం వంటివి చేస్తారు. కానీ ఈ శ్రావణ మాసంలో వచ్చే ఈ పంచమి తిథిని మాత్రం 'గరుడ పంచమి' అని కూడా అంటారు. నాగులు. గరుడు (అంటే గ్రద) రెండు పరమ వైరి జంతువులు. అలాంటి రెండింటికి సంబంధించిన రోజుగా పండితులు చెబుతుంటారు. ఇంతకీ దీన్ని నాగుల పంచమి అని పిలవాలా లేక గరుడు పంచమి అనాల? ఎందికిలా రెండు రకాలుగా పిలుస్తున్నాం. దీనికున్న ప్రాశస్యం తదితరాల గురించే ఈ కథనం!. ఎందుకిలా రెండు రకాలుగ పిలుస్తున్నారంటే.. కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. వినతకి గరుత్మంతుడు జన్మించిగా, కద్రువ కడుపున సర్పజాతి జన్మించింది. అందువల్ల సర్పజాతి జన్మించిన శ్రావణ శుద్ధ పంచమి నాగ పంచమిగా పిలవబడుతోంది. ఇక ఇదే రోజున వినతకి గరుత్మంతుడు జన్మించాడు కనుక శ్రావణ శుద్ధ పంచమిని గరుడు పంచమిగా కూడా వ్యవహరిస్తున్నాం. అదీగాక ఆయన తన తల్లి వినత దాస్య విముక్తి కోసం ఆయన కనబర్చిన ధైర్యసాహాసాల రీత్యా ఈ పర్యదినానికి ఆయనకి కూడా ప్రాముఖ్యత ఏర్పడింది. కావున శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ పంచమని నాగపంచిమిగానూ, గరుడ పంచమిగానూ వ్యవహరిస్తున్నాం. కేవలం శ్రావణంలో వచ్చే పంచమికి మాత్రం నాగేంద్రుడి తోపాటు గరుత్మంతునికి అత్యంత ప్రాముఖ్యతనిస్తున్నాం. ఎందుకింత మహిమాన్వితమైంది అంటే.. శ్రావణమాసంలో ఆచరించే ముఖ్యమైన పండుగలలో " గరుడ పంచమి" ఒకటి. గరుత్మంతుడు సూర్యరథసారధి అయిన అనూరుడికి తమ్ముడు. మేరు పర్వతంతో సమానమైన శరీరం కలవాడు. సప్త సముద్రాల్లోని జలాన్నంతటినీ ఒక్కరెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు. అందువలనే అతడికి సువర్ణుడు అనే పేరు కుడా ఉన్నది. గరుడపంచమికి సంబంధించి భవిష్యత్పురాణంలో ప్రస్తావన ఉంది. సముద్రమధనంలో " ఉచ్పైశ్రవం" అనే గుఱ్ఱం ఉద్భవించింది. అది శ్వేతవర్ణం కలది. కశ్యపుడు , వినతల కుమారుడు గరుడుడు. ఓ రోజు వినత ఆమే తోడుకోడలు కద్రువ విహార సమయంలో ఆ తెల్లటి గుఱ్ఱాన్ని చుసారు. కద్రువ , వినతతో గుఱ్ఱం తెల్లగా ఉన్న తోకమాత్రం నల్లగా ఉంది అని చెప్పగా , వినత గుఱ్ఱం మొత్తం తెల్లగానే ఉంది అని చెప్పింది. వాళ్ళిద్దరు ఓ పందెం వేసుకొన్నారు , గుఱ్ఱపు తోక నల్లగాఉంటే వినత కద్రువకు దాస్యం చేయలని , గుఱ్ఱం మొత్తం తెల్లగా ఉంటే వినతకు కద్రువ దాస్యం చేయలని పందెం. కద్రువ తన కపట బుద్దితో సంతానమైన నాగులను పిలిచి అశ్వవాలాన్ని పట్టి వ్రేలాడమని కోరగా . దానికి వారెవ్వరు అంగీకరించలేదు. కోపగించిన కద్రువ " జనమేజయుని సర్పయాగంలో నశించాలని" శపించింది. ఒక్క కర్కోటకుడు అనే కుమారుడు అశ్వవాలాని పట్టి వ్రేలాడి తల్లి పందాన్ని గెలిపించాడు. కొద్దికాలం తరువాత గర్బవతి అయిన వినత, తనకు పుట్టిన రెండు గుడ్లలో మొదటి దాన్ని పగులగొట్టి చూసింది. అప్పటికి ఇంకా పూర్తిగా ఆకారం ఏర్పడని అనూరుడు బైటకురాగానే " అమ్మా నీ తొందరుపాటువలన నేను అవయవాలు లేకుండానే జన్మించాను, కాని నీవు మాత్రం రెండవ గుడ్డును తొందరపడి పగులగొట్టవద్దు" అని చెప్పి , సూర్యభగవానుడి రధసారధిగా వెళ్ళిపోయాడు. కొద్దికాలం తరువాత జన్మించిన గరుత్మంతుడు తన తల్లి వినుత క్షేమం కోసం , తల్లి ఋణం తీర్చుకోవాలని , ఆమెకు దాస్యం నుంచి విముక్తి కలిగించడానికి అమృతాన్ని తెచ్చిస్తానని , పాముల తల్లి అయిన కద్రువకు మాట ఇస్తాడు. ఆ మాట కోసం అమృతాన్ని తేవాలని నిప్పులు వెదజల్లుతూ , ఆకాశంలో పిడుగుల శబ్దం దద్దరిల్లేలాగా బలమైన రెక్కలతో బయలుదేరాడు. ఈ సంగతి తెలిసిన ఇంద్రుడు భయపడి.. అమృతాన్ని కాపాడమని హెచ్చరికలు జారీ చేశాడు. దేవతా శ్రేష్టులంతా గరుత్మంతుడితో రాత్రింబవళ్లు యుద్ధం చేశారు. పెట్రేగిపోయిన గరుడుడు స్వర్గాన్ని చీకటిమయం చేసి , తన రెక్కలతో దుమారాన్ని సృష్టించాడు. వసువులు , రుద్రులు , అశ్వనీ దేవతలూ , కుబేరుడు , వాయువు , యముడు అందరినీ ఎదుర్కొని , ఓడించి అమృతాన్ని సమీపించాడు. అతడిని ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. గరుత్మంతుడు అమృతం తీసుకొనిపోతుండగా.. విష్ణువు అతడిని సమీపించి , ‘‘నీ విజయ సాధనకు మెచ్చాను. ఏమి కావాలో కోరుకో’’ అన్నాడు. ‘‘నిన్ను సేవించాలనేదే నా కోరిక స్వామి’’ అంటాడు గరుత్మంతుడు. తనకు వాహనంగా , జెండాగా ఉండాలంటూ విష్ణువు వరమిచ్చాడు. ఇంద్రుడు గరుత్మంతుడిని ఎదుర్కోలేక , అతడి పరాక్రమాన్ని కొనియాడాడు. ‘‘అమృతం లేకుండానే నీవు మరణించకుండా ఉండే వరం పొందావు. నీవు తీసుకెళ్తున్న అమృతాన్ని ఎవరికైనా ఇస్తావేమో..! అమృతం సేవిస్తే.. వారని జయించడం కష్టం. దాన్ని ఎవ్వరికీ ఇవ్వకుండా, తిరిగి ఇచ్చేస్తే నీవు ఏం కోరినా.. బహుమతిగా ఇస్తా’’ అని అన్నాడు. ‘‘నా తల్లిని రక్షించుకోవడానికే అమృతం కోసం వచ్చాను. నా మాట ప్రకారం కద్రువ సంతానమైన పాములకు ఈ అమృతం ఇచ్చి, నా తల్లిని కాపాడుకుంటాను. వారు అమృతాన్ని తాగకముందే, నువ్వు వెళ్లి దానిని దొంగిలించు. మనిద్దరి కోరికలు నెరవేరతాయి’’ అని అనగానే.. అతని సలహాకు మెచ్చి ఇంద్రుడు సరేనంటాడు. గరుత్మంతుడు అమృతంతో బయలుదేరి, పాములకు ఆ పాత్రనిచ్చి.. ‘‘చాలా శ్రమపడి తెచ్చాను. మీరు తృప్తిగా ఆరగించి , అమరులవ్వండి’’ అంటూ తల్లిని తన భుజస్కంధాలపై ఎక్కించుకుని వాయు, మనోవేగాలతో ఉడాయించాడు. నియమనిష్టల పేరుతో.. పాములను స్నానమాచరించాకే అమృతం తాగాలనే నిబంధన పెట్టి.. ఆ అమృత పాత్రను ఇంద్రుడు తీసుకెళ్లడం వేరే విషయం. తల్లి ఋణం తీర్చుకోవడానికి ఎంతో త్యాగం చేసిన గరుత్మంతుడిని ఎవరైనా ఆదర్శంగా తీసుకోవాలి.. అనుసరించాలి. నిర్మలమైన మనస్సు , తెలివైన పిల్లలకోసం చేసే పూజ గరుడ పంచమి. గరుడ పంచమి రోజున మహిళలు స్నానాంతరం ముగ్గులు పెట్టిన పీఠపై అరటి ఆకును పరచి , బియ్యంపోసి , వారి శక్తి మేర బంగారు , వెండి నాగపడిగను ప్రతిష్టించి , పూజచేసి , పాయసం నైవేద్యం పెడ్తారు. మరి కొన్ని ప్రాంతాలలో పుట్టలో పాలుపోస్తారు. ఇలా మనపూజలందుకొనే గరుడిని వంటి మాతృప్రేమకల కుమారుడు కావాలని తెలిపే గరుడ పంచమి వ్రతం అనంత సౌభాగ్యాలను కలుగచేస్తుంది. అలాగే కాలసర్ప దోషాలు ఉన్నా, సరైన సంతానం లేని దంపతులు ఈ నాగపంచిమి లేదా గరుడ పంచిమి రోజున ఆ ఇరువురిని కొలచినట్లయితే మంచి వివేకవంతులైన పిల్లలు పుడతారని ప్రతీతి. (చదవండి: శివ కేశవులిరువురికి ప్రీతికరమైన మాసం శ్రావణం! ఎందుకంటే..) -
అధిక శ్రావణమాసం.. పెళ్లికి మంచి ముహూర్తాలు ఇవే
శ్రావణం...శుభ ముహూర్తాల సమ్మేళనం. అందుకే అందరూ శ్రావణం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. నేటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుండగా..నోములు, వ్రతాలతో పాటు పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కల్యాణమండపాల వద్ద సందడి కనిపిస్తోంది. పెళ్లి... ప్రతి ఒక్కరి జీవితంలో అపురూపమైన వేడుక. అందుకే కలకాలం గుర్తుండిపోయేలా చేసుకోవాలనేది ప్రతి ఒక్కరి కోరిక. ఇందుకోసం రూ.లక్షలు ఖర్చు చేస్తారు. పెళ్లి కుదిరినప్పటి నుంచి ప్రతి ఈవెంట్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలని ఇటు నూతన వధూవరులతో పాటు అటు వారి కుటుంబ సభ్యులు, బంధువులూ భావిస్తారు. వీటన్నిటికన్నా ముఖ్యమైనది పెళ్లి ముహూర్తం. వివాహం నిశ్చయమైనా ఆషాఢమాసం, అధిక శ్రావణంతో శుభ ముహూర్తాలు లేక నిరీక్షిస్తున్న వేలాది జంటలు ఈ శ్రావణంలో ఒక్కటి కాబోతున్నారు. పట్టణాలతో పాటు గ్రామాల్లో కూడా పెళ్లికి సన్నాయి మేళాలు మోగనున్నాయి. ఈ నెల 17న శ్రావణం ప్రారంభం కానుండగా, మరుసటి రోజు నుంచే ముహూర్తాలూ ఉన్నాయి. 18 నుంచి వివాహ ముహూర్తాలు సాధారణంగా శ్రావణ మాసంలోనే ఎక్కువగా పెళ్లిళ్లు జరుగుతాయి. బుధవారం(16న) అమావాస్య వచ్చింది. తర్వాత నిజ శ్రావణమాసం. ఈ నెల 18వ తేదీ నుంచి దాదాపు వరుసగా 10 రోజుల పాటు వివాహ ముహూర్తాలున్నాయి. ఇవి డిసెంబర్ వరకూ కొనసాగనున్నాయి. ముహూర్త బలం వల్ల ఒకేరోజు ఎక్కువ పెళ్లిళ్లు జరుగుతుండటంతో కల్యాణమండపాలకు డిమాండ్ బాగా పెరిగింది. ఫంక్షన్ హాళ్లకు డిమాండ్ శ్రావణంలో చాలా ముహూర్తాలు ఉన్నప్పటికీ కొన్నింటిని దివ్యమైనవిగా పేర్కొంటారు. ఆ ముహూర్తంలోనే పిల్లల పెళ్లిళ్లు చేయాలని తల్లిదండ్రులు భావిస్తుంటారు. అందుకే ఆయా తేదీల్లో కల్యాణ మండపాలతో పాటు అన్నీంటికీ డిమాండే. పెళ్లితో కొత్తగా ఒక్కటి కానున్న జంటలు, వారి కుటుంబ సభ్యులతో పాటు బంధువులు అన్ని హంగులూ ఉన్న కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్ల కోసం పరుగులు పెడుతున్నారు. శ్రావణమాసం మొదలు డిసెంబర్ వరకూ జిల్లాలో వెయ్యికిపైగా పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. శ్రావణంలో పెళ్లిళ్లలతో పాటు పండుగలూ ప్రతి ఇంటా సంతోషాలు నింపుతాయి. ఈనెల 21న వచ్చే నాగుల చవితి, గరుడ పంచమి రాకతో ప్రధాన పండుగలు ఆరంభం కానున్నాయి. 22న మంగళగౌరీ వ్రతాలు 25న వరలక్ష్మీవ్రతం, 31న రాఖీ పౌర్ణిమ, ఈనెల చివరలో 31 నుంచి మూడు రోజుల పాటు రాఘవేంద్రస్వామి ఆరాధనా ఉత్సవాలు, సెప్టెంబర్ 6న శ్రీ కృష్ణాష్టమి పర్వదినాలు వరుసగా వస్తాయి. 14న పొలాల అమావాస్యతో నిజ శ్రావణంలో వచ్చే పండుగలు ముగిసి భాద్రపదంలో ప్రవేశిస్తాయి. అలాగే ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ 14వ తేదీ వరకూ నోములు, వ్రతాలు ఆచరించుకునేందుకు మహిళలు సిద్ధమయ్యారు. ఎందరికో ఉపాధి పెళ్లంటే రెండు జీవితాల కలయిక మాత్రమే కాదు. ఎందరికో ఉపాధి కూడా. పెళ్లి పత్రికల ముద్రణ, ప్లెక్సీల ఏర్పాటు, కల్యాణ మండపం, అద్దె గదులు తీసుకోవడం, ఫ్లవర్ డెకరేషన్, పెళ్లి భోజనాలు, ఫొటోలతో పాటు వీడియోలు తీయడం, పెళ్లి కూతురు అలంకరణ, ఫంక్షన్ హాలు శుభ్ర పరచడం, పురోహితులు, భజంత్రీలు, రవాణా ఇలా ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది. అలాగే బంగారు, నిత్యవసర సరుకులు, వస్త్ర వ్యాపారులకు కూడా పెళ్లిళ్ల సీజన్లో వ్యాపారం బాగా జరుగుతుంది. పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ శుభ ముహూర్తాలు తక్కువే. జూలైలో ఆషాఢమాసం వచ్చింది. అందుచేత పెళ్లిళ్లకు బ్రేక్ పడింది. గురువారం నుంచి శ్రావణమాసం వస్తోంది. కాబట్టి ఈ నెల 18, 20, 21, 23, 27, 31 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి. సెప్టెంబర్ నెలలో కూడా 1, 3, 10వ తేదీల్లో శుభ ముహూర్తాలున్నాయి. డిసెంబర్ ఆఖరు వరకూ పెళ్లిళ్ల సీజనే. -
శుభకార్యాలకు వేళాయే.. నేటి నుంచే శ్రావణమాసం
నిజశ్రావణం గురువారం నుంచి ప్రారంభమవుతోంది. దీంతో పాటే శుభముహూర్తాలు మొదలుకానున్నాయి. నిశ్చితార్థాలు, వివాహాలు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు, ఉపనయనం, అక్షరాభాస్యం, అన్నప్రాశన, వ్యాపార, పరిశ్రమల ప్రారంభోత్సవాలు, దేవతా విగ్రహాల ప్రతిష్ఠాపనలు నిర్వహించుకోవచ్చని పండితులు చెబుతున్నారు. శ్రీశోభకృత్ నామ సంవత్సరంలో అధిక మాసంగా శ్రావణం వచ్చింది. ఓ నెల అధిక శ్రావణ మాసం కాగా, మరో నెల నిజ శ్రావణ మాసం. తొలుత వచ్చిన అధిక శ్రావణ మాసం గత నెల 18న ప్రారంభమై ఈ నెల 16తో ముగిసింది. ఈ నెల 17వ తేదీ గురువారం నుంచి మొదలయ్యే నిజ శ్రావణ మాసం సెప్టెంబర్ 15 వరకు ఉంటుంది. శుభకార్యాలకు వేళాయె.. శ్రావణ మాసం అనగానే శుభకార్యాలకు ప్రత్యేకంగా భావిస్తారు. అయితే అధిక శ్రావణ మాసం అశుభకర మాసమని పండితులు నిర్ణయించటంతో ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించలేదు. నిజ శ్రావణ మాసం శుభ కార్యక్రమాలకు అనుకూలంగా నిర్ణయించగా వేలాదిగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జరగనున్నాయి. కాగా, శ్రావణ మాసంలో ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 10 వరకు ముహూర్తాలు ఉండగా, ఆ తర్వాత సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 14 వరకు కొనసాగే భాద్రపదంలో ఎలాంటి ముహూర్తాలు లేవు. దీంతో ఈ నెలలో వివాహాలు, ఇతర శుభకార్యాల నిర్వహణకు అంతా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శుభకార్యాల కాలం నిజ శ్రావణ మాసం శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. భాద్రపదం, పుష్యమాసాల్లో మినహా మిగిలిన మాసాల్లో శుభ ముహూర్తాలు బాగానే ఉన్నాయి. నిశ్చితార్థాలు, వివాహాలు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలకు ఇప్పటికే చాలామంది ముహూర్తాలు ఖరారు చేసుకున్నారు. -
ఈ తిథులలో మహా విష్ణు పూజ చేస్తే అనుగ్రహం వస్తుంది
-
రెండు నెలల మాసం.. శ్రావణం!.. ఈ నెలంతా శుభకార్యాలకు విరామం
ఖమ్మంగాంధీచౌక్ : ఈ ఏడాది శ్రావణ మాసానికి ఓ ప్రత్యేకత ఉంది. ఏటా నెల పాటు మాత్రమే ఉండే శ్రావణమాసం ఈ ఏడాది రెండు నెలల పాటు ఉండనుంది. ఇందులో ఓ మాసం అశుభకరం.. మరొకటి శుభకరమని పండితులు చెబుతున్నారు. శ్రావణమాసం అనగానే హిందువులు శుభకార్యాలను నిర్వహించుకునే నెలగా భావిస్తారు. అయితే నేటి(మంగళవారం) నుంచి శ్రావణం మొదలవుతున్నా దీనిని అధిక శ్రావణమాసంగా పిలవనుండడంతో శుభకార్యాలు నిర్వహించడానికి వీలుండదు. ఇక ఆగస్టు 17 నుంచి వచ్చే రెండో(నిజ) శ్రావణమాసంలో మాత్రం శుభ కార్యాలు నిర్వహించుకునేందుకు అవకాశం ఉంది. మూడేళ్లకోసారి ఒక నెల అధికం ప్రతీ మూడేళ్లకోసారి ఒక నెల అధికంగా వస్తుంది. ఈ సంవత్సరం తెలుగు క్యాలెండర్లో 13 నెలలు ఉండగా.. దీనిలో శ్రావణ మాసం రెండుసార్లు వచ్చింది. అంటే అధిక మాసం రావడంతో మొదటి నెలకు అధిక శ్రావణంగా, రెండో మాసాన్ని నిజ శ్రావణమాసంగా పిలుస్తారు. సూర్య, చంద్రుల కాలగణన ఆధారంగా ప్రతీ మూడేళ్లకోసారి వచ్చే అధిక మాసం ఈ ఏడాది శ్రావణ మాసంలో.. 19 ఏళ్ల తర్వాత వచ్చిందని, మళ్లీ 2042లో వస్తుందని పండితులు స్పష్టం చేస్తున్నారు. అధిక మాసాన్ని పురుషోత్తమ మాసంగా పిలవనుండగా.. మత విశ్వాసాల ప్రకారం ఎలాంటి శుభ కార్యాలు నిర్వహించరు. నేటి నుంచి అధిక శ్రావణమాసం ఆషాఢ మాసం సోమవారంతో పూర్తి కాగా, మంగళవారం నుంచి శ్రావణ మాసం ఆరంభమవుతోంది. ఆగస్టు 16 వరకు అధిక శ్రావణ మాసంగా ఉండనుండగా.. ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలు తలపెట్టరాదని పండితులు సూచిస్తున్నారు. అలాగే, ప్రత్యేక పూజలు చేయకపోవటం మంచిదని చెబుతున్నారు. ఈ మాసం శ్రీమహా విష్ణువుకు ప్రీతికరమైనది కాగా పురుషోత్తమ మాసంగా పేరు ప్రసాదించారు. ఈ మాసంలో చేపట్టే దైవకార్యాలు ఫలాలను ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో విష్ణుహస్రనామాలు పఠించటం, పితృ ఆరాధన, దాన ధర్మాలు వంటివి చేయటం మంచిదని వెల్లడించిన పండితులు.. వివా హాలు చేయడం, నూతన వ్యాపారాలు ఆరంభించడం, ఆస్తి కొనుగోళ్లు, ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన, ఉపనయనం వంటి కార్యక్రమాలు చేపట్టొద్దని సూచిస్తున్నారు. నెల ఆగితేనే ‘నిజ శ్రావణం’ అధిక శ్రావణ మాసం ఆగస్టు 16తో ముగిశాక 17 నుంచి నిజ శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఈ నెలంతా ఏటా శ్రావణంలో జరుపుకున్నట్లుగా ప్రత్యేక పూజలు, శుభకార్యాలు జరుపుకోవచ్చని అర్చకులు తెలిపారు. సెప్టెంబర్ 15 వరకు కొనసాగే నిజ శ్రావణంలో పండుగలు, శుభ కార్యాలే కాక శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతాలు జరుపుకోవడం, వివాహాలు, గృహ ప్రవేశాలు, నూతన వ్యాపారాల ఆరంభం, నూతన గృహాల శంకుస్థాపనలు వంటివి నిర్వహించవచ్చని పండితులు పేర్కొంటున్నారు. ఆగస్టు వరకు ముహూర్తాలు లేవు... అధిక శ్రావణ మాసం కారణంగా ఆగస్టు నెల వరకు వివాహాలకు ముహూర్తాలు లేవు. ఇతర శుభకార్యాలు చేయడం కూడా మంచిది కాదు. ఆగస్టు 17 నుంచి నిజ శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. అప్పుడే మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఏదైనా శుభకార్యాలు చేయాలనుకునే వారు పురోహితులను సంప్రదించి సరైన తేదీ ఎంచుకుంటే మంచిది. – విశ్వనాథశర్మ, ఉద్యోగ,అర్చక సంఘం జిల్లా అధ్యక్షుడు, భద్రాచలం శుభకార్యాలకు తావులేదు.. అధిక శ్రావణంలో శుభకార్యాలకు తావులేదు. నూతన గృహ ప్రవేశాలు, శంకుస్థాపనల వంటి శుభ కార్యక్రమాలు చేపట్టవద్దు. పితృకార్యాలు చేసేవారు అధిక మాసంతో పాటు నిజమాసంలో రెండు సార్లు చేయాలి. అలాగే, దైవ కార్యాలకు ఎలాంటి నియమం లేదు. నూతనంగా వివాహమైన వధువు నిజ శ్రావణంలో మాత్రమే అత్తవారింటికి వెళ్లాలి. – దాములూరి కృష్ణశర్మ, అర్చకులు,శ్రీ గుంటు మల్లేశ్వర స్వామి ఆలయం, ఖమ్మం -
గాంధీ.. ఆ ఊరోళ్లకు గాంధమ్మ
మహాత్మా గాంధీ.. ఆ ఊరి వాళ్లకు ఓ శక్తి స్వరూపిణి. అందుకే ఏటా శ్రావణ మాసంలో మొదటి ఆదివారం గాంధీజీని గ్రామ దేవత రూపంలో గాంధమ్మగా కొలుస్తారు. పూలు, పసుపు, కుంకుమ, నైవేద్యాలు సమర్పించి సంబరాలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కేదారిపురం గ్రామస్తులు ఎన్నో ఏళ్లుగా సాగిస్తున్న ఆచారం ఇది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచీ ఏటా కేదారిపురంలో రైతులు పొలాల్లో నాట్లు వేయడానికి ముందు గాంధమ్మ సంబరాలు నిర్వహిస్తున్నారు. గాంధీజీ తమ గ్రామంలో శక్తి అవతారం గాంధమ్మగా వెలిశారని.. ఆ తల్లిని పూజిస్తే పంటలు బాగా పండుతాయని ఆ గ్రామస్తుల విశ్వాసం. అందుకే.. తొలకరి వర్షాలు కురిసిన తరువాత దుక్కులకు వెళ్లే ముందు గాంధమ్మ సంబరాలు చేసుకోవడం ఆనవాయితీగా పాటిస్తున్నారు. ప్రతి ఇంటినుంచీ వడపప్పు, పానకాలు, పసుపు నీటితో భారీ ఊరేగింపు నిర్వహించి గ్రామ నడిమధ్యన గాంధీజీ చిత్రపటాన్ని ఉంచి ముర్రాటలు సమర్పిస్తారు. ఆదివారం నాడు గ్రామంలోని మహిళలంతా ఊరేగింపు నిర్వహించి పూజలు నిర్వహించారు. గాంధమ్మకు నైవేద్యం సమర్పించి ప్రసాదంగా పంచి పెట్టారు. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో ఈ ఊరి వారంతా గాంధేయ వాదులుగా ఉంటూ ఆయనపై అపరిమిత ప్రేమ చూపించేవారు. అవే ఇప్పుడు ఇలా గాంధమ్మ పూజలుగా మారాయి. – కాశీబుగ్గ -
ఆగస్టు 7న టీటీడీ ఆధ్వర్యంలో ఉచిత వివాహాలు
కడప కల్చరల్: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీ సహకారంతో కల్యాణమస్తు పేరిట వినూత్న కార్యక్రమాన్ని రూపుదిద్దారు. వివాహాలు చేసుకోవడం ఆర్థికంగా భారం అయిన కుటుంబాలు, పేదలు ఈ కార్యక్రమం ద్వారా వారి బిడ్డలకు ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా వివాహాలు చేసుకునే సౌకర్యం కల్పించారు. తిరుమలేశుని సన్నిధిలో ఉంచి పూజించిన వివాహ సామగ్రిని నూతన జంటలకు ఉచితంగా అందజేసేవారు. వాటిలో ముఖ్యంగా బంగారు తాళిబొట్టు, నూతన వస్త్రాలు, బాసికాలతోపాటు మంగళ వాయిద్యాలు, పురోహితులను కూడా ఉచితంగా ఏర్పాటు చేసేవారు. డాక్టర్ వైఎస్సార్ ఆకస్మిక మరణంతో ఆ తర్వాత ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని కొనసాగించలేకపోయాయి. ప్రస్తుత తరుణంలో పిల్లల వివాహాలు చేయడం పేదలకు అసాధ్యమవుతుండగా మధ్యతరగతి కుటుంబాలను అప్పుల పాలు చేస్తోంది. ఈ పరిస్థితి మార్చాలని మధురమైన ఈ కల్యాణ ఘట్టాన్ని మరుపురానిదిగా మార్చాలని ప్రస్తుత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తిరిగి చేపట్టింది. ఈనెల 29వ తేదీనుంచి శ్రావణమాసం ప్రారంభం కానుంది. ఆగస్టు 7న రాష్ట్ర మంతటా సామూహికంగా కల్యాణమస్తు కార్యక్రమాన్ని చేపట్టేందుకు అధికారులు ఇప్పటికే విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణ తేదీకంటే ముందుగానే కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. నియమ నిబంధనలు ఇవీ! ► వధూవరుల ప్రస్తుత ఫొటోలు దరఖాస్తుకు జతపరచాలి. ► విడివిడిగా ఉన్న దరఖాస్తు కాలమ్‌లో వధూవరుల పూర్తి పేరు, వయస్సు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు, కులం, గోత్రం, మతం, విద్యార్హతలు, వృత్తి, వారివారి పూర్తి చిరునామాను పొందు పరచాల్సి ఉంది. వధూవరులు విడివిడిగా వారి మొబైల్ ఫోన్ నంబర్లను నమోదు చేయాలి. ► స్వీయ అంగీకార పత్రంలో తాము భారతీయ హిందువులని, వెంకటేశ్వరస్వామిపై పూర్తిగా భక్తివిశ్వాసాలు ఉన్నాయని, ఇద్దరం హిందూ సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోదలిచామని స్పష్టం చేయాల్సి ఉంది. ► జులై 31 నాటికి వధువుకు 18, వరుడికి 21 సంవత్సరం ఉన్నట్లు రుజువు చేయాల్సి ఉంది. ► వివాహం నాటికి తామిద్దరం మేజర్లమని, ఎలాంటి మానసిక సమస్యలు లేవని సగోత్రికులం కాదని స్పష్టం చేయాలి. ► ఉభయుల తల్లిదండ్రులు, పెద్దల అంగీకారంతోనే ఈ వివాహం చేసుకుంటున్నామని, ఇంతకుముందు తమకు వివాహం కాలేదని సెక్షన్–8 హిందూ వివాహ చట్టం–1955 ప్రకారం రిజిష్టర్ చేయించుకునే బాధ్యత తమదేనని తెలపాలి. ► న్యాయ, ధర్మబద్ధంగా వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తామని, వివాహం కుదుర్చుకోవడంలో బాధ్యత తమదేనని టీటీడీకి ఎలాంటి సంబంధం లేదని తెలుపుతున్నట్లు వధూవరులతోపాటు వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు సంతకం చేయాల్సి ఉంటుంది. ► వధూవరుల వయస్సు నిర్ధారణ కోసం స్కూలు సర్టిఫికెట్ లేదా ఆధార్‌కార్డు జతపర్చాలి. తల్లిదండ్రుల ఆధార్ ప్రతులను కూడా జత చేయాలి. ► వధూవరులు వేర్వేరు మండలాలకు చెందిన వారైతే తహసీల్దార్ ధ్రువీకరణ పొందాలి. (క్లిక్: కర్రసాములో ప్రత్యేకత చాటుకుంటున్న మంగంపేట) -
శ్రావణ మేఘాలు
శ్రావణమాసం కొద్దిరోజుల్లోనే రానుంది. ఇది ప్రకృతి మేఘమల్హరాలాపనతో పరవశించే మాసం. శ్రావణమాసానికి ఆధ్యాత్మిక విశేషాలు ఎన్నో ఉన్నాయి. శ్రావణమాసంలో నోములు, వ్రతాలు విరివిగా జరుపుకొంటారు. వాయనాల్లో మొలకెత్తిన శనగలను ఇచ్చిపుచ్చుకుంటారు. నోములు, వ్రతాలు జరుపుకొనే మహిళలు పట్టుచీరలతోను, నగలతోను కళకళలాడుతూ కనిపిస్తారు. ఇందుకే శ్రావణమాసాన్ని ‘నగల మాసం, శనగల మాసం’ అంటూ చమత్కరించారు ముళ్లపూడి వెంకటరమణ. ఆధ్యాత్మిక విశేషాలను పక్కన పెడితే, శ్రావణమాసంలో కనిపించే కారుమబ్బులు, అవి కురిపించే కుండపోత వర్షాలు ప్రకృతి గమనంలోని సహజ పరిణామాలు. మేఘసౌందర్యాన్ని వర్ణించని కవులు అరుదు. ‘నల్లని మబ్బులు గుంపులు గుంపులు, తెల్లని కొంగలు బారులు బారులు’ అంటూ కారుమబ్బుల అందాలను కళ్లముందు నిలిపారు కృష్ణశాస్త్రి. మేఘాల గురించి ‘గాథా సప్తశతి’లో ఒక అరుదైన, అపురూపమైన వర్ణన ఉంది. ‘అవిరల పడంత నవజల ధారా రజ్జు ఘడిఅం పఅత్తేణ/ అపహుత్తో ఉఖేతుం రస ఇవ మేహో మహింవు అహ’. అంటే, వర్షధారల దారాలతో భూమిని బంధించి పైకి లాగేయడానికి మేఘం విఫలయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నంలో మేఘం ఎంతో కష్టపడుతోంది. అందుకు నిదర్శనం– అది చేస్తున్న ఉరుముల హూంకారాలే! ఇంతటి కవి చమత్కారం మరే భాషా సాహిత్యంలోనూ కనిపించదు. మబ్బులు కమ్ముకున్నాక, అవి ఉరుములు ఉరమడం, మెరుపులు మెరవడం, చినుకులు కురవడం సహజమే! అలాగని ప్రతి మబ్బూ వాన కురుస్తుందనే భరోసా ఏమీ లేదు. మబ్బుల్లో నాలుగు రకాలు ఉంటాయని, అలాగే మనుషుల్లోనూ నాలుగు రకాలు ఉంటారని బుద్ధుడు తన శిష్యులకు ఎరుకపరచాడట! ఉరుములు ఉరిమినా చినుకు కురవకుండానే వెళ్లిపోయేవి ఒకరకం, ఉరుములు మెరుపులు లేకపోయినా చినుకులు కురిసిపోయేవి మరోరకం, ఉరుములు మెరుపుల సందడితో వాన హోరెత్తించేవి ఒకరకం, ఉరుముల శబ్దం చేయకుండా, చినుకైనా కురవకుండా తేలిపోయేవి ఇంకోరకం. మేఘాల స్వభావం లాగానే మనుషుల స్వభావాలూ ఉంటాయి. ఊరకే నీతులు చెబుతూ ఆచరించని వాళ్లు ఒక రకం, శాస్త్రాలు చదువుకున్నా వాటి సారాన్ని గ్రహించని వాళ్లు ఇంకో రకం. శాస్త్రాలు చదవకున్నా, ధర్మసారాన్ని గ్రహించి ఆచరించేవాళ్లు ఒకరకం, శాస్త్రాలు చదివి, వాటి సారాన్ని గ్రహించి ఆచరించేవాళ్లు మరోరకం. సాహిత్యంలోను, కళల్లోను మబ్బులు రకరకాల భావనలకు సంకేతాలుగా చలామణీలో ఉన్నాయి. దిగులుకు, దుఃఖభారానికి, అంతుచిక్కని రహస్యానికి, అనిశ్చితికి, ప్రతికూల పరిస్థితులకు సంకేతంగా మబ్బులను పోల్చుతారు. అంతేకాదు, మబ్బులు క్షాళనకు కూడా సంకేతాలు. మబ్బులు కురిపించే వానలో నేల మీద ఉన్న చెత్తాచెదారం కొట్టుకుపోయినట్లే, దుఃఖ వర్షం తర్వాత గుండెలో గూడు కట్టుకున్న దిగులు కొట్టుకుపోయి మనసు తేటపడుతుందని కొందరి భావన. ‘భారమైన హృదయాలు దట్టమైన మబ్బుల్లాంటివి. వాటి నుంచి కాస్త నీటిని బయటకు పోనిస్తేనే మంచిది. అప్పుడే ఊరట చెందుతాయి’ అంటాడు అమెరికన్ రచయిత క్రిస్టఫర్ మోర్లే. మేఘతతులు ఎరుకకు, పరివర్తనకు, కలలకు కూడా సంకేతాలు. అయితే, ఎక్కువగా మబ్బులను దిగులుకు, ప్రతికూలతలకు సంకేతంగానే భావిస్తారు. సాహిత్యంలోనూ ఇలాంటి వర్ణనలే కొంత ఎక్కువగా కనిపిస్తాయి. ‘భారమైన మేఘాలు నక్షత్రాలను ఆర్పేస్తున్నాయి’ అని తన ‘నైట్ ఫ్లైట్’ నవలలో వర్ణించాడు ఆంటోయిన్ డి సెయింట్ ఎక్సు్యపెరీ. పైలట్‌గా పనిచేసినప్పుడు నక్షత్రాలను మేఘాలు కమ్మేసిన దృశ్యాలను క్లోజప్‌లో చూసిన అనుభవం ఉన్నవాడాయన. దట్టంగా కమ్ముకున్న మబ్బులు పగలు సూర్యుణ్ణి, రాత్రి చంద్రుణ్ణి, నక్షత్రాలను కనపించనివ్వవు. అలాగని ఆకాశంలో సూర్యచంద్రులు, నక్షత్రాలు అదృశ్యమైపోవు. తాత్కాలికంగా అలా అనిపిస్తాయంతే! మబ్బులు మటుమాయం కాగానే, మళ్లీ తమ సహజకాంతులతో కనిపిస్తాయి. గుండెలోని గుబులు, మనసులోని దిగులు కూడా అంతే! దిగులు మబ్బులు కమ్ముకున్నంత మాత్రాన మనసులోని ఆశలు పూర్తిగా అడుగంటిపోవు. అందుకే, ‘మబ్బులకు ఆవల సూర్యుడు నిరంతరం వెలుగుతూనే ఉంటాడు’ అంటాడు అమెరికన్ రచయిత పాల్ ఎఫ్. డేవిస్. ఉరిమే ప్రతి మబ్బూ కురవదని లోకోక్తి. వ్యర్థ ప్రసంగాలతో హోరెత్తించే వారికి ఇది చక్కగా వర్తిస్తుంది. ‘వాగ్దానం మబ్బు మాత్రమే, అది నెరవేరినప్పుడే వాన కురిసినట్లు’ అని ఇంగ్లిష్ సామెత. వాగ్దానకర్ణులైన రాజకీయ నాయకులకు ఇది అక్షరాలా సరిపోతుంది. ‘ఎంతటి రాగి గొలుసులతోనైనా మబ్బులను బంధించలేము’ అనే సామెత కూడా ఉంది. నింగిలోని మబ్బులు స్వైరవిహారం జరిపే స్వేచ్ఛాసంచారులు. వాటి మానాన అవి ముందుకు సాగుతూనే పోతాయి. ప్రపంచంలో వాటిని బంధించే శక్తి ఏదీ లేదు. ఎక్కడైనా, ఎవరైనా స్వాభావికమైన స్వేచ్ఛను బంధించబూనితే, దాని పర్యవసానం మేఘవిస్ఫోటం కూడా కావచ్చు! ఇటీవల శ్రావణ భార్గవి అనే గాయని అన్నమయ్య కుమారుడు పెద తిరుమలాచార్యుని పదాన్ని పాడిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో అనవసర దుమారానికి దారితీసింది. కొందరి అభ్యంతరాల ధాటికి ఆమె వెనక్కు తగ్గి, ఆ వీడియోను తొలగించింది. ఈ దుమారం సద్దుమణిగినా ఇదంత మంచి సంకేతం కాదు. ప్రజాస్వామ్య ప్రభలను మూకస్వామ్య దౌర్జన్యపర్జన్యాలు కబళించడం వాంఛనీయం కాదు. -
శ్రీరస్తు.. మాస్క్ మస్టు
పెళ్లంటే ఆకాశమంత పందిళ్లు..తళుకులీనే మండపాలు..భాజాభజంత్రీలు.. బంధుమిత్రులు..ఒకటే హడావుడి.. వివాహ వేడుక జరిగే వీధంతా సందడిగా ఉండేది. అయితే ప్రస్తుత కరోనా కాలంలో కల్యాణోత్సవం కళ తప్పింది. మాస్కు సమేతంగా రావాలని కొద్ది మందికి మాత్రమే ఆహ్వానం అందుతోంది. వేడుకకు హాజరైన వారు కూడా చేతులకు శానిటైజర్లు వేసుకొని..భౌతిక దూరంపాటించాల్సి వస్తోంది. భజంత్రీలు మోగకుండానే మూడుముళ్ల బంధం ఒక్కటవుతోంది. కర్నూలు(హాస్పిటల్): శ్రావణమాసం ప్రారంభమైంది. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో వాతావరణమూ చల్లగా ఉంది. ఇదే సమయంలో వివాహానికి ఆగస్టు 14వ తేదీ వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా ఏప్రిల్, మే నెలల్లో జరగాల్సిన పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం మంచి రోజులు ఉండడంతో వాయిదా పడిన కల్యాణోత్సవాలను జరిపేందుకు పెద్దలు సిద్ధమవుతున్నారు. అదే విధంగా నూతన వివాహ వేడుకలు నిర్వహించేందుకూ ముహూర్తాలు ఖరారయ్యాయి. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వైభవంగా వివాహం చేసుకునేందుకు నిబంధనలు అడ్డొస్తున్నాయి. హంగు ఆర్భాటాలు లేకుండా, పరిమిత సంఖ్యలో బంధువులు, స్నేహితులను పిలిచి పెళ్లి తంతు చేసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎలాగైనా ఇప్పుడే పెళ్లి చేయాలని భావించే వారు నిబంధనలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నారు. భాజాభజంత్రీలు లేకుండా, హంగూ ఆర్భాటాల జోలికి వెళ్లకుండా దగ్గరి వారిని మాత్రమే పిలిచి పెళ్లి కానిచ్చేస్తున్నారు. పెళ్లికి ఇలా సిద్ధం కావాలి ఎవరైనా వివాహం చేయాలంటే ముందుగా సంబంధిత తహసీల్దార్ అనుమతి తీసుకోవాలి. ఈ మేరకు వివాహ ఆహ్వాన పత్రికతో పాటు రూ.10 నాన్ జ్యూడీషియల్ స్టాంప్‌పై అఫిడవిట్‌ను తహసీల్దార్‌కు సమర్పించాలి. వివాహం చేసే వారు తప్పనిసరిగా కోవిడ్ పరీక్షలు చేయించుకుని ఉండాలి. వధూవరుల తరఫు నుంచి 20 మంది మాత్రమే పెళ్లిలో పాల్గొనాలి. భాజాభజంత్రీలకు అనుమతి లేదు. నిబంధనలు ఉల్లంఘిస్తే జాతీయ విపత్తు నిర్వహణ చట్టం–2005లోని సెక్షన్ 188 ద్వారా నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటారు. మార్గదర్శకాలు పాటించాలి.. ♦ పెళ్లంటే పదుల సంఖ్యలో ఒకచోట చేరి ముచ్చట్లు పెట్టుకుంటామంటే కుదరదు. ♦ పెళ్లికి పరిమిత సంఖ్యలోనే హాజరుకావాలి. వచ్చిన వారు సైతం నాలుగు నుంచి ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలి. ♦ నిర్వాహకులతో పాటు పెళ్లికి వచ్చిన వారు సైతం తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి. ఎవ్వరైనా మాస్క్ ధరించకపోతే నిర్వాహకులే మాస్క్‌లు ఏర్పాటు చేయాలి. ♦ నిర్వాహకులు, పెళ్లికి హాజరైన వారు తప్పనిసరిగా చేతులను శుభ్రంగా తరచూ కడుక్కుంటుండాలి. ఈ మేరకు శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. ♦ అందరినీ ఒకేసారి వేదికపైకి గాకుండా పరిమిత సంఖ్యలో వచ్చేటట్లు ఏర్పాటు చేసుకోవాలి. వివాహానికి వచ్చిన వారికి వేసిన కుర్చీల మధ్య ఎడమ ఉండాలి. భోజనాల వద్ద సైతం ఇదే సూత్రాన్ని, భౌతిక దూరాన్ని పాటించాలి. మార్గదర్శకాల మేరకు పెళ్లి చేశాం మా అబ్బాయి వివాహాన్ని ఇటీవల చేశాం. పెళ్లికి వచ్చిన వారిని ప్రతి బెంచీల్లో నలుగురు గాకుండా ఇద్దరినే కూర్చోబెట్టాం. దీంతో పాటు ప్రతి కుర్చీకి నాలుగు అడుగులు దూరం ఉండేటట్లు చూసుకున్నాం. పెళ్లికి వచ్చిన ప్రతి వ్యక్తికీ చేతులను శానిటేషన్ చేశాం. మాస్క్ కూడా అందజేశాం. 25 నిమిషాల తర్వాత మళ్లీ వారి వద్దకు వెళ్లి ప్రతి ఒక్కరికీ శానిటైజ్ చేస్తూ వచ్చాం. పెళ్లికి వచ్చే వారిని విడతల వారీగా కొద్ది కొద్ది మందిని ఆహ్వానించాం. వారికి భోజనాలను సైతం అలాగే పిలిచి ఏర్పాటు చేశాం. దీని వల్ల మా పెళ్లిలో ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఇప్పటి వరకు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. – వెంకట్, మెడికల్ రెప్, కర్నూలు కొత్త రకం పెళ్లిని చూసిన అనుభూతి కలిగింది నేను ఇటీవల ఓ పెళ్లికి వెళ్లాను. అక్కడ వధూవరులతో పాటు బంధువులు మాస్క్‌లు ధరించి భౌతిక దూరం పాటించారు. దూర ప్రాంతాల నుంచి బంధువులు రాకపోయినా నిర్వాహకులు బాధపడకుండా పరిస్థితులను అర్థం చేసుకున్నారు. ప్రధానమైన పెళ్లి కుటుంబసభ్యుల సమక్షంలో ఉదయమే ముగించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన వారి కోసం రిసెప్షన్ నిర్వహించి, భౌతిక దూరం పాటిస్తూఅక్షింతలు చల్లి దీవించే ఏర్పాటు చేశారు. భోజనం వడ్డించే వారికి పీపీఈ కిట్ల మాదిరిగా డ్రెస్‌లు ధరింపజేశారు. భోజనం వడ్డించిన తర్వాత మాస్క్‌లు తీయడానికి, ఆ తర్వాత తినడానికి పలువురు ఇబ్బంది పడటం చూస్తే నవ్వొచ్చింది. దీంతో నా జీవితంలో కొత్తరకం పెళ్లిని చూసిన అనుభూతి కలిగింది. – బి. హైమావతి, కర్నూలు -
శోభలేని శ్రావణం
-
పెళ్లికి మొత్తంగా 20మందికే చాన్స్..
బెల్లంపల్లి/మంచిర్యాలరూరల్(హాజీపూర్): శ్రావణమాసంతో శుభ గడియలు, సుముహూర్తాలు మొదలయ్యాయి. ఈ మాసం హిందువులకు ఎంతో ప్రత్యేకమైనది. ఈ మాసంలోని ప్రతి మంగళ, శుక్రవారాలు మహిళలకు ఎంతో ప్రీతికరమైనవి. వ్రతాలు, ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు శ్రావణమాసం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మాసం రాక కోసం గృహిణులు ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. శ్రావణమాసంలో దివ్యమైన ముహూర్తాలు ఉండటంతో ముందస్తు ప్రణాళిక ప్రకారంగా గృహ ఆరంభ ముహూర్తాలు, గృహ ప్రవేశాలు, వివాహ నిశ్చితార్థాలు, పెళ్లిళ్లు జరిపించడానికి తహతహలాడుతుంటారు. శ్రావణమాసం ముహుర్తాలు పోతే మళ్లీ కార్తీక మాసం వరకు వేచి చూడక తప్పదని కొందరు పెళ్లిళ్లకు సిద్ధమవుతున్నారు. పెళ్లికి అనుమతి ఇలా.. ♦ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో పెళ్లిళ్లకు వధువు నుంచి 10 మంది, వరుడి నుంచి 10 మంది మొత్తంగా 20 మందితో మాత్రమే అనుమతులు ఇస్తున్నారు. ♦తహసీల్దార్ వద్ద పెళ్లికి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతి కోసం 10 రూపాయల నాన్ జ్యూడీషియల్ స్టాంప్‌పై అఫిడవిట్‌ను తహసీల్దార్‌కు అందజేయాలి. ♦ముద్రించిన పెళ్లి పత్రిక కానీ, పురోహితుడు రాసిన లగ్న పత్రిక జతచేసి తెల్లని కాగితంపై దరఖాస్తు చేసుకోవాలి. అలాగే వివాహానికి హాజరయ్యే 20 మంది పేర్లు కూడా అందులోనే రాసి ఇవ్వాలి. ♦దరఖాస్తు చేసుకునే వారి నుంచి ఆధార్‌కార్డు జిరాక్స్ కూడా అందజేయాలి. ♦రెవెన్యూ అధికారులు దరఖాస్తును పరిశీలించి నిబంధనలతో కూడిన అనుమతి పత్రాన్ని జారీ చేస్తారు. ♦నిబంధనలు పాటించని వారిపై జాతీయ విపత్తు నిర్వహణ చట్టం 2005లోని 188 సెక్షన్ కింద చర్యలు తీసుకుంటారు. శుభ ముహూర్తాలు ఇవే.. శ్రావణమాసం మంగళవారం ప్రారంభమైంది. ఇప్పటి నుంచి ఆగస్టు 14వరకు శుభకార్యాలు నిర్వహించడానికి ముహూర్తాలు ఉన్నట్లు వేద పండితులు చెబుతున్నారు. జూలైలో 25, 26, 27, 29 తేదీల్లో దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయి. ఆగస్టులో 2, 5, 8, 9, 13, 14లల్లో కూడా మంచి రోజులున్నట్లు వేద పండితులు వివరిస్తున్నారు. ఆయా సుముహూర్తాలలో అన్ని రకాల శుభకార్యాలు నిర్వహించవచ్చని సూచిస్తున్నారు. కాగా సెప్టెంబర్, అక్టోబర్‌లో ఎలాంటి ముహూర్తాలు లేవని, ఆ రెండు నెలలను అధిక మాసమంటారని పేర్కొంటున్నారు. నవంబర్ 18నుంచి మళ్లీ సుముహూర్తాలు ఆరంభం కానున్నాయి. నిబంధనలతోనే పెళ్లి పెళ్లంటే పందిర్లు.. తప్పట్లు.. తాళాలు.. తలంబ్రాలు.. భజాభజంత్రీలు.. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాలతో అంగరంగ వైభవంగా పెళ్లి వేడుకలు జరుపుకోవాలని వధూవరులతో పాటు వారి కుటుంబ సభ్యులు ఎన్నో కలలు కంటారు. లక్షల్లో ఖర్చు చేసి వివాహాలు జరుపుకుని జీవితాంతం మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ ఉంటారు. కాని అలాంటి వేడుకలకు “కరోనా’ మహమ్మారి పుణ్యమా బ్రేక్ పడింది. పల్లె, పట్నం అనే తేడా లేకుండా అందరి పరిస్థితి ఇప్పుడు ఒకేలా మారింది. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల మేరకు 20 మందితో మాత్రమే వివాహాలు జరిపించాలని ఆదేశించింది. అలా హామీ ఇస్తేనే అనుమతి ఇస్తామని స్పష్టంగా చెబుతోంది. ఇక అనుమతి పొంది వివాహాలు జరిపించేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనాలు ఏర్పాటు చేయరాదని కూడా తెలియజేస్తుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే పెళ్లి అనుమతి పొందిన వ్యక్తిని బాధ్యుడిని చేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. వివాహాలకు మాత్రమే అనుమతి కరోనా నేపథ్యంలో పెళ్లిళ్లకు తప్ప ఇతర శుభకార్యాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. పెళ్లి తంతు ఎంత వైభవమో పెళ్లి అనంతరం పెళ్లి కొడుకు ఇంటి వద్ద ఇచ్చే విందు కూడా అంతే స్థాయిలో వైభవంగా ఉంటుంది. కానీ కరోనా కారణంగా పెళ్లిళ్ల బరాత్‌లు, విందులకు అనుమతి ఇవ్వడం లేదు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు పెళ్లికి అనుమతి పొందిన వారిలో చాలా మంది నిబంధనలు ఉల్లంఘిస్తే ఎం కాదులే అనే ధీమాలో ఉన్నారు. అనుమతి పొందాక నిబంధనలు పాటిస్తున్నామా..? లేదా..? అని పరిశీలించే వ్యవస్థ లేదని, స్థానికంగా ఉండే పోలీసులను మేనేజ్ చేసుకోవచ్చని భావిస్తున్నారు. కాని ఎవరైన నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. మంచి ముహూర్తాలు ఉన్నాయి శ్రావణమాసం ఆరంభం కావడంతో మంచి ముహూర్తాలు వచ్చాయి. నాలుగు నెలలుగా ఇంటిలో నుంచి బయటకు వెళ్లలేదు. కరోనా వల్ల శుభకార్యాలు జరగలేదు. దీంతో తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు పడ్డాం. ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తి వేయడంతో ఆంక్షల మధ్య శుభకార్యాలు నిర్వహించడానికి వీలు కలుగుతోంది. కానీ బయటకు వెళ్లడానికి భయపడుతున్నాం. ఈ మాసమైనా పండితులకు కాస్తా అనుకూలిస్తుందని ఆశిస్తున్నాం.–రాంపల్లి నారాయణ శర్మ, అవధాని, బెల్లంపల్లి -
బాసరలో భక్తుల ప్రత్యేక పూజలు
సాక్షి, నిర్మల్: శ్రావణమాసం ప్రారంభం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు.. పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అదే విధంగా గోదావరి నదికి పూజలు చేస్తున్నారు. శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా బాసర సరస్వతి అమ్మవారి ఆలయ అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం వేకువజామున వేద మంత్రోత్సరణల మధ్య అమ్మవారికి నిత్య అభిషేకం, హారతి, గణపతి పూజ, కలశపూజ, కుంకుమార్చన పూజలను అర్చకులు నిర్వహించారు. శ్రావణమాస మొదటి శుక్రవారం పర్వదినం కావడంతో భక్తుల రద్ది పెరిగి అమ్మవారి దర్శనానికి గంట సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు. -
శ్రావణ శోభ
నెల్లూరు(బృందావనం): శ్రావణమాస తొలి శుక్రవారాన్ని పురస్కరించుకొని నగరంలోని అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఆలయాల్లో పూజలను నిర్వహించి నోములను ఆచరించారు. ఆలయాల్లో భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. గీ నగరంలోని రాజరాజేశ్వరి ఆలయంలో అమ్మవారికి లక్షకుంకుమార్చనను విశేషంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు తంగిరాల రాధాకృష్ణ ఆధ్వర్యంలో కుప్చచ్చి సుబ్బారావు, ఆలూరు శిరోమణిశర్మ పర్యవేక్షణలో 20 మంది రుత్విక్కులతో కుంకుమార్చన శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ మండపంలో అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిచ్చారు. సాయంత్రం విశేషహారతులు, రాత్రి అమ్మవారికి పల్లకీసేవ కనులపండువగా జరిగింది. తీర్థప్రసాదాలకు ఉభయకర్తలుగా సోమవారపు సూర్యనారాయణరావు, విజయలక్ష్మి దంపతులు, గంగాభవాని, మధుకర్ వ్యవహరించారు. ఈఓ వెండిదండి శ్రీనివాసరెడ్డి, దేవస్థాన వంశపారంపర్య ధర్మకర్త రత్నం జయరామ్ పర్యవేక్షించారు. రాజరాజేశ్వరి అమ్మవారిని హైకోర్టు న్యాయమూర్తి శివశంకరరావు శుక్రవారం రాత్రి దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. మూలాపేటలోని భువనేశ్వరీ సమేత మూలస్థానేశ్వరస్వామి దేవస్థానంలో అమ్మవారికి విశేషపూజలను నిర్వహించారు. రాత్రి పల్లకీసేవ, ఊంజల్‌సేవను వేడుకగా జరిపారు. ఆలయ అర్చకులు బాలాజీశర్మ, శ్రీరామకవచం కోటేశ్వరశర్మ, శ్రీశైలం భార్గవశర్మ, ధూర్జటి వేణుగోపాలశర్మ, తదితరుల ఆధ్వర్యంలో పూజలు చేశారు. ఉభయకర్తలుగా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతి దంపతులు వ్యవహరించారు. ఈఓ ఆరంబాకం వేణుగోపాల్ పర్యవేక్షించారు. మూలాపేటలోని ఇరుకళల పరమేశ్వరి దేవస్థానంలో సామూహిక కుంకుమార్చన నిర్వహిం చారు. ఉభయకర్తలుగా సూర్యప్రకాశ్‌రావు, విజయశ్రీ దంపతులు వ్యవహరించారు. అమ్మవారికి సాయంత్రం పూలంగిసేవ, చందనా లంకారం, రాత్రి పల్లకీసేవను నిర్వహించారు. ఉభయకర్తలుగా రాజేశ్వరరావు, అరుణ దంపతులు వ్యవహరించారు. ఈఓ వేమూరి గోపీ పర్యవేక్షించారు. పప్పులవీధిలోని మహాలక్ష్మి దేవస్థానంలో అమ్మవారికి క్షీరాభిషేకం, రాత్రి ఊంజల్‌సేవను నిర్వహించారు. ఈఓ గుమ్మినేని రామకృష్ణ పర్యవేక్షించారు. -
తేలు కుట్టినా ఏమీ కాదంటా..!
కోడుమూరు: సాధారణంగా విష పురుగులైన తేళ్లను చూస్తే ఎవరైనా ఆమడదూరం పరుగెడతారు. కానీ ఈరోజు (మూడో శ్రావణ సోమవారం) కోడుమూరు వాసులు ఏమాత్రమూ భయం లేకుండా తేళ్లను పట్టుకున్నారు. వాటిని చేతులపై, తలపై, నాలుకపై ఉంచుకొని నృత్యాలు చేశారు. ఈరోజు తేలు కుట్టినా ఏమీ కాదని, ఆలయం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తే విషప్రభావం తగ్గిపోతుందని వారు తెలిపారు. అదే మిగతా రోజుల్లో అయితే సమస్య వస్తుందని చెప్పారు. శ్రావణమాసం మూడో సోమవారాన్ని పురస్కరించుకుని కోడుమూరు సమీపంలోని కొండపై వేడుకను వైభవంగా నిర్వహించారు. గ్రామస్తుల ఇష్టదైవమైన కొండలరాయుడి సన్నిధిలో నిర్వహించిన ఈ వేడుకకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. తేళ్లను పట్టుకొని స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. ప్రతి ఏటా శ్రావణమాసం మూడో సోమవారం ఈ వేడుక ఆనవాయితీగా జరుగుతోంది. ఈసారి కూడా భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. -
ఐశ్వర్యప్రద వ్రతం
శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం కాని, ఆ మాసంలోని రెండవ శుక్రవారం కాని ఈ వ్రతం ఆచరిస్తారు. కుదరని వారు తర్వాత వచ్చే శుక్రవారంనాడైనా సరే, ఈ వ్రతం జరుపుకోవచ్చు. పసుపు, కుంకుమ, వాయనానికవసరమైన వస్తువులు, అక్షతలు, పసుపు గణపతిని ముందుగా తయారు చేసి ఉంచుకోవాలి. ఎర్రటి రవికె, గంధం, పూలు, పండ్లు, తమలపాకులు, వక్కలు, తోరాలు చేసుకోవడానికి నూలు దారం, కొబ్బరికాయలు, దీపపు కుందులు, పంచహారతి, దీపారాధనకు ఆవు నెయ్యి, కర్పూరం, అగరు వత్తులు, బియ్యం, శనగలు, అర్ఘ్య పాత్ర (చిన్నగిన్నె) తదితరాలను సిద్ధంగా ఉంచుకోవాలి. పూజావిధానం: ఉదయాన్నే లేచి తలంటిస్నానం చేసి ఇంటిని శుభ్రం చేయాలి. ఇంటిముంగిట కళ్లాపు చల్లి, ముగ్గుపెట్టి, గుమ్మాన్ని పసుపు కుంకుమలు, మామిడాకుల తోరణాలతో అలంకరించాలి. ఇంట్లో ఇల్లాలు శుచిగా, కలశం స్థాపించి, అందులో లక్ష్మీదేవిని ఆవాహన చేసి, షోడశోపచారాలతో పూజించాలి. అనంతరం విఘ్న నివారణకై పసుపు గణపతి పూజ చేయాలి. ఆ తర్వాత సంకల్పం చెప్పుకుని పూజకు మాత్రమే ఉపయోగించే ఒక పంచపాత్రనుగాని, లోటాను గాని తీసుకుని, అందులో నీరు పోసి అక్షతలు, పువ్వులు, తమలపాకులను ఉంచాలి. దానికి బయట మూడువైపులా పసుపు, కుంకుమ, గంధంతో అలంకరించి కలశపూజ చేసుకోవాలి. అమ్మవారిని ధ్యానావాహనాది షోడశోపచార పూజలతో పూజించాలి. తెల్లని నూలు దారాన్ని ఐదు లేదా తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు పూయాలి. ఆ దారానికి ఐదు లేదా తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. ఇలా ఐదు లేదా తొమ్మిది పోగులతో తయారు చేసిన తోరాలను పీఠం మీద ఉంచి పూజించాలి. కథానంతరం తోరాలు కట్టుకోవాలి. తీర్థప్రసాదాలు స్వీకరించాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యంతో సహా విందారగించి రాత్రి భోజనాన్ని త్యజించాలి. -
జనసాగరంగా ఉరుకుంద
– భారీగా తరలివస్తున్న భక్తజనం – చివరి సోమవారం పూజలకు క్యూకడుతున్న వైనం కౌతాళం: శావ్రణమాస ఉత్సవాల్లో భాగంగా చివరి సోమవారం ఉరుకుంద ఈరన్నస్వామి దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. దీంతో ఉరుకుంద క్షేత్రం ఆదివారం ఉదయం నుంచే జన సాగరాన్ని తలపించింది. ఆదివారం సాయంత్రం నుంచి క్యూలైన్లలో భక్తుల రద్దీ కనిపించింది. సోమవారం తెల్లవారుజామున స్వామి వారి పల్లకి తుంగభద్ర నదికి బయలు దేరి సాయంత్రం తిరిగి ఉరుకుందకు చేరుకుంటుందని ఆలయ పాలక మండలి అధ్యక్షుడు చెన్నబసప్ప, ఈఓ మల్లికార్జున ప్రసాద్తెలిపారు.æ అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆదోని తాలుకా సీఐ దైవప్రసాద్ ఆధ్వర్యంలో కౌతాళం ఎస్ఐ నల్లప్ప బందోబస్తు ఏర్పాట్లు చేశారు. -
నాచగిరి.. శ్రావణ సందడి
ఓ వైపు సత్యనారాయణవ్రతాలు మరోవైపు ఉట్లోత్సవ వేడుకలు కిటకిటలాడిన పుణ్యక్షేత్రం నాచారంగుట్ట(వర్గల్):శ్రావణమాసం చివరి ఆదివారం వారాంతపు సెలవురోజు నాచగిరి శ్రీలక్ష్మీనృసింహక్షేత్రం భక్తులతో పోటెత్తింది. శ్రావణమాసంలో పుణ్యక్షేత్రం సందర్శించి పూజల్లో పాల్గొంటే విశేష పుణ్యం లభిస్తుందని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో క్షేత్రానికి తరలివచ్చారు. ఉదయం నుంచే క్షేత్రానికి భక్తుల తాకిడి మొదలైంది. ఓవైపు ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు, మరోవైపు సత్యనారాయణస్వామి వ్రతమండపంలో దంపతుల సామూహిక వ్రతాలు, గర్భగుడిలో నారసింహుని దర్శనార్థం బారులు తీరిన భక్తులతో నాచగిరిలో ఎటు చూసినా భక్తుల రద్దీ కన్పించింది. సాయంత్రం వరకు 80 సత్యనారాయణ వ్రతాలు జరిగాయి. క్షేత్రంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెల్లివిరిసాయి. ఉట్లోత్సవ సంబరం నాచగిరిలో గోకులాష్టమి వేడుకలు ఆదివారం సాయంత్రం ఉట్లోత్సవంతో ముగిసాయి. లక్ష్మీసమేతులైన స్వామి వారు ఉట్లోత్సవం తిలకించేందుకు పల్లకిపై ఆలయ ఉత్తర ద్వారం వైపు ఊరేగింపుగా చేరుకున్నారు. అక్కడ ఉట్లు కొట్టె కార్యక్రమం తిలకించారు. చప్పట్లు, కేరింతల మధ్య కొనసాగిన ఈ వేడుకలో భక్తులు పాల్గొని ఆనందపరవశులయ్యారు. స్వామి వారిని దర్శించుకుని తరించారు. తులు -
శ్రావణలక్ష్మీ నమోస్తుతే..
-
ఉరుకుందలో ‘శ్రావణ’ సందడి
– ఆలయంలో పోటెత్తిన భక్తులు – ఈరన్నకు ప్రత్యేక పూజలు కౌతాళం: శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా మొదటి సోమవారం ఉరుకుంద ఈరన్న ఆలయం భక్తులతో పోటెత్తింది. ఆదివారం నుంచే స్వామి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. ఈ రద్దీ సోమవారం పెరిగి..స్వామి దర్శనానికి గంటల కొద్ది సమయం పట్టింది. మన రాష్ట్రం నుంచేకాక తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ పరిసరాల్లో ప్రత్యేక వంటకాలను వండి స్వామి వారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు తెల్లవారు జామున 3 గంటలకు సుప్రభాతసేవ, మహా మంగళహారతి, ఆకుపూజ, బిందుసేవ, పంచామతాభిషేకం తదితర ప్రత్యేక పూజల అనంతరం భక్తులను దర్శనానికి వదిలారు. రద్దీకి అనుగుణంగా అతిశీఘ్ర దర్శనంతో పాటు ప్రత్యేక, శీఘ్ర, ఉచిత దర్శనం ఏర్పాటు చేశారు. స్వామి సన్నిధిలో పంచాయతీరాజ్ కమిషనర్ ఉరుకుంద ఈరన్న స్వామిని సోమవారం తెల్లవారుజామున పంచాయతీ రాజ్ కమిషనర్ రామాంజనేయులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి పాలక మండలి అధ్యక్షుడు చెన్నబసప్ప, ఈవో మల్లికార్జున ప్రసాద్‌లు స్వాగతం పలికారు. స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలను చేయించి స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ తమ ఇంటి దైవం ఈరన్న స్వామిని ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో దర్శించుకుంటామన్నారు. -
పుష్కరోత్సాహం
-
శ్రావణం..శుభకరం
పాతపోస్టాఫీసు :పాతనగరం కన్యకాపరమేశ్వరి ఆలయంలో 10.30 నుంచి 11.30 వరకూ మహిళలచే శ్రీ చక్ర సహిత కుంకుమ పూజలు, శ్రీ లలితా సహస్రనామ పారాయణం, శ్రీ అష్టలక్ష్మీ స్తోత్రం, శ్రీ లక్ష్మీ, శ్రీ భ్రమరాంబికా, శ్రీ రాజరాజేశ్వరీ అష్టకములు సామూహిక పారాయణం వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. సుమారు 200 మంది భక్తులు కుంకుమార్చనలో పాల్గొన్నారు. పూలమాలలతో దేదీప్యమానంగా వెలుగొందుతున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులుతీరారు. ఆదుకోవమ్మా...కనకదుర్గ పాతనగరంలోని శ్రీ విశాఖ సాగర కనకదుర్గ ఆలయం, లక్ష్మీదేవి ఆలయాల్లో తొలి శుక్రవారం కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. సుమారు 200 మంది మహిళలు నాలుగు విడతులుగా పూజలో పాల్గొన్నారు. ఆలయ మండపంలో సామూహిక కుంకుమార్చనలతో పాటు శ్రీ లక్ష్మీ హోమం చేపట్టారు. -
ఉరుకుందలో శ్రావణమాస ఉత్సవాలు ప్రారంభం
కౌతాళం: ఉరుకుంద ఈరన్నస్వామి శ్రావణ మాస ఉత్సవాలు బుధవారం పాలకమండలి అధ్యక్షుడు చెన్నబసప్ప, పాలక మండలి సభ్యులు, ఆలయ కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాద్‌ల ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారు జామున 4 గంటలకు సుప్రభాతసేవ, మహా మంగళహరతి, పంచామతాభిషేకం, ప్రత్యేక పూజల అనంతరం భక్తులను దర్శనానికి వదిలారు. రాత్రి 7గంటలకు ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. అంతకు ముందుకు దేవాలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి దీపారాధన చేశారు. అనంతరం ఆలయ గోపురంపై స్వామి జెండాను ఆవిష్కరించారు. ఆలయ పర్యవేక్షకులు మల్లికార్జున, వెంకటేశ్వర్లు, పాలక మండలి సభ్యులు కొట్రేష్‌గౌడ్, ఈరన్న, చిరంజీవి, శంకరమ్మ, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. -
శ్రావణం.. పండుగలమయం
దేవతలకు ప్రీతికరం.. సిరిసంపదలకు ఆలవాలం అమ్మవార్ల అనుగ్రహానికి అనువైన కాలం ప్రతి రోజూ శుభప్రదమే శ్రావణంలో ముఖ్య పండుగల తేదీలు నాగుల పంచమి 7 మంగళ గౌరీ వ్రతం 9 వరలక్ష్మీవ్రతం 12 రక్షాబంధన్ 18 శ్రీ కృష్ణాష్టమి 25 జోగిపేట: మహాశక్తిదాయిని, సౌభాగ్య సంతాన ఫలాలనిచ్చే వరప్రదాయిని శ్రీ మహాలక్ష్మి మాత. గుమ్మం ముందు ముగ్గు.. పూజాపీఠం వద్ద దీపం.. పెరట్లో గోమహాలక్ష్మి.. తులసికోట.. గడపకు పసుపు.. నుదుటున కుంకుమతో కళకళలాడే ఇంతులున్న ఇంట ఆ అమ్మవారు కొలువై ఉంటారట. శ్రీమహావిష్ణువు హృదయవాసినిగా భాసిల్లే ఆ అమృత స్వరూపిణికి కొలువై ఉన్న ఇల్లు ఎల్లవేళలా సిరిసంపదలు సుమంగళీ భాగ్యంతో అలరారుతుంది. అంతటి కరుణామూర్తిని పూజించేందుకు.. అమ్మవారి అనుగ్రహం పొందేందుకు అనువైన మాసం శ్రావణం. ఈ మాసం దేవికే కాదు..శివుడికి కూడా ప్రీతికరమైనదే. ఆధ్యాత్మిక మాసం శ్రావణంలో ప్రతి రోజు ప్రత్యేకమే...శుభప్రదమే. ఒక్కోరోజు ఒక్కో దేవునికి పూజలు పాడ్యమి బ్రహ్మదేవుడు విదియ శ్రీయఃపతి తదియ పార్వతీదేవి చవితి వినాయకుడు పంచమి శశి షష్టి నాగదేవతలు సప్తమి సూర్యుడు అష్టమి దుర్గాదేవి నవమి మాతృదేవతలు దశమి ధర్మరాజు ఏకాదశి మహర్షులు ద్వాదశి శ్రీమహావిష్ణువు త్రయోదశి అనంగుడు చతుర్దశి పరమశివుడు పూర్ణిమ పితృదేవతలు పండగల మాసమే... శ్రావణమాసం వ్రతాలు, పూజలు, ఉపవాసాలతో పాటు ఎటు చూసినా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుంటుంది. మహిళలకు అత్యంత ముఖ్యమైనది. మహిళలు పాటించే వ్రతాల్లో అధికం ఈ మాసంలోనే ఉండడంవల్ల వ్రతాలమాసమని, సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా చెబుతారు. నాగుల పంచమి సర్పదోషాలు తొలగిపోవడానికి శ్రావణ శుద్ధ పంచమి (ఆగస్టు7)రోజు నాగుల పంచమిని జరుపుకుంటారు. పుట్టలో పాలుపోసి ప్రత్యేక పూజలు చేస్తారు.వెండితో నాగ ప్రతిమలు చేసి పుట్టల్లో వదులుతారు. మహిళలు ఉపవాసం ఉండి పుట్టలో పాలుపోస్తారు. మంగళగౌరీ వ్రతం శ్రావణమాసంలో ఆచరించే వ్రతాల్లో ముఖ్యమైనది. నిండు నూరేళ్లు సౌభాగ్యవతిగా ఉండాలని, మంచి సంతానం కలగాలని కోరుతూ నూతన వధువులు ఈ మాసంలో ప్రతి మంగళవారం మంగళగౌరి వ్రతం చేస్తారు.(ఆగస్టు9)అన్యోన్య దాంపత్యం, సంతానం, కలగాలని వ్రతాన్ని ఆచరిస్తారు. వివాహంన జరిగిన మొదటి ఐదేళ్లూ ఈ మాసంలో ప్రతి మంగళవారం చేపడతారు. వరలక్ష్మీ వ్రతం మహిళలకు అత్యంత ముఖ్యమైన శ్రావణమాసంలో ఆచరించే మరో ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మీ వ్రతం. దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం (ఆగస్టు12)రోజున వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించి సౌభాగ్యంతో వర్ధిల్లాలని కోరుతూ ఈ వ్రతాన్ని నిర్వహిస్తారు. రాఖీపూర్ణిమ సోదరుడి సుఖసంతోషాలు కోరుతూ అక్కాచెల్లెళ్లు సోదరుడి చేతికి రాఖీ కడతారు నుదుట బొట్టు పెట్టి.అనంతరం మిఠాయిలను తినిపిస్తారు. సోదరుడు సోదరి ఆశీర్వాదం తీసుకుని కానుకలివ్వడం ఆనవాయితీ. అంతే గాక ఈ రోజు పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం. సోదర, సోదరీమణుల బంధానికి ప్రతీకంగా నిలచిన రక్షాబంధన్(ఆగస్టు18)ను జరుపుకుంటారు. శ్రీకృష్ణాష్టమి శ్రీమహావిష్ణువు ధరించిన అవతారాల్లో ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన రోజు. దీనినే కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి అని పేర్లు. ఈ రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు, మీగడ, వెన్నలను సమర్పించడం ఆచారం. శ్రావణ బహుళ అష్టమి రోజున (ఆగస్టు 25) న శ్రీకృష్ణుడి జన్మదిన వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. కృష్ణుడిని ఊయలలో వేసి ఉత్సవాలను నిర్వహిస్తారు. -
మహిమాన్వితం.. ఉరుకుంద క్షేత్రం
– 3 నుంచి శ్రావణమాస ఉత్సవాలు ప్రారంభం – ఉత్సవాలకు ముస్తాబైన నారసింహుడు – ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు కౌతాళం: ఉరుకుంద ఈరన్న (నరసింహ) స్వామి క్షేత్రం భక్త జనుల పుణ్యధామంగా వెలుగొందుతోంది. మహిమాన్వితుడైన ఈరన్న స్వామిని మనసా, వాచా కొలిస్తే శుభం జరుగుతుందనే నమ్మకం ఉంది. స్వామి పాదాలు తాకితే సర్వపాపాలు తొలగి ముక్తిమార్గం సంప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు ఈనెల 3వ తేదీ బుధవారం నుంచి వచ్చే నెల 1వ తేదీ గురువారం వరకు జరుగుతాయి. ఉత్సవాల్లో సోమవారం, గురువారాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ సారి ఐదు గురువారాలు, నాలుగు సోమవారాలు వచ్చాయి. మూడో∙సోమవారం ఒక్కరోజే లక్షల్లో భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారని అంచనా. నాలుగవ సోమవారం 29వ తేదీ స్వామి వారి పల్లకోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవాలు ముగిసే వరకు ఈ ప్రాంతం ప్రజలు మద్యపానానికి మాంసాహారానికి దూరంగా ఉంటారు. నిరాకారుడు.. కౌతాళం మండల కేంద్రానికి 6కి.మీ. దూరంలోని ఉరుకుంద గ్రామంలో ఈరన్న (నరసింహ) స్వామి వెలిశారు. స్వామికి నిర్దిష్టమైన ఆకారం అంటూ లేదు. ఒక సిద్ద పురషుడని, వీరభద్ర అంశంతో భూలోకానికి వచ్చిన దేవదూతగా పెద్దలు చెబుతారు. దాదాపు రెండువేల సంవత్సరాల క్రితం ఆయన ఉరుకుంద గ్రామాన్ని కేంద్రంగా చేసుకోని మానవజాతిని ఉద్ధరించేవాడని కథలు ప్రచారంలో ఉన్నాయి. నిరాకారుడైన స్వామి అశ్వర్థ వక్ష స్వరూపుడిగా ఇక్కడ పూజలందుకుంటున్నారు. ఆలయంలో పెద్దమర్రి చెట్టు ఉంది. చెట్టు చుట్టూ కట్టను నిర్మించారు. ప్రస్తుతం భక్తులు కట్టకే పూజలు చేస్తున్నారు. స్వామి ఇప్పటì కి రాత్రివేళ్లల్లో సర్ప రూపంలో సంచరిస్తుంటాడని భక్తులు విశ్వసిస్తున్నారు. స్వామిపై భక్తితో ఈరన్న, ఈరమ్మ, నాగరాజు, నాగమ్మ, వీరేష్, వీరన్న ఇలా పేర్లు పెట్టుకుంటున్నారు. పిల్లలకు స్వామి పేర్లు పెట్టడం వల్ల ఇంటికి అంతా శుభం జరుగుతోందని భక్తులు భావిస్తున్నారు. నిత్యాన్నదానం ఆలయం వద్ద నిత్యాన్నదానం కార్యక్రమం జరుగుతోంది. ఎంతమంది భక్తులు వచ్చినా ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక భవనాన్ని విశాలమైన ప్రదేÔ¶ ంలో నిర్మించారు. అన్నదానానికి భక్తులు ఇచ్చిన విరాళాలు సుమారు రూ.3కోట్లకు పైగా ఉన్నట్లు ఆలయన చైర్మన్ చెన్న బసప్ప, ఈవో మల్లికార్జున ప్రసాద్‌లు తెలిపారు. దర్శనీయ స్థలాలు ఆలయం వెనుక ఉన్న ఆంజనేయ స్వామి, నాగుల స్వామి, బసవన్న కట్టను దర్శించుకోవడం అనవాయితీ. ఉరుకుందకు సుమారు 35 కి,మీ. దూరంలో మంత్రాలయం మఠం ఉంది. ఉరుకుందకు మూడు కి,మీ. దూరంలో బుడుములదొడ్డి ఆంజినేయ స్వామి ఉంది. కౌతాళం–సుళేకేరి రోడ్డులో ఉన్న ఈఆలయం అత్యంత పురాతనమైనది. ఉరుకుందకు 21 కి,మీ. దూరంలో మేళిగనూరు వద్ద రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. నీటి సదుపాయం ఆలయం సమీపంలోనే తుంగభద్ర దిగువకాలువ ప్రవహిస్తుంది. దీంతో భక్తులకు నీటి సమస్య ఉండదు. ఈ ఏడాది దేవాలయ అధికారులు.. ఆదోని, కోసిగి రోడ్లలో అలాగే బావి వద్ద బోర్లు వేసి షవర్లు ఏర్పాటు చేశారు. తాగునీటి కోసం ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. దేవాలయం వద్ద నీటి శుద్ధి యంత్రాన్ని ఏర్పాటు చేసి మినరల్ వాటర్‌ను సరఫరా చేస్తున్నట్లు ఈవో తెలిపారు. వసతి సదుపాయం భక్తుల కోసం అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని ఈవో మల్లికార్జున ప్రసాద్, చైర్మన్ చెన్నబసప్పలు తెలిపారు. భక్తుల సహకారంతో నిర్మించిన 160 గదులు అందుబాటులో ఉన్నాయని వారు తెలిపారు. ప్రత్యేక బందోబస్తు ఉత్సవాలు ముగిసే వరకు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలకు గురికాకుండా ఉండేందుకు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఇద్దరు సీఐలు, 8 మంది ఎస్ఐలు, 20 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 50 మంది కానిస్టేబుళ్లు, 10మంది మహిళ పీసీలు, 40 మంది హోంగార్డులతో పాటు ఆదోనిఎన్సీసీ విద్యార్థుల సహకారంతో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నాట్లు కౌతాళం ఎస్ఐ నల్లప్ప తెలిపారు. రవాణా సౌకర్యం ఆదోని, ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలతోపాటు కర్ణాటకలోని బళ్లారి, శిరుగుప్ప, రాయచూరు, సింధనూరు ఆర్టీసీ డిపోల నుంచి ఉరుకుందకు బస్సులు నడుపుతున్నారు. ఆదోని, ఎమ్మిగనూరుకు చేరుకుంటే అక్కడి నుంచి ఉరకుందకు వెళ్లేందుకు బస్సులు సిద్ధంగా ఉంటాయి. -
మా కన్నయ్యకోసమే ఈ పెళ్లిళ్లు!
శ్రావణమాసం అంటే... ఈ స్నేహబృందానికి అత్యంత ఇష్టమైన మాసం. ఎందుకంటే... కృష్ణుడు పుట్టింది ఈ మాసంలోనే. అరవై ఆరేళ్ల స్వరాజ్యలక్ష్మి అయితే... ‘మా అబ్బాయి పుట్టిన రోజు’ అంటూ హడావుడి చేస్తారు. ఇక ధనుర్మాసం వస్తే... ‘మా వాడి పెళ్లి’ అంటూ ఇంటిని అలంకరిస్తారు. ముత్యాల పందిరి వేస్తారు... నలుగుపెట్టి స్నానం చేయిస్తారు. మధుపర్కాలు ధరింపచేసి తలంబ్రాలు పోయిస్తారు. హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో గణపతి కాంప్లెక్స్ దగ్గర ‘స్వరాజ్య లక్ష్మిగారిల్లు తెలుసా’ అని ఎవరినైనా అడిగితే ‘ఏటా కృష్ణుడికి పెళ్లి చేస్తుంటారు, ఆడవాళ్లంతా చేరి ధ్యానం చేస్తుంటారు... ఆవిడేనా?’ అన్నట్లు చూస్తారు. నిజమే! ఆమె పాతికేళ్లపాటు నిర్విఘ్నంగా ఏటా కృష్ణుడికి గోదాదేవితో పెళ్లి చేశారు. మురళీమోహనుడిని రాధాసమేతంగా ఇంట్లో అట్టే పెట్టేసుకున్నారు. రాధాకృష్ణులకు చమ్కీ వర్క్ చేసిన ముఖమల్ వస్త్రాలు తొడిగి, ముత్యపు పందిరి వేశారామె. ప్రతి మంగళవారం ఉదయం పదకొండు గంటలకు కాలనీలోని స్నేహితురాళ్లందరూ స్వరాజ్య లక్ష్మి ఇంట్లో కలుస్తారు. అప్పటికే రాధాకృష్ణులకు ప్రభాత సేవ, నైవేద్యం వంటి పనులన్నీ పూర్తయి ఉంటాయి. ‘కృష్ణయ్యా! నిన్ను చూడడానికి ఎవరెవరొచ్చారో చూడు’ అంటూ ధ్యానంలో కూర్చుంటారామె. ఆమెతోపాటు స్నేహితులందరూ ధ్యానం చేస్తారు. ధ్యానం పూర్తయిన తర్వాత కృష్ణతత్వాన్ని, భాగవతంలోని దశమస్కంధాన్ని పారాయణం చేస్తారు. కృష్ణుడిని కన్నబిడ్డగా భావించే మధుర భక్తురాలు స్వరాజ్యలక్ష్మి. ధ్యానమే మూలం! ఈ స్నేహబృందం... కృష్ణతత్వాన్ని, కృష్ణుడి లీలలను తలచుకోవడంతోపాటు మానవ సేవ చేయడమే ఆ మాధవుడికి చేసే పరిపూర్ణమైన సేవ అని నమ్ముతారు. ‘‘కృష్ణుడికి పెళ్లి చేసేది నా తృప్తి కోసం. అనాథలకు పెళ్లి మాత్రం కృష్ణుడికి ఇష్టమని చేస్తున్నాం. ఏ పని అయినా సరే మా సత్సంగంలో పాల్గొనే స్నేహితులందరం కలిసి చేస్తాం’’ అన్నారు స్వరాజ్యలక్ష్మి. ‘‘ఇప్పటికి పది జంటలకు పెళ్లి చేశాం. పెళ్లికి కావల్సిన అన్ని వస్తువులనూ మేమే సమకూరుస్తాం. వారు కాపురం పెట్టుకోవడానికి అవసరమైన వస్తువులన్నీ మేమే ఇస్తాం’’ అన్నారు అక్కడే ఉన్న ప్రమీల. ఏదైనా ఒక పని అనుకుంటే ఎవరూ వెనుకడుగు వేయరు. అందరూ తలో చెయ్యి వేయడానికి ముందుకు వస్తారు. అలా మంచి ఆలోచనలకు, మంచి కార్యాచరణకు ధ్యానమే కారణం అంటూ ‘‘ధ్యానంతో స్పందించే గుణం వస్తుంది. మనసు, ఆలోచనలు ధారాళంగా ముందుకు సాగుతాయి. ఆ ధ్యానమే నాకు ఇంతమంది స్నేహితులను ఇచ్చింది. వారి స్నేహమే నాతో ఇన్ని మంచి పనులు చేయిస్తోంది’’ అంటారు స్వరాజ్యలక్ష్మి. భక్తి నుంచి ధార్మికంలోకి... ఈ సత్సంగంలోని స్నేహబృందం చేపట్టిన పనులేవీ చిన్నవి కావు. అదే విషయాలను గుర్తు చేసుకుంటూ... ‘‘పదిహేనేళ్లుగా దాదాపుగా వందమందిమి ఇలాగే వారం వారం కలుస్తూన్నాం. మొదట్లో ఒకసారి అందరం కలిసి పదిమందికి ఉపయోగపడే ఏదైనా చిన్న పని చేద్దాం. అనాథ పిల్లల చదువు కోసం సత్సంగం తరఫున ఐదువేల రూపాయలిచ్చాం. అలా చిన్న చిన్నవి చేస్తూ వచ్చాం. ఒకసారి పేపర్లో బోడుప్పల్లో రాజేశ్ అనే కుర్రాడు అనాథలైన వృద్ధులకు ఆశ్రయం ఇస్తున్నట్లు చదివి మేము కొంతమందిమి వెళ్లి చూసి వచ్చాం. అతడు వృద్ధులకు చేసే సేవ చూస్తే ఎవరికైనా మనసు కరిగిపోతుంది. అలాంటి వ్యక్తికి మా వంతుగా ఏదైనా చేస్తే బావుంటుందనుకున్నాం. మొదట అంబులెన్స్ కొనిచ్చాం. బోరు వేయించాం. ఆ తర్వాత ఆశ్రమానికి స్థలం కొనిచ్చాం. ఆ స్థలం కొనడానికి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ అధినేత అంజిరెడ్డి గారి భార్య సహకరించారు’’ అన్నారు స్వర్ణ. స్వరాజ్య లక్ష్మి... అనాథాశ్రమంలో బోరు వేయించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ... ‘‘బోరు కోసం అందరం కలిసి రెండు లక్షల రూపాయలు జమచేశాం. భూమి పూజ చేసి బోరు వేయడం మొదలైంది. ఏడు వందల అడుగులు వెళ్లినా నీటి జాడ లేదు. దాంతో నాకు భయం వేసింది. నా ఒక్కదాని డబ్బు కాదు. నా మాట మీద ఇంతమంది ముందుకు వచ్చారు. నీరు పడకపోతే నీటి ఇబ్బంది తీరక ఆశ్రమంలోని వాళ్ల కష్టం అలాగే ఉంటుంది. వాళ్లకేదో మేలు చేద్దాం అని డబ్బిచ్చిన ఇంతమందీ నిరాశ చెందుతారు. నాయనా కృష్ణయ్యా నీవే దిక్కు - అని భారం అంతా వాడి మీదనే వేశాను. ఎనిమిది వందలు దాటే సరికి జల పడింది’’ అన్నారామె సంబరంగా! పెళ్లికి ఇలా! అనాథ జంటల పెళ్లిని ఈ స్నేహబృందం అంతా తమ ఇంటి పెళ్లిలాగ నిర్వహిస్తారు. నలుగురు వెళ్లి పెళ్లి బట్టలు, మంగళ సూత్రం కొంటారు. మరికొందరు ఇంటికి అవసరమైన వస్తువులు తీసుకువస్తారు. దీంతోపాటు అందరి ఇళ్ల నుంచి వాడకుండా పక్కన పెట్టేసిన పాత్రలు, వేడుకలకు హాజరైనప్పుడు ఇచ్చిన స్టీలు డబ్బాల వంటి బహుమతులను జమ చేస్తారు. ఇలా కొత్త కాపురానికి అవసరమైన వస్తువులన్నీ చేరిపోతాయి. తాము ఒక మోస్తరుగా వాడిన చీరలు, కాలేజ్ పిల్లల జీన్స్ ప్యాంట్లు, చొక్కాలు అన్నీ కలిపి వధువుకి నలభై జతలు, వరుడికి పాతిక జతల వరకు చేరుస్తారు. ఇంతమంది మహిళలు నిండు మనసులతో కొత్త జీవితానికి ఆసరాగా నిలవడంతో ఆ వధూవరులు తమకెవరూ లేరనే బాధ నుంచి బయటపడి వీరి ఆత్మీయతకు ఆనందపడతారు. ‘‘ఇంతవరకు పది జంటలను కలిపాం. మరో పెళ్లికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. వధూవరులే రావాల్సి ఉంది’’ అంటూ చమత్కరించారు భవాని. కృష్ణాష్టమిరోజు కృష్ణుడికి పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తారు. ధనుర్మాసంలో రాధను గోదాదేవిగా అలంకరించి రోజూ పాశురాలు చదువుతూ భోగి రోజు వివాహం చేస్తారు. అలా పాతికేళ్లపాటు వివాహమహోత్సవాన్ని నిర్వహించారామె. మాధవ సేవ ఎంత చేసినా మానవ సేవ చేస్తేనే మా కృష్ణయ్యకు సంతోషం... అంటారామె. ఇంకా తనకు ఇద్దరమ్మాయిలనిచ్చి కొడుకుగా వాడే నా ఇంట్లో ఉన్నాడు - అంటూ మురిసిపోతారు. - వాకా మంజులారెడ్డి అదిహృదయభాష ! ధ్యానం వల్ల పొందే అనుభూతిని వివరించడానికి మాటలుండవు. మనసుకి అర్థం కావాల్సిందే. ధ్యానంతో జ్ఞాపకశక్తి పెరుగు తుంది. కష్టాలను అధిగమించగలిగే మానసిక స్థిరత్వం వస్తుంది. - రాజ్యలక్ష్మి సత్సంగ నిర్వహకురాలు -
గ్రేట్ ముహూర్తం
బలమైన లగ్నాలు కుదిరాయి.. తిథులు, నక్షత్రాలు కలిశాయి.. వారాలు కలిసొచ్చాయి.. వివాహఘడియలకు శుభసూచకంగా మారాయి.. వీటికి తోడు శ్రావణ మాసం.. ఇలాంటి తరుణంలో వేలాది జంటలు ఒక్కటి కానున్నాయి.. వరుసగా మూడు రోజులు వివాహాలకు అనువుగా ఉండడంతో గ్రేటర్‌కు పెళ్లిక ళ వచ్చేసింది. మండపాలు, ఫంక్షన్ హాళ్లు, గృహాలు అందంగా ముస్తాబవుతున్నాయి. మార్కెట్లన్నీ కళకళలాడుతున్నాయి. - మూడు రోజులూ సందడే - వేల సంఖ్యలో వివాహాలు - ముస్తాబవుతున్న ఫంక్షన్‌హాళ్లు, మండపాలు - భారీగా పెరిగిన ధరలు - రెట్టింపైన పెళ్లి బడ్జెట్ సాక్షి, సిటీబ్యూరో/కంటోన్మెంట్, చంపాపేట్, హస్తినాపురం, నాగోల్: శ్రావణమాసం.. పెళ్లిళ్లకు అనుకూలం.. అందునా మంచి ముహూర్తాలు కలిసొస్తే ఇక పెళ్లి సందడే. బుధ, గురు, శుక్రవారాలు ఉన్నతమైన గ్రహస్థితి, చక్కటి తిథులు, వేళలు అన్నీ శుభసూచికంగా మారాయి. ఈ అద్భుత ఘడియల్లో వేలాది జంటలను ఒక్కటి చేసేందుకు మండపాలు, ఫంక్షన్‌హాళ్లు అందంగా ముస్తాబవుతున్నాయి. నగరంలో ఏ గల్లీ చూసినా పెళ్లి సందడే. వస్త్ర, బంగారు దుకాణాలు రద్దీగా ఉన్నాయి. భారీ సంఖ్యలో వివాహాలు జరుగుతున్న సందర్భంగా ఫంక్షన్ హాళ్లకు భారీ డిమాండ్ నెలకొంది. ధరలకు రెక్కలు... ఈ శ్రావణ మాసం అన్నీ మంచి రోజులే. అయితే ఈ నెల 13, 14, 15 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉండటంతో వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో అన్ని రకాల వస్తువుల ధరలకు రెక్కలొచ్చేశాయి. ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు ధరలు అమాంతం పెంచేశారు. మండపాలను అలంకరించే ఆర్టిస్టులు మొదలుకొని సన్నాయి వాద్యకారులు, పురోహితులు, కేటరింగ్ వాళ్లు అందరికీ డిమాండ్ పెరిగింది. కిందటే డాది కంటే ఈసారి చార్జీలు భారీగా పెంచేశారు. ఈ నేపథ్యంలో రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షల వ్యయం అయ్యే పెళ్లి బడ్జెట్ ఏకంగా రూ. 10 లక్షలకు చేరుకోనుంది. సికింద్రాబాద్, కంటోన్మెంట్, తిరుమలగిరి తదితర ప్రాంతాల్లో సాధారణ రోజుల్లో రూ. 2 లక్షలు మాత్రమే ఉండే ఓ ఫంక్షన్ హాలు అద్దె రూ. 3 లక్షలకు పెంచేశారు. ఎల్బీనగర్, చంపాపేట్, నాగోల్, సాగర్ రింగురోడ్డు తదితర ప్రాంతాల్లోని ఫంక్షన్ హాళ్లు సాధారణ రోజుల్లో రూ. 5 లక్షల నుంచి రూ. 6 లక్షలుండగా ప్రస్తుతం రూ. 7 లక్షల నుంచి రూ. 8 లక్షలకు పెరిగాయి. ఫంక్షన్ హాళ్లు లభించని వారు బస్తీల్లోని కమ్యూనిటీ హాళ్లు, ఇంటి ముందు సెట్టింగులతో ఉన్నంతలో ఘనంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ‘డెకరేషన్’ ఎక్కువైంది! పెళ్లి మండపాలు, ఆహ్వాన వేదిక, సెట్టింగుల ఖర్చులు భారీగా పెరిగాయి. రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఇందుకోసమే ఖర్చుచేస్తున్నారు. డెకరేషన్లకు జర్బరా, కార్నేషన్, ఆర్కిడ్, ఆంథోరియమ్ వంటి పూలను వాడుతారు. సాధారణ రోజుల్లో జర్బరా బంచ్ (పది పూల కట్ట)కు సగటున రూ. 50 ఉంటే ప్రస్తుతం అది రూ. 200 లకు పెరిగింది. కార్నేషన్ ధరలు రూ. 150 నుంచి రూ. 300 వరకు, ఆర్కిడ్ రేట్లు రూ. 200 నుంచి రూ. 400కు పెరిగాయి. - సాధారణ రోజుల్లో రూ. 80 వేల నుంచి రూ. లక్ష వరకు తీసుకునే వీడియోగ్రాఫర్లు ప్రస్తుతం రూ. 2 లక్షలకు పైగా డిమాండ్ చేస్తున్నారు. - ఒకే సమయంలో ఎక్కువ ముహూర్తాలు రావడంతో పురోహితులకు డిమాండ్ ఏర్పడింది. దీంతో వేద పాఠశాలల్లో ఉండే పండితులు, దేవాలయ అర్చకులు సైతం రంగంలోకి దిగారు. - నాదస్వర విద్యాంసులకు సైతం డిమాండ్ నెలకొంది. సాధారణంగా ఒక పెళ్లికి రూ. 15,000 నుంచి రూ. 25,000 తీసుకునే ఐదుగురు సభ్యుల బృందం ప్రస్తుతం రూ. 30,000కు పైగా డిమాండ్ చేస్తున్నారు. మూసుకున్న హాళ్లూ తెరుచుకుంటున్నాయ్! కంటోన్మెంట్లో బీ-3 కేటగిరీకి చెందిన ఓల్డ్ గ్రాంట్ బంగళా స్థలాల్లో ఉన్న ఫంక్షన్ హాళ్లను గతేడాది బోర్డు అధికారులు మూసేయగా, మరికొందరు నిర్వహణ భారం మోయలేక మరికొందరు హాళ్లను మూసేశారు. మల్కాజ్‌గిరిలోని మల్లారెడ్డి గార్డెన్‌ను ఎనిమిది నెలల కిందట మూసేశారు. ప్రస్తుతం షెడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి పెళ్లిళ్లకు సిద్ధం చేస్తున్నారు. -
పెళ్లి కళ వచ్చేసిందే బాలా..
ఈనెలలో వేలాది వివాహాలు ముస్తాబవుతున్న వేదికలు పరిమిత ముహూర్తాలతో పెళ్లి ఏర్పాట్లకు భారీ డిమాండ్ మూడు ముళ్లు.. ఏడడుగులు.. పెళ్లంటే రెండు మనసులు ఒక్కటయ్యే శుభ ఘడియలు. అందుకే అంత ఆనందం. చూసిన వారికి సైతం ముచ్చట గొలిపే వేడుకది. అందుకే అంత వైభోగం. శ్రావణం మాసం రావడంతో సుముహూర్తాలు సమీపించాయి. వేదికలు సిద్ధమవుతున్నాయి. పట్టు చీరల రెపరెపలు.. సుగంధ పరిమళాలు.. పిండి వంటల ఘుమఘుమలు.. వివాహ మహోత్సవానికి శోభను చేకూర్చే విషయాలు. పెళ్లి సందడిపై ప్రత్యేక కథనం.. విశాఖపట్నం-కల్చరల్ : శ్రావణ మాసం వచ్చింది.. మంచి ముహూర్తాలెన్నో తెచ్చింది. కల్యాణ మండపాలు సర్వాంగసుందరంగా ముస్తాబవుతున్నాయి. మూఢం ముగిశాక ఈనెల 13, 14, 15 తేదీల్లో సుముహూర్తాలు ఉండటంతో పెద్దలు పెళ్లి పనుల్లో బిజీబిజీ అయిపోయారు. 19వ తేదీన బలమైన ముహూర్తం కావడంతో ఆరోజు వెయ్యికిపైగా వివాహాలు జరగనున్నాయని పురోహితులు చెప్పారు. ఈ రోజుల్లో రికార్డు స్థాయిలో పెళ్లిళ్లు ఉండటంతో నగరంలోని కల్యాణ మండపాలతోపాటు క్యాటరింగ్, వీడియో తీసే వారికి డిమాండ్ పెరిగిపోయింది. నగరంలోని ప్రముఖ కల్యాణ మండపాలతోపాటు చిన్న, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండే ఫంక్షన్ హాల్స్, ట్రావెల్స్, ఫ్లవర్ డెకరేషన్ ట్రూప్స్‌ను ముందుగానే రిజర్వు చేసుకున్నారు. చిన్న పెద్ద హోటల్ రూమ్స్ ఇప్పటికే హౌస్‌ఫుల్ అయ్యాయి. నగరంలో 500లకు పైగా ఉన్న ట్రావెల్ ఏజెన్సీలు బిజీబిజీగా ఉన్నాయి. ఈ మూడు రోజుల్లో బుక్ చేద్దామంటే డేట్స్ ఖాళీలేవని కస్టమర్లకు చెబుతున్నారు. ముచ్చటైన వేదికలు పెళ్లికి గ్రాండ్ లుక్ తీసుకురావడంలో ఫంక్షన్ హాళ్లదే కీలక పాత్ర. ఖరీదైన కల్యాణ మండపాలు, స్టార్ హోటళ్లలో కాన్ఫరెన్స్ హాళ్లు ఇందుకు మంచి వేదికలుగా నిలుస్తున్నాయి. పెద్దపెద్ద గ్రౌండ్స్‌లో అపురూపమైన సెట్టింగ్‌లు వేసి, ఇంకెక్కడా లేని విధంగా ప్రత్యేకంగా డెకరేట్ చేసుకోవడం ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది. ఇందుకు ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడడం లేదు. సెట్టింగులు వేయడానికి చెన్నై నుంచి ఆర్ట్ డెరైక్టర్లను కూడా రప్పిస్తున్నారు. ది పార్క్ హోటల్ లాన్లో ఓపెన్ ఫంక్షన్ హాల్‌ను కళ్లు చెదిరేలా రూపొందిస్తున్నారు. ఎల్ఈడీ టీవీలు, స్క్రీన్లు ఏర్పాటు చేసి, వివాహ వేడుకను దూరంగా కూర్చున్నవారు, డిన్నర్ హాల్లో ఉన్నవారు సైతం క్లోజ్‌గా వీక్షించడనాకి ప్రొజెక్టర్తోపాటుగా వైఫై సౌకర్యం అందుబాటులో ఉంటున్నాయి. స్పెషల్ డెకరేటివ్ లైటింగ్, సెంట్రలైజ్డ్ ఏసీ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. జీవీఎంసీ పరిధిలో 270 ఫంక్షన్ హాల్స్‌ను ఆన్లైన్ ద్వారానే బుక్ చేసుకోవాలి. (డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.జీవీఎంసీ.ఓఆర్జీ.ఇన్) ఇక ప్రైవేటుగా సుమారు 1500కుపైగా ఫంక్షన్ హాళ్లు ఉన్నాయి. వీటిలో కొన్నింటిని ఆన్లైన్ ద్వారానే బుక్ చేసుకుంటున్నారు. ..అందుకే శ్రావణమంటే క్రేజ్ శ్రావణంలో పెళ్లి ముహూర్తాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సహజంగానే ఈ మాసంలో పెళ్లిని సుముహూర్తంగా భావిస్తారు. అందుకే శ్రావణమంటే క్రేజ్. చాలా అడ్వాన్సుగా శ్రావణం సీజన్ ముహూర్తాలకు వివాహ వేదికలన్నీ బుక్ అయిపోయాయి. మన నగరంలో ఇప్పుడిప్పుడే ఫంక్షన్ హాళ్లు పెరిగాయి. అయితే కొన్ని చోట్ల కనీస సౌకర్యాలు ఉండటం లేదు. అవసరం కోసం జనం అడ్జస్టయిపోతున్నారు. వాహనాల పార్కింగు సదుపాయం లేని ఫంక్షన్ హాళ్లకు అనుమతించరాదనే నిబంధన అధికారులు అమలుచేయాలి. - యు.నాగభూషణం, వైశాఖి జల ఉద్యానవనం -
బాదుడు భయం!
1 నుంచి పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలు క్రయవిక్రయాలకు జనం పరుగులు కిటకిటలాడుతున్న రిజిస్ట్రార్ ఆఫీసులు ప్రభుత్వానికి దండిగా ఆదాయం తీసినా వేసినా బాధించేవి పన్నులని ఏ ‘పన్’డితుడు చెప్పాడో కానీ.. జనం ఈ రెండు రకాల ఈతి బాధలతో సత మతమైపోతున్నారు. నిజానికి పన్ను వేసినప్పటి బాధతో పోలిస్తే, తీసినప్పటి బాధ లెక్కలోకి రాదని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు.. అందుకే ఇప్పుడు అంతా రిజిస్ట్రార్ కార్యాలయాలకు పరుగులు తీస్తున్నారు. ఆగస్టు 1 నుంచి రిజిస్ట్రేషన్ చార్జీల బాదుడుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేయడంతో అంతా ముందే క్రయవిక్రయాలు పూర్తి చేసే హడావుడిలో ఉన్నారు. ఏదైతేనేం ఆ విధంగా కూడా ప్రభుత్వానికి దండిగా రాబడి సమకూరుస్తున్నారు. మధురవాడ/ఆనందపురం/పెందుర్తి/భీమిలి : రద్దీ.. రద్దీ.. ఒకటే రద్దీ.. భూముల క్రయవిక్రయాలు రిజిస్టర్ చేసే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కక్షిదారుల రద్దీ భారీ ఎత్తున ఉంది. భూముల క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు అనివార్యమని తెలియడంతో ఈ రద్దీ గత రెండు మూడు రోజుల్లో బాగా పెరిగింది. ఆగస్టు 1 నుంచి ప్రభుత్వం చార్జీల బాదుడుకు సిద్ధం కావడంతో క్రయవిక్రయాల జోరు పెరిగింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు రోజుల వ్యవధిలోనే కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతోంది. మరోవైపు శ్రావణమాసం కూడా కలిసి రావడంతో ఈ హడావుడి మరింత పెరిగింది. దీంతో బుధవారం మధురవాడ, ఆనందపురం, పెందుర్తి, భీమిలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జనం సందడి బాగా కనిపించింది. కక్షిదారులతో ప్రతి కార్యాలయం కిటకిటలాడింది. నగరంలోని టర్నర్ చౌల్ట్రీ వద్దనున్న కార్యాలయంలోనూ ఇదే వాతావరణం కనిపించింది. రోజంతా హడావుడే పెందుర్తి విషయానికే వస్తే.. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో భూముల క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. గత నెల రోజుల్లో రిజిస్ట్రేషన్ల ఆదాయం గణనీయంగా తగ్గింది. రోజుకు పది లక్షలు కూడా వచ్చిన దాఖలాలు లేవు. అయితే ఇటీవల రిజిస్ట్రేషన్ల చార్జీల పెంపు ప్రతిపాదనతో ప్రజలు అప్రమత్తమయ్యారు. వచ్చే నెల ఒకటి నుంచి ఇప్పుడున్న చార్జీల కంటే 15 నుంచి 30 శాతం అదనంగా వసూలు చేసే అవకాశాలు ఉన్నాయని తెలియడంతో అంతా తొందరపడుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం పెందుర్తి రిజిస్ట్రార్ కార్యాలయం క్రయవిక్రయదారులతో కిటకిటలాడింది. ఒక్కరోజునే దాదాపు వందకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అంచనా. రూ.కోట్లలో ఆదాయం.. వాస్తవానికి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ఊపందుకుంది. అయితే మంగళవారం సెలవుదినం కావడంతో బుధవారం జోరందుకుంది. ఈ రెండు రోజులు కలిపి పెందుర్తిలోనే దాదాపు కోటిన్నర పైగా ఆదాయం వచ్చినట్లు అధికారవర్గాలు అంటున్నాయి. రానున్న రెండు రోజులు గురు,శుక్రవారాలు కావడంతో ఈ ఆదాయం మూడు నాలుగురెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. భీమిలిలో సందడి భీమునిపట్నం: రిజిస్ట్రేషన్ల ధరలు పెరుగున్న నేపద్యంలో భీమిలి సబ్రిజిస్రార్ కార్యాలయం వద్ద బుధవారం సందడి నెలకొంది. భూములు కొనుగోలు చేసేవారు, విక్రయించేవారు పెద్ద సంఖ్యలో రావడంతో ఇక్కడ వాతావరణం హడావుడిగా మారింది. సోమవారం 83 రిజిస్ట్రేషన్లు జరగగా రూ. 9 లక్షల ఆదాయం వచ్చింది. రాబోయే రెండు రోజుల్లో ఇది మరింతగా పెరిగే సూచనలున్నాయి. -
పుష్కరాలకు, పెళ్లిళ్లకు డిష్యూం డిష్యూం
* గోదావరి పుష్కరాలతో వచ్చే ఏడాది పెళ్లిళ్లు ఉండవు * అందుకే శ్రావణ మాసంలో పెళ్లిళ్ల జోరు * 5 రోజుల్లో 2 లక్షల పెళ్లిళ్లు * గోదావరి పరివాహక ప్రాంతంలో ఇక కళ్యాణ శ్రావణం 12 ఏళ్లకు పుష్కరాలు.... 16 ఏళ్లకు పరువాలు ... అని ఓ సినీ గేయ రచయిత ఆ రెండింటికి లింక్ పెట్టి ఓ పాట రాశారు. అయితే పుష్కరాల్లో పెళ్లి చేస్తే మాత్రం ఆశుభమని పెద్దలు అంటారు. వచ్చే ఏడాది జూలైలో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి పరివాహక ప్రాంత జిల్లాలైన శ్రీకాకుళం,విజయనగరం, విశాఖపట్నం,తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల ప్రజలకు పెద్ద చిక్కు వచ్చి పడింది. ఈ పుష్కరాల నేపథ్యంలో తమ పిల్లలకు ఇప్పుడు పెళ్లి చేయకుంటే 2016 జులై వరకు ఆగాల్సిందే. దాంతో ఆయా జిల్లాల ప్రజలు తమ పిల్లలకు వెంటనే పెళ్లి చేసేయాలని నిర్ణయించుకుంటున్నారు. ఇంకేం ఉత్తమమైన మాసాల్లో ఒక్కటైన శ్రావణ మాసం రానే వచ్చింది. ఈ మాసంలో 12 నుంచి 14 వరకు ఆ తర్వాత ఇదే నెలలో 19వ తేదీ మంచి ముహుర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత డిసెంబర్ మాసంలో అరకొర ముహుర్తాలున్నాయి. అంతవరకు ఎందుకులే శ్రేష్టమైన మాసం శ్రావణంలో కానిచ్చేద్దామని పెద్దలు తమ పిల్లల పెళ్లికి ముహుర్తాలు పెట్టించేస్తున్నారు. దాంతో శ్రావణమాసంలోని ఈ అయిదు రోజులలో మొత్తం 2 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయి. ఇరు రాష్ట్రాలలోని తిరుపతి, చిన్న తిరుపతి, అన్నవరం, విజయవాడ శ్రీకనకదుర్గ, శ్రీకాళహస్తి, యాదగిరిగుట్ట, వేములవాడిలోని శ్రీరాజరాజేశ్వరీ దేవాలయాలలో తమ పిల్లల వివాహానికి వారి తల్లిదండ్రులు ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్నారు. అలాగే నగరాలు, పట్టణాలలోని కల్యాణమండపాలు, క్యాటరింగ్, లైటింగ్.... అన్ని ఇప్పటికే బుక్ అయి పోయాయి. ఈ విషయాన్ని గమనించిన క్యాటరింగ్ సంస్థలు, లైటింగ్ వాళ్ల నుంచి అందరు రేట్లు పెంచేశారు. దాంతో ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయి. అయినా తప్పుదు కదా లేకుంటే 2016 జూలై తర్వాతే అని తల్లిదండ్రులు ఓ భయం పట్టుకుంది. దాంతో తమ పిల్లల పెళ్లి కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడం అంటున్నారు తల్లిదండ్రులు. అయితే ఆ తర్వాత ఏడాదే అంటే 2016లో కృష్ణా పుష్కరాలు జరగనున్నాయి. -
శ్రావణ మాసానికి సర్వం సిద్ధం
పింప్రి, న్యూస్‌లైన్: శ్రావణమాసాన్ని పురస్కరించుకొని శ్రీక్షేత్ర భీమశంకర ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ఏటా ఈ క్షేత్రం శ్రావణమాసంలో భక్తులతో కిటకిటలాడుతుంది. దీంతో ఆలయాన్ని రంగురంగుల పువ్వులు, పచ్చటి తోరణాలతో ఆలయాన్ని అందంగా ముస్తాబు చేస్తున్నారు. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందస్తుగా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. భద్రతా చర్యలను కూడా పెంచినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. నేటి నుంచి శ్రావణయాత్ర.. శ్రావణమాసంలో వచ్చే తొలి సోమవారమైన నేటి శ్రావణ యాత్ర ప్రారంభంకానుంది. ఇందుకుగాను అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పార్కింగ్, ఇతర సదుపాయాలను కూడా పూర్తి చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సు సేవలను కూడా ప్రారంభించనున్నట్లు మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నారాయణ్ గావ్ విభాగానికి చెందిన అశోక్ హండే తెలిపారు. 25 మంది పోలీసు ఉన్నతాధికారులు, 200 మంది సీనియర్ అధికారులతోపాటు పెద్దమొత్తంలో సిబ్బంది భద్రతా విధుల్లో పాల్గొననున్నార ని పోలీస్ అధికారి గిరీష్ దీగావ్కర్ తెలిపారు. యాత్ర ఏర్పాట్లను ఆంబేగావ్ ప్రాంతీయ అధికారి దత్తాత్రేయ కవితకే, సునీల్ తోఖే, ఖేడ్ ప్రాంతీయ అధికారి హిమాంత్ ఖరాడే, జున్నర్ తహశీల్దారు ప్రశాంత్ అవట్, అటవీ సంరక్షణ సహాయ అధికారి కీర్తి జయదోడే, భవన నిర్మాణ విభాగ అధికారి ఎ.బి.దేవడే, ప్రాంతీయ నగరాభివృద్ధి అధికారులు రత్నాకర్, సురేష్, విద్యుత్ మండలి అధికారి ఎస్.ఎస్.గీతే ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.