పెద్దపల్లిరూరల్: శుభ ముహూర్తాలకు వేళయింది. సోమవారం నుంచి మొదలయ్యే శ్రావణ మాసంలో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపన తదితర కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఇప్పటికే చాలామంది సన్నద్ధమయ్యారు. శుక్ర మౌఢ్యమి, ఆషాడం, గురుమౌఢ్యమి కారణంగా మూడునెలల పాటు నిలిచిపోయిన శుభ కార్యక్రమాలు శ్రావణంలో జరగనున్నాయి. శుభ కార్యక్రమాల్లో పాలుపంచుకునే పురోహితులు, బ్యాండుమేళం, ఫొటో, వీడియోగ్రాఫర్లు, ఈవెంట్ల నిర్వాహకులు, ప్రింటింగ్‌ప్రెస్, బట్టలు, కిరాణం, పండ్లు, పూలు, క్యాటరింగ్‌తో పాటు నగల వ్యాపారులు శ్రావణమాస ముహూర్తాలకు శ్రీరెడీశ్రీ అయ్యారు. మూడునెలల పాటు ఖాళీగా ఉన్న వీరంతా ఇప్పుడు బిజీ కానున్నారు.
శ్రావణంలో పండుగలు
శ్రావణమాసంలో వచ్చే పండుగలిలా ఉన్నాయి. సోమవారం (ఈనెల 5) నుంచే శ్రావణం మొదలవుతోంది. 8న నాగుల చవితి, 9న నాగులపంచమి, 16న వరలక్ష్మీ వ్రతం, 19న రాఖీ పౌర్ణమి, 27న కృష్ణాష్టమి ఉన్నాయి. అలాగే ఈనెల 5న తొలి సోమవారంతో పాటు 12,19,26న సోమవారాల్లో శివుడిని, 9,16,23,30వ తేదీల్లో (శుక్రవారాల్లో) లక్ష్మీదేవి, 10,17,24,31వ తేదీల్లో (శనివారాల్లో) విష్ణువును పూజిస్తారు. ఈ రోజుల్లో ఆలయాలన్నీ పూజా కార్యక్రమాలతో బిజీగా మారనున్నాయి.
శుభ ముహూర్తాలు
ఈనెల 5వ తేదీతో మొదలయ్యే శ్రావణమాసం సెప్టెంబర్ 3తో ముగియనుండగా, ఈ నెల 31లోపే శుభకార్యాలను ముగించుకోవాలని అర్చకులు సూచిస్తున్నారు. ఈనెల 7,8,9,10,11,15,16,17,18,21,22,23,24,28 తేదీల్లో పెళ్లిళ్లకు ముహూర్తాలు ఉన్నాయంటున్నారు. మూడునెలల ముందు నుంచే వేచి ఉన్నవారంతా ఈ శుభ ముహూర్తాల్లో తమకు అనుకూల తేదీలను నిర్ణయించుకుని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇంటింటా పండగే..
శ్రావణమాసంలో అందరూ భక్తితో పరవశిస్తారు. ఈ మాసంలో ఇంటింటా పండగ వాతావరణమే. విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం శ్రావణం. అందుకే ఈ మాసంలో అందరూ భక్తి, పవిత్రతో ఉంటూ శుభ కార్యక్రమాలను నిర్వహించుకుంటారు. ఈ నెల 28వరకే శుభముహూర్తాలున్నాయి.
– కొండపాక శ్రీనివాసాచార్యులు, అర్చకుడు, పెద్దపల్లి
Comments
Please login to add a commentAdd a comment