బంజారాహిల్స్ (హైదరాబాద్): ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఆయన ఇంట్లో పని చేస్తున్న బిహార్‌కు చెందిన వ్యక్తి, తన స్నేహితుడితో కలిసి దాదాపు రూ.20 లక్షల విలువైన సొత్తు, నగదు ఎత్తుకుపోయాడు. ఈ మేరకు అందిన ఫిర్యాదు నేపథ్యంలో..బంజారాహిల్స్ పోలీసులు అన్ని రాష్ట్రాల రైల్వే పోలీసు (జీఆర్పీ) అధికారులను అప్రమత్తం చేయడంతో.. పశ్చిమబెంగాల్‌లోని ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో వారిద్దరూ పట్టుబడ్డారు. భట్టి విక్రమార్క ప్రస్తుతం ప్రజా భవన్‌లో నివసిస్తున్నారు. అయితే ఆయనకు బంజారాహిల్స్ రోడ్ నం.14లోని బీఎన్ రెడ్డికాలనీలో విల్లా ఉంది. బిహార్‌కు చెందిన రోషన్‌కుమార్ మండల్ (28) ఆ ఇంట్లో పని చేస్తూ అక్కడే ఉంటున్నాడు.
ఇంటి హాల్‌లో పడుకుంటూ వాచ్‌మన్‌గా, సర్వెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. భట్టి ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లడాన్ని అవకాశంగా తీసుకున్న రోషన్ దొంగతనానికి పథకం వేశాడు. తన స్వస్థలం నుంచి స్నేహితుడైన ఉదయ్ కుమార్ ఠాకూర్‌ను పిలిపించాడు. ఇద్దరూ కలిసి మంగళవారం మధ్యాహ్నం విల్లా పడక గది తాళాలు పగులకొట్టారు. అందులోని బీరువాలో ఉన్న నగదు, బంగారు, వెండి వస్తువులు, విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలు తస్కరించారు. అదే రోజు రాత్రి సికింద్రాబాద్ నుంచి రైలు మార్గంలో బిహార్‌కు బయలుదేరారు. అయితే అదే ఇంట్లో భట్టి వ్యక్తిగత సహాయకులు కూడా ఉంటుంటారు.
గురువారం విల్లాలో రోషన్ కనిపించకపోవడంతో ఇల్లంతా వెతుకుతూ మొదటి అంతస్తుకు వెళ్లారు. అక్కడ ప్రధాన బెడ్‌రూమ్ తాళాలు పగులగొట్టి ఉండటం, చోరీ జరగడాన్ని గుర్తించారు. వెంటనే భట్టి పీఏ భాస్కర శర్మకు సమాచారం అందించారు. వెంటనే విల్లాకు వచ్చిన ఆయన రోషన్‌కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో ఆయన బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల్లో నమోదైన ఫుటేజ్‌లను పరిశీలించగా రోషన్, ఉదయ్ ఓ బ్యాగ్‌తో వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. వీళ్లు రైల్లో వెళ్లారని గుర్తించిన పోలీసులు పశి్చమ బెంగాల్, బిహార్‌ల్లో ఉన్న అన్ని రైల్వేస్టేషన్ల జీఆర్పీ అధికారులకు సమాచారం ఇచ్చారు.
నగరం నుంచి తొలుత భువనేశ్వర్ వెళ్లిన నిందితులిద్దరూ అక్కడి నుంచి భువనేశ్వర్–హౌరా జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. ఈ రైలు గురువారం సాయంత్రం ఖరగ్‌పూర్ స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ నం.7కు చేరుకోగా అందులో తనిఖీలు చేస్తున్న జీఆర్పీ సిబ్బంది బ్యాగ్‌తో ఉన్న రోషన్, ఉదయ్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి చోరీ సొత్తు, సొమ్ము స్వాధీనం చేసుకుని నగర పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో శుక్రవారం ఖరగ్‌పూర్ వెళ్లిన ఎస్సై రాంబాబు నేతృత్వంలోని బృందం శనివారం సాయంత్రానికి నిందితుల్ని ఇక్కడకు తీసుకురానుంది.
Comments
Please login to add a commentAdd a comment