పెళ్లికి వేళాయే.. | Auspicious Wedding Dates From Feb 24, Huge Rush in Telugu States | Sakshi
Sakshi News home page

పెళ్లికి వేళాయే..

Published Fri, Feb 16 2018 4:20 PM | Last Updated on Fri, Feb 16 2018 4:20 PM

Auspicious Wedding Dates From Feb 24, Huge Rush in Telugu States - Sakshi

ఆలేరు /భువనగిరి : పెళ్లిళ్లు, పేరంటాలు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలకు సుముహూర్తాలు రాబోతున్నాయి. ఈనెల 17 నుంచి జూలై 7వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. దీంతో వివా హ వేడుకల సందడి ప్రారంభంకానుంది. సంబంధాలను కుదుర్చుకున్న యువత మూడుమూళ్ల బంధంతో ఏకమయ్యేందుకు ముహూర్తాలను ఎంచుకుంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వేల సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. 
 

ఖరీదవుతున్న వేడుకలు..
ప్రస్తుతం పెళ్లిళ్ల ఏర్పాట్ల ఖర్చులు విపరీతంగా పెరుగుతోంది. కల్యాణ మండపం ఒక్కరోజు అద్దె రూ.30 వేల నుంచి గరిష్టంగా రూ.1.30లక్షల వరకు డిమాండ్‌ ఉంది. వీటికి అదనంగా విద్యుత్‌ బిల్లు, క్లినింగ్‌ చార్జీలు వసూలు చేస్తున్నారు. కల్యాణ మండపం బుక్‌ చేసుకున్నాక పెళ్లి పందిరి, సౌండ్‌ సిస్టమ్, సామగ్రి, ఇతర సదుపాయాలు, మండప నిర్వాహకులే సమకూరుస్తున్నారు. వీటికి అదనంగా చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. వీటి చార్జీలు కూడా సుమారు రూ. 20వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటున్నాయి. ఇక ఫొటో, వీడియో, ఆల్బమ్, తయారీదారుల ధరలు కూడా పెరిగాయి. వీటికి రూ.30వేల నుంచి రూ.80వేల వరకు వసూలు చేస్తున్నారు.

విందు భోజనాలు.. 
ప్రస్తుతం పెళ్లంటే రకరకాల స్వీట్లు, కూరగాయలు, బిర్యాని తదితర నోరూరించే పదార్థాలు ఉండాల్సిందే. మధ్యతరగతి కుటుంబ సభ్యులకు కనీసం రూ. లక్ష నుంచి 2 లక్షల వరకు ఖర్చవుతోంది. కేటరింగ్‌కు ఇస్తే అన్ని వారే సమకూర్చుతున్నారు. ఒక్కో ప్లేట్‌కు శాఖాహారమైతే రూ.100 నుంచి రూ.200 వరకు తీసుకుంటున్నారు. అదే మాంసాహారమైతే రూ.200 నుంచి రూ.300 వరకు తీసుకుంటున్నారు. 
 

పురోహితులు దొరకడం కష్టమే..
ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరగనుండడంతో అన్ని వర్గాల ప్రజలకు అవస్థలు తప్పడంలేదు. ముఖ్యంగా కొందరికి పురోహితులు దొరకడం లేదు. పూల ధరలు ఆకాశానంటుతున్నాయి. అంతేకాకుండా మునుపెన్నడూ లేని వి«ధంగా జీఎస్టీతో పెద్ద మొత్తంలో పన్ను పడుతుండడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలపై జీఎస్‌టీ ప్రభావం పడనుంది.  

శుభ ముహూర్తాలు..
ఫిబ్రవరి నుంచి ఆషాడం వచ్చే వరకు జూలై 7వరకు ముహూర్తాలు ఉన్నాయి. ఒక్కో నెలలో 5 నుంచి 12వరకు ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.
ఫిబ్రవరి 17, 19, 23, 24, 26
మార్చి 4, 8, 10, 12, 14 
ఏప్రిల్‌ 1, 2, 5, 11, 19, 20, 22, 25, 27, 28, 29, 30
మే 2, 9, 10, 16,
జూన్‌ 16, 20, 21, 22, 27, 28, 30 
జూలై 1, 5, 6, 7వ తేదీల్లో దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆషాడమాసం ప్రారంభం అవుతుందని వేదపండితులు చెబుతున్నారు. మే 16వ తేదీ నుంచి జూన్‌ 13 వరకు అధిక జ్యేష్ట మాసం ఉంటుంది. 


అధికంగా  జరగనున్నాయి
మార్చి 4, 8, 10, 14 తేదీల్లో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరుగనున్నాయి. మార్చి 4వ తేదీ ముహుర్తానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇదేరోజు ఆదివారం కావడంతో ఎక్కువగా ముహుర్తాలను నిర్ణయించుకున్నారు. 
– పవన్‌శర్మ, పురోహితుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement