purohits
-
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పూజారులు మృతి
తంబళ్లపల్లె /కురబలకోట: తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఆలయ పూజారులుగా పని చేస్తున్న ఇద్దరు యువకులు అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కుటుంబీకుల కథనం మేరకు వివరాలు ఇలా... కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామానికి చెందిన రాఘవేంద్రస్వామి(28) తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లె టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ ప్రసన్న వెంకటరమణస్వామి ఆలయంలో పూజారిగా ఉన్నారు. ఆయన భార్య అనిత, ఇద్దరు చిన్నపిల్లలతో అంగళ్ళులో కాపురం ఉంటున్నారు. ఇతని బావమరిది అనిల్‌కుమార్(29) కురబలకోట మండలం తెట్టు శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో పూజారిగా ఉన్నారు. ఆయనది అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలోని ముకుందాపురం. ఏడాది క్రితం రాధమ్మతో వివాహమైంది. రాఘవేంద్రస్వామి, అనిల్‌కుమార్ గార్లదిన్నెలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సమీప బంధువు ఇంటికి వెళ్లారు. అతను మొహర్రం సందర్భంగా విధుల్లో బిజీగా ఉండటంతో శుక్రవారం సాయంత్రం వెనుదిరిగి బైక్‌పై వస్తున్నారు. ఈ క్రమంలో గార్లదిన్నె వద్ద ఐచర్ లారీ ఢీకొంది. ప్రమాదంలో రాఘవేంద్రస్వామి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన అనిల్‌కుమార్‌ను 108 వాహనంలో అనంతపురంలోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. మృతదేహాలకు శనివారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. అనంతరం స్వగ్రామాలకు తరలించారు. -
ముహూర్తం బాగుంది..
సాక్షి, హైదరాబాద్: మహానగరం పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఆదివారం ఒక్క రోజే సుమారు 30 వేలకు పైగా జంటలు ఒక్కటి కానున్నాయి. తరువాత 5వ తేదీ సోమవారం, 8వ తేదీ కూడా భారీ సంఖ్యలో పెళ్లిళ్లు జరుగనున్నాయి. ఈ మూడు రోజుల్లో 60 వేలకు పైగా పెళ్లిళ్లు జరగవచ్చునని పురోహితులు అంచనా వేస్తున్నారు. హేవళంబి నామ సంవత్సరంలో ఇవే ఆఖరు ముహూర్తాలు కావడంతో చాలామంది ఈ ముహూర్తాలకే అధిక ప్రాధాన్యతనిచ్చారు. తిరిగి శ్రీ రామనవమి తరువాతనే ముహూర్తాలు ఉండడంతో అనూహ్యమైన డిమాండ్ నెలకొంది. దీంతో నగరంలోని అన్ని పెళ్లి మండపాలు, ఫంక్షన్ హాళ్లకు అనూహ్యమైన డిమాండ్ నెలకొంది. శివార్లలోని వందలాది ఫంక్షన్ హాళ్లు మూడు నెలల ముందే బుక్కయ్యాయి. డిమాండ్‌ను బట్టి హాళ్ల చార్జీలను భారీగా పెంచేశారు. కనీసం సైతం 20 నుంచి 30 శాతానికి ధరలు పెంచారు. డిజైనర్లు, ఈవెంట్ మేనేజర్లు, కేటరింగ్ సంస్థలు సైతం తమ చార్జీలను రెట్టింపు చేశాయి. ఇవి దివ్యమైన ముహూర్తాలు కావడమే.. ఫాల్గుణ మాసం బహుళపక్షం, ఆదివారం, హస్తా నక్షత్రం.. ఉదయం 7.29 గంటల నుంచి రాత్రి 10.50 గంటలకు దివ్యమైన ముహూర్తాలున్నాయి. 5వ తేదీ సోమవారం ఉదయం 7.20 నుంచి మధ్యాహ్నం 12.05 గంటలకు ముహూర్తాలు బాగున్నాయి. 8వ తేదీ ఉదయం 7.13 నుంచి రాత్రి 10.34 వరకు దివ్యమైన ముమూర్తాలున్నాయని పురోహితులు నిర్ణయించారు. మార్చి 27వ తేదీ వరకు ఎలాంటి ముహూర్తాలు లేవు. ఇప్పుడిప్పుడే వేసవి మొదలైంది. ఏప్రిల్ నాటికి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. దీంతో ఈ మార్చి మొదటి వారంలోనే తంతు ముగించుకునేందుకు అనువుగా ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. చార్జీలు అ‘ధర’హో.. మరోవైపు డిమాండ్‌ను బట్టి ఫంక్షన్‌హాళ్ల యజమానులు చార్జీలను అమాంతంగా పెంచేశారు. సాధారణ రోజుల్లో రూ.3 లక్షలు వసూలు చేసినవారు ఇప్పుడు రూ.5 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారు. పెద్ద హాళ్లు రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచేశాయి. పెళ్లి మండపాల అలంకరణ, డీజే, ఆర్కెస్ట్రా, భోజనాలు వంటి ఖర్చులన్నీ కలిసి రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు స్థాయికి తగినట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ ఖర్చులు భరించలేని వారు తమ ఇళ్ల వద్దనే వేదికలు ఏర్పాటు చేసి పెళ్లిళ్లు చేస్తున్నారు. మరోవైపు నగరంలోని అన్ని ప్రాంతాల్లోని కమ్యూనిటీ హాళ్లకు భారీ డిమాండ్ నెలకొంది. నగరంలో పూల నుంచి బంగారం వరకు, బట్టలు, అలంకరణ వస్తువుల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. వరుస పెళ్లిళ్ల దృష్ట్యా గత పది రోజులుగా 20 శాతం నుంచి 30 శాతం వరకు బంగారం అమ్మకాలు పెరిగినట్లు వ్యాపారవర్గాల అంచనా. ఈ రోజుల్లో సుమారు రూ.100 కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్టు అభిప్రాయపడ్డారు. క్యాటరింగ్ కూడా మెనూను బట్టి ప్లేట్ ధర రూ.200 నుంచి రూ.700 వరకు తీసుకుంటున్నారు. పురోహితులు ఫుల్ బిజీ వరుస ముహూర్తాలతో నగరంలోని పురోహితులు బిజీ అయ్యారు. నగరంలో సుమారు 10 వేల మంది పురోహితులు ఉన్నట్లు అంచనా. వీరంతా ఒక్కొక్కరు ఈ మూడు రోజుల్లో 6 నుంచి 10 పెళ్లిళ్లకు హాజరు కావాల్సిన పరిస్థితి. ఇక బాజా భజంత్రీలకు డిమాండ్ పెరిగింది. గతంలో రూ.25 వేల వరకు తీసుకున్న బ్యాండ్ బృందాలు ఇప్పుడు కనీసం రూ.30 వేలు లేందే రానంటున్నాయి. అలంకరణ కోసం తెచ్చిన పూలు.. పూల ధరలకు రెక్కలు పెళ్లి పూలకు విపరీతమైన గిరాకీ పెరిగింది. బొకేలు, డెకరేషన్ కోసం వాడే పూల ధరలూ ఆకాశన్నంటుతున్నాయి. జెర్బరా ఒక్కోటి రూ.40కి చేరుకోగా, కార్నేషన్ రూ.75 పైనే ఉంది. మండపాల అలంకరణకు విదేశీ పూలను అధికంగా వినయోగిస్తుండడంతో థాయిలాండ్ నుంచి ఆర్కిడ్ రకం పూలను పెద్దమొత్తంలో దిగుమతి చేసుకొన్నట్లు పూలవ్యాపారులు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో రూ.30లోపే లభించే ఆర్కిడ్ బంచ్ ఇప్పుడు రూ.250 దాటింది. ఈ బంచ్‌లో కేవలం 10 పూలు మాత్రమే ఉంటాయి. పూల ధరలు నగరమంతటా ఒకేలా లేవు. డిమాండ్‌ను బట్టి ఒక్కోచోట ఒక్కో రకంగా అమ్మి వ్యాపారులు సొమ్ము చేసుకొంటున్నారు. ఇవి బలమైన ముహూర్తాలు ఈ మూడు రోజులు బలమైన ముహూర్తాలు. ఇప్పటికైతే ఇది ఆహ్లాకరమైన వాతావరణం కావడంతో అందరూ ఈ ముహూర్తాలనే కోరుకుంటున్నారు. ఈ మూడు రోజులు పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలకు అనుకూలంగా ఉన్నాయి. – డాక్టర్ బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి, శృంగేరి శారద పీఠం ఆస్థాన పండితులు ఆర్డర్లు వదిలేసుకున్నాం.. పాతబస్తీ నుంచి వచ్చి డెకరేషన్లు చేస్తున్నాం. డిమాండ్ బాగా పెరిగింది. రోజుకు నాలుగు ఫంక్షన్ హాళ్లు అలంకరించాల్సి వస్తోంది. పని ఒత్తిడి భరించలేక కొన్ని ఆర్డర్లను వదిలేసుకున్నాం. ధర ఎంతైనా చెల్లించేందుకు నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారు. కానీ శక్తికి మించి పని చేయలేం కదా. – అబిద్, స్టేజ్ డెకరేషన్ నిర్వహకుడు -
పెళ్లికి వేళాయే..
ఆలేరు /భువనగిరి : పెళ్లిళ్లు, పేరంటాలు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలకు సుముహూర్తాలు రాబోతున్నాయి. ఈనెల 17 నుంచి జూలై 7వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. దీంతో వివా హ వేడుకల సందడి ప్రారంభంకానుంది. సంబంధాలను కుదుర్చుకున్న యువత మూడుమూళ్ల బంధంతో ఏకమయ్యేందుకు ముహూర్తాలను ఎంచుకుంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వేల సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. ఖరీదవుతున్న వేడుకలు.. ప్రస్తుతం పెళ్లిళ్ల ఏర్పాట్ల ఖర్చులు విపరీతంగా పెరుగుతోంది. కల్యాణ మండపం ఒక్కరోజు అద్దె రూ.30 వేల నుంచి గరిష్టంగా రూ.1.30లక్షల వరకు డిమాండ్ ఉంది. వీటికి అదనంగా విద్యుత్ బిల్లు, క్లినింగ్ చార్జీలు వసూలు చేస్తున్నారు. కల్యాణ మండపం బుక్ చేసుకున్నాక పెళ్లి పందిరి, సౌండ్ సిస్టమ్, సామగ్రి, ఇతర సదుపాయాలు, మండప నిర్వాహకులే సమకూరుస్తున్నారు. వీటికి అదనంగా చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. వీటి చార్జీలు కూడా సుమారు రూ. 20వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటున్నాయి. ఇక ఫొటో, వీడియో, ఆల్బమ్, తయారీదారుల ధరలు కూడా పెరిగాయి. వీటికి రూ.30వేల నుంచి రూ.80వేల వరకు వసూలు చేస్తున్నారు. విందు భోజనాలు.. ప్రస్తుతం పెళ్లంటే రకరకాల స్వీట్లు, కూరగాయలు, బిర్యాని తదితర నోరూరించే పదార్థాలు ఉండాల్సిందే. మధ్యతరగతి కుటుంబ సభ్యులకు కనీసం రూ. లక్ష నుంచి 2 లక్షల వరకు ఖర్చవుతోంది. కేటరింగ్‌కు ఇస్తే అన్ని వారే సమకూర్చుతున్నారు. ఒక్కో ప్లేట్‌కు శాఖాహారమైతే రూ.100 నుంచి రూ.200 వరకు తీసుకుంటున్నారు. అదే మాంసాహారమైతే రూ.200 నుంచి రూ.300 వరకు తీసుకుంటున్నారు. పురోహితులు దొరకడం కష్టమే.. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరగనుండడంతో అన్ని వర్గాల ప్రజలకు అవస్థలు తప్పడంలేదు. ముఖ్యంగా కొందరికి పురోహితులు దొరకడం లేదు. పూల ధరలు ఆకాశానంటుతున్నాయి. అంతేకాకుండా మునుపెన్నడూ లేని వి«ధంగా జీఎస్టీతో పెద్ద మొత్తంలో పన్ను పడుతుండడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలపై జీఎస్టీ ప్రభావం పడనుంది. శుభ ముహూర్తాలు.. ఫిబ్రవరి నుంచి ఆషాడం వచ్చే వరకు జూలై 7వరకు ముహూర్తాలు ఉన్నాయి. ఒక్కో నెలలో 5 నుంచి 12వరకు ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఫిబ్రవరి 17, 19, 23, 24, 26 మార్చి 4, 8, 10, 12, 14 ఏప్రిల్ 1, 2, 5, 11, 19, 20, 22, 25, 27, 28, 29, 30 మే 2, 9, 10, 16, జూన్ 16, 20, 21, 22, 27, 28, 30 జూలై 1, 5, 6, 7వ తేదీల్లో దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆషాడమాసం ప్రారంభం అవుతుందని వేదపండితులు చెబుతున్నారు. మే 16వ తేదీ నుంచి జూన్ 13 వరకు అధిక జ్యేష్ట మాసం ఉంటుంది. అధికంగా జరగనున్నాయి మార్చి 4, 8, 10, 14 తేదీల్లో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరుగనున్నాయి. మార్చి 4వ తేదీ ముహుర్తానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇదేరోజు ఆదివారం కావడంతో ఎక్కువగా ముహుర్తాలను నిర్ణయించుకున్నారు. – పవన్‌శర్మ, పురోహితుడు -
వ్రతపురోహితులపై క్రమశిక్షణ కొరడా
వి«ధులకు సక్రమంగా హాజరుకాని 37 మందిపై ఈఓ చర్యలు ఐదుగురు సస్పెన్షన్, ఒకరికి జరిమానా, 31 మందికి షోకాజ్ నోటీస్‌లు సెప్టెంబర్ నెల పారితోషకం నుంచి రూ.లక్ష కోత అన్నవరం : అన్నవరం దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావు మరోసారి వ్రత పురోహితులపై క్రమశిక్షణ కొరడా ఝుళిపించారు. సకాలంలో వి«ధులకు హాజరుకాని, ఎటువంటి సమాచారం లేకుండా గైర్హాజరవుతున్న 37 మంది పురోహితులను ‘బయో మెట్రిక్’ అటెండెన్స్ ద్వారా గుర్తించి వారిపై చర్య తీసుకున్నారు. పురోహితుల సెప్టెంబరు నెల పారితోషకం నుంచి రూ.లక్ష కోత విధించారు. ఈ క్రమశిక్షణ చర్యలతో పురోహితులలో తీవ్ర కలకలం రేగింది. ఐదుగురు పురోహితుల సస్పెన్షన్... ఎటువంటి సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరవుతున్న ప్రథమశ్రేణి పురోహితుడు ముత్య శంకర్రావు, రెండో శ్రేణి పురోహితుడు తనికళ్ల నరసింహశర్మలను విధుల నుంచి సస్పెండ్ చేశారు. విధులకు సక్రమంగా హాజరుకావడం లేదన్న అభియోగాలపై రాజ్యం రామకృష్ణ, ఆలస్యంగా విధులకు హాజరై, ముందుగా వెళ్లిపోతున్నారన్న అభియోగాలపై మామిళ్లపల్లి రామకృష్ణ, మంధా రవి ప్రసాద్‌లను సస్పెండ్ చేశారు. ఎక్కువ సెలవులు వాడుకుంటున్నందుకు రూ.రెండు వేలు జురిమానా... నిర్దేశించిన సెలవులకన్నా ఎక్కువగా వాడుకుంటున్నారన్న అభియోగంపై అంగర వేంకట సుబ్రహ్మణ్య సతీష్ కు రూ. రెండు వేలు జరిమానా విధించారు. 31 మంది పురోహితులకు షోకాజ్ నోటీస్‌లు... విధులకు సకాలంలో హాజరుకాకపోవడం, విధుల మధ్యలో కొండదిగువకు వెళ్లిపోయి సాయంత్రం వచ్చి మరలా బయోమెట్రిక్ అటెండెన్స్ వేయడం ద్వారా తాము రోజంతా డ్యూటీలోనే ఉన్నట్లుగా భ్రమింపచేయడం వంటి పనులకు పాల్పడుతున్న 31 మంది పురోహితులకు వివిధ అభియోగాలతో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీరంతా వారం రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని కోరారు. రూ.లక్ష కట్... వ్రత పురోహితుల సెప్టెంబర్ నెల పారితోషకం నుంచి రూ.లక్ష కోత విధించారు. బయోమెట్రిక్ అటెండెన్స్ ప్రకారం విధులకు గైర్హాజరైన, సకాలంలో హాజరు కాని పురోహితుల వేతనం నుంచి కోత విధించారు. ఈ విధంగా గత జూన్ నెల నుంచి ప్రతి నెలా ఎంతో కొంత ఈ విధంగా కోత కోస్తున్నారు. చర్యలు సరే...నిలకడ ఏది..? దేవస్థానంలో క్రమశిక్షణ చర్యలు, సస్పెన్షన్లంటూ అధికారులు చేసే హడావిడి ఒకటి, రెండు రోజుల్లోనే చప్పగా చల్లారిపోతోంది. గతంలో కూడా ఇదేవిధంగా సస్పెన్షన్లు చేసినా కేవలం రెండు, మూడు రోజుల్లోనే సస్పెన్షన్లు ఎత్తేయడంతో అసలు భయమే లేకుండాపోయింది. కల్యాణోత్సవాల అపశృతుల్లో అరు నెలలు సస్పెండ్ చేసిన పురోహితుడిని కూడా మూడు రోజుల్లోనే తిరిగి విధుల్లోకి తీసుకున్న చరిత్ర కూడా అధికారుల సొంతం. రాజకీయ పలుకుబడి కలిగినవారు, లేదా వ్రతపురోహితుల యూనియన్ పెద్దల అండదండలున్నవారిని వెంటనే కరుణించేస్తున్నారు. ఏ అండా లేని వారిపైన, అమాయకుల మీద ప్రతాపం చూపిస్తున్నారన్న విమర్శ ఉంది. మరి ఈ క్రమశిక్షణ చర్యలు ఎన్ని రోజులుంటాయో వేచి చూడాలి.