కుత్బుల్లాపూర్‌లో ముస్తాబవుతున్న ఫంక్షన్ హాల్..
సాక్షి, హైదరాబాద్: మహానగరం పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఆదివారం ఒక్క రోజే సుమారు 30 వేలకు పైగా జంటలు ఒక్కటి కానున్నాయి. తరువాత 5వ తేదీ సోమవారం, 8వ తేదీ కూడా భారీ సంఖ్యలో పెళ్లిళ్లు జరుగనున్నాయి. ఈ మూడు రోజుల్లో 60 వేలకు పైగా పెళ్లిళ్లు జరగవచ్చునని పురోహితులు అంచనా వేస్తున్నారు. హేవళంబి నామ సంవత్సరంలో ఇవే ఆఖరు ముహూర్తాలు కావడంతో చాలామంది ఈ ముహూర్తాలకే అధిక ప్రాధాన్యతనిచ్చారు. తిరిగి శ్రీ రామనవమి తరువాతనే ముహూర్తాలు ఉండడంతో అనూహ్యమైన డిమాండ్ నెలకొంది. దీంతో నగరంలోని అన్ని పెళ్లి మండపాలు, ఫంక్షన్ హాళ్లకు అనూహ్యమైన డిమాండ్ నెలకొంది. శివార్లలోని వందలాది ఫంక్షన్ హాళ్లు మూడు నెలల ముందే బుక్కయ్యాయి. డిమాండ్‌ను బట్టి హాళ్ల చార్జీలను భారీగా పెంచేశారు. కనీసం సైతం 20 నుంచి 30 శాతానికి ధరలు పెంచారు. డిజైనర్లు, ఈవెంట్ మేనేజర్లు, కేటరింగ్ సంస్థలు సైతం తమ చార్జీలను రెట్టింపు చేశాయి.
ఇవి దివ్యమైన ముహూర్తాలు కావడమే..
ఫాల్గుణ మాసం బహుళపక్షం, ఆదివారం, హస్తా నక్షత్రం.. ఉదయం 7.29 గంటల నుంచి రాత్రి 10.50 గంటలకు దివ్యమైన ముహూర్తాలున్నాయి. 5వ తేదీ సోమవారం ఉదయం 7.20 నుంచి మధ్యాహ్నం 12.05 గంటలకు ముహూర్తాలు బాగున్నాయి. 8వ తేదీ ఉదయం 7.13 నుంచి రాత్రి 10.34 వరకు దివ్యమైన ముమూర్తాలున్నాయని పురోహితులు నిర్ణయించారు. మార్చి 27వ తేదీ వరకు ఎలాంటి ముహూర్తాలు లేవు. ఇప్పుడిప్పుడే వేసవి మొదలైంది. ఏప్రిల్ నాటికి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. దీంతో ఈ మార్చి మొదటి వారంలోనే తంతు ముగించుకునేందుకు అనువుగా ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు.
చార్జీలు అ‘ధర’హో..
మరోవైపు డిమాండ్‌ను బట్టి ఫంక్షన్‌హాళ్ల యజమానులు చార్జీలను అమాంతంగా పెంచేశారు. సాధారణ రోజుల్లో రూ.3 లక్షలు వసూలు చేసినవారు ఇప్పుడు రూ.5 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారు. పెద్ద హాళ్లు రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచేశాయి. పెళ్లి మండపాల అలంకరణ, డీజే, ఆర్కెస్ట్రా, భోజనాలు వంటి ఖర్చులన్నీ కలిసి రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు స్థాయికి తగినట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ ఖర్చులు భరించలేని వారు తమ ఇళ్ల వద్దనే వేదికలు ఏర్పాటు చేసి పెళ్లిళ్లు చేస్తున్నారు. మరోవైపు నగరంలోని అన్ని ప్రాంతాల్లోని కమ్యూనిటీ హాళ్లకు భారీ డిమాండ్ నెలకొంది. నగరంలో పూల నుంచి బంగారం వరకు, బట్టలు, అలంకరణ వస్తువుల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. వరుస పెళ్లిళ్ల దృష్ట్యా గత పది రోజులుగా 20 శాతం నుంచి 30 శాతం వరకు బంగారం అమ్మకాలు పెరిగినట్లు వ్యాపారవర్గాల అంచనా. ఈ రోజుల్లో సుమారు రూ.100 కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్టు అభిప్రాయపడ్డారు. క్యాటరింగ్ కూడా మెనూను బట్టి ప్లేట్ ధర రూ.200 నుంచి రూ.700 వరకు తీసుకుంటున్నారు.
పురోహితులు ఫుల్ బిజీ
వరుస ముహూర్తాలతో నగరంలోని పురోహితులు బిజీ అయ్యారు. నగరంలో సుమారు 10 వేల మంది పురోహితులు ఉన్నట్లు అంచనా. వీరంతా ఒక్కొక్కరు ఈ మూడు రోజుల్లో 6 నుంచి 10 పెళ్లిళ్లకు హాజరు కావాల్సిన పరిస్థితి. ఇక బాజా భజంత్రీలకు డిమాండ్ పెరిగింది. గతంలో రూ.25 వేల వరకు తీసుకున్న బ్యాండ్ బృందాలు ఇప్పుడు కనీసం రూ.30 వేలు లేందే రానంటున్నాయి.
అలంకరణ కోసం తెచ్చిన పూలు..
పూల ధరలకు రెక్కలు
పెళ్లి పూలకు విపరీతమైన గిరాకీ పెరిగింది. బొకేలు, డెకరేషన్ కోసం వాడే పూల ధరలూ ఆకాశన్నంటుతున్నాయి. జెర్‌బరా ఒక్కోటి రూ.40కి చేరుకోగా, కార్నేషన్ రూ.75 పైనే ఉంది. మండపాల అలంకరణకు విదేశీ పూలను అధికంగా వినయోగిస్తుండడంతో థాయిలాండ్ నుంచి ఆర్కిడ్ రకం పూలను పెద్దమొత్తంలో దిగుమతి చేసుకొన్నట్లు పూలవ్యాపారులు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో రూ.30లోపే లభించే ఆర్కిడ్ బంచ్ ఇప్పుడు రూ.250 దాటింది. ఈ బంచ్‌లో కేవలం 10 పూలు మాత్రమే ఉంటాయి. పూల ధరలు నగరమంతటా ఒకేలా లేవు. డిమాండ్‌ను బట్టి ఒక్కోచోట ఒక్కో రకంగా అమ్మి వ్యాపారులు సొమ్ము చేసుకొంటున్నారు.
ఇవి బలమైన ముహూర్తాలు
ఈ మూడు రోజులు బలమైన ముహూర్తాలు. ఇప్పటికైతే ఇది ఆహ్లాకరమైన వాతావరణం కావడంతో అందరూ ఈ ముహూర్తాలనే కోరుకుంటున్నారు. ఈ మూడు రోజులు పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలకు అనుకూలంగా ఉన్నాయి.
– డాక్టర్ బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి, శృంగేరి శారద పీఠం ఆస్థాన పండితులు
ఆర్డర్లు వదిలేసుకున్నాం..
పాతబస్తీ నుంచి వచ్చి డెకరేషన్లు చేస్తున్నాం. డిమాండ్ బాగా పెరిగింది. రోజుకు నాలుగు ఫంక్షన్ హాళ్లు అలంకరించాల్సి వస్తోంది. పని ఒత్తిడి భరించలేక కొన్ని ఆర్డర్లను వదిలేసుకున్నాం. ధర ఎంతైనా చెల్లించేందుకు నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారు. కానీ శక్తికి మించి పని చేయలేం కదా.
– అబిద్, స్టేజ్ డెకరేషన్ నిర్వహకుడు
Comments
Please login to add a commentAdd a comment