Function halls
-
ఏం పెళ్లి రా అది..! ప్రస్తుతం ట్రెండ్..
ఇటీవల పారిశ్రామిక కుబేరుడు అంబానీ ఇంట జరిగిన పెళ్లి వేడుక ఎంత ఆర్భాటంగా జరిగిందో అందరూ చూశారు. వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి ప్రపంచం నలుమూలల నుంచి దిగ్గజాల వంటి అతిథులను పిలిపించారు. కానీ స్థానిక ధనవంతులు అంత స్థాయిలో కాకపోయినా అబ్బో అనిపించేలా తమ పిల్లల వివాహాలను జరిపిస్తున్నారు. సిలికాన్ సిటీలో ఇటువంటి పెళ్లిళ్ల పరిశ్రమ ప్రముఖంగా మారిపోయింది.సాక్షి, బెంగళూరు: గతంలో పెళ్లి అనేది చాలా శాస్త్రోక్తంగా జరగాలని భావించేవారు. అయితే నేటి రోజుల్లో తమ తమ ఆడంబరాలను చాటుకోవడానికి సంపన్నులు, ఆఖరికి మధ్య తరగతివారు కోట్ల రూపాయలు వెదజల్లి వైభవోపేతంగా చేసుకుంటున్నారు. డబ్బులు ఉంటే చాలు.. ఇంద్ర భవనం వంటి ఫంక్షన్‌హాల్స్, టూరిస్టు ప్రదేశాలలో మూడుముళ్ల వేడుకలు జరుగుతాయి. అందులోనూ వెడ్డింగ్ ప్లానర్ల పాత్ర పెరిగిపోయింది. భారీ బడ్జెట్ సినిమాను తీసినట్లుగా పెళ్లి తంతును మహా ఆర్భాటంగా చేయడం సిలికాన్ సిటీలో ట్రెండ్ అయ్యింది.వెడ్డింగ్ ప్లానర్లుగతంలో పెళ్లి అంటేనే ముహూర్తం, ఆభరణాలు, బట్టల కొనుగోలు, ఆహ్వాన పత్రిక, ఫంక్షన్ హాల్, ఫోటో, వీడియో గ్రాఫర్లు తదితర ఎన్నో అంశాలు మదిలో మెదులుతాయి.. ఇలా హడావుడి పెళ్లిళ్ల ఒత్తిడిని వెడ్డింగ్ ప్లానర్లు తప్పిస్తున్నారు. పెళ్లి బాద్యతలను వెడ్డింగ్ ప్లానర్లకు అప్పగిస్తే పెళ్లి పనులు అన్నీ వారే చూసుకుంటారు. ఇలాంటి వెడ్డింగ్ ప్లానర్లు ప్రస్తుతం బెంగళూరు ఎంతో వేగంగా పెరిగిపోతున్నారు.అన్ని హంగులూ ఉండాలి మరిసాధారణంగా ధనవంతులు తమ కుటుంబంలోని పెళ్లిళ్ల ద్వారా తాము ఎంత శ్రీమంతులమో తెలియజేయాలని అనుకుంటారని, అందుకు అనుగుణంగానే ఎంతో గ్రాండ్‌గా పెళ్లిళ్లు జరిగిస్తారని కొందరు ప్లానర్లు తెలిపారు. ఈ గ్రాండియర్, రిచ్‌నెస్ కోసం భోజనాల దగ్గరి నుంచి అతిథులకు ఇచ్చే గిఫ్ట్‌ల వరకు రాజీ పడడం లేదు. కొంతమంది శ్రీమంతులు తమ పెళ్లిళ్లలో సెలబ్రెటీలు ఉండాలని కోరుకుంటారని ప్లానర్లు తెలిపారు. పెళ్లిలో సినిమా, టీవీ ప్రముఖ నటీనటులు, మోడల్స్ పాల్గొనేలా చూడమని కోరుతుంటారు. మధ్య తరగతి కుటుంబాల కోసం రూ. 15 లక్షల నుంచి ప్యాకేజీ ప్రారంభమవుతుంది. ఒకవేళ గ్రాండ్‌గా పెళ్లి జరగాలంటే ఫుల్ ప్యాకేజీ కింద కనీసం కోటి రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయినా ఎవరూ వెనుకాడకుండా లగ్జరీ పెళ్లిళ్లకు సరే అంటున్నారు.నెలరోజుల్లో రూ.900 కోట్లపైనే వివాహం ఎంతో గ్రాండ్‌గా జరగాలి... అందరూ మన పెళ్లి కూడా చర్చించుకోవాలి అనే క్రేజ్ కర్ణాటకలో పెరిగిపోతోంది. ఇతర జిల్లాల నుంచి బెంగళూరుకు విచ్చేసి ఘనంగా పెళ్లి ప్లాన్ చేసుకుంటున్నారు. బెంగళూరులో నవంబర్ 12 నుంచి డిసెంబర్ 16 మధ్య సుమారు 13 వేలకు పైగా పెళ్లిళ్లు ఉన్నట్లు ప్లానర్లు తెలిపారు. ఈ సమయంలో డెకరేషన్, సెట్డిజైనర్, షామియానాలు, మేకప్ కళాకారులు, ఫోటో, వీడియో గ్రాఫర్లు, బ్యాండ్ సెట్, లైటింగ్, కేటరింగ్, ఆర్కెస్ట్రా, ఆభరణాల కొనుగోలు ఇలా తదితర అంశాల కోసం రూ. 900 కోట్ల మేర లావాదేవీలు జరిగే అవకాశం ఉందని వెడ్డింగ్ ప్లానర్లు అంచనా వేస్తున్నారు. ఇక కొందరైతే సముద్ర తీరం, రాజ ప్యాలెస్, అందమైన పరిసరాలు, ఖరీదైన స్టార్ హోటళ్లలో కొద్దిపాటి సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడుతున్నట్లు వెడ్డింగ్ ప్లానర్లు చెబుతున్నారు. బెంగళూరు చుట్టుపక్కల గడిచిన నెల రోజుల్లో సుమారు 9 డెస్టినేషన్ వెడ్డింగ్‌లు జరిగాయి. మరో 17 పెళ్లిళ్లు నిశ్చమయ్యాయి. గతంతో పోలిస్తే ఈసారి డెస్టినేషన్ వెడ్డింగ్ సంఖ్య 10 శాతం పెరిగినట్లు ప్లానర్లు తెలిపారు. -
జీహెచ్ఎంసీ ఫంక్షన్ హాళ్లు ఇక ఆన్లైన్లో.. హాల్ విస్తీర్ణం, అద్దె వివరాలు
సాక్షి, సిటీబ్యూరో: బల్దియా ఆధ్వర్యంలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల బుకింగ్స్‌ను త్వరలో ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తేనున్నారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల తరహాలో జీహెచ్ఎంసీ పోర్టల్ ద్వారానే ఫంక్షన్ హాళ్లను బుకింగ్ చేసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మా న్యువల్‌గా జరుగుతున్న బుకింగ్‌లతో నెలలో ఎన్ని రోజులు బుక్ అవుతున్నా యో, ఎంత ఫీజు వసూలు చేస్తున్నారో ఉన్నతాధికారులకు తెలియడం లేదు. మరోవైపు జీహెచ్ఎంసీ ఫంక్షన్ హాళ్లకు సైతం ఇతర ఫంక్షన్ హాళ్ల మాదిరిగా భా రీ ఫీజులు వసూళ్లు చేస్తున్నారనే ఫిర్యా దులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్ బుకింగ్ సదుపాయం ద్వా రా అవతవకలకు తావుండదని, పారదర్శకత ఉంటుందని భావించిన అధికారులు ఈ ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. వచ్చేనెల నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. పోర్టల్‌లో ఫంక్షన్ హాళ్ల అద్దె ధరలు, అందుబాటులో ఉన్నదీ, లేనిది తదితర వివరాలు తెలుసుకొని బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. రూ.95.70 కోట్లతో 25 ఫంక్షన్ హాళ్లు.. జీహెచ్ఎంసీలో 25 మల్టీ పర్పస్ ఫంక్షన్ హాళ్లకు రూ.95.70 కోట్లు మంజూరై ఏళ్లు గడుస్తుండగా, ఇప్పటి వరకు 9 ఫంక్షన్ హాళ్ల నిర్మాణం పూర్తయి వినియోగంలోకి వచ్చినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. మరో 9 పురోగతిలో ఉన్నాయి. మిగతా ఏడింటి నిర్మాణం చేపట్టాల్సి ఉంది. పనులు పురోగతిలో ఉన్నవి.. ► హెచ్‌ఎఫ్‌నగర్, రహ్మత్‌నగర్ ► అయ్యప్ప క్రీడామైదానం దగ్గర, వెంగళ్రావునగర్ ► టీఎస్ఐఐసీ కాలనీ, సూరారం ► వాలీబాల్ కోర్టు దగ్గర, తార్నాక ► పాటిగడ్డ, బేగంపేట ► ఆరంభ టౌన్షిప్, పాపిరెడ్డికాలనీ ► గోపన్‌పల్లి,గచ్చిబౌలి ► జుమ్మేరాత్‌బజార్ అడ్డగుట్ట, సికింద్రాబాద్ అన్ని ఫంక్షన్లకూ.. పుట్టినరోజు నుంచి పెళ్లిళ్ల వరకు వివిధ రకాల ఫంక్షన్లకు వీటిని అద్దెకిస్తారు. పెద్ద ఫంక్షన్ హాళ్ల ఖర్చులు భరించలేని వారికి సదుపాయం కలి్పంచాలనే లక్ష్యంతో జీహెచ్ఎంసీ ఈ మల్టీపర్పస్ ఫంక్షన్‌హాళ్లను అందుబాటులోకి తెస్తోంది. వీటికి నిషేధం.. రాజకీయ సంబంధమైన, రాజకీయ పార్టీలకు సంబంధించిన, మత సంబంధమైన కార్యక్రమాలను ఈ ఫంక్షన్‌హాళ్లలో అనుమతించరు. హాల్ విస్తీర్ణాన్ని బట్టి.. అద్దె ధరలు రోజుకు ► 2వేల చ.మీ వరకు:రూ.10,000 ► 2001–4000 చదరపు మీటర్ల వరకు: రూ.15,000 ► 4000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ: రూ.20,000 ► ఈ ధరలతో పాటు 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ► పారిశుద్ధ్య చార్జీల కింద 20 శాతం చెల్లించాలి. రోజు మొత్తం కాకుండా షిఫ్టుల వారీగా తీసుకునే సదుపాయం ఉంది. అందుకు సగం ఫీజు చెల్లి స్తే సరిపోతుంది. మొదటి షిఫ్టు ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు. రెండో షిఫ్టు సాయంత్రం 4.30 నుంచి రాత్రి 11.30 గంటల వరకు. నిర్మాణం పూర్తయిన మల్టీ పర్పస్ ఫంక్షన్‌హాళ్లు.. ► బన్సీలాల్‌పేట కమ్యూనిటీ హాల్ ► చైతన్యనగర్, పటాన్చెరు ► భగత్‌సింగ్‌నగర్, చింతల్ ► కేపీహెచ్‌బీ4 ఫేజ్,భగత్‌సింగ్‌నగర్ గాం«దీనగర్, రామంతాపూర్ ► గాంధీ విగ్రహం దగ్గర, చంపాపేట ► నెహ్రూనగర్ పార్క్, మారేడ్‌పల్లి ► వెస్ట్రన్హిల్స్, అడ్డగుట్ట ► సీతాఫల్మండి, సికింద్రాబాద్ -
తప్పదు భరించాల్సిందే.. పాకిస్తాన్ సంచలన నిర్ణయం
దాయాది దేశంలో పాకిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవలి కాలంలో పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న తరుణంలో ఇంధన పొదుపు(విద్యుత్, చమురు)పై ఫోకస్ పెంచింది. ఈ క్రమంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటూ.. మార్కెట్లు, మాల్స్, కళ్యాణ మండపాల్లో ఇంధన పొదుపుకు చర్యలు తీసుకుంది. వివరాల ప్రకారం.. పాకిస్తాన్ సర్కార్ సబ్సిడీల భారాన్ని మోయలేక చాలా వాటికి ప్రభుత్వం కోత పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇంధన పొదుపు ప్రణాళికలను ప్రకటించింది. ఇంధన ఆదాతోపాటు చమురు దిగుమతులను తగ్గించేందుకుగానూ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. భేటీలో భాగంగా జాతీయ ఇంధన పరిరక్షణ ప్రణాళికను ఆమోదించింది. ఈ ప్రణాళికలో భాగంగా మార్కెట్లు, వివాహ వేదికలను సాధారణ సమయానికి ముందుగానే మూసివేస్తున్నట్లు తెలిపింది. కేబినెట్ సమావేశం అనంతరం పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ‘రాత్రి 8.30 గంటలకే మార్కెట్లు, రాత్రి 10 గంటలకు ఫంక్షన్ హాల్స్‌ను మూసివేయాలి. దీంతో 60 బిలియన్ల పాకిస్థానీ రూపాయలు ఆదా అవుతాయి. ఫిబ్రవరి నుంచి సాధారణ బల్బుల తయారీని నిలిపివేస్తాం. జులై నుంచి నాసిరకం ఫ్యాన్ల ఉత్పత్తిని ఆపేస్తాం. దీంతో.. మరో 37 బిలియన్లు ఆదా అవుతాయి. ఏడాదిలోపు కేవలం కొనికల్ గీజర్ల వాడకాన్ని తప్పనిసరి చేస్తాం. ఫలితంగా.. తక్కువ గ్యాస్ వినియోగంతో 92 బిలియన్లు మిగులుతాయి. వీధి దీపాల్లో మార్పులతో మరో 4 బిలియన్లు ఆదా అవుతాయి. నేడు జరిగిన కేబినెట్ భేటీ కూడా పగటి పూట వెలుతురులోనే జరిగింది. భేటీలో లైట్లను ఉపయోగించలేదు అని చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో.. 2023 ఏడాది చివరి నాటికి దేశంలో ఎలక్ట్రిక్ బైక్‌లను తీసుకువస్తామని వెల్లడించారు. వాతావరణ మార్పుల సమస్య పరిష్కారానికి కూడా ఈ ప్రణాళిక ఉపయోగపడుతుందన్నారు. ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దేశంలో నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదల, చమురు నిల్వలు తగ్గిపోవడం, కరెన్సీ విలువ పతనం, ద్రవ్యోల్బణం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. -
రెండు నెలలు.. లక్ష వివాహాలు.. ఫంక్షన్ హాళ్లకు భారీగా డిమాండ్
సాక్షి, ముంబై: కరోనా తరువాత ఏకంగా రెండేళ్లకు పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండటంతో డెకోరేటర్లు, ఫుడ్ క్యాటరింగ్, ఫంక్షన్ హాలు, వీడియో, ఫోటోగ్రాఫర్లకు చేతి నిండా పని దొరికినట్లయింది. అంతేగాకుండా వీరిపై ఆధారపడిన వేలాది కార్మికులు, కూలీలకు కూడా ఉపాధి దొరికింది. వచ్చే వారం నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవుతుంది. దీంతో కరోనా కారణంగా ప్రభుత్వం అమలుచేసిన లాక్డౌన్ వల్ల వాయిదా వేసుకున్న అనేక పెళ్లిళ్లకు ఇప్పుడు మంచి ముహూర్తాలు లభించాయి. కొందరు పెళ్లిల్లు చేసుకున్నప్పటికీ అనేక ఆంక్షలకు, షరతులకు కట్టుబడి ఉండాల్సి వచ్చింది. కానీ ఈసారి దీపావళి తర్వాత మంచి ముహూర్తాలు డిసెంబర్, జనవరిలో ఉన్నాయి. దాదాపు లక్ష నుంచి లక్షన్నర వరకు పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా వేశారు. దీంతో డెకొరేటర్లు, క్యాటరింగ్, హాలు, టూరిస్టు వాహనాలు, మెహందీ (గోరింటాకు) ఆర్టిస్టులను ముందుగానే బుకింగ్ చేసుకుని ఉంచారు. వీరితోపాటు మార్కెట్లో కొత్త దుస్తులు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడంవల్ల వ్యాపారులకు కూడా మంచి రోజులు వచ్చాయి. కరోనా కారణంగా రెండేళ్లుగా బేరాలు లేక ఆర్థికంగా నష్టపోయిన వ్యాపారులు ఇప్పుడు కొంత తేరుకుంటున్నారు. శుభకార్యాలపై మహమ్మారి ప్రభావం... కరోనా కాలంలో శుభ, అశుభ కార్యక్రమాలకు ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించింది. గత్యంతరం లేక అనేక మంది వాయిదా వేసుకున్నారు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే వధువు, వరుడి తరఫున 25 మంది చొప్పున బంధువులను అనుమతించారు. దీంతో సాదాసీదాగా పెళ్లి తంతు పూర్తి చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా ప్రభుత్వం విధించిన ఆంక్షలవల్ల కేటరింగ్, డెకోరేటర్లు, వీడియో, ఫోటో గ్రాఫర్లు ఆర్థికంగా నష్టపోయారు. ఒక్కో పెళ్లిలో 500–700 మందికి ఫుడ్ సప్లయిచేసే క్యాటరింగ్ యజమానులు ఆంక్షలవల్ల కేవలం 50 మందికే సరఫరా చేయాల్సి వచ్చింది. చదవండి: (National Highways: రాయలసీమకు కొత్తగా 9 జాతీయ రహదారులు) హాలులో కుర్చీలు, తివాచీలు, కళ్లు జిగేల్మనిపించే విద్యుత్ దీపాలకు, ఇతర అలంకరణ సామాగ్రికి డిమాండ్ లేకపోవడంతో డెకొరెటర్లు కూడా నష్టపోయారు. ముఖ్యంగా పెళ్లిళ్లలో వీడియో, ఫోటో గ్రాఫర్ల డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే పెళ్లిలో బారాత్‌లు కూడా లేకపోవడంతో బ్యాండ్, ఇతర భాజాభజంత్రీలకు, మేళతాళాలకు, డప్పులు వాయించే వీరికి కూడా చేతినిండి పనిలేకుండా పోయింది. దీంతో గత రెండేళ్లుగా అరకొర ఆర్డర్లతో ఎలాగో నెట్టుకొస్తున్నారు. ప్రవేశ ద్వారం, హాలు, స్టేజ్‌ను అలంకరించే డెకొరేటర్లు లేకపోవడంతో పూలకు కూడా డిమాండ్ పడిపోయింది. ఇప్పుడు కరోనా నియంత్రణలోకి రావడంతో ధైర్యంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. డెకొరేటర్లు, ఫుడ్ కేటరింగ్, హాలు, కెమరా మెన్లకు, బ్యాండ్ మేళతాళాలు వాయించే వారికి భారీ డిమాండ్ ఏర్పడింది. పనిచేసే కూలీలు, కార్మికులను కూడా సమకూర్చుకుని సిద్ధంగా ఉంచుకున్నారు. బారాత్‌లకు అవసరమైన టూరిస్టు వాహనాలను, బంధువులను తీసుకెళ్లేందుకు బస్సులు, టాటా సుమోలు, క్వాలీస్ తదితర వాహనాలను కూడా ముందుగానే బుకింగ్ చేసుకుని ఉంచుకున్నారు. ఇలా అన్ని రంగాల వారికి చేతినిండా ఉపాధి లభించడంతో రెండేళ్ల తరువాత ఆర్ధికంగా నిలదొక్కుకునే అవకాశం లభించింది. -
ఎన్నిసార్లు చెప్పినా అంతే..! ఒకరింట్లో విందు.. మరొకరింట్లో నిద్ర బందు
సాక్షి, శంషాబాద్: ఒకరి ఇంట్లోని శుభకార్యం మరో ఇంటికి తీవ్ర ఇబ్బందిని కలిగిస్తోంది. ఓ వైపు టపాసుల మోత.. మరో వైపు శబ్దాల హోరుతో పలు ఫంక్షన్‌హాళ్ల వద్ద అర్ధరాత్రి వరకు జరుగుతున్న కార్యక్రమాలకు సమీప కాలనీల ప్రజలు నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోంది. ఒకే చోట ఐదు.. ►శంషాబాద్‌లోని సిద్ధంతి, నక్షత్ర, సాయినగర్ కాలనీ సమీపంలో ఒకే చోట ఐదు ఫంక్షన్‌హాళ్లు ఉన్నాయి. ఒకే చోట అధిక సంఖ్యలో ఇవి ఉండటం వల్ల ఎలాంటి కార్యక్రమాలు జరిగినా సమీప కాలనీ వాసులకు వీటి శబ్దం కారణంగా తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. పలుసార్లు ఫిర్యాదు.. ►అనుమతి లేకుండానే అర్ధరాత్రి వరకు పెద్ద ఎత్తున సౌండ్ బాక్సుల శబ్దాలు, టపాసుల మోతతో పరిస్థితి దారుణంగా మారుతోంది. ఈ విషయంపై కాలనీ వాసులు పలుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకే సారి అన్ని ఫంక్షన్‌హాళ్లలో వేడుకలు జరిగినప్పుడు శబ్దం తీవ్రత మరింతగా బాధిస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేజర్ కాంతులపై నిషేధం.. ►విమానాశ్రయానికి సుమారు 8 కిలో మీటర్ల వరకు ఎలాంటి లేజర్ కాంతులు ఏర్పాటు చేయకూడదని గతంలో అనేకసార్లు ఎయిర్‌పోర్టు అధికారులతో పాటు స్థానిక సంస్థలు కూడా ఫంక్షన్ హాళ్లకు నోటీసులు జారీ చేశాయి. గతంలో పోలీసుల దృష్టి పెట్టినప్పుడు కొంత మేర తగ్గించి తిరిగి యథాతథంగా కొనసాగిస్తున్నారని వాపోతున్నారు. తెల్లవారే వరకు శబ్ధాలు.. ఒక్కోసారి రాత్రి నుంచి తెల్లారే వరకు కూడా శబ్దాల హోరు తగ్గడం లేదు. టపాసుల మోతతో పాటు సౌండ్ బాక్సుల్లో మితిమీరిన శబ్దం ఫంక్షన్ హాళ్ల నుంచి వెలువడుతోంది. వీటిని నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. – రాజిరెడ్డి, సాయినగర్ కాలనీ -
20 నెలల తర్వాత పెళ్లి కళ వచ్చేసింది..!
సాక్షి, ముంబై: ఫంక్షన్ హాళ్లలో సుమారు 20 నెలల తరువాత పెళ్లి మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి. కరోనా కారణంగా కొందరు మాత్రమే సాదాసీదాగా పెళ్లి తంతు పూర్తిచేసి చేతులు దులుపేసుకున్నారు. కాని గత సంవత్సరన్నర కాలంగా భారీగా, ఆర్భాటంగా పెళ్లిళ్లు నిర్వహించలేకపోయారు. ముఖ్యంగా కరోనా కేసులు పెరగడంతో విధించిన లాక్డౌన్ కారణంగా అనేక మంది శుభకార్యాలు, పెళ్లిలు వాయిదా వేసుకున్నారు. దీంతో ఫంక్షన్ హాళ్లన్నీ బ్యాండు మేళాలు, మంగళవాయిద్యాల చప్పుళ్లు లేక మూగబోయాయి. కానీ ఈనెల 15వ తేదీ నుంచి తిరిగి పెళ్లిళ్లకు ముహూర్తాలు ప్రారంభమయ్యాయి. మరోవైపు ప్రభుత్వం లాక్డౌన్లోని అనేక ఆంక్షలు సడలించడంతో గతంలో మాదిరిగా శుభకార్యాలు నిర్వహించడం ప్రారంభించారు. అదేవిధంగా గత సంవత్సరం వాయిదా వేసుకున్న పెళ్లిళ్లన్నీ ఇప్పుడు చేయాలని నిర్ణయించుకుంటున్నారు. దీంతో ఫంక్షన్ హాళ్లు, స్కూల్ మైదానాలు, బంక్వెట్ హాళ్లని బుకింగ్‌లతో ఫుల్ అయ్యాయి. పరిమిత సంఖ్యలో ఆహుతులతో.. గత సంవత్సరం కరోనా కేసులు వెలుగులోకి రావడంతో మార్చి 23వ తేదీ నుంచి లాక్డౌన్ అమలైన సంగతి తెలిసిందే. కాని లాక్‌డౌన్‌కు ముందు ముహూర్తాలు పెట్టుకుని ఫంక్షన్ హాళ్లు బుకింగ్ చేసుకున్న వారికి కరోనా అంక్షలకు కట్టుబడి వివాహాలు జరుపుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. వధూవరుల వైపునుంచి కేవలం 20 మంది చొప్పున బంధువులు మాత్రమే వివాహానికి హాజరుకావాలని ఆంక్షలు విధించింది. ఆ తరువాత కరోనా కొంత అదుపులోకి రావడంతో ఈ సంఖ్యను 50కు పెంచింది. అనంతరం కరోనా రెండో వేవ్‌లో కోవిడ్ కేసులు పెరగడంతో కొద్ది నెలలపాటు తిరిగి శుభకార్యాలకు బ్రేక్ పడింది. దీంతో అనేక మంది పెళ్లిలు వాయిదా వేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో కరోనా అదుపులోకి రావడంతో వంద మంది చొప్పున బంధువులు పెళ్లికి హాజరయ్యేందుకు ప్రభుత్వం, బీఎంసీ నుంచి అనుమతి లభించింది. కానీ కోవిడ్ భయంతో శుభకార్యాలు చేసేందుకు అనేకమంది సాహసం చేయలేకపోయారు. చదవండి: (సినిమా చెట్టు: ఆ చెట్టు కింద 300 సినిమాల షూటింగ్..) చివరకు కొందరు దగ్గర బంధువుల మధ్య పెళ్లి తంతు పూర్తి చేసినప్పటికీ ఆర్భాటంగా నిర్వహించలేకపోయారు. ప్రస్తుతం కోవిడ్ పూర్తిగా కాకపోయినా 90 శాతం అదుపులోకి రావడంతో ధైర్యంగా శుభకార్యాలు చేయడానికి ప్రజలు ముందుకు వస్తున్నారు. అయినప్పటికీ ఫంక్షన్ హాలు బుకింగ్ చేసుకునే సమయంలో కోవిడ్ నియమాలు పాటించేలా హాలు యాజమాన్యాలు హామీ పత్రం తీసుకుంటున్నాయి. సాధ్యమైనంత వరకు తక్కువ సంఖ్యలో బంధువులను ఆహ్వానించాలని చెబుతున్నారు. అయితే నిబంధనలు కచ్చితంగా పాటిస్తారా అన్న విషయంలో అనుమానం నెలకొంది. సుమారు 20 నెలల తరువాత పెళ్లిళ్లు నిర్వహించేందుకు వాతావరణం అనుకూలించడంతో తమ బంధువులందరినీ ఆహ్వానిస్తున్నారు. అయితే కేసుల తీవ్రత తగ్గినప్పటికీ కరోనా విషయంలో ఇప్పటికీ అప్రమత్తత అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. భాజా భజంత్రీలకు మళ్లీ ఉపాధి పెళ్లిలో తాళి కట్టే సమయంలో వాయించే భాజాభజంత్రీలు, గట్టి మేళం, మంగళవాయిద్యాలను కూడా బుక్ చేసుకున్నారు. ఇప్పుడు వీరికి కూడా ఉపాధి లభించింది. గత సంవత్సరన్నర నుంచి బేరాలు లేక వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వాయిద్యాల వినియోగం లేకపోవడంతో అవి తప్పుపట్టి పనికిరాకుండా పోయాయి. ఇప్పుడు చేతి నిండా పని దొరకడంతో అప్పులుచేసి వాయిద్యాలకు మరమ్మతులు చేసుకుని సిద్ధంగా ఉంచుకుంటున్నారు. లాక్డౌన్ కారణంగా చెల్లాచెదురైన వాయిద్యాల బృందాలు ఇప్పుడు ఒకచోట చేరి ప్రాక్టీసు చేయడం ప్రారంభించారు. మొన్నటి వరకు వాయిద్యాలకు డిమాండ్ లేకపోవడంతో బందం సభ్యులు ఖాళీగా గడిపారు. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో పోటీ పడుతూ బుకింగ్ చేసుకుంటున్నారు. కరోనా తొలగి తిరిగి మంచి రోజులు రావడంతో ఆయా బృందాల కళ్లలో ఆనందం కనబడుతోంది. -
సెకండ్ వేవ్: లగ్గాలపై కరోనా పగ్గాలు..
సాక్షి, విద్యానగర్(కరీంనగర్): గతేడాది కరోనా సృష్టించిన కల్లోలం అంతాఇంత కాదు. ఒక్కసారిగా పరిస్థితులు తలకిందులయ్యాయి. పని దొరక్క, శుభకార్యాలుని లిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కాగా ఈ ఏడాది కోవిడ్–19 వైరస్ సెకండ్ వేవ్ ఉధృతితో పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ ప్రకటించింది. దీంతో శ్రీసీతారాముల పెండ్లి తర్వాత లగ్గం పత్రికలు రాసుకొని, వచ్చే నెల ముహూర్తాల్లో పెళ్లిళ్లు పెట్టుకోవాలనుకున్న వారు తీవ్ర ఆలోచనలో పడ్డా రు. కొంతమంది పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈసారి కూడా కష్టాలు తప్పవని ఫంక్షన్‌హాళ్లు, పెళ్లిళ్లకు సంబంధించిన క్యాటరింగ్, డెకరేషన్, ఈవెంట్ మేనేజ్మెంట్ నిర్వాహకుల్లో ఆందోళన మొదలైంది. 29 నుంచి జూలై 4 వరకు ముహూర్తాలు.. ఈ నెల 29 నుంచి జూలై 4 వరకు 30కి పైగా పెళ్లి ముహూర్తాలున్నాయి. గతేడాది పెళ్లిళ్ల సీజన్‌పై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. తొలుత లాక్డౌన్, అనంతరం అన్‌లాక్ తర్వాత వాణిజ్య, వ్యాపారాలు కొంత కుదుట పడ్డాయి. అందరూ తమ వృత్తుల్లో బీజీ అవుతుండగా మళ్లీ సెకండ్ వేవ్ ముంచుకొచ్చింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఫంక్షన్‌హాళ్ల నిర్వాహకులు,వధూవరుల కుటుంబీకులకు కరోనా బెంగ పట్టుకుంది. పెళ్లి ఎలా చేయాలి.. ఎంత మందిని పిలవా లి.. ఎంత మందికి భోజనాలు.. అన్ని ఏర్పాట్లు చేసుకుంటే అందరూ వస్తారా అని ఇప్పటికే ఫంక్షన్‌హాళ్లు బుక్ చేసుకున్నవారు ఆందోళన చెందుతున్నారు. వస్త్ర వ్యాపారులు ఖాళీగా కూర్చునే పరిస్థితి.. వివాహ ముహూర్తాలు దగ్గరికి వచ్చిన నేపథ్యంలో ఆడ, మగ పెళ్లివారు కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారని ఎదురుచూస్తున్న వస్త్ర వ్యాపారులు కరోనా కరో నా కారణంగా గిరాకీ లేక ఖాళీగా కూర్చునే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వందల సంఖ్యలో వస్త్ర దుకాణాలున్నాయి. ఒక పెళ్లికి సుమారు రూ.లక్ష విలువైన వస్త్రాలు విక్రయించేవారు. కరోనా సెకండ్ వేవ్‌తో శుభకార్యాలు జరగకుంటే దుకాణాల అద్దె, వర్కర్లకు వేతనాలు ఎలా చెల్లించాలో తెలియ డం లేదని వ్యాపారులు అంటున్నారు. రవాణా వ్యవస్థపై ప్రభావం.. శుభకార్యాల వల్ల ఆర్టీసీతోపాటు పలు ప్రైవేట్ వాహనాలకు గిరాకీ ఉంటుంది. కరోనా వల్ల ఆర్టీసీ అద్దె బస్సుల చార్జీలను ప్రభుత్వం తగ్గించింది. అయినప్పటికీ ఆదాయం అంతగా రావడం లేదు. ప్రైవేటులో ఒక్కో వాహనానికి రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలు సుమారు 5 వేల వరకు ఉంటాయి. వీటిపై ఆధారపడిన వాహన యజమానులు, డ్రైవర్లు, క్లీనర్ల ఉపాధికి సెకండ్ వేవ్‌తో గండి పడింది. మూగబోనున్న బ్యాండ్ మేళం.. గృహప్రవేశాలు, వివాహాల్లో బ్యాండ్ మేళం అవసరం తప్పకుండా ఉంటుంది. ఒక్కో శుభకార్యానికి రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు తీసుకుంటున్నారు. ఒక్కో టీంలో నలుగురి నుంచి ఎనిమిది సభ్యులు ఉంటారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో బ్యాండ్ మేళం మూగబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. డెకరేషన్ వారిదీ ఇదే పరిస్థితి.. శుభకార్యాల్లో డెకరేషన్‌కు ఎక్కువ ప్రాధాన్యమిస్తా రు. ఇందుకోసం కొందరు రూ.లక్షలు ఖర్చు చేస్తుంటారు. కరోనాతో ఈ రంగంపై ఆధారపడి బతికేవా రు ఉపాధి కోల్పోనున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో 5 వేల మందిపై సెకండ్ వేవ్ ప్రభావం పడనుంది. వంటవాళ్లకు గడ్డు పరిస్థితులు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్ద కల్యాణ మండపాలు 100, మధ్య తరహావి 150 వరకు, సింగరేణి, ఎన్టీపీసీ తదితర సంస్థలకు అనుబంధంగా కూడా కొన్ని ఉన్నాయి. ఎక్కువ మంది శుభకార్యాల సందర్భంగా క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చి, భోజనాలు తయారు చేయిస్తుంటారు. 1,000 మందికి భోజనం వడ్డించేందుకు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు చేస్తారు. ఈ మొత్తంలో 15 నుంచి 20 శాతం నిర్వాహకులకు ఆదాయంగా మిగులుతుంది. కరో నా కారణంగా వంట చేసేవాళ్లకు ప్రస్తుతం గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. -
కల్యాణ మండపాలు కళకళ
సాక్షి, అమరావతి : కరోనా ఎన్నో కల్యాణాలను వాయిదా వేసింది. మూడు ముళ్ల సరదా, సందళ్లు లేకుండా చేసింది. ఈ మహమ్మారి కారణంగా వివాహాలను రద్దు చేసుకున్న వారు కొందరైతే మూహూర్తాలు మార్చుకున్న వారు మరికొందరు. నిబంధనలు పాటిస్తూ తూతూమంత్రంగా పెళ్లిళ్లు కానిచ్చిన వారు ఇంకొందరు. కోవిడ్ ప్రభావంతో చాలా వివాహాలు సందడి లేకుండానే జరిగాయి. దాదాపు ఏడు నెలలుగా కొనసాగుతున్న కరోనా ప్రభావం కాస్తంత తగ్గుముఖం పడుతుండడం, లాక్డౌన్ సడలింపులతో ఇప్పుడిప్పుడే పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటోంది. విజయదశమి నుంచి మొదలైన శుభ ముహూర్తాలు రెండు నెలలకు పైగా (ఆశ్వయుజ, కార్తీక, మార్గశిర మాసాల్లో) కొనసాగనున్నాయి. జనవరి రెండో వారం నుంచి మూడున్నర నెలలు మూఢం (మౌఢ్యమి) వల్ల శుభ ముహూర్తాలు లేకపోవడంతో పలువురు ఈ సీజనులోనే పెళ్లిళ్లకు తొందర పడుతున్నారు. రానున్న మూడు నెలల పాటు విజయవాడలోని దాదాపు 500 చిన్న, పెద్ద కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు ఖాళీ లేకపోవడం గమనార్హం. ఈ సీజనులో నగరంలో రెండు వేలు, జిల్లాలో మరో వెయ్యి వరకు వివాహాలు జరుగుతాయని పురోహితులు అంచనా వేస్తున్నారు. మారిన పిలుపులు.. పెళ్లంటే ఎవరి స్థాయిలో వారు ఆడంబరంగా జరుపుకుంటారు. స్థితిమంతులు అంగరంగ వైభవంగా చేసుకుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మునుపటిలా ఘనంగా కాకపోయినా పరిమిత సంఖ్యలో బంధుమిత్రులను ఆహ్వానిస్తున్నారు. మాస్కులు ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పుడు పరిస్థితులు మారడంతో నామమాత్రంగానే శుభలేఖలు ముద్రిస్తున్నారు. ముఖ్యులను, ఆత్మీయులను మాత్రమే ఫోన్లు, వాట్సాప్‌ల ద్వారా ఆహ్వానిస్తున్నారు. ఇక వివాహ వేడుకల్లో అతిథులు మొదలు ఫంక్షన్ హాల్ సిబ్బంది, ఫొటోగ్రాఫర్లు, మేకప్ ఆర్టిస్టులు, క్యాటరింగ్ బాయ్స్ వరకు అంతా మాస్క్‌లు, హ్యాండ్ గ్లౌజ్‌లు ధరిస్తున్నారు. పలుచోట్ల ప్రవేశ ద్వారాల వద్ద శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించడంతోపాటు సామాజిక దూరం పాటించేలా కుర్చీలను అమరుస్తున్నారు. వంటకాల సంఖ్యను కుదించడంతో భోజనాల ఖర్చు కూడా తగ్గుతోంది. ఇవీ శుభ ముహూర్తాలు.. ఆశ్వయుజ మాసం: నవంబర్ 4, 11వ తేదీలు కార్తీక మాసం: నవంబర్ 17, 19, 20, 21, 22, 25, 26, డిసెంబర్ 1, 6, 8, 9వ తేదీలు మార్గశిర మాసం: డిసెంబర్ 17, 18, 20, 24, 27వ తేదీలు జనవరి: 1, 2, 4, 7 తేదీలు డబ్ల్యూహెచ్‌వో (ప్రపంచ ఆరోగ్య సంస్థ) సూచనలివీ.. - కరోనా జాగ్రత్తలు పాటించడం వీలు కాని పక్షంలో వేడుకలు రద్దు చేసుకోవాలి. - పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించాలి. - వేడుక ప్రారంభానికి ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అతిథులకు అవగాహన కల్పించాలి. - ఎక్కువ సేపు లోపల గడపకుండా బయటే వేడుకలు నిర్వహించుకోవాలి. - వేడుకకు హాజరయ్యే వారికి శానిటైజర్‌తోపాటు సబ్బు, నీళ్లు, టిష్యూ పేపర్లు, మాస్క్‌లు సరఫరా చేయాలి. - విందు భోజనాల్లో తప్పనిసరిగా పరిశుభత్ర, భౌతిక దూరం పాటించాలి. వాడి పారవేసే ప్లేట్లు (డిస్పోజబుల్) వినియోగించాలి. - ఏమాత్రం అనారోగ్య లక్షణాలున్నా ఇంటికే పరిమితం కావాలి. పురోహితులకు డిమాండ్.. ‘విజయదశమి నుంచి జనవరి మొదటి వారం వరకు శుభ ముహూర్తాలున్నాయి. కోవిడ్ నిబంధనలతో పరిమిత సంఖ్యలోనే బంధుమిత్రులను ఆహ్వానించాలని సూచిస్తున్నాÆం. ఐదారు నెలలుగా ఖాళీగా ఉన్న పురోహితులకు ఇప్పుడు డిమాండ్ పెరిగింది. నేను ఈ సీజనులో 60 వరకు పెళ్లి ముహూర్తాలు నిర్ణయించా’ –పులిపాక రాఘవేంద్రాచార్యులు, వేదపండితుడు, విజయవాడ. -
కల్యాణ ఘడియలకు కరోనా ‘వర్జ్యం’
సాక్షి, హైదరాబాద్: కల్యాణమొచ్చినా.. కక్కొచ్చినా ఆగదని నానుడి. కానీ, కరోనా వస్తే వివాహమే కాదు.. సమస్తమూ ఆగిపోతాయనేది ప్రస్తుతం ఒరవడి. సాధారణంగా శ్రీరామనవమి వేళ రాములోరి పెళ్లి అనంతరం వివాహాలు ఊపందుకుంటాయి. పెళ్లంటే ఆ సందడే వేరు. ఈసారి కరోనా దెబ్బకు ఆ సందడి, సంతోషం మాయమయ్యాయి. పెళ్లంటే నూరే ళ్ల పంట అనే సంగతి దేవుడెరుగు.. పెళ్లి, విందుల పేరుతో పది మందీ గుమికూడితే కరోనాతో కొత్త తంటా అనే ఉద్దేశంతో పలువురు పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటున్నారు. ఏటా ఈ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా లక్షల వివాహాలు జరుగుతుంటాయి. కరోనా ఎఫెక్ట్‌తో లాక్‌డౌన్‌కు ముందే కుదుర్చుకున్న పెళ్లిళ్లు సైతం అనేక ఆంక్ష లు, షరతుల మధ్య పదుల సంఖ్యలోనే జరిగాయి. ఆ తరువాత ముహూర్తాలు పెట్టుకున్న పెళ్లిళ్లు ఇప్పట్లో జరిగే అవకాశం లేక వాయిదా వేసుకుంటున్నారు. ఒక సందర్భంలో సీఎం కేసీఆర్..పెళ్లిళ్లు వాయిదా వేసుకున్న వారిని అభినందించారు. పెళ్లి.. ఫంక్షన్ వాయిదా.. కరోనా పంజా విసరడం, లాక్డౌన్ విధించడం పెళ్లిళ్లపై పెద్ద ప్రభావమే చూపింది. ఇప్పటికే జరిగిన పెళ్లిళ్లను చాలాచోట్ల నలుగురైదుగురితో మమ అనిపించగా, ఇకముందు జరగాల్సిన వాటిని వాయిదా వేసుకుంటున్నారు. ఏప్రిల్ 15, 16, 26, 27, మే 2, 6, 8, 14, 17, 18, 24, జూన్ 10, 11, 14, 15, జూలై 24, 25, 26, 29, ఆగస్టు 2, 3, 5, 6 ,8, 13, 14 తేదీల్లో ముహూర్తాలు ఉండగా, ఈ తేదీల్లో లక్షల్లో వివాహాలు కుదిరి ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. ఇంకా నవంబర్ 19, 25, 30, డిసెంబర్ 2, 9, 10, 16, 17, 23, 27 తేదీల్లోనూ పెళ్లిళ్లకు పలువురు ప్లాన్ చేసుకున్నారు. వీరంతా లాక్డౌన్ నిబంధనల నేపథ్యంలో జూన్ వరకు వివాహాల వాయిదాకే మొగ్గు చూపుతున్నారు. మరికొందరైతే పరిస్థితులు కుదుటపడితే శ్రావణమాసంలో లేదా వచ్చే ఏడాది జరిపించే యోచనలో ఉ న్నారు. ఫలితంగా మార్చి నుంచి మే వరకు కిటకిటలాడే ఫంక్షన్ హాళ్లు బోసిపోయాయి. తీసుకున్న అడ్వాన్సులు సైతం వెనక్కివ్వాల్సిన పరిస్థితి.. ఇక, వీటిలో పనిచేసే వందలాది కార్మికులు ఖాళీ అయిపోయారు. ఫొటోగ్రాఫర్లు, స్టూడియోలు, బ్యూటీషియన్లు, మ్యారేజ్‌బ్యూరోలు, బ్యాండ్ మేళాలు, టెంట్హోస్ నిర్వాహకులు ఉపాధి కోల్పోయారు. పెళ్లిళ్లూ లేవు.. పూజలూ లేవు ఈ సీజన్లో పురోహితులకు మంచి డిమాండ్.. మార్చి నుంచి మధ్యలో కొన్ని రోజులు మినహా శ్రావణ మాసం వరకు వీరు దొరకడమే గగనమయ్యేది. ముందే కుదుర్చుకున్న ముహూర్తాలతో ఇతర ముహూర్తాలు పెట్టడానికి, శుభకార్యాలు నిర్వహించడానికి సమయం లేదని చెప్పేవారు. అలాంటిది ఇప్పు డు పెళ్లిళ్లే కాదు.. గుడిలో పూజలకూ దూరమై ఖాళీ అయిపోయారు. తమకు ఫోన్ చేసిన వారికి పెళ్లి వాయిదా వేసుకోవాలని, వీలుంటే వచ్చే ఏడాది చేసుకోవాలని చెబుతున్నారు. వాయిదా వేసుకున్నాం.. మా అబ్బాయి పెళ్లి మే నెలలో పెట్టుకున్నాం. కరోనాతో వాయిదా వేసుకున్నాం. ఇలాంటి సమయంలో పెళ్లి చేసి ఇబ్బంది పడేకంటే వాయిదా వేసుకోవడమే ఉత్తమం. లాక్డౌన్ మంచి నిర్ణయం. అందరూ స్వీయ నియంత్రణ పాటించాలి. – గంగారాం మళ్లీ వచ్చే ఏడాదే.. ఏప్రిల్ చివరిలో మా అన్న కుమార్తె పెళ్లి ఉండె. పెళ్లికి కావాల్సిన అన్ని వస్తువులూ కొన్నాం. ఏ ఒక్కటీ తక్కువ కావద్దని అన్నీ ముందే సమకూర్చుకున్నాం. కరోనా దెబ్బకు పెళ్లి వాయిదా వేసుకున్నాం. సెప్టెంబర్ లేదా వచ్చే ఏడాది చేయాలని నిర్ణయించుకున్నాం. – రాజు -
ప్రేమికుల రోజునే.. పెళ్లి బాజాలు
ప్రేమ.. అనిర్వచనీయమైన అనుభూతి. వివాహం.. జీవితంలో ఓ మధురమైన ఘట్టం. తమ పెళ్లి జ్ఞాపకాలు జీవితాంతం ఉండేలా.. తమ హృదిలో ఆ మధుర స్మృతులు పదిలంగా నిలిచేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు నేటి యువత. దీనికి ప్రేమికుల రోజుకంటే మంచిరోజు ఏముంటుంది. ప్రేమికుల రోజు సాక్షిగా వివాహబంధంతో ఒక్కటయ్యేందుకు జంటలు సిద్ధమవుతున్నాయి. ఫిబ్రవరి 14న కృష్ణాజిల్లా వ్యాప్తంగా వేల ముహుర్తాలు ఉండడమే దానికి తార్కాణం. సాక్షి, కోడూరు(అవనిగడ్డ): మాఘమాసంలో శుభకార్యాలకు కొదవుండదు. జనవరి 25 నుంచి మాఘమాసం ప్రారంభం కాగా ఇప్పటికే జిల్లావ్యాప్తంగా పెళ్లిళ్ల సందడి నెలకొంది. అయితే ఈ నెల 13,14,15 బలమైన సుముహూర్తాలు ఉండడంతో ఈ మూడు రోజుల పాటు వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయి. వివాహాలతో పాటు గృహప్రవేశాలు, నూతన వస్త్రాల బహూకరణ, ఉపనయనం, అన్నప్రాసనలకు ఈ మూడు రోజులు శుభదినాలుగా పండితులు చెబుతున్నారు. వాలెంటైన్స్ డే రోజే వివాహం.. ఈ మూడు రోజుల్లో ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కూడా కావడంతో ఈ రోజున పెళ్లిలఘ్నాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రేమికుల రోజున పెళ్లి చేసుకుంటే జీవితకాలం తమకు ఆతేదీ ప్రత్యేకంగా గుర్తుండిపోతుందనే ఆలోచనతో యువత ఆరోజున పెళ్లి చేసుకొనేందుకు ఇష్టం చూపుతున్నారు. దీంతో 14న తేదీన జిల్లావ్యాప్తంగా అన్ని కల్యాణమండలాలు ఒక నెలరోజుల ముందే బుక్ అయిపోయినట్లు సమాచారం. ఈ మూడు రోజుల పాటు శుభకార్యాలకు కొదవలేకపోవడంతో 90శాతానికి పైగా కల్యాణమండపాలు, ప్రైవేటు అసోసియేషన్ భవనాలు బుక్ అయిపోయినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. రెట్టింపైన పెళ్లి ఖర్చు ! ప్రస్తుతం వేల సంఖ్యలో పెళ్లిళ్లు ఉండడంతో కల్యాణమండలపాల నిర్వాహకులు, బాజా భజంత్రీలు వారు తమ రేట్లు పెంచేశారు. డెకరేషన్, సౌండ్‌సిస్టమ్స్, లైటింగ్ నిర్వాహకులు, పండితులు కూడా రెట్టింపు రేట్లు వసూలు చేస్తున్నారని అంటున్నారు. ఫొటోగ్రాఫర్లకు కూడా మంచి గిరాకీ ఏర్పడింది. అయితే జీవితంలో వివాహఘట్టం జరిగేది ఒకసారి కావడంతో ఖర్చులకు ఎక్కడా వెనుకాడడం లేదు. బంగారం షాపులు, పచారీ, వస్త్ర దుకాణాలు, కూరగాయల, పూలదుకాణాలు ఇప్పటికే కిటకిటలాడుతున్నాయి. కోడూరులో సిద్ధమైన ఒక కల్యాణ మండపం వేదిక -
ఫంక్షన్ హాళ్లే టార్గెట్
దూద్‌బౌలి: ఫంక్షన్ హాళ్లను కేంద్రంగా చేసుకుని ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఓ యువకుడిని హుస్సేనీఆలం పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చార్మినార్ ఏసీపీ అంజయ్య, హుస్సేనీఆలం ఇన్స్పెక్టర్ రమేశ్ కొత్వాల్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి మైలార్‌దేవ్‌పల్లి కింగ్ కాలనీకి చెందిన మహ్మద్ ఆఫ్రిది అఫ్జల్ ఓ ఫంక్షన్ హాల్లో వీడియోగ్రాఫర్‌గా పని చేసేవాడు. జల్సాలకు అలవాటు పడిన అతను వివాహాది శుభకార్యాలకు వచ్చే వారి బైక్‌లను చోరీ చేసి విక్రయించేవాడు. కొద్ది రోజుల క్రితం ఫతేదర్వాజాలోని మహరాజా ఫంక్షన్ హాల్లో ఓ శుభకార్యానికి హాజరైన మహ్మద్ అక్బర్ అనే వ్యక్తి తన బజాజ్ సిటీ–100 వాహనం కనిపించకపోవడంతో హుస్సేనీఆలం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా సదరు వాహనానికి సంబంధించి ట్రాఫిక్ పోలీసుల నుంచి చలాన్ పోస్టు ద్వారా అందింది. ఈ వాహనం హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలో తిరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో హుస్సేనీఆలం అడిషనల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావు మూసాబౌలి చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా సదరు బైక్‌పై వెళుతున్న అబ్దుల్లా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, మహ్మద్ ఆఫ్రిది అఫ్జల్ తనకు బైక్‌ను విక్రయించినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు అఫ్జల్ ఆఫ్రిదిని అదుపులోకి తీసుకుని అతడి నుంచి ఆరు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో 2, చాంద్రాయణగుట్ట పరిధిలో 2, చార్మినార్ పరిధిలో 1, హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒకటి చొప్పున దొంగిలించినట్లు తెలిపాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో అడిషనల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావు, ఎస్సైలు రాము నాయుడు, శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు. -
మోగింది కల్యాణ వీణ
ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి.. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్లంటే మరి.. అన్నాడొక సినీ కవి. ఇళ్లన్నీ మామిడి తోరణాలతో మెరవాలి. వేద మంత్రోచ్ఛరణలు మార్మోగాలి. బాజాభజంత్రీలతో హోరెత్తాలి. ముచ్చటైన జంటను చూసిన బంధు జనం మురవాలి. మనసారా దీవెనల వర్షం కురవాలి. మాఘమాసం వచ్చేసింది. శుభ ముహూర్తాలకు వేళయ్యింది. ఒక్కటయ్యే జంటల కోసం పెళ్లి వేదిక నిరీక్షిస్తోంది. ఫిబ్రవరి 8, 9, 10, 11 తేదీల్లో జిల్లావ్యాప్తంగా భారీ సంఖ్యలో జరగనున్న పెళ్లిళ్లతో సందడి నెలకొంది. విజయనగరం మున్సిపాలిటీ:ఈ నెల 5 నుంచి మార్చి 6 వరకూ మాఘమాసం కొనసాగనుంది. ఈ పవిత్ర మాసంలో మంచి ముహూర్తాలు ఉండటంతో వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు తదితర శుభకార్యాలు జోరుగా జరగనున్నాయి. పల్లె, పట్టణం తేడా లేకుండా పెళ్లిబాజాలు మోగనున్నాయి. జిల్లాలో వివాహాది శుభకార్యాలు చివరిగా మార్గశిర బహుళ నవమి అంటే డిసెంబర్ 30న జరిగాయి. తిరిగి 35 రోజుల విరామం అనంతరం బుధవారం నుంచి ఈ నెల 28 వరకూ జరగనున్నాయి. వీటిలో ఈ నెల 8, 9, 10, 11 తేదీల్లో ఉన్న ముహూర్తాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు చేసేందుకు చాలామంది ఏర్పాట్లు చేసుకున్నారు. మార్చి 7వ తేదీ నుంచి మొదలయ్యే ఫాల్గుణ మాసంలో కూడా వివాహాలు జరుగుతాయని పండితులు తెలిపారు. భారీ సంఖ్యలో పెళ్లిళ్లు జరగనుండటంతో పురోహితులు, సన్నాయి మేళాలు, కల్యాణ మండపాలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా రెండువేలకు పైగా జంటలు వివాహ బంధంతో ఒక్కటవ్వనున్నాయి. జోరందుకున్న వ్యాపారాలు హిందూ సంప్రదాయం ప్రకారం మూఢం రోజుల్లో పెళ్లిళ్లు, ప్రారంభోత్సవాలు వంటి మంచి కార్యక్రమాల నిర్వహణకు ముందుకు రారు. దీంతో మూఢం ముగిసే వరకు వేచి ఉన్న వారంతా ఇప్పుడు తమ పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రధానంగా పెళ్ళిళ్లు నిశ్చయించుకున్న వారి ఇళ్లల్లో సందడి ప్రారంభమైంది. వస్త్రాలు, బంగారు ఆభరణాలు, ఇతర సామగ్రి కొనుగోలుకు పల్లె ప్రజలు పట్టణాలకు తరలి వస్తున్నారు. వీడియో గ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లకు కూడా చేతినిండా పని దొరికింది. కల్యాణ మండపాలకు కళ ఒకప్పుడు ఎవరి ఇంటి ముందు వారు పెళ్లి చేసుకునే సంప్రదాయం కనుమరుగై కల్యాణ మండపాలను ఆశ్రయించడం ఎక్కువైంది. కల్యాణ మండపంలో పెళ్ళి చేస్తే అయ్యే ఖర్చుకన్నా ఇంటి దగ్గర చేస్తే అయ్యే ఖర్చు ఎక్కువని అందరూ భావిస్తున్నారు. దీంతో ఆలయాలు, కల్యాణ మండపాలు, హోటళ్ళలో పెళ్లిళ్లకు ఎక్కువ మంది మక్కువ చూపిస్తున్నారు. ఆర్థిక స్థితిగతులను బట్టి వేదికలను ఎంపిక చేసుకుంటున్నారు. గతంలో కనీస సౌకర్యాలతో ఉన్న కల్యాణ మండపం రూ.5 వేల నుంచి రూ.10 వేల మధ్య అందుబాటులో ఉండేది. ప్రస్తుతం రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. హైటెక్ కల్యాణ మండపాల పరిస్థితి చెప్పనక్కర్లేదు. రూ.కనీస అద్దె రూ.లక్షల్లో పలుకుతోంది. ఇటీవల కాలంలో కన్వెన్షన్ హాల్ సంప్రదాయం విస్తరిస్తుండటంతో మంచి రోజుల్లో వాటిని బుక్ చేయించేందుకు నిర్వాహకులు బారులు తీరుతున్నారు. మేళతాళాలకుముందస్తు నమోదు పెళ్లిళ్లల్లో కీలకమైన మంగళ వాయిద్యాలకు గిరాకీ పెరిగింది. పూర్తి స్థాయి బ్యాండ్ పార్టీలు దొరికే పరిస్థితి లేదు. కొందరు సన్నాయిమేళం తోనే సరిపెట్టుకోవలసి వస్తోంది. ఒక్కొక్క సారి తక్కువ మందిగల బ్యాండ్ పార్టీ కూడా దొరకడం గగనమవుతోంది. రూ.20 వేల నుంచి రూ.లక్షల్లో బ్యాండ్ పార్టీల ధరలు పలుకుతున్నాయి. మంచి రోజులు వచ్చేశాయి మాఘమాసం ప్రారంభం కావటంతో మంచి రోజులు వచ్చేశాయి. ఈనెల 5 నుంచి పుష్యమాసం ముగిసిపోయింది. మాఘమాసంలో జిల్లాలో పెళ్ళిళ్ల సందడి ప్రారంభం కానుంది. ఈ మాసంలో దివ్యమైన ముహూర్తాలు ఉండటంతో ఆ రోజుల్లో వేల సంఖ్యలో నూతన జంటలు ఒక్కటి కానున్నాయి. – కామేశ్వరశర్మ, వేద పండితుడు, నెల్లిమర్ల ఒకేరోజు నాలుగైదు వివాహాలు ప్రస్తుతం పురోహితులకు కూడా జిల్లాలో మంచి డిమాండ్ ఉంది. ఒక పురోహితుడు ఒకేరోజు నాలుగైదు వివాహాలు జరిపించే పరిస్థితి నెలకొంది. ఒక్కొక్క వివాహానికి స్థాయిని బట్టి రూ.7వేలకు పైగా తీసుకుంటున్నారు. -
ఫంక్షన్ హాళ్లు, కోచింగ్ సెంటర్ల ఇష్టారాజ్యం
సాక్షి, హైదరాబాద్: నగరవాసులకు వివిధ వాణిజ్య పరమైన సేవలు అందిస్తున్న సర్వీస్ కేంద్రాలు బాహాటంగా సేవాపన్ను ఎగవేతకు పాల్పడుతున్నాయి. ఖాతాదారులు, వినియోగదారుల నుంచి ఇష్టారాజ్యంగా వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్న వీరు ప్రభుత్వ ఖజానాకు నయాపైసా చెల్లించడం లేదు. కొన్ని సంస్ధలు స్లాబ్ పేరుతో చేతివాటం ప్రదర్శిస్తుండగా, మరికొన్ని పూర్తిగా ఎగవేతకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. వాణిజ్య పన్నుల శాఖాధికారుల ఉదాసిన వైఖరి, అవినీతి కారణంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున సేవా పన్నును నష్టపోతుంది. సేవా పన్ను వసూలపై పట్టింపేది... జీఎస్టీ చట్టం అమల్లోకి వచ్చి ఏడాది పూర్తయినా సేవా పన్ను రాబట్టడంపై వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు పట్టింపు లేకుండా పోయింది. వాస్తవంగా ఏడాది కంటే మందు కేవలం వస్తువు పన్ను మాత్రమే వాణిజ్య పన్నుల శాఖ పరిధిలో ఉండేది. సేవల పన్నుల వ్యవహారం కేంద్ర ఎక్సైజ్ శాఖ పరిధిలో వచ్చేది. జీఎస్టీ అమలుతో రెండు పన్నులు ఒకే పరిధిలోకి వచ్చాయి. ఏటా కోటిన్నర పైగా టర్నోవర్ గల డీలర్లు సగం కేంద్రం, సగం రాష్ట్రం పన్నుల పరిధికి వచ్చారు. ఇప్పటి వరకు కేంద్ర పరిధిలో ఉండి సేవా పన్నులు చెల్లించిన సంస్ధలు పాత విధానమే పునరావృత్తం చేస్తూ సేవాపన్నును ఎగవేస్తున్నట్లు తెలుస్తోంది. ఫంక్షన్ హాళ్లు, కోచింగ్ సెంటర్లు, ఆహార సంస్ధలు ముందు వరుసలో ఉన్నట్లు సమాచారం. రెండువేలకు పైనే.... హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు రెండు వేలకు పైగానే ఉన్నాయి. వాటి దినసరి అద్దె, వివిధ చార్జీలు కలిపి కనీసం రూ.20 వేల నుంచి రూ.3 లక్షల వరకు ఉంది. శుభకార్యాలయాలు, ఇతర కార్యక్రమాలకు డిమాండ్ బట్టి నిర్వాహకులు చార్జీలు వసూలు చేస్తుంటారు. ఇందుకుగాను వారు రెండు రకాల రికార్డుల నిర్వహిస్తుంటారు. అధికారిక రికార్డులో వసూలు మొత్తం నమోదు కనిపించదు. అధికారికంగా రశీదు కూడా ఇవ్వడం లేదు. వాస్తవంగా ఫంక్షన్ హాల్స్, కన్వెన్షన్ హాల్స్‌కు వసూలు చేసే మొత్తంలో సుమారు 18 శాతం జీఎస్టీ పన్ను కింద చెల్లించాల్సి ఉంటుంది. అయితే జీఎస్టీ పరిధిలో నమోదైన వాటి సంఖ్య చాల తక్కువ. జీఎస్టీ కింద నమోదు హాళ్లు సైతం రికార్డుల తారుమారుతో మొక్కుబడిగా పన్నును చెల్లిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల వాణిజ్య పన్నుల శాఖ అధికారులు నగరంలోని సుమారు 200 పైగా ఫంక్షన్‌హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లను గుర్తించారు. వాటిలో కొన్నింటికి నోటీసులు ఇచ్చి చేతులు దులుపు కున్నారు. కోచింగ్ సెంటర్లు అంతే... తెలంగాణ ఏర్పాటు అనంతరం వివిధ పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లకు డిమాండ్ పెరింది. ప్రభుత్వం నోటిఫికేషన్లతో కోచింగ్ సెంటర్లపై కనక వర్షం కురుస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై కూడా నిరుద్యోగ యువత ఆసక్తి కనబర్చడం తో కోచింగ్ కేంద్రాలకు మరింత కలిసి వచ్చింది. వివిధ పరీక్షల కోచిం గ్ను బట్టి అడ్డు అదుపు లేకుండా ఫీజులు వసూలు చేస్తున్నారు. నగరంలో సుమారు మూడు వేలకు పైగా కోచింగ్ కేంద్రాలు ఉన్నట్లు సమాచారం. నిర్వాహకులు వసూలు చేసే ఫీజుల్లో జీఎస్టీ కింద కొంత పన్ను చెల్లించాల్సింది. ఆయితే జీఎస్టీ పరిధి కింద నమోదైన వాటి సంఖ్య వేళ్లపై లెక్కిం చ వచ్చు. అదేవిధంగా బ్యాంకింగ్, ఏటీఎం. ఎస్ఎంఎస్, క్రెడిట్ కార్డు, ఆర్టీజీఎస్, ఫైనాన్స్ సం స్ధలు కూడా ఖాతాదారుల నుంచి, ఆహార సరఫ రా సంస్ధలు వినియోగదారుల నుంచి వసూలు చేసే చార్జీల్లో సుమారు ఐదు నుంచి 18 శాతం వర కు జీఎస్టీ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇందులో కనీసం పదిశాతం కూడా పన్నులు చెల్లిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇప్పటికైనా పన్నుల వసూలుపై వాణిజ్య పన్నుల శాఖ దృష్టి సారించాలని నిపుణులు కోరుతున్నారు. -
సుముహూర్తం..మోగనున్న పెళ్లి బాజాలు
వికారాబాద్ అర్బన్ : అధిక జేష్ఠమాసం ఈ నెల 15వ తేదీతో ముగిసింది. దీంతో గత పది రోజులుగా పలు శుభకార్యాలు కొనసాగుతున్నా.. పెళ్లిళ్లకు అనువైన మూహూర్తాలు మాత్రం దొరకలేదు. ఈ నెల 27, 30వ తేదీల్లో వివాహాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. దీంతో వధూవరుల తల్లిదండ్రులు పెళ్లి ఏర్పాట్లలో బిజీబిజీగా ఉన్నారు. జూలై 15 నుంచి ఆషాఢ మాసం రానున్న నేపథ్యంలో ఆగస్టు 15వ తేదీ వరకు ముహూర్తాలు ఉండవు. దీంతో జూలై మొదటి వారంలోనే పెళ్లిళ్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు. తీపి గుర్తుగా... మనిషి జీవితంలో ఒకే సారి చేసుకునే పండుగ పెళ్లి. ఈ మూడు ముళ్ల బంధం, తలంబ్రాల కోలాహలం, ఏడు అడుగల నడక.. వందేళ్ల తీపి గుర్తులుగా ఉండిపోవాలని వధూవరులు, తల్లిదండ్రులు ఆశిస్తారు. ఈ సంబరాన్ని ఎప్పుడైనా చూసుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే ఎంత ఖర్చయినా వెనకాడకుండా ఫొటోగ్రఫీ, వీడియోలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకోసం ఒక్కొక్కరు తమ స్థాయిని బట్టి రూ.30 వేల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు పెడుతున్నారు. ఇటీవల కొందరు డ్రోన్ కెమెరాలతో పెళ్లి వేడుకలను చిత్రీకరిస్తున్నారు. గాలిలో తేలియాడుతూ అత్యంత క్వాలిటీగా ఫొటోలు, వీడియోలు తీస్తుండటంతో డ్రోన్ కెమెరాలకు ఆదరణ పెరిగింది. పెళ్లి మండపంలోనే రెండు, మూడు స్క్రీన్లు ఏర్పాటు చేసి పెళ్లి వేడుకను దగ్గరగా చూసే అవకాశం కల్పిస్తున్నారు. ఇలాంటి ఏర్పాట్లు పెద్దపెద్ద పట్టణాల్లో, ధనికుల పెళ్లి వేడుకల్లో కనిపించేవి. ఇప్పుడు వికారాబాద్, తాండూరు, పరిగి లాంటి చిన్నచిన్న పట్టణాల్లో సందడి చేస్తున్నాయి. మండపాలకు డిమాండ్... పెళ్లి వేడుకలను వైభవంగా చేయాలంటే పెళ్లి మండపాలను ఆశ్రయించాల్సిందే. అక్కడైతేనే అతిథులకు అన్ని రకాల సౌకర్యాలు, విశాలమైన స్థలం ఉంటుంది. ఇందుకోసం పెళ్లి పెద్దలు ఎంత ఖర్చుకైనా వెనకాడటం లేదు. దీంతో పెళ్లి మండపాలకు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది. రెండు నెలల ముందు బుక్ చేసుకుంటే కానీ ఫంక్షన్ హాల్ దొరికే పరిస్థితి లేదు. దీంతో పాటు, డెకరేషన్, క్యాటరింగ్, వీడియో, ఫొటోగ్రాఫర్లను సైతం ముందుగానే బుక్ చూసుకోవాలి. శ్రావణమాసం, భక్తిమాసం... హిందువులు అత్యంత పవిత్రమైనదిగా భా వించేది శ్రావణమాసం. ఈ మాసంలో అత్యధిక మంది భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు, భజ నలు, దీక్షలు చేస్తారు. ఈ నెల మొత్తం చాలా మంది మాంసాహారానికి దూరంగా ఉంటా రు. ఆగస్టు 14వ తేదీ నుంచి శ్రావణ మాసం రానుంది. ఆగస్టు మాసంలో దివ్య మైన మూహూర్తాలు ఉన్నట్లు పురోహితులు చెబుతున్నారు. శ్రావణమాసం పండుగలకు, శుభకార్యాలకు అనువైన మాసం కావడంతో పెళ్లిళ్ల వేడుకలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. మంచి రోజులు.. గత నెల రోజులుగా శుభగడియల కోసం ఎదురు చూసిన వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పెళ్లి వేడుకలను జరిపించేందుకు రెడీ అవుతున్నారు. జూన్‌లో కొన్ని సుముహూర్తాలు ఉండటంతో నూతన గృహప్రవేశం, పిల్లలకు పుట్టు పంచలు వంటి కార్యక్రమాలు చేశారు. నేటి బుధవారంతో పాటు ఈ నెల 30వ తేదీన మంచి ముహూర్తాలు ఉండటంతో ఫంక్షన్ హాళ్లు ఇప్పటికే బుక్ అయిపోయాయి. జూలై మాసంలో 1, 5, 6, 7తేదీల్లో మంచి గడియలు ఉన్నాయని పురోహితుడు వైభవలక్ష్మి ఆలయ అర్చకుడు అంబదాస్ తెలిపారు. ఆగస్టు మాసంలో 15, 16, 17, 18, 19, 23, 24, 29, 30, 31వ తేదీల్లో, సెప్టెంబర్ 2, డిసెంబర్ 12, 14, 21, 22, 27, 28, 29, 30వ తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నట్లు చెప్పారు. తిరిగి 2019 ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మంచి ముహూర్తాలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. -
పెళ్లి విందుల్లో.. ప్లాస్టిక్ వద్దు
సాక్షి, హైదరాబాద్ : పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. నగరంలో భారీ సంఖ్యలో వివాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఫంక్షన్ హాళ్లు బుక్కైపోయాయి. స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా వివిధ కార్యక్రమాలను చేపడుతున్న జీహెచ్ఎంసీ.. పెళ్లి విందుల్లో వినియోగించే ప్లాస్టిక్‌పైనా దృష్టి సారించింది. విందుల్లో తాగునీరు, స్వీట్స్, ఫ్రూట్ సలాడ్స్ తదితరమైన వాటికి ప్లాస్టిక్ గ్లాసులు, కప్పులు ఎక్కువగా వాడుతుండటాన్ని గుర్తించింది. తద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలు భారీగా పెరగనుండటంతో.. వాటికి స్వస్తి పలుకుతూ స్టీల్, గాజు గ్లాసులు, పింగాణీ ప్లేట్లనే వాడేలా ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులకు అవగాహన కల్పించనుంది. వచ్చే నెల రెండో వారం నుంచి ఈ ప్రచారాన్ని ఉద్యమంలా చేపట్టనుంది. దీంతోపాటు ప్లాస్టిక్ బదులు తగినన్ని స్టీల్, గాజు, పింగాణీ పాత్రలను అందుబాటులో ఉంచేందుకు.. వాటి వివరాలందించేం దుకూ సిద్ధమవుతోంది. హరిత ఉత్సవాల (గ్రీన్ ఫెస్టివల్) పేరిట ఈ ప్రచార కార్యక్రమాలు చేపట్టనుంది. గ్రేటర్లో వాడుతున్న ప్లాస్టిక్ కవర్లు ఏటా 73 కోట్లు వీటిల్లో అధిక వాడకం 50 మైక్రాన్ల లోపువే.. ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణానికి, మానవాళికి ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నందున కేంద్ర ప్రభుత్వం 50 మైక్రాన్లలోపు ప్లాస్టిక్‌పై నిషేధం విధించింది. దాని అమలుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టినా అమలులో ఆశించిన ఫలితం కనిపించడం లేదు. కర్రీ పాయింట్ల నుంచి హోటళ్ల దాకా.. వీధివ్యాపారుల నుంచి మాల్స్ దాకా.. ఎక్కడ పడితే అక్కడ భారీగా వినియోగిస్తున్నారు. గ్రేటర్లో రోజుకు వెలువడుతున్న చెత్త4,700 టన్నులు ఇందులో ప్లాస్టిక్ వ్యర్థాలు 400 టన్నులు ఈ లెక్కన నగరవాసులను ఏటా ప్రమాదంలోకి నెడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు 1,44,000 టన్నులు స్వచ్ఛందంగా వాడేలా చర్యలు ఫంక్షన్ హాళ్లలో ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు కాకుండా గాజు గ్లాసులు, స్టీల్ ప్లేట్లు స్వచ్ఛందంగా వాడేలా సూచించాలని యజమానులకు తెలియజేస్తాం. ఫంక్షన్‌హాళ్లు, బ్యాంకిట్ హాళ్లలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించే వారికి పురస్కారాలు అందజేస్తాం. ఇందుకుగాను వచ్చే నెల రెండో వారం నుంచి వీటిని ఉద్యమంలా నిర్వహిస్తాం. హరిత ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా భాగస్వాములు కావాలి. – బి.జనార్దన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ హానికరం ఇలా.. ప్లాస్టిక్ భూమిలో కలిసేందుకు వేల సంవత్సరాలు పడుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలతో భూగర్భజలాలు అడుగంటుతాయి. భూసారం తగ్గుతుంది. తక్కువ మందం ప్లాస్టిక్ త్వరగా చీలికలు పీలికలై రీసైక్లింగ్‌కు పనికిరాదు. ఇవి కొన్నేళ్లకు శిథిలమై ప్లాస్టిక్ ధూళిగా మారి గాల్లో కలసి మానవ శరీరంలో చేరి క్యాన్సర్, కిడ్నీ, శ్వాసకోశ సంబంధ వ్యాధులను కలుగజేస్తాయి. ప్లాస్టిక్ తిన్న పశువులు జీర్ణించుకోలేక మరణిస్తాయి. -
దావత్ చేస్కోవద్దా!?
ఫంక్షన్ హాళ్ల అద్దెలు భరించలేని మధ్య, దిగువ తరగతి, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా జీహెచ్ఎంసీ నిర్మించ తలపెట్టిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణం ముందుకు సాగడం లేదు. గ్రేటర్లో తక్కువ వ్యయంతో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు నిర్వహించుకునేందుకు వీలుగా జీహెచ్ఎంసీ వీటి నిర్మాణానికి ముందుకు వచ్చింది. తక్కువ అద్దెలకే ఈ ఫంక్షన్ హాళ్లను కేటాయించాలని నిర్ణయించింది. వివిధ ప్రాంతాల్లో మొత్తం 50 చోట్ల నిర్మించాలని భావించి..తొలుత 31 ఫంక్షన్ హాళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. దాదాపు ఏడాది కాలంలో వీటిని పూర్తి చేయాలని భావించినా ఫలితం లేదు. మూడేళ్లయినా వీటి అతీగతీ లేదు. సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణాలు పూర్తి కాకపోవడానికి పలు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల టెండర్లు పూర్తయినప్పటికీ, స్థల వివాదాలు తదితర కారణాలతో పనులు ప్రారంభం కాలేదు. మొదట కేటాయించిన ప్రాంతాల్లో కాకుండా...ఇతర ప్రాంతాలకు తరలించడంతో మరికొన్ని చోట్ల జాప్యమయింది. కొన్నిచోట్ల పనులు ప్రారంభమైనా ముందుకు సాగలేదు. వెరసి మొత్తం 31 ఫంక్షన్ హాళ్లకుగాను 16 చోట్ల నిర్మాణానికి సిద్ధమైనప్పటికీ వాటిల్లోనూ కొన్నింటిపై కొందరు కోర్టుకు వెళ్లారు. కొన్నింటిని ఇతర ప్రదేశాలకు మార్పు చేశారు. కొన్నింటికి తగిన స్థలం లేదు. మరికొన్ని పనులు కుంటుతున్నాయి. తగిన స్థలం అందుబాటులో ఉన్నదీ లేనిదీ చూసుకోకుండానే, యాజమాన్య హక్కులపై వివాదాల్ని పట్టించుకోకుండానే తొందరపడి టెండర్లు పిలవడంతో పలు చోట్ల ఆటంకాలేర్పడ్డాయి. ఈ నేపథ్యంలో మూడేళ్లలో కనీసం మూడు ఫంక్షన్‌హాళ్లు కూడా పూర్తికాలేదు. మొత్తం ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఫంక్షన్‌హాళ్ల భారీ వ్యయం భరించలేని సామాన్య ప్రజలకు తక్కువ ధరలో అందుబాటులోకి తేవాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. రూ.90 కోట్లతో 31 ఫంక్షన్‌హాళ్లు నిర్మించాలనుకున్నప్పటికీ, రూ.30 కోట్ల పనులు కూడా పూర్తి కాలేదు. ఇవి ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి. ఈ ఫంక్షన్‌హాళ్ల నిర్మాణానికి ప్రత్యేక ♦ మార్గదర్శకాలతో తగిన ప్రణాళికలు రూపొందించారు. అవి.. ♦ ఫంక్షన్‌హాళ్లను దాదాపు 2 వేల చ.గ.ల విస్తీర్ణంలో నిర్మించాలి. ♦ మూడంతస్తులుగా నిర్మించాలి. ♦ ఒక అంతస్తులో పెళ్లిళ్ల వంటి శుభకార్యాలు, ఒక అంతస్తులో ప్రదర్శనలు, సమావేశాలు నిర్వహించేలా ఏర్పాట్లు. ♦ మరో అంతస్తులో భోజనాలకు ఏర్పాట్లు. సెల్లార్లో పార్కింగ్ సదుపాయం. ♦ పెళ్లిళ్లకు కనీసం వెయ్యిమంది కూర్చునేలా ఏర్పాట్లు. తొలుత ప్రతిపాదించిన ప్రాంతాలు.. 1. జుమ్మేరాత్‌బజార్ (పురానాపూల్ –ముస్లింజంగ్ బ్రిడ్జి). 2. ఆజాద్ మార్కెట్, ఈసామియా బజార్. 3.మునిసిపల్ కళ్యాణమంటపం(శాంతినగర్). 4.దూద్‌బావి, రైల్వే క్వార్టర్స్ దగ్గర,చిలకలగూడ. 5. చక్రిపురం చౌరస్తా, కుషాయిగూడ. 6. పోలీస్‌స్టేషన్ వెనుక, కుషాయిగూడ. 7. శ్రీరామ్‌నగర్‌కాలనీ, (కాప్రాసర్కిల్). 8. కొత్తపేట. 9. గాంధీ విగ్రహం వద్ద(ఎల్బీనగర్సర్కిల్). 10. సుబ్రహ్మణ్యం కాలనీ(సర్కిల్–4). 11.భానునగర్ (సర్కిల్–4). 12. మైలార్‌దేవ్‌పల్లి(రాజేంద్రనగర్ సర్కిల్) 13. అత్తాపూర్ విలేజ్(రాజేంద్రనగర్ సర్కిల్) 14.భోజగుట్ట(సర్కిల్–7) 15. అంబర్‌పేట. 16. హకీంబాబా దర్గా, ఫిల్మ్‌నగర్. 17. బంజారాహిల్స్. 18.లక్ష్మీనరసింహస్వామి ఆలయం, షేక్‌పేట. 19. గచ్చిబౌలి. 20. రాయదుర్గం. 21. చందానగర్. 22. హఫీజ్‌పేట. 23.రైల్వేట్రాక్ వద్ద, శాంతినగర్(సర్కిల్–13) 24. బొబ్బుగూడ మార్కెట్ (కూకట్పల్లి సర్కిల్) 25.ఆల్విన్‌కాలనీ. 26. జగద్గిరిగుట్ట. 27. సర్వేనెం.2/2 ఓల్డ్ అల్వాల్. 28. హెచ్ఎంటీ కాలనీ. 29.టీఆర్టీ క్వార్టర్స్, సికింద్రాబాద్ . 30. కేపీహెచ్‌బీ. 31. ఫేజ్ 2 హౌసింగ్‌కాలనీ(నార్త్‌జోన్) ప్రస్తుత పరిస్థితి .. ♦ ఎట్టకేలకు రూ.30.32 కోట్లతో 16 హాళ్లు నిర్మించేందుకు సిద్ధమైనప్పటికీ వాటిల్లో కొన్నింటికి ఆటంకాలెదురయ్యాయి. కొన్ని కుంటుతున్నాయి. వివరాలిలా ఉన్నాయి.. ♦ కొత్తపేటలో నిర్మించాలనుకున్న ఫంక్షన్‌హాల్‌ను తగిన స్థలం లేదని నాగోల్‌కు తరలించారు. దీని నిర్మాణానికి టౌన్‌ప్లానింగ్ విభాగం నుంచి ఇంకా అనుమతి రాలేదు. ♦ చంపాపేట గాంధీ విగ్రహం దగ్గర ఫంక్షన్ హాల్ పనులు దాదాపు 50 శాతమే పూర్తయ్యాయి. ♦ జుమ్మేరాత్ బజార్లో పనులు ఆరంభమైనప్పటికీ ముందుకు సాగలేదు. ♦ బంజారాహిల్స్ రోడ్‌నెంబర్–12 ఎన్బీటీనగర్లో నిర్మించతలపెట్టిన స్థలంపై కోర్టు కేసుఉండటంతో విరమించుకున్నారు. ♦ వెస్ట్‌జోన్‌లోని పాపిరెడ్డి కాలనీలో పనులు దాదాపు 70 శాతం మేర పూర్తయ్యాయి. ♦ హఫీజ్‌పేటలో స్థలమే గుర్తించలేదు. ♦ రామచంద్రాపురం శ్రీనివాసనగర్ కాలనీ ఎస్సీ బస్తీలో నిర్మాణం చేయాలనుకున్న స్థలం కోర్టు వివాదంలో ఉంది. ♦ అడ్డగుట్ట వెస్టర్న్హిల్స్లో స్థానిక ప్రజలతోపాటు, కార్పొరేటర్నుంచి అభ్యంతరాలతో పనులు ఆపివేశారు. కొత్త ప్రతిపాదనలకు సిద్ధమయ్యారు. ♦ సీతాఫల్మండి టీఆర్టీ క్వార్టర్స్ వద్ద దాదాపు 60 శాతం పనులు జరిగాయి. ♦ మారేడ్‌పల్లి నెహ్రూనగర్ దగ్గర ఫంక్షన్‌హాల్ పనులు దాదాపు 60 శాతం పూర్తయ్యాయి. ♦ భగత్‌సింగ్‌నగర్‌లో దాదాపు 60 శాతం మేర పనులు జరిగాయి. ♦ ఇలా పనులు వివిధ కారణాలతో ఆగిపోగా, కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. -
ముహూర్తం బాగుంది..
సాక్షి, హైదరాబాద్: మహానగరం పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఆదివారం ఒక్క రోజే సుమారు 30 వేలకు పైగా జంటలు ఒక్కటి కానున్నాయి. తరువాత 5వ తేదీ సోమవారం, 8వ తేదీ కూడా భారీ సంఖ్యలో పెళ్లిళ్లు జరుగనున్నాయి. ఈ మూడు రోజుల్లో 60 వేలకు పైగా పెళ్లిళ్లు జరగవచ్చునని పురోహితులు అంచనా వేస్తున్నారు. హేవళంబి నామ సంవత్సరంలో ఇవే ఆఖరు ముహూర్తాలు కావడంతో చాలామంది ఈ ముహూర్తాలకే అధిక ప్రాధాన్యతనిచ్చారు. తిరిగి శ్రీ రామనవమి తరువాతనే ముహూర్తాలు ఉండడంతో అనూహ్యమైన డిమాండ్ నెలకొంది. దీంతో నగరంలోని అన్ని పెళ్లి మండపాలు, ఫంక్షన్ హాళ్లకు అనూహ్యమైన డిమాండ్ నెలకొంది. శివార్లలోని వందలాది ఫంక్షన్ హాళ్లు మూడు నెలల ముందే బుక్కయ్యాయి. డిమాండ్‌ను బట్టి హాళ్ల చార్జీలను భారీగా పెంచేశారు. కనీసం సైతం 20 నుంచి 30 శాతానికి ధరలు పెంచారు. డిజైనర్లు, ఈవెంట్ మేనేజర్లు, కేటరింగ్ సంస్థలు సైతం తమ చార్జీలను రెట్టింపు చేశాయి. ఇవి దివ్యమైన ముహూర్తాలు కావడమే.. ఫాల్గుణ మాసం బహుళపక్షం, ఆదివారం, హస్తా నక్షత్రం.. ఉదయం 7.29 గంటల నుంచి రాత్రి 10.50 గంటలకు దివ్యమైన ముహూర్తాలున్నాయి. 5వ తేదీ సోమవారం ఉదయం 7.20 నుంచి మధ్యాహ్నం 12.05 గంటలకు ముహూర్తాలు బాగున్నాయి. 8వ తేదీ ఉదయం 7.13 నుంచి రాత్రి 10.34 వరకు దివ్యమైన ముమూర్తాలున్నాయని పురోహితులు నిర్ణయించారు. మార్చి 27వ తేదీ వరకు ఎలాంటి ముహూర్తాలు లేవు. ఇప్పుడిప్పుడే వేసవి మొదలైంది. ఏప్రిల్ నాటికి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. దీంతో ఈ మార్చి మొదటి వారంలోనే తంతు ముగించుకునేందుకు అనువుగా ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. చార్జీలు అ‘ధర’హో.. మరోవైపు డిమాండ్‌ను బట్టి ఫంక్షన్‌హాళ్ల యజమానులు చార్జీలను అమాంతంగా పెంచేశారు. సాధారణ రోజుల్లో రూ.3 లక్షలు వసూలు చేసినవారు ఇప్పుడు రూ.5 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారు. పెద్ద హాళ్లు రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచేశాయి. పెళ్లి మండపాల అలంకరణ, డీజే, ఆర్కెస్ట్రా, భోజనాలు వంటి ఖర్చులన్నీ కలిసి రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు స్థాయికి తగినట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ ఖర్చులు భరించలేని వారు తమ ఇళ్ల వద్దనే వేదికలు ఏర్పాటు చేసి పెళ్లిళ్లు చేస్తున్నారు. మరోవైపు నగరంలోని అన్ని ప్రాంతాల్లోని కమ్యూనిటీ హాళ్లకు భారీ డిమాండ్ నెలకొంది. నగరంలో పూల నుంచి బంగారం వరకు, బట్టలు, అలంకరణ వస్తువుల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. వరుస పెళ్లిళ్ల దృష్ట్యా గత పది రోజులుగా 20 శాతం నుంచి 30 శాతం వరకు బంగారం అమ్మకాలు పెరిగినట్లు వ్యాపారవర్గాల అంచనా. ఈ రోజుల్లో సుమారు రూ.100 కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్టు అభిప్రాయపడ్డారు. క్యాటరింగ్ కూడా మెనూను బట్టి ప్లేట్ ధర రూ.200 నుంచి రూ.700 వరకు తీసుకుంటున్నారు. పురోహితులు ఫుల్ బిజీ వరుస ముహూర్తాలతో నగరంలోని పురోహితులు బిజీ అయ్యారు. నగరంలో సుమారు 10 వేల మంది పురోహితులు ఉన్నట్లు అంచనా. వీరంతా ఒక్కొక్కరు ఈ మూడు రోజుల్లో 6 నుంచి 10 పెళ్లిళ్లకు హాజరు కావాల్సిన పరిస్థితి. ఇక బాజా భజంత్రీలకు డిమాండ్ పెరిగింది. గతంలో రూ.25 వేల వరకు తీసుకున్న బ్యాండ్ బృందాలు ఇప్పుడు కనీసం రూ.30 వేలు లేందే రానంటున్నాయి. అలంకరణ కోసం తెచ్చిన పూలు.. పూల ధరలకు రెక్కలు పెళ్లి పూలకు విపరీతమైన గిరాకీ పెరిగింది. బొకేలు, డెకరేషన్ కోసం వాడే పూల ధరలూ ఆకాశన్నంటుతున్నాయి. జెర్బరా ఒక్కోటి రూ.40కి చేరుకోగా, కార్నేషన్ రూ.75 పైనే ఉంది. మండపాల అలంకరణకు విదేశీ పూలను అధికంగా వినయోగిస్తుండడంతో థాయిలాండ్ నుంచి ఆర్కిడ్ రకం పూలను పెద్దమొత్తంలో దిగుమతి చేసుకొన్నట్లు పూలవ్యాపారులు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో రూ.30లోపే లభించే ఆర్కిడ్ బంచ్ ఇప్పుడు రూ.250 దాటింది. ఈ బంచ్‌లో కేవలం 10 పూలు మాత్రమే ఉంటాయి. పూల ధరలు నగరమంతటా ఒకేలా లేవు. డిమాండ్‌ను బట్టి ఒక్కోచోట ఒక్కో రకంగా అమ్మి వ్యాపారులు సొమ్ము చేసుకొంటున్నారు. ఇవి బలమైన ముహూర్తాలు ఈ మూడు రోజులు బలమైన ముహూర్తాలు. ఇప్పటికైతే ఇది ఆహ్లాకరమైన వాతావరణం కావడంతో అందరూ ఈ ముహూర్తాలనే కోరుకుంటున్నారు. ఈ మూడు రోజులు పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలకు అనుకూలంగా ఉన్నాయి. – డాక్టర్ బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి, శృంగేరి శారద పీఠం ఆస్థాన పండితులు ఆర్డర్లు వదిలేసుకున్నాం.. పాతబస్తీ నుంచి వచ్చి డెకరేషన్లు చేస్తున్నాం. డిమాండ్ బాగా పెరిగింది. రోజుకు నాలుగు ఫంక్షన్ హాళ్లు అలంకరించాల్సి వస్తోంది. పని ఒత్తిడి భరించలేక కొన్ని ఆర్డర్లను వదిలేసుకున్నాం. ధర ఎంతైనా చెల్లించేందుకు నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారు. కానీ శక్తికి మించి పని చేయలేం కదా. – అబిద్, స్టేజ్ డెకరేషన్ నిర్వహకుడు -
అన్నీ మంచి శకునాలే
జిల్లాలో పెళ్లిసందడి మొదలైంది. పలకరించే పచ్చనిపందిళ్లు.. ఆహ్వానం పలుకుతున్న మామిడాకుల తోరణాలు...కళ్లు చెదిరే అలంకరణతోవేదిక...పట్టుపావళ్ల యువతులూ...జరీ చీరెల గలగలలూ....చిన్నారులతుళ్లింతలూ...రంగురంగుల విద్యుద్దీపకాంతులు..సన్నాయి మేళాలసుస్వరాలు...ఆత్మీయతల పరిమళాలు...అనుబంధాలకమ్మదనంతో కల్యాణ వేదిక కళకళలాడుతోంది.మూడుముళ్ల బంధంతో ఇద్దరు ఒక్కటయ్యే శుభవేళ,రెండు కుటుంబాల మధ్య అనుబంధాలు పెనవేసుకొనేఘట్టం. జీవితంలో మరుపురాని, మధురమైన జ్ఞాపకంకానున్న ఘడియలు. ఇక ఏడాదంతా శుభముహూర్తాలే.. తల్లిదండ్రులకు మంచి శకునాలే.. కడప కల్చరల్ : ఇక ముహూర్తాలకు కొదువ లేదు. నాలుగు నెలల మూడం తర్వాత శుభఘడియాలు మొదలయ్యాయి. బాజాభజంత్రీలు మొగుతున్నాయి. మూడేళ్ల సుదీర్ఘ సమయం తర్వాత ఆ కరువు తీరేలా సంవత్సరం పాటు వరుస ముహూర్తాలు వచ్చాయి. ఈ బుధవారం తొలి ముహూర్తంతో ప్రారంభమైన ముహూర్తాలు 2019 వరకు ప్రతినెలా వరుసగా ఉన్నాయి. ఎలాంటి తొందర, హడావుడి, గందరగోళం లేకుండా ముహూర్తాలు, జాతకాలు, జన్మ నక్షత్రాలు సరిచూసుకుని తీరిగ్గా పెళ్లిళ్లు చేసుకొనే మంచి అవకాశం చాలా ఏళ్ల తర్వాత వచ్చింది. ముందుగానే బుకింగ్‌లు ఈ ముహూర్తాలలో వివాహాల కోసం జిల్లాలోని 500కుపైగా గల చిన్న, పెద్ద కల్యాణ మండపాలను నవంబరులోనే బుక్ చేసుకున్నారు. పెళ్లి పత్రికల హడావుడి ఫిబ్రవరి మొదటివారం నుంచి మొదలైంది. పురోహితులకు డిమాండ్ ఏర్పడడంతో ముందే వారికి అడ్వాన్సులు ఇచ్చారు. డిమాండ్‌ను బట్టి ఒక్కో అర్చకునికి కనీసం రూ.వెయ్యి ఇవ్వాల్సి వస్తోంది. స్థాయినిబట్టి ఒక్కొ పెళ్లికి ఇద్దరు నుంచి ఐదుగురు పురోహితులను మాట్లాడుకున్నారు. వచ్చే మార్చి వరకు అద్దె వాహనాలకు డిమాండ్ ఉంటుంది. పెట్రోలు, డీజల్ విక్రయాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. రూ. 200 కోట్ల పైమాటే.. ఈ సీజన్లో వివాహాల కోసం జిల్లా అంతటా రూ.150 నుంచి 200 కోట్ల వ్యాపారాలు జరిగే అవకాశం ఉంది. పెళ్లంటే పారిశుద్ధ్య కార్మికుల నుంచి పసిడి వ్యాపారుల వరకు దాదాపు 150 అనుబంధ రంగాల వ్యాపారాలు జరుగుతాయి. కడపలో 10 వేల నుంచి రూ. 2లక్షల అద్దెగల కల్యాణ మండపాలు 70దాకా ఉండగా, ప్రొద్దుటూరులో 50కి పైగాఉన్నాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 500కు పైగా ఉండగా మే వరకు రూ.7కోట్ల నుంచి రూ.10 కోట్ల ఖర్చయ్యే అవకాశం ఉంది. భోజనాలకు ప్లేటు ఒక్కింటికి కనీసం రూ.150 నుంచి రూ.300 ఖర్చుచేయాల్సి వస్తోంది. మే వరకు జరగనున్న వివాహ భోజనాలకు రూ.2కోట్లకు పైగా ఖర్చు కానుండగా, మండపాల అలంకారాలకు రూ.10 వేల నుంచి రూ.3లక్షలు చొప్పున ఈ సీజన్లో రూ.3కోట్లు వెచ్చించాల్సి వస్తోంది. వ్యాపారం...బంగారం.. మే వరకు జిల్లావ్యాప్తంగా 500కు పైగా వివాహాలు జరగనున్నాయి. ఎంత చిన్న వివాహామైనా అమ్మాయికి కనీసం 10తులాల నుంచి కిలో దాక బంగారం పెడతారు. ఈ లెక్కన ఈ సీజన్లో రూ.70 కోట్ల మేరకు బంగారం వ్యాపారం జరిగే అవకాశం ఉంది. పెళ్లి వస్త్రాల కోసం మధ్యతరగతి కుటుంబం దాదాపు లక్ష రూపాయలు, పెద్ద కుటుంబాలైతే రూ.3 లక్షలు చొప్పున ఖర్చుచేస్తారు. దీంతో ఈ సీజన్లో రూ.6–10 కోట్ల మేరకు వస్త్ర వ్యాపారం జరిగే అవకాశం ఉంది. సంవత్సర కాలంగా నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావంతో గణనీయంగా తగ్గిన ఈ రంగాల వ్యాపారాలు ఈ ముహూర్తాల కారణంగా లాభాలు చూసే అవకాశం ఉంది. అందరికీ శుభమే.. ఇవిగాక బస్సులు, రైళ్లు, ప్రైవేటు వాహనాలు, శుభలేఖలు, కిరణా సరుకులు, కూరగాయల వ్యాపారాలు ఈ సంవత్సరమంతా బాగా జరగనున్నాయి. ఈ వేడుకల్లో ఒక్కొ వివాహానికి ఫొటోలు, వీడియోలకు రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చవుతుంది. డ్రోన్ లాంటి పరికరాలతో కొత్తరకం షూటవుట్లకు బాగా ఖర్చు చేయనున్నారు. పూలు, కొబ్బరికాయల వ్యాపారాలు పెరిగి రైతు, వ్యాపారులతోపాటు ఆయా రంగాల శ్రామికులకు కూడా సంవత్సరంపాటు డబ్బు అందే అవకాశం లభిస్తుంది. అటు ప్రభుత్వ రవాణా రంగాలు, పెట్రోలు, డీజల్ వ్యాపారాలు నష్టాల నుంచి కోలుకొని లాభాలు పొందే అవకాశం ఉంది. మొత్తంపై దాదాపు సంవత్సరంపాటు గల ఈ ముహూర్తాలు, పెళ్లిళ్లు ఆయా కుటుంబాలకే కాకుండా పలు ఇతర రంగాల ప్రజలకు కూడా ఆనందాన్ని కలిగించనుండడం విశేషం. కల్యాణదాయకం..శుభం ఇలా దాదాపు సంవత్సరం పాటు వరుసగా ముహూర్తాలు ఉండడం అరుదైన విషయం. అందరికీ సంతోషదాయకం. అన్నిరంగాల వారికి పెళ్లిళ్ల సమయంలో పని లభిస్తుంది. ఈ ముహూర్తాలన్నీ మంచివే కావడంతో తొందర లేకుండా పెళ్లిళ్లు చేసుకోవచ్చు. – చక్రవర్తుల నాగాంజనేయశర్మ, వేద పండితులు, కడప కోలుకునే అవకాశం నోట్లరద్దు, జీఎస్టీతోపాటు ముహూర్తాలు లేకపోవడంతో సంవత్సర కాలంగా పనిలేక నష్టాలకు గురవుతున్నాం. ఈ వరుస ముహూర్తాలతో వ్యాపారాలు పుంజుకోగలవన్న ఆశ ఉంది. – ఎలిశెట్టి శివకుమార్, డెకరేషన్, కేటరింగ్ కాంట్రాక్టర్ నెలవారీగా ముహూర్తాలు ఫిబ్రవరి: 24, 25 మార్చి: 1, 3, 4, 8, 10, 23, 29, 30 ఏప్రిల్: 1, 5, 11, 12, 20, 22, 25, 28, 29 మే: 2, 6, 10 మే 16 నుంచి జూన్ 13 వరకు నిజ జేష్ఠమాసం, అధిక జేష్ఠమాసం ఉండడంతో ఈ సమయంలో వివాహాలు చేసుకోరు. ఆ తర్వాత 2019 మార్చి వరకు ముహూర్తాలకు కొదవ లేదు. -
పెళ్లి సందడి
పెళ్లిల్ల సీజన్ వచ్చేసింది. ఈనెల 17 నుంచి మే 13వ తేదీ వరకు వివాహ ముహూర్తాలు ఉన్నాయి. డిసెంబర్ 1 నుంచి ఈ ఏడాదిఫిబ్రవరి 16 వరకు మూఢాలు ఉండడంతో శుభకార్యాలు ముఖ్యంగా వివాహాలకు మూహూర్తాలు పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుతం శుభ ఘడియలు రావడంతో పెళ్లిల్ల సందడి మొదలు కానుంది. సాక్షి, వరంగల్ రూరల్: శుభ ఘడియలు సమీపిస్తున్నాయి. ఉమ్మడి జల్లాలో ఊరూరా పెళ్లి బాజాలు మోగనున్నాయి. గత డిసెంబర్ ఒకటి నుంచి ఈనెల 16 వరకు మూడాలు ఉండడంతో ఉండటంతో వివాహాది శుభకార్యాలు పెద్దగా జరగలేదు. 17 నుంచి ఫాల్గుణ మాసం శుభ ముహూర్తాలను మోసుకొస్తుండడంతో శుభకార్యాలకు సిద్ధమవుతున్నారు. కల్యాణ మండపాలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. మే 13 వరకు బలమైన ముహూర్తాలు ఉండడంతో వేల సంఖ్యలో జిల్లాలో వివాహాలు జరగనున్నాయని పురోహితులు చెబుతున్నారు. కల్యాణ మండపాలు బిజీ ఉమ్మడి జిల్లాలో కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు, క్యాటరింగ్, ఫొటో, వీడియో, పురోహితులు టెంట్ హౌస్‌లకు డిమాండ్ రానుంది. పట్టణాల్లో ఉన్న ప్రముఖ కల్యాణ మండపాలతో పాటు చిన్న, మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ఉండే ఫంక్షన్ హాళ్లు, ట్రావెల్స్, ప్లవర్స్ డెకరేషన్ ట్రూప్స్, బ్యాండ్ వాలాలను ముందుగానే రిజర్వు చేసుకుంటున్నారు. చిన్న, పెద్ద హోటళ్లలో గదులు ఇప్పటికే హౌస్‌ఫుల్ అవుతున్నాయి. ట్రావెల్ ఏజెన్సీలు బిజీబిజీగా మారాయి. ముచ్చటైన వేదికలు.. పెళ్లికి గ్రాండ్ లుక్ తీసుకురావడంలో ఫంక్షన్ హాళ్లే కీలకం. ఖరీదైన కల్యాణ మండపాలు, స్టార్ హోటళ్లలో కాన్ఫరెన్స్ హాళ్లు వేదికలుగా నిలుస్తున్నాయి. ఇక పట్టణాల్లో కొంత మంది విశాలమైన మైదానాలను ఎంచుకుంటున్నారు. ఆకర్షణీకమైన సెట్టింగ్‌లు, ప్రత్యేక అలంకరణలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇందుకు ఎంత ఖర్చుకైనా వెనుకాడడం లేదు. సెట్టింగ్‌లు వేసేందుకు హైదరాబాద్ నుంచి ఆర్ట్ డైరెక్టర్లను రప్పిస్తున్నారు. మే 13 వరకే... ఈనెల 17 నుంచి మే 13 వరకు వివాహ ముహూర్తాలు ఉన్నాయి. మే 14 నుంచి జూన్ 14 వరకు అధిక జేష్ఠ మాసం రావడంతో వివాహాలు లేకుండా పోయాయి. జూన్ 16 నుంచి జూలై 11 వరకు శుభమూహూర్తాలు ఉన్నాయి. ఫిబ్రవరిలో 17, 19, 23, 24, 26, మార్చి 2, 4, 6, 10, 14 ఏప్రిల్‌లో 1, 2, 5, 11, 19, 20, 22, 25, 27, 28, 29, 30, మే నెలలో 2, 9, 10వ తేదీల్లో అధికంగా ముహూర్తాలు ఉన్నట్లు పురోహితులు చెబుతున్నారు. ఫాల్గుణ మాసం నుంచి.. ఫాల్గుణ మాసం నుంచి చాలా దివ్యమైన మూహూర్తాలు ఉన్నాయి. ఈనెల 17 నుంచి మే నెల 13వరకు మళ్లీ నెల రోజుల విరామం తర్వాత జూన్ 16 నుంచి జూలై 11 వరకు వివాహాలు జరగనున్నాయి. ఆషాఢమాసంలో మళ్లీ పెళ్లిళ్లు ఉండవు. నేను ఉగాది వరకు 22 పెళ్లి మూహుర్తాలు పెట్టాను. గతేడాది కంటే ఈసారి ఎక్కువగానే వివాహాలు జరగనున్నాయి. –సముద్రాల సుదర్శనాచార్యులు,ప్రధాన అర్చకుడు, శ్రీనాగేంద్రస్వామి దేవాలయం, ఊకల్ -
రాత్రి 9 లోపు నిఖా పూర్తికావాలి
సాక్షి, హైదరాబాద్: ముస్లింల పెళ్లంటే ఆడంబరం.. హంగు.. ఆర్భాటం.. పెద్ద ఎత్తున డీజే సౌండ్లతో పెళ్లి కొడుకు బరాత్, నిర్దేశించిన సమయం కంటే ఆలస్యంగా నిఖా (పెళ్లి) తంతు, విందులో 10 నుంచి 20 రకాల ఆహార పదార్థాలు, తెల్లవారుజాము వరకు విందు భోజనం ఆరగింపు. ఇక ఇలాంటి పెళ్లి వేడుకలకు ఫుల్స్టాప్ పడనుంది. సాదాసీదాగా పెళ్లి వేడుకలు జరుగనున్నాయి. ఆంక్షలతో కూడిన బరాత్.. రాత్రి తొమ్మిది గంటల్లోపు నిఖా (పెళ్లి) తంతు.. రాత్రి 11.30 గంటల్లోగా వివా హ విందు పూర్తి చేసి, అర్ధరాత్రి 12 గంటల్లోగా ఫంక్షన్ హాల్ మూతవేయాలి. ఈ మేరకు మంగళవారం వక్ఫ్‌బోర్డు కార్యాలయంలో చైర్మన్ సలీం అధ్యక్షతన జరిగిన ‘ముస్లిం వివాహ వేడుకల నియంత్రణ సదస్సు’ నిర్ణయం తీసుకుంది. ఈ సదస్సులో ఇస్లామిక్ స్కాలర్స్, మతగురువులు, ముఫ్తీలు, ఉలేమాలు, మషాయిఖీన్లు, ఖాజీలు, పోలీసు ఉన్నతాధికారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నిఖాపై సమయ పాలన వివాహ వేడుకల్లో పెళ్లి (నిఖా) ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల లోపు మాత్రమే చేయాలని నిర్ణయించింది. రాత్రి తొమ్మిది తర్వాత నిఖా జరిపించవద్దని ఖాజీలకు సూచించింది. దీనిని ఉల్లంఘించే ఖాజీలకు నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని సదస్సు వక్ఫ్‌బోర్డుకు విజ్ఞప్తి చేసింది. మసీదుల్లో నిఖాను జరిపించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయపడింది. ఈ మేరకు ఖాజీలకు గైడ్‌లైన్స్ జారీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సాదాసీదాగా విందు పెళ్లి విందులో ఆడంబరాలకు వెళ్లకుండా సాదాసీదాగా ఒక బిర్యానీ, ఒక కర్రీ, ఒక స్వీట్ మాత్రమే పెట్టాలని సదస్సు సూచించింది. విందు భోజనాలు కూడా రాత్రి 11.30 గంటల్లోగా పూర్తి చేయాలని కోరింది. సెలబ్రిటీ, వీవీఐపీలకు వారి విజ్ఞప్తుల మేరకు షరియత్‌కు లోబడి విందును అనుమతిం చాలని సదస్సు నిర్ణయించింది. బరాత్, ఫంక్షన్ హాళ్లపై ఆంక్షలు పెళ్లి వేడుకల సందర్భంగా జరిగే బరాత్, ఫంక్షన్ హాల్ సమయాలపై ఆంక్షలు విధించాలని సదస్సు నిర్ణయించింది. హంగు, ఆర్భాటాల బరాత్‌ను కట్టడి చేయాలని, ఫంక్షన్ హాళ్లను రాత్రి 12 గంటల్లోపు మూసేసే విధంగా పోలీసులు చర్యలు చేపట్టాలని సదస్సు సూచించింది. వివాహ వేడుకల్లో డ్యాన్స్‌లను బహిష్కరించాలని సదస్సు నిర్ణయించింది. -
బారాత్‌లతో ట్రాఫిక్ బంద్
ప్రధాన రహదారులపై ఫంక్షన్ హాలు ఉంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో రాజేంద్రనగర్ ప్రాంత ప్రజలకు తెలిసినంతగా మరెవరికీ తెలియదనే చెప్పొచ్చు. ప్రతి రోజూ రాత్రి వేళల్లో ఫంక్షన్ హాళ్ల వద్ద గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ సమస్యలను ట్రాఫిక్, లా ఆండ్ ఆర్డర్ పోలీసులు పట్టించుకోవటం లేదు. వారు ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు ఇచ్చే మామూళ్లలో మత్తులో పడి పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. వివరాల ప్రకారం... రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అత్తాపూర్ నుంచి ఆరాంఘర్ చౌరస్తా, ఆరాంఘర్ చౌరస్తా నుంచి అటూ దానమ్మ ఆర్చ్, ఇటూ బండ్లగూడ చౌరస్తా, శాతంరాయ్ వరకు 20కు పైగా ఫంక్షన్ హాళ్లున్నాయి. ఇవన్నీ ప్రధాన రోడ్డుకు పక్కనే కొనసాగుతున్నాయి. రాత్రి సమయాలలో ఈ ఫంక్షన్ హాళ్లకు వచ్చే బారాత్‌లు, వాహనాల కారణంగా తరచూ ట్రాఫిక్ నిలిచిపోతోంది. ఉడెంగడ్డలోని ఫంక్షన్ హాల్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన వివాహ కార్యక్రమ బారాత్ సందర్భంగా రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట వరకు వాహనదారుల ఇబ్బందులను పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. ఇలా, దాదాపు ప్రతి నిత్యమూ ఈప్రాంతాలలో వాహనాల రాకపోలకు అంతరాయం కలుగుతోంది. ఈ విషయంలో ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. -
ఫంక్షన్ హాళ్లపై చర్యలు తీసుకునేనా?
నిబంధనలకు విరుద్ధంగా నిర్వహణ అనుమతి లేని 19 ఫంక్షన్ హాళ్లను గుర్తించిన అధికారులు చర్యలకోసం ఆదేశాలిచ్చిన డీపీవో పంచాయతీ కార్యదర్శులకు అందిన ఉత్తర్వులు జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండానే పలు ఫంక్షన్ హాళ్లను నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 19 ఫంక్షన్ హాళ్లను గుర్తించిన అధికారులు.. వాటిపై చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. అయితే ఏళ్లుగా పన్నులు ఎగవేస్తూ దర్జాగా ఫంక్షన్ హాళ్లను నిర్వహిస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకునే సాహసం చేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిచ్పల్లి : ఎలాంటి అనుమతులు లేకుండానే కొంద రు దర్జాగా ఫంక్షన్ హాళ్లను నిర్వహిస్తున్నారు. పంచాయతీలకు పన్నులు ఎగ్గొడుతూ.. తాము మాత్రం లక్షలు ఆర్జిస్తున్నారు. జిల్లాలో 19 ఫంక్షన్ హాళ్లకు అనుమతులు లేవని గుర్తించిన అధికారులు.. వాటిపై చర్యలకు ఆదేశించారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఫంక్షన్ హాళ్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. గతంలో ఫంక్షన్ హాళ్లలో శుభకార్యాలంటే డబ్బున్న వారే చేస్తారన్న అభిప్రాయం ఉండేది. పెళ్లిళ్లు, కొన్ని కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయపార్టీల సమావేశాలు, కార్యక్రమాలకు ఫంక్షన్ హాళ్లు వేదికగా నిలిచేవి. అయితే ఇప్పుడు కాలం మారింది. గ్రామీణ ప్రాంత ప్రజలు సైతం చిన్న చిన్న శుభకార్యాలనూ ఫంక్షన్ హాళ్లలోనే చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. గతంలో వివాహాది వేడుకలకే ఫంక్షన్‌హాళ్లు వినియోగిస్తే.. ప్రస్తుతం పుట్టిన రోజు, బారసాలలాంటి చిన్న చిన్న శుభకార్యాలకూ ఫంక్షన్ హాళ్లను వినియోగిస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాలకూ ఫంక్షన్ హాళ్లు విస్తరించాయి. ఫంక్షన్ హాళ్లలో నిలువు దోపిడీ ప్రజల అవసరాలు, ఆసక్తిని ఆసరాగా తీసుకుని ఫంక్షన్ హాళ్ల యజమానులు నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. వంట పాత్రల నుంచి కుర్చీలు, డెకరేషన్, మినరల్ వాటర్ సరఫరా ఇతరత్రా అన్నీ వారి వద్దే తీసుకోవాల్సి ఉంటుంది. కల్యాణమండపం అద్దెనే రూ. 30 వేలనుంచి లక్షన్నర రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. డెకరేషన్, వాటర్, లైటింగ్, కరెంటు బిల్లు, క్లీనింగ్, లేబర్ చార్జీలు అదనం.. అనుమతి లేకుండానే.. జిల్లాలో సుమారు 150 ఫంక్షన్ హాళ్లున్నాయి. పట్టణాలు, నగరాల్లో ఫంక్షన్ హాళ్లను మున్సిపల్ అధికారుల తనిఖీ చేసి నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు, ఈవోపీఆర్డీలు ఈ బాధ్యతలు నిర్వహిస్తారు. జిల్లాలో 19 ఫంక్షన్ హాళ్లకు ఎలాంటి అనుమతి లేవు. పట్టణాలు, నగరాల్లో కార్పొరేటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచులకు ఎంతోకొంత ముట్టచెప్పి కల్యాణమండపాలు కట్టేశారన్న ఆరోపణలున్నాయి. కొన్ని ఫంక్షన్‌హాళ్లలో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే బయట పడటానికి అవసరమైన మార్గాలూ లేవు. కాగా అసలు నిర్మాణపరమైన అనుమతులు లేకుండానే ఏళ్లుగా కొనసాగుతున్నా.. అధికారులు ఇన్నాళ్లూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. చర్యలకు ఉన్నతాధికారుల ఆదేశాలు.. అనుమతి లేని ఫంక్షన్ హాళ్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ నెల 17న జిల్లా పంచాయతీ అధికారి కృష్ణమూర్తి అన్ని మండలాలకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన ఈ ఉత్తర్వులు ఇచ్చారు. అనుమతి లేకుండా అక్రమంగా నిర్మించిన ఫంక్షన్ హాళ్లకు నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. సంబంధిత ఈవోపీఆర్డీలు పంచాయతీ కార్యదర్శులకు ఉత్తర్వులు అందజేసి, అనుమతి లేని ఫంక్షన్ హాళ్లపై చర్యలకు సిద్ధమవుతున్నారు. అయితే కొన్నేళ్లుగా పన్నులు ఎగవేస్తూ ఎలాంటి అనుమతి లేకుండా ఫంక్షన్‌హాళ్లను నిర్వహిస్తున్నవారిపై అధికారులు చర్యలు తీసుకుంటారా అన్నది వేచి చూడాలి. సీజ్ చేస్తాం ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. లేదంటే చర్యలు తప్పవు. గ్రామ పంచాయతీ నుంచి అనుమతి పొందకుండా నిర్మించిన ఫంక్షన్‌హాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. అవసరమైతే ఫంక్షన్ హాళ్లను సీజ్ చేస్తాం. ఈ విషయంలో ఎవరి ఒత్తిడికీ తలొగ్గం.. - శ్రీనివాస్, ఈవోపీఆర్డీ, డిచ్పల్లి -
నిప్పు...ముప్పు!
► ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు లేని నగరం ► తాఖీదులిచ్చినా స్పందించని సంస్థలు ► ప్రమాదం సంభవిస్తే అంతే సంగతులు సాక్షి, సిటీబ్యూరో: అది నగరంలోనే అతి పెద్ద షాపింగ్ మాల్. నిత్యం వేలాది మంది అక్కడికి వస్తుంటారు. అంతపెద్ద షాపింగ్ మాల్లో ఏ మూలన నిప్పు అంటుకున్నా... భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఎందుకంటే... అక్కడ అగ్ని ప్రమాదాల నుంచి రక్షించే ఏర్పాట్లు ఏమాత్రం లేవు. ఫైర్‌సేఫ్టీ నిబంధనలు పాటించని ఇలాంటి భవనాలు మహా నగరంలో లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. ఎండలు మండుతున్న ప్రస్తుత తరుణంలో అనుకోకుండా ఏదేని అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే అదుపులోకి తెచ్చే సదుపాయాలు వీటిలో కానరావు. అయినా ఆ సంస్థలు దర్జాగా తమ వ్యాపారాలు, కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఫంక్షన్ హాళ్లు.. షాపింగ్‌మాళ్లు.. లాడ్జీలు..పెద్ద పెద్ద భవనాలు.... అంతస్తులపై అంతస్తులు... నిత్యం వేల సంఖ్యలో సందర్శకులు... ఏటా రూ.కోట్లలో వ్యాపారం. అగ్ని ప్రమాదాలను నిరోధించే తీరులో నిర్లక్ష్యం... ఇదీ నగరంలోని షాపింగ్‌మాల్స్...కొన్ని ఆస్పత్రులు... పాఠశాలల పరిస్థితి. ‘హెచ్చరికల’తో సరిపెడుతున్న అధికారుల సాక్షిగా వారి అరాచకాలు సాగుతున్నాయి. ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. హోటళ్లు... హాస్పిటళ్లు... పాఠశాలలు... అన్నిటిదీ ఒకటే దారి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేసే అధికార యంత్రాంగం... కొద్ది రోజులకే ఆ విషయం మరచిపోతోంది. దీంతో పరిస్థితి షరా మామూలుగా మారుతోంది. నిర్ణీత వ్యవధిలోగా ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు చేసుకోకపోతేవ్యాపార సంస్థలను సీజ్ చేస్తామని... ట్రేడ్ లెసైన్సులు రద్దు చేస్తామని... ఆస్పత్రుల లెసైన్సుల రద్దుకు కూడా వెనుకాడబోమనే హెచ్చరికలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. ఏళ్ల తరబడి సాగుతున్న ఈ తంతులో మార్పులేదు. గతంలో అధికారులు 380 షాపింగ్‌మాల్స్‌ను తనిఖీ చేసి... ఒక్క దానిలోనూ ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు లేవని గుర్తించారు. ఇప్పటికీ వాటిలో ఎన్నింట్లో ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లున్నాయో వివరాలు లేవు. ఇటీవల నోటీసులిచ్చినా... స్పందించిన వారు స్వల్పం. జీహెచ్ఎంసీ ఫైర్‌సేఫ్టీ విభాగం నుంచి ఎన్ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్)లు పొందిన వ్యాపార సంస్థల సంఖ్య వేళ్ల మీద లెక్క పెటవచ్చు. ఏ తరహా వ్యాపార సంస్థలు ఎన్ని ఉన్నాయనే లెక్కలూ అధికారుల వద్ద లేవు. ప్రకటనలకే పరిమితం ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు లేని సంస్థలపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు ఏటా ప్రకటనలు చేస్తున్నప్పటికీ... ఇంతవరకూ ఎవరిపైనా చర్యలు లేవు. సంబంధిత యాజమాన్యాలు సైతం ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. అగ్ని ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో వెంటనే అదుపు చేసే ఏర్పాట్లు లేకపోవడంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తున్నాయి. అధికారం లేనందునే... ఫైర్‌సేఫ్టీ ప్రమాణాలు పాటించని వారిపై ప్రత్యక్షంగా చర్యలు తీసుకునేందుకు జీహెచ్ఎంసీకి అధికారం లేకపోవడమే ఉల్లంఘనకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఫైర్‌సేఫ్టీ పాటించని భవన యజమానులపై కోర్టులో కేసు న మోదు చేయడం.. న్యాయస్థానం ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం మినహా.. తమంత తాముగా చర్యలు తీసుకునేందుకు జీహెచ్ఎంసీకి అధికారాలు లేవు. ఈ నేపథ్యంలో.. ఫైర్‌సేఫ్టీ లేని ఆస్పత్రులపై జిల్లా వైద్యాధికారుల ద్వారా... ప్రైవేట్ విద్యాసంస్థలపై విద్యాశాఖ ద్వారా... ఇతరత్రా సంస్థలపై సంబంధిత శాఖల ద్వారా అనుమతులు, లెసైన్సులు రద్దు చేయించాలని భావించారు. గతంలో ఆ దిశగా కొంత కసరత్తు చేశారు. అనంతరం మరిచిపోయారు. దీంతో పరిస్థితి ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటోంది. -
రన్..రన్.. విశ్వనగరం వైపు..
అభివృద్ధి దిశగా అడుగులు సుమారు రూ.300 కోట్లతో పనులు మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లు, మార్కెట్ల నిర్మాణం బస్ షెల్టర్లు, పార్కింగ్ ప్రదేశాలకు సన్నాహాలు సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో అభివృద్ధి పథకాల వైపు అడుగులు వేసేందుకు రంగం సిద్ధమవుతోంది. వివిధ సౌకర్యాల కల్పన దిశగా అధికారులు చురుగ్గా కదులుతున్నారు. వీటి కోసం బడ్జెట్లో దాదాపు రూ.300 కోట్లు కేటాయించారు. స్థలాల సమస్యతో ఇన్నాళ్లూ అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి తలెత్తింది.ఎట్టకేలకు వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన దాదాపు 170 స్థలాలు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. ఆ ప్రాంతాల్లో అవసరమైన సౌకర్యాల కల్పనకు యోచిస్తున్నారు. ప్రభుత్వ ఆమోదమే తరువాయి... అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్లై ఓవర్లు.. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు పేదలు, దిగువ మధ్య తరగతి వారి కోసం మార్కెట్లు, ఫంక్షన్ హాళ్లు, బస్ షెల్టర్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఇటీవల సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. విశ్వ నగరంలో భాగంగా అంతర్జాతీయ రహదారులు, మల్టీలెవెల్ గ్రేడ్ సెపరేటర్లతో పాటు నగర ప్రజల కనీసావసరాలను తీర్చాలని స్పష్టం చేశారు. వీటికి జీహెచ్ఎంసీ వద్ద నిధులు ఉన్నప్పటికీ.. స్థలాలు అందుబాటులో లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోక అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. ైవె ద్య ఆరోగ్య శాఖకు చెందిన ఏడెకరాల స్థలం అమీర్‌పేటలో ఖాళీగా ఉన్నట్టు ఇటీవల గుర్తించారు. అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ప్రతిపాదించారు. ప్రభుత్వం అనుమతివ్వడంతో ఆ స్థలం జీహెచ్ఎంసీ పరమైంది. అదే తరహాలో ఏయే విభాగాల వద్ద ఎంత స్థలం అందుబాటులో ఉందో గుర్తించే పనిలో పడ్డారు. ఆమేరకు వివరాలు సేకరించారు. ఈ స్థలాలను ప్రజా సదుపాయాల కల్పనకు కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరనున్నారు. అటు నుంచి ఆమోదం రాగానే పనులు చేపట్టాలని భావిస్తున్నారు. ఇవీ సదుపాయాలు... గ్రేటర్ ప్రజల అవసరాల మేరకు దాదాపు వెయ్యి మార్కెట్లు, పేదలు, మధ్య తరగతి వారు కనీస చార్జీలతో ఫంక్షన్లు నిర్వహించుకునేందుకు 50 మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లు నిర్మించాలని యోచిస్తున్నారు. వీటితో పాటు బస్ షెల్టర్లు, పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయాలని సంకల్పించారు. వీటి కోసం దాదాపు 25 ప్రభుత్వ విభాగాలకు చెందిన 170 స్థలాలు ఉన్నట్లు గుర్తించారు. ఆ స్థలాల్లో ఎలాంటి సదుపాయాలు కల్పించవచ్చో అంచనా వేసి... వాటిని అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నారు. స్థలాల విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకోవడంతో పాటు అక్కడ ఏ సదుపాయం కల్పిస్తే ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగపడుతుందనేఅంశంపైనా అధికారులు దృష్టి సారించారు. పార్కింగ్ సదుపాయాలు లేని... ఎక్కువ రద్దీ ఉండే ప్రదేశాల్లో మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించే యోచనలో ఉన్నారు. వెయ్యి చదరపు అడుగులు... అంతకన్నా ఎక్కువ విస్తీర్ణం కలిగిన ప్రదేశాల్లో ఫంక్షన్ హాళ్లు, మార్కెట్లు నిర్మించాలని భావిస్తున్నారు. బహుళ అవసరాలు తీర్చేలా ఒకేచోట మార్కెట్లు, పార్కింగ్ ప్రదేశాలు, టాయ్లెట్లు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. విభాగాల వారీగా ఉన్న స్థలాలు... విశ్వసనీయ సమాచారం మేరకు వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన స్థలాల వివరాలు... రెవెన్యూ- 64, విద్యాశాఖ -20, పోలీసు- 19, ఏపీ హౌసింగ్ బోర్డు-11, టీఎస్ ఆర్టీసీ-2, బీసీ కార్పొరేషన్-1, దేవాదాయ శాఖ-1 , అటవీ శాఖ-3, వైద్య,ఆరోగ్య శాఖ-7, వాటర్ బోర్డు-7, ఆర్టీఏ-1, హెచ్ఎండీఏ-3, న్యాయ శాఖ-2, కార్మిక శాఖ-1, పర్యావరణ శాఖ-1, ఎక్సైజ్-2, ఆర్అండ్బీ- 2, సాంఘిక సంక్షేమశాఖ-3, స్పోర్ట్స్-2, ట్రస్టు-2, వక్ఫ్ బోర్డు-2, మార్కెటింగ్ 4, పరిశ్రమలు-4, వ్యవసాయ శాఖ-4. తొలిదశలో 56 మార్కెట్లు, 50 మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లు, 70 బస్షెల్టర్లు, 20 మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించాలని ప్రతిపాదించారు. వీటిలో 4 మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లకు స్థలాలు ఎంపిక చేశారు. జుమ్మేరాత్‌బజార్, ఈసామియా బజార్, దూద్బావితోపాటు సర్కిల్-13లోనూ స్థలాలు ఎంపిక చేశారు. ఒక్కో హాల్ నిర్మాణానికి దాదాపు రూ. 25 కోట్లు ఖర్చు కాగలదని అంచనా. -
న్యూ ‘ఇయర్’ రూల్స్..!
భువనగిరి/ కోదాడటౌన్ : నవ వసంతానికి స్వాగతం పలికేందుకు యువత ఎన్నో ఏర్పాట్లు చేసుకుంటుంటుంది. అయితే ఆనందంగా గడుపుకోవాల్సిన నూతన సంవత్సర వేడుకల్లో విషాదం నిండాకుండా ఉండేందుకు పోలీస్‌శాఖ కొన్ని సూచనలు చేసింది. హద్దు మీరితే చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేసింది. రెస్టారెంట్లు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు.. ఇంకెవరైనా సరే.. నూతన సంవత్సర వేడుకలు నిర్వహించాలంటే ప్రభుత్వం జారీ చేసిన సరికొత్త నిబంధనలు పాటించాల్సిందే. ఈవెంట్ ఆర్గనైజర్లు ఎవరైనా వేడుకలను నిర్వహిస్తే ముం దస్తు అనుమతి తీసుకోవడంతో పాటు ప్రభుత్వానికి రూ.3వేల ఫీజు చలానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అనుమతులు లేకుండా వేడుకలు నిర్వహిస్తే నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలని ఉన్నత స్థాయి నుంచి ప్రత్యేక ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం. అంతేకాకుండా వేడుకలను నిర్ణీత సమయం వరకే నిర్వహించాల్సి ఉంటుంది. అనుమతులు కోసం ఎక్సైజ్ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను జిల్లా అధికారులకు పంపి వారి ఆమోదం పొందిన అనంతరం అనుమతులు జారీ చేస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని సివిల్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మద్యం మత్తులో రోడ్లపై మోటార్‌సైకిళ్లతో విన్యాసాలు చేస్తే వారి వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామంటున్నారు. వేడుకల పేరుతో శ్రుతిమించి వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని చెబుతున్నారు. న్యూ ఇయర్ రోజున హోటళ్లు, మ ద్యం దుకాణాలను రాతిర11 గంటల వరకు మూసివేయాలని, అనుమతులు తీసుకున్న వారు కూడా తమతమ ప్రదేశాల్లోనే ప్రశాం తంగా వేడుకలను నిర్వహించాలని, అనుమతి ఉన్న సమయం లోపే వాటిని ముగించాలని ముందస్తుగానే హెచ్చరిస్తున్నారు. అనుమతులు తీసుకోవాలి : మల్లయ్య, ఎక్సైజ్ సీఐ, కోదాడ ఈవెంట్ ఆర్గనైజర్లు నూతన సంవత్సరం వేడుకలను నిర్వహించినా, అందులో మద్యం వినయోగించినా తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. రూ. 3 వేలు చలానా రూపంలో చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. పాటించాల్సిన నిబంధనలు... బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించవద్దు. డిసెంబర్31 వతేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు మాత్రమే కార్యక్రమాలను నిర్వహించుకోవాలి. {పజలకు ఆటంకం కలగకుండా వేడుకలను నిర్వహించుకోవాలి. అనుమతి పొందిన కార్యక్రమాలను మాత్రమే నిర్వహించాలి. తాత్కాలిక స్టేజ్‌లను ఏర్పాటు చేస్తే తగిన పటిష్టత ఉందంటూ,అధికారు ల వద్ద అనుమతి పత్రం పొందాలి. వేడుకల్లో భాగంగా మద్యం ఇచ్చేలా ఉంటే దానికి సంబంధించిన అనుమతిని పొందాలి. హోటళ్లు, ఫాంహౌస్‌లకు వచ్చేవారి వాహనాలు నిలిపేందుకు తగిన పార్కింగ్ స్థలాన్ని కేటాయించాలి. ముఖ్యైమైన ప్రాతాల్లో నిఘా కెమెరాలను ఏర్పాటు చేయాలి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా హోటళ్లు, ఫాంహౌస్ నిర్వహకులు చర్యలు తీసుకోవాలి. ఒక వేళ ఏమైనా జరిగినా వాటికి హోటళ్లు ఫాంహౌస్లే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మద్యం తాగిన వారు తమ నివాసాలకు భద్రంగా చేరే విధంగా కార్యక్రమ నిర్వాహకులు తగు ఏర్పాట్లు చేయాలి. నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చే విదేశీయులకు సంబంధించిన వివరాలు సమీపంలోని పోలీసు స్టేషన్లో సమర్పించాలి. ఈత కొలనుపై తాత్కాలిక స్టేజ్‌లను ఏర్పాటు చేయడానికి అనుమతి లేదు కొత్త సంవత్సరానికి వేసే లైటింగ్ విద్యుత్ సంబంధిత అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదం జరిగితే విద్యుత్ శాఖ బాధ్యత వహించదు. నిబంధనలు ఎవరు అతిక్రమించినా చర్యలు తప్పవంటూ హెచ్చరిక జారీ చేసింది.