ఉప్పల్‌లో అసంపూర్తిగా మిగిలిన ఫంక్షన్ హాల్ నిర్మాణం
ఫంక్షన్ హాళ్ల అద్దెలు భరించలేని మధ్య, దిగువ తరగతి, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా జీహెచ్‌ఎంసీ నిర్మించ తలపెట్టిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణం ముందుకు సాగడం లేదు. గ్రేటర్‌లో తక్కువ వ్యయంతో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు నిర్వహించుకునేందుకు వీలుగా జీహెచ్‌ఎంసీ వీటి నిర్మాణానికి ముందుకు వచ్చింది. తక్కువ అద్దెలకే ఈ ఫంక్షన్ హాళ్లను కేటాయించాలని నిర్ణయించింది. వివిధ ప్రాంతాల్లో మొత్తం 50 చోట్ల నిర్మించాలని భావించి..తొలుత 31 ఫంక్షన్ హాళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. దాదాపు ఏడాది కాలంలో వీటిని పూర్తి చేయాలని భావించినా ఫలితం లేదు. మూడేళ్లయినా వీటి అతీగతీ లేదు.
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణాలు పూర్తి కాకపోవడానికి పలు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల టెండర్లు పూర్తయినప్పటికీ, స్థల వివాదాలు తదితర కారణాలతో పనులు ప్రారంభం కాలేదు. మొదట కేటాయించిన ప్రాంతాల్లో కాకుండా...ఇతర ప్రాంతాలకు తరలించడంతో మరికొన్ని చోట్ల జాప్యమయింది. కొన్నిచోట్ల పనులు ప్రారంభమైనా ముందుకు సాగలేదు. వెరసి మొత్తం 31 ఫంక్షన్ హాళ్లకుగాను 16 చోట్ల నిర్మాణానికి సిద్ధమైనప్పటికీ వాటిల్లోనూ కొన్నింటిపై కొందరు కోర్టుకు వెళ్లారు. కొన్నింటిని ఇతర ప్రదేశాలకు మార్పు చేశారు. కొన్నింటికి తగిన స్థలం లేదు. మరికొన్ని పనులు కుంటుతున్నాయి. తగిన స్థలం అందుబాటులో ఉన్నదీ లేనిదీ చూసుకోకుండానే, యాజమాన్య హక్కులపై వివాదాల్ని పట్టించుకోకుండానే తొందరపడి టెండర్లు పిలవడంతో పలు చోట్ల ఆటంకాలేర్పడ్డాయి.
ఈ నేపథ్యంలో మూడేళ్లలో కనీసం మూడు ఫంక్షన్‌హాళ్లు కూడా పూర్తికాలేదు. మొత్తం ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఫంక్షన్‌హాళ్ల భారీ వ్యయం భరించలేని సామాన్య ప్రజలకు తక్కువ ధరలో అందుబాటులోకి తేవాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. రూ.90 కోట్లతో 31 ఫంక్షన్‌హాళ్లు నిర్మించాలనుకున్నప్పటికీ, రూ.30 కోట్ల పనులు కూడా పూర్తి కాలేదు. ఇవి ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి.
ఈ ఫంక్షన్‌హాళ్ల నిర్మాణానికి ప్రత్యేక
♦ మార్గదర్శకాలతో తగిన ప్రణాళికలు రూపొందించారు. అవి..
♦ ఫంక్షన్‌హాళ్లను దాదాపు 2 వేల చ.గ.ల విస్తీర్ణంలో నిర్మించాలి.
♦ మూడంతస్తులుగా నిర్మించాలి.
♦ ఒక అంతస్తులో పెళ్లిళ్ల వంటి శుభకార్యాలు, ఒక అంతస్తులో ప్రదర్శనలు, సమావేశాలు నిర్వహించేలా ఏర్పాట్లు.
♦ మరో అంతస్తులో భోజనాలకు ఏర్పాట్లు. సెల్లార్‌లో పార్కింగ్ సదుపాయం.
♦ పెళ్లిళ్లకు కనీసం వెయ్యిమంది కూర్చునేలా ఏర్పాట్లు.
తొలుత ప్రతిపాదించిన ప్రాంతాలు..
1. జుమ్మేరాత్‌బజార్ (పురానాపూల్ –ముస్లింజంగ్ బ్రిడ్జి).
2. ఆజాద్ మార్కెట్, ఈసామియా బజార్.
3.మునిసిపల్ కళ్యాణమంటపం(శాంతినగర్).
4.దూద్‌బావి, రైల్వే క్వార్టర్స్ దగ్గర,చిలకలగూడ.
5. చక్రిపురం చౌరస్తా, కుషాయిగూడ.
6. పోలీస్‌స్టేషన్ వెనుక, కుషాయిగూడ.
7. శ్రీరామ్‌నగర్‌కాలనీ, (కాప్రాసర్కిల్).
8. కొత్తపేట.
9. గాంధీ విగ్రహం వద్ద(ఎల్‌బీనగర్‌సర్కిల్).
10. సుబ్రహ్మణ్యం కాలనీ(సర్కిల్–4).
11.భానునగర్ (సర్కిల్–4).
12. మైలార్‌దేవ్‌పల్లి(రాజేంద్రనగర్ సర్కిల్)
13. అత్తాపూర్ విలేజ్(రాజేంద్రనగర్ సర్కిల్)
14.భోజగుట్ట(సర్కిల్–7)
15. అంబర్‌పేట.
16. హకీంబాబా దర్గా, ఫిల్మ్‌నగర్.
17. బంజారాహిల్స్.
18.లక్ష్మీనరసింహస్వామి ఆలయం, షేక్‌పేట.
19. గచ్చిబౌలి.
20. రాయదుర్గం.
21. చందానగర్.
22. హఫీజ్‌పేట.
23.రైల్వేట్రాక్ వద్ద, శాంతినగర్(సర్కిల్–13)
24. బొబ్బుగూడ మార్కెట్ (కూకట్‌పల్లి సర్కిల్)
25.ఆల్విన్‌కాలనీ.
26. జగద్గిరిగుట్ట.
27. సర్వేనెం.2/2 ఓల్డ్ అల్వాల్.
28. హెచ్‌ఎంటీ కాలనీ.
29.టీఆర్‌టీ క్వార్టర్స్, సికింద్రాబాద్ .
30. కేపీహెచ్‌బీ.
31. ఫేజ్ 2 హౌసింగ్‌కాలనీ(నార్త్‌జోన్)
ప్రస్తుత పరిస్థితి ..
♦ ఎట్టకేలకు రూ.30.32 కోట్లతో 16 హాళ్లు నిర్మించేందుకు సిద్ధమైనప్పటికీ వాటిల్లో కొన్నింటికి ఆటంకాలెదురయ్యాయి. కొన్ని కుంటుతున్నాయి. వివరాలిలా ఉన్నాయి..
♦ కొత్తపేటలో నిర్మించాలనుకున్న ఫంక్షన్‌హాల్‌ను తగిన స్థలం లేదని నాగోల్‌కు తరలించారు. దీని నిర్మాణానికి టౌన్‌ప్లానింగ్ విభాగం నుంచి ఇంకా అనుమతి రాలేదు.
♦ చంపాపేట గాంధీ విగ్రహం దగ్గర ఫంక్షన్ హాల్ పనులు దాదాపు 50 శాతమే పూర్తయ్యాయి.
♦ జుమ్మేరాత్ బజార్‌లో పనులు ఆరంభమైనప్పటికీ ముందుకు సాగలేదు.
♦ బంజారాహిల్స్ రోడ్‌నెంబర్–12 ఎన్‌బీటీనగర్‌లో నిర్మించతలపెట్టిన స్థలంపై కోర్టు కేసుఉండటంతో విరమించుకున్నారు.
♦ వెస్ట్‌జోన్‌లోని పాపిరెడ్డి కాలనీలో పనులు దాదాపు 70 శాతం మేర పూర్తయ్యాయి.
♦ హఫీజ్‌పేటలో స్థలమే గుర్తించలేదు.
♦ రామచంద్రాపురం శ్రీనివాసనగర్ కాలనీ ఎస్సీ బస్తీలో నిర్మాణం చేయాలనుకున్న స్థలం కోర్టు వివాదంలో ఉంది.
♦ అడ్డగుట్ట వెస్టర్న్‌హిల్స్‌లో స్థానిక ప్రజలతోపాటు, కార్పొరేటర్‌నుంచి అభ్యంతరాలతో పనులు ఆపివేశారు. కొత్త ప్రతిపాదనలకు సిద్ధమయ్యారు.
♦ సీతాఫల్‌మండి టీఆర్‌టీ క్వార్టర్స్ వద్ద దాదాపు 60 శాతం పనులు జరిగాయి.
♦ మారేడ్‌పల్లి నెహ్రూనగర్ దగ్గర ఫంక్షన్‌హాల్ పనులు దాదాపు 60 శాతం పూర్తయ్యాయి.
♦ భగత్‌సింగ్‌నగర్‌లో దాదాపు 60 శాతం మేర పనులు జరిగాయి.
♦ ఇలా పనులు వివిధ కారణాలతో ఆగిపోగా, కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment