సాక్షి, హైదరాబాద్ : పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. నగరంలో భారీ సంఖ్యలో వివాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఫంక్షన్ హాళ్లు బుక్కైపోయాయి. స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా వివిధ కార్యక్రమాలను చేపడుతున్న జీహెచ్‌ఎంసీ.. పెళ్లి విందుల్లో వినియోగించే ప్లాస్టిక్‌పైనా దృష్టి సారించింది. విందుల్లో తాగునీరు, స్వీట్స్, ఫ్రూట్ సలాడ్స్ తదితరమైన వాటికి ప్లాస్టిక్ గ్లాసులు, కప్పులు ఎక్కువగా వాడుతుండటాన్ని గుర్తించింది. తద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలు భారీగా పెరగనుండటంతో.. వాటికి స్వస్తి పలుకుతూ స్టీల్, గాజు గ్లాసులు, పింగాణీ ప్లేట్లనే వాడేలా ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులకు అవగాహన కల్పించనుంది. వచ్చే నెల రెండో వారం నుంచి ఈ ప్రచారాన్ని ఉద్యమంలా చేపట్టనుంది. దీంతోపాటు ప్లాస్టిక్ బదులు తగినన్ని స్టీల్, గాజు, పింగాణీ పాత్రలను అందుబాటులో ఉంచేందుకు.. వాటి వివరాలందించేం దుకూ సిద్ధమవుతోంది. హరిత ఉత్సవాల (గ్రీన్ ఫెస్టివల్) పేరిట ఈ ప్రచార కార్యక్రమాలు చేపట్టనుంది.
గ్రేటర్‌లో వాడుతున్న ప్లాస్టిక్ కవర్లు ఏటా 73 కోట్లు వీటిల్లో అధిక వాడకం 50 మైక్రాన్ల లోపువే.. ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణానికి, మానవాళికి ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నందున కేంద్ర ప్రభుత్వం 50 మైక్రాన్లలోపు ప్లాస్టిక్‌పై నిషేధం విధించింది. దాని అమలుకు జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టినా అమలులో ఆశించిన ఫలితం కనిపించడం లేదు. కర్రీ పాయింట్ల నుంచి హోటళ్ల దాకా.. వీధివ్యాపారుల నుంచి మాల్స్ దాకా.. ఎక్కడ పడితే అక్కడ భారీగా వినియోగిస్తున్నారు.
- గ్రేటర్‌లో రోజుకు వెలువడుతున్న చెత్త4,700 టన్నులు
- ఇందులో ప్లాస్టిక్ వ్యర్థాలు 400 టన్నులు
- ఈ లెక్కన నగరవాసులను ఏటా ప్రమాదంలోకి నెడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు 1,44,000 టన్నులు
స్వచ్ఛందంగా వాడేలా చర్యలు
ఫంక్షన్ హాళ్లలో ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు కాకుండా గాజు గ్లాసులు, స్టీల్ ప్లేట్లు స్వచ్ఛందంగా వాడేలా సూచించాలని యజమానులకు తెలియజేస్తాం. ఫంక్షన్‌హాళ్లు, బ్యాంకిట్ హాళ్లలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించే వారికి పురస్కారాలు అందజేస్తాం. ఇందుకుగాను వచ్చే నెల రెండో వారం నుంచి వీటిని ఉద్యమంలా నిర్వహిస్తాం. హరిత ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా భాగస్వాములు కావాలి.
– బి.జనార్దన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్
హానికరం ఇలా..
- ప్లాస్టిక్ భూమిలో కలిసేందుకు వేల సంవత్సరాలు పడుతుంది.
- ప్లాస్టిక్ వ్యర్థాలతో భూగర్భజలాలు అడుగంటుతాయి.
- భూసారం తగ్గుతుంది.
- తక్కువ మందం ప్లాస్టిక్ త్వరగా చీలికలు పీలికలై రీసైక్లింగ్‌కు పనికిరాదు.
- ఇవి కొన్నేళ్లకు శిథిలమై ప్లాస్టిక్ ధూళిగా మారి గాల్లో కలసి మానవ శరీరంలో చేరి క్యాన్సర్, కిడ్నీ, శ్వాసకోశ సంబంధ వ్యాధులను కలుగజేస్తాయి.
- ప్లాస్టిక్ తిన్న పశువులు జీర్ణించుకోలేక మరణిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment